సామాన్య ప్రజలంటే మరీ చులకన!

`అడిగితే నువ్వెవరు అంటుంది?

`ప్రశ్నిస్తే గద్దిస్తుంది?

`పలకరింపే కోపంగా వుంటుంది?

`హై కోర్టు ఆర్డర్‌ కూడా లెక్క చేయనంటుంది?

`కలెక్టర్‌ మాట వినేదేంది అంటుంది?

`బాధితులను చూస్తే చాలు చిర్రుబుర్రులాడుతుంది?

`అక్రమార్కులకు అండగా వుంటుంది?

`సామాన్యులను అసహ్యించుకుంటుంది?

`తను ఇష్టానుసారం వ్యవహరిస్తుంది?

`నస్పూర్‌ తహసీల్దారు ఇష్టా రాజ్యం!

`అక్రమార్కులకు అందలం…పని కోసం వచ్చే వారిపై తిట్ల దండకం!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 ఆమె బాధ్యతగల్గిన ఉన్నత ఉద్యోగురాలు. నస్పూర్‌ మండల తహసీల్దారు జ్యోతి. నిత్యం వందలాది మంది కార్యాలయానికి వస్తుంటారు. సహజంగా మహిళా అధికారి అంటే ఎంతో