విపత్తులనుంచి విముక్తి లభించేనా?

`నోటీసుల జారీతో దూసుకుపోతున్న హైడ్రా

`‘హైడ్రా’ ఏర్పాటుకు ముందే హైకోర్టు జోక్యం

`పర్యావరణానికి ప్రాధాన్యమివ్వాలన్న హైకోర్టు

`ఆక్రమణలపై హైకోర్టు నియమించిన కమిటీ నివేదిక సమర్పణ

`13 చెరువుల పరిధిలో పరిశీలన

`1100 అక్రమ నిర్మాణాల గుర్తింపు

`అనధికారిక లెక్కల ప్రకారం వేలల్లో అక్రమ నిర్మాణాలు

`రేవంత్‌ ప్రభుత్వానికి ముందున్నవి పెను సవాళ్లు

`సామాన్యుల్లో ప్రభుత్వానికి పెరుగుతున్న మద్దతు

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పెరుగుతున్న జనాభాతో పాటు అవినీతి వెన్నుదన్నుతో నీటితావులను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలు ప్రస్తుతం ‘‘సరస్సుల నగ రం’’గా ప్రసిద్ధి పొందిన హైదరాబాద్‌ను ‘విపత్తుల నగరం’గా మార్చివేస్తున్నాయి. ఈ అడ్డగోలు నిర్మాణాల వల్ల వరదనీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో నగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవడం వర్తమాన చరిత్ర. గత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, అధికార్ల అవినీతి, విపత్తులను పట్టించుకోకుండా చేపట్టిన నిర్మాణాలు ప్రస్తుతం నగర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వాతావరణంలో సహజంగా వస్తున్న మార్పులతో పాటు, ఇటువంటి మానవ కార్యకలాపాలు కూడా అధికవర్షాలు, వరదలు, క్షామం వంటి విపరీత పరిస్థితు లకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు చెరువులతో, పచ్చగా కళకళలాడిన నగరం నేడు కాంక్రీట్‌ జంగిల్‌గా రూపుమార్చుకోవడమే కాదు, వనరులపై ఎన్నోరెట్లు వత్తిడి పెరగడంతో తన సహజ రూపురేఖలను కోల్పోతున్నది. ఉన్న వనరులపై వత్తిడిలేని రీతిలో పెరుగుతున్న జనాభాకు ఆవాస అవకాశాలు కల్పిస్తే ప్రకృతి వైపరీత్యాలకు తావుండదు. అందుకు విరుద్ధంగా నిర్మాణాలు పెరిగిపోవడమే ప్రస్తుత దుస్థితికి కారణం. తిరిగి సాధారణస్థితి నెలకొనాలంటే అక్రమనిర్మాణాలపై ఉక్కుపాదం మోపక తప్పదు. ధనవంతులు, రాజకీయనేతలు, పలుకుబడి వ్యక్తులు వీటిల్లో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమైనా చర్యలకు వెనుకాడటం సహజం. ప్రస్తుతం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకుధైర్యంగా ముందడుగు వేసి ‘హైడ్రా’ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో అందరిదృష్టి హైదరాబాద్‌పై పడిరది. ‘హైడ్రా’ దూకుడు వైఖరి, ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వ ‘బుల్డోజర్‌’ సంస్కృతిని గుర్తుచేస్తోంది. ‘రిస్క్‌’ లేకుండా ‘ఫలితం’ రాదన్న సత్యాన్ని బాగా అవగతం చేసుకున్న ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేయడం ద్వారా సామాన్యల్లో విశ్వాసాన్ని పాదుగొల్పుతోంది. 

