ఎస్సై వేధింపులకు యువకుడు బలి
సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తల గొడవ విషయంలో తలదూర్చిన సంగెం ఎస్సై నాగరాజు ఇజ్జిగిరి కార్తీక్‌ను పోలీస్‌స్టేషన్‌లో తీవ్రంగా కొట్టడంతో మనస్తాపానికి గురైన కార్తీక్ బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై తన కుమారుడిని తీవ్రంగా కొట్టిన విషయంలో కార్తీక్ తండ్రి లక్ష్మిపతి వరంగల్ పోలీస్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఎస్సైపై చర్యలు తీసుకోక ముందే కార్తీక్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఎస్సై నాగరాజు ఓవరాక్షన్ మూలంగానే తన కుమారుడు ఆత్మహత్య చేసుకుని మృతిచెందడాని మృతుడి తండ్రి లక్ష్మిపతి ఆరోపించారు. శవాన్ని సైతం పోస్టుమార్టమ్ త్వరగా చేయకుండా అడ్డుకుంటున్నారని తన కోడలుపై తప్ప ఎస్సైపై ఎలాంటి ఫిర్యాదు చేయవద్దని సీఐ తమను బెదిరింపులకు గురిచేస్తున్నాడని లక్ష్మిపతి ఆరోపించారు. భార్యాభర్తల గొడవలు పరిష్కారం చేయమని కౌన్సిలింగ్ కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళితే తన కుమారుడిని తీవ్రంగా చితకబాది ఆత్మహత్య చేసుకునేలా చేశాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమారుడి చావుకు కారణమైన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.