16న సన్మాన కార్యక్రమం
వరంగల్ అర్బన్ జిల్లాలో మేదరి ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో మేదర విద్యార్థులు, ఉద్యోగులు, పదవీవిరమణ పొందిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆ సంఘం అధ్యక్షుడు ప్రతాపగిరి ప్రసాద్, జనరల్ సెక్రటరీ దండుగుడుము ఉపేందర్ తెలిపారు. శనివారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ అర్బన్ జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లలో అధికమార్కులు సాధించిన మేదరి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని అన్నారు. అదేవిధంగా కొత్తగా ఉద్యోగం పొందిన వారికి, ఉద్యోగంలో పదోన్నతులు పొందిన వారికి, ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీవిరమణ పొందిన వారికి ఈనెల 16వ తేదీన సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సన్మాన కార్యక్రమం వరంగల్ జెమిని టాకీస్ సమీపంలోని పోతన విజ్ఞాన పీఠంలో జరుగుతుందని, అర్హత కలిగిన విద్యార్థులు తమ మార్కుల జాబితాలను అందజేయాలని తెలిపారు. ప్రోత్సాహాక కమిటీ ద్వారా వారి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా ఆహ్వానం తెలుపుతామని అన్నారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షుడు కూచనపల్లి శ్యామ్‌సుందర్, ఉపాధ్యక్షులు ప్రతాపగిరి సత్యదేవ్, దీకొండ సరిత, లీగల్ అడ్వైజర్ కూచనపల్లి వెంకటేశ్వర్లు, చీఫ్ అడ్వైజర్ సిలువేరు మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.