అక్రమ నిర్మాణాలకు నోటీసులు

రంగారెడ్డి, మేడ్చెల్‌ జిల్లాల్లో చెరువుల్లో అక్రమ ఆక్రమణలకు సంబంధించి ఆగస్టు 31 వరకు రెవెన్యూశాఖ 1100 నిర్మాణలకు సంబం ధించి నోటీసులు జారీచేయడం తాజా పరిణామం. వీటిల్లో 462 ఎఫ్‌.టి.ఎల్‌. పరిధిలో, 634 బఫర్‌ జోన్‌ పరిధిలో ఉన్నాయి. కాగా 204 నిర్మాణాలు దుర్గం చెరువుకు సమీపంలో వుండటం విశేషం. ఒక ఓల్డ్‌ బోయిన్‌పల్లికి చెందిన వందేళ్ల చరిత్ర వున్న హస్‌మత్‌పేట్‌ చెరువు (బోయిన్‌ చెరువు)లో గరిష్టంగా 148, ఓల్డ్‌ అల్వాల్‌ చెరువు (చిన్నరాయని చెరువు)లో 105 నిర్మాణాలను గుర్తించారు. నిజానికి ఇవి చాలా కొద్ది సంఖ్య మాత్రమే, అక్రమ నిర్మాణాల సంఖ్య కొన్ని వేలల్లో వుంటాయని అనధికారిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇప్పటివరకు అక్రమ నిర్మాణాలు విపరీతంగా ఉన్నట్లు గుర్తించిన 13 చెరువుల్లో కూకట్‌పల్లి సమీపంలోని సున్నం చెరువు, మేడికుంట చెరువు (నానక్‌రామ్‌గూడ), గోసాయికుంట చెరువు (గౌలిదొడ్డి), పెద్ద చెరువు (చందానగర్‌), నల్లగండ్ల చెరువు (నల్లగండ్ల), దుర్గం చెరువు (మాదా పూర్‌), మద్దెలకుంట (సరూర్‌నగర్‌), పెద్దచెరువు (పీర్జాదీగూడ), నల్లచెరువు (ఉప్పల్‌), చిన్న దామెర చెరువు (దుండిగల్‌), అంబర్‌ చెరువు (కూకట్‌పల్లి) వున్నాయి. వీటిల్లో కొన్ని చెరువులు 160 ఎకరాలు మరికొన్ని 80ఎకరాల విస్తీర్ణంలో ఉన్నప్పటికీ వీటికి తగిన రక్షణ వ్యవస్థలు లేకపోవడం అక్రమ ఆక్రమణలకు ప్రధానకారణం. 

దుర్గంచెరువుపై దృష్టి

ప్రస్తుతం అధికార్లు దుర్గం చెరువు ఆక్రమణలపై కూడా ప్రధానంగా దృష్టికేంద్రీకరించారు. ఈ నేపథ్యంలో ‘వాల్టా’ (తెలంగాణ వాటర్‌, ల్యాండ్‌ అండ్‌ ట్రీస్‌ యాక్ట్‌) చట్టం కింద నెక్టార్స్‌ కాలనీ, కావూరి హిల్స్‌, డాక్టర్స్‌ కాలనీలకు చెందిన భవన యజమానులకు నోటీసులు జారీ అయ్యాయి. చెరువుల ఎఫ్‌టిఎల్‌ మరియు నాన్‌ డెవలప్‌మంట్‌ జోన్‌ (ఎన్‌డీజెడ్‌) పరిధిలో నిర్మించిన భవనాలకు ‘ఎఫ్‌’ అని అధికా ర్లు మార్కింగ్‌ చేస్తున్నారు. ఇటువంటి నిర్మాణాలను నోటీసు జారీచేసిన 30రోజుల్లోగా తప్పనిసరిగా కూల్చివేయాల్సి వుంటుంది. ఈ దు ర్గం చెరువునే రాయదుర్గం చెరువు అనికూడా వ్యవహరిస్తారు. రంగారెడ్డిజిల్లాకు చెందిన ఈ మంచినీటి చెరువు విస్తీర్ణం 100 ఎకరాలు కాగా అక్రమ నిర్మాణాల కారణంగా ప్రస్తుతం 64 ఎకరాలకు కుదించుకుపోయింది. ఇది జూబ్లీహిల్స్‌`మాదాపూర్‌ మధ్యలో విస్తరించి వుండటం వల్ల దీన్ని ‘రహస్య చెరువు’ అని కూడా పేర్కొంటారు. 2014లో ఈ చెరువును ‘నాన్‌ డెవలప్‌మెంటల్‌ జోన్‌’గా గుర్తిస్తూ నాటి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. అయితే దీనికి సంబంధించి తుది నోటిఫికేషన్‌ ఇంకా జారీకాకపోవడంతో ఈచెరువు చుట్టూ అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లాగా పెరిగిపోయాయి. ఈ ప్రాంతంలో రాజకీయనాయకులు, సినీపెద్దలు, పెద్ద వ్యాపార దిగ్గజాలు భవనాలు ని ర్మించుకోవడంతో సహజంగానే వీటిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇదే ప్రాంతంలో సొంత భవనం ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోదరుడు, తిరుపతిరెడ్డికి కూడా షేర్‌లింగంపల్లి అధికార్లు నోటీసులు జారీచేయడం గమనార్హం. 

