
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
డీఎస్సీ 2008 అభ్యర్థులకు న్యాయం చేసినట్లుగానే డీఎస్సీ 1998 అభ్యర్థులకు కూడా వెంటనే ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డీఎస్సీ 1998 బ్యాచ్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పల శ్రీనివాస్, నాయకులు రావుల రాజేశం చెవ్వ సంపత్, ఎడ్ల సమ్మయ్య, పడేదల తిరుపతి రావు, టి. కృష్ణమోహన్ లు కోరారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 22 సంవత్సరాల డీఎస్సీ 1998 అభ్యర్థులు అప్పటి ముఖ్యమంత్రుల చుట్టూ..విద్యాశాఖ మంత్రుల చుట్టూ తిరుగుతున్నామని, 2008 డీఎస్సీ వారికి ఇచ్చినట్టుగానే తెలంగాణ రాష్ట్రంలోని 1998 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చి కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నామన్నారు. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులందరూ మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పారని, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అందరి సమస్యలు వింటూ..అందరిని ఆదుకుంటున్నారని, అలాగే మమ్ములను కూడా ఆదుకోవాలని 1998 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థులు మొర పెట్టుకుంటున్నామని, మేము నిర్జీవులుగా మారి కాలం వెళ్ళదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే అక్కడ 1998 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం జరిగిన కేబినెట్ పెద్దలు సమావేశంలో 2008 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన చేశారు. వీరి లాగానే మాకు కూడా ఉద్యోగాలు ఇచ్చి మానవత్వాన్ని చాటుకోవాలన్నారు. కష్టపడి ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయ ఉద్యోగ పరీక్ష రాసి క్వాలిఫై అయిన అభ్యర్థులకు అప్పటి ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయం వల్ల ఉద్యోగాలు రాక ఎంతోమంది ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఈ విషయంపై హై కోర్టు, సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని 1998 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వండని తీర్పులు చెప్పినా గత ముఖ్యమంత్రులు పెడ చెవిన పెట్టి మా జీవితాలు నాశనం కావడానికి గత ముఖ్యమంత్రులే కారకులని బాధితులు తెలిపారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవత్వమున్న నాయకుడని మాకు కూడా న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 1998 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థులు దాదాపు 200 మంది కంటే ఎక్కువ లేరు..కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలన్నారు.