18 ఏళ్ల సమస్యకు ముగింపు.
అంగన్వాడీ కేంద్రానికి తాగునీటి సౌకర్యం.
మహబూబ్ నగర్/ నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామ అంగన్వాడీ కేంద్రానికి గత 18 సంవత్సరాలుగా తాగునీటి సౌకర్యం లేక చిన్నారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై పలుమార్లు ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు ఫిర్యాదులు చేసినప్పటికీ.. పలు సమావేశాల్లో చర్చించినప్పటికీ పరిష్కారం కాలేదు.
ముగ్గురు సర్పంచులు, నలుగురు కార్యదర్శులు మారినా సమస్య అలాగే కొనసాగింది. అయితే తాజాగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ కురుమన్న, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ చొరవ తీసుకొని కేవలం మూడు రోజుల వ్యవధిలోనే.. సుమారు 100 మీటర్ల దూరం నుంచి కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేసి అంగన్వాడీ కేంద్రానికి నీటి సౌకర్యం కల్పించారు.
దీంతో అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ.. సర్పంచ్, కార్యదర్శికి కృతజ్ఞతలు తెలిపారు.