జి.హెచ్‌.ఎం.సి పరిధిలో 185 చెరువులు

2022 మార్చి 22వ తేదీన చెన్నైలోని గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు హైదరాబాద్‌ నార్త్‌ డివిజన్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం నాటికి జి.హెచ్‌.ఎం.సి. పరిధిలో 185 చెరువులను గుర్తించారు. వీటికి 2012 నుచి ఎఫ్‌.టి.ఎల్‌ (ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌) సరిహద్దులను గుర్తించి ఆయా మ్యాప్‌లను హెచ్‌ఎండీఏకు చెందిన చెరువుల పరిరక్షణ కమిటీకి సమర్పించారు. వీటిల్లో 157 చెరువుల ఆక్రమణలకు సంబంధించి చెరువుల పరిరక్షణ కమిటీ నోటీసులు జారీచేయగా, మరో 28 చెరువులకు సంబంధించి ప్రాథమిక నోటీసులు జారీచేయాల్సి వున్నదని కూడా ఆ ఆఫిడవిట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు 2012లో చెరువుల సరిహద్దులు గుర్తించడానికి ముందే వాటికి సంబంధించిన ఎఫ్‌.టి.ఎల్‌, బఫర్‌ జోన్‌ లు ఆక్రమణలకు గురయినట్టు గుర్తించారు. జి.హెచ్‌.ఎం.సి. పరిధి లోని చెరువుల్లో కొన్ని పాక్షి కంగా మరికొన్ని అధికంగా ఆక్రమణలకు గురయ్యాయి. ఎఫ్‌.టి.ఎల్‌. పరిధిలో 8718, బఫర్‌ జోన్‌ పరిధిలో 5343 ఆక్రమనిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. 51 చెరువులు అప్పటికి ఏవిధ మైన ఆక్రమణలకు గురికాలేదు కానీ 30 చెరువులు 85% ఆక్రమణలకు గురికాగా మరో 104 చెరువులు 15% ఆక్రమణకు గురైనట్టు గుర్తించారు. కొత్తగా ఎటువంటి ఆక్రమణలను గుర్తించినా అటువంటివాటిపై జి.హెచ్‌.ఎం.సి, రెవెన్యూ శాఖల సహకారంతో క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని కూడా ఇ.ఇ.తన అఫిడవిట్‌లో హామీ ఇచ్చారు. అయితే గుర్తించిన ఆక్రమ ఆక్రమణల్లో కొన్నింటిని అప్పట్లో అధికార్లు తొలగించి ఫెన్సింగ్‌ వేసినప్పటికీ, మరికొన్ని ఆక్రమణల విషయంలో భూస్వా ములు కోర్టులను ఆశ్రయించడంతో వాటిపై అధికార్లు అప్పట్లో చర్యలు తీసుకోలేకపోయారు. ఇదిలావుండగా 63 చెరువుల చుట్లూ ఫెన్సింగ్‌ నిర్మాణం కోసం అప్పట్లో జి.హెచ్‌.ఎం.సి. రూ.94.17 కోట్లు కేటాయించింది కూడా. ఈ మొత్తంతో 70% ఫెన్సింగ్‌ పనులు పూర్త యినా పెండిరగ్‌ కేసుల పుణ్యమాని మిగిలిన 30% పూర్తికాలేదు. మొత్తంమీద చెప్పాలంటే కోర్డుల్లో కేసులు పెం డిరగ్‌లో వుండటం ఆక్రమ ఆక్రమణలను తొలగించడానికి ప్రధాన అడ్డంకిగా మారిందని స్పష్టమవుతోంది. 

ఎప్పుడో గుర్తించిన హైకోర్టు

నిజానికి హైడ్రా ఏర్పాటుకు ముందే గతంలో హైకోర్టు నగరంలోని చెరువులు ఆక్రమణలకు గురి కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. వీటికి సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలను విచారించి, అక్రమ ఆక్రమణలనుంచి చెరువుల పరిరక్షణకు కొన్ని మార్గదర్శకాలను కూడా సూచించింది. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలంలోనే హైకోర్టు ఈవిధమైన నిర్దేశాలు చేయడం గమనా ర్హం. హైదరాబాద్‌ నగర పరిధిలోని 13 చెరువుల బఫర్‌ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించేవిధంగా అధికార్లను ఆదేశిం చాలని కోరుతూ 2007లోనే ఒక పిటిషన్‌ హైకోర్టులో దాఖలైంది. ఇదిలావుంగా 2023 డిసెంబర్‌ 16న హైకోర్టు, దుర్గంచెరువు పరిరక్షణకు సంబంధించి ఒక వార్తను సుమోటోగా స్వీకరించింది. అటుతర్వాత కోర్టు ఒక జాయింట్‌ కమిటీని ఏర్పాటుచేసి రాష్ట్రంలో నీటితావుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై తగిన సిఫారసులు చేయమని కోరింది. ఈ కమిటీ గత ఫిబ్రవరిలో తన నివేదికను సమర్పించింది. రాష్ట్రంలోని అన్ని చెరువులకు సంబంధించి ఎఫ్‌.టి.ఎల్‌, బఫర్‌ జోన్లను స్పష్టంగా గుర్తించాలని, ఫెన్సింగ్‌ చేసి సి.సి. కెమేరాలను అమర్చాలని సిఫారసు చేసింది. ఇదే ఏడాది ఏప్రిల్‌ 23న హైకోర్టు నదులు, చెరువుల సరిహద్దు ప్రాంతాల ఆక్రమణలకు సంబంధించి మళ్లీ సు మోటోగా స్వీకరించింది. ఇటువంటి అక్రమ నిర్మాణాలు నగరంలో వరదలకు కారణమవుతున్నాయని గుర్తించింది.ఈవిధంగా కోర్టుల జోక్యం ఒకపక్క కొన సాగుతుండగానే ఈ ఏడాది జులై 19న తెలంగాణ ప్రభుత్వం జి.ఒ.ఎం.ఎస్‌. నెం.99 ద్వారా ‘హైడ్రా’ సంస్థను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, అక్రమ ఆక్రమణలు`నిర్మాణాల తొలగింపు, విపత్తు నిర్వహణలో ఇతర సంస్థలకు సహకరించడం వంటి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. హైడ్రా అక్రమ నిర్మాణాలపై కఠినచర్యలు తీసుకుంటూ, కూల్చివేతలకు ఉపక్రమించిన నేపథ్యంలో చాలామంది ప్రస్తుతం కోర్టులను ఆశ్రయించడంతో ప్రస్తుతం కేసుల విచారణ కొనసాగుతోంది.

‘హరిత ధర్మాసనం’?

తెలంగాణ హైకోర్టులో త్వరలోనే ‘గ్రీన్‌ బెంచ్‌’ (హరిత ధర్మాసనం) ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నీటితావుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు వంటి పర్యావరణ పరమైన సమస్యలకు కారణమయ్యే వాటిపై ఇది విచారణ జరుపుతుంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే ఇటువంటి ప్రత్యేక ధర్మాసనాలు పనిచేస్తున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈ బెంచ్‌ను ఏర్పాటు చేసే అధికారం వుంటుంది. గతంలో కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ మొత్తం 13 చెరువులను పరిశీలించి ఎఫ్‌టీఎల్‌ మరియు బఫర్‌ జోన్లలో 1100 అక్రమ నిర్మాణాలను గుర్తించిన నేపథ్యంలో, ఈ బెంచ్‌ ఏర్పాటు అంశం వెలుగులోకి వచ్చింది. 

వరదనీరు పారకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం, ట్రాఫిక్‌కు అంతరాయం కల్పించే నిర్మాణాల విషయంలో ఎటువంటి నోటీసులు జారీచేయాల్సిన అవసరం లేకుండానే కూల్చివేసే అధికారాన్ని మున్సిపల్‌ చట్టాలు ప్రభుత్వానికి కల్పిస్తున్నాయి. చట్టం ఎంత కఠినంగా వున్నా అక్రమాలకు పాల్పడినవారు బలవంతులైనప్పుడు వీటి అమలు కష్టసాధ్యమవడం సహజం. ఇటువంటి సమయాల్లోనే పాలకుల ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, నిస్పాక్షిక వైఖరి వెలుగులోకి వచ్చి ప్రజల అభిమానాన్ని మరింతగా చూరగొనే అవకాశముంటుంది. ఇప్పటివరకు ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేయడం ముదావహం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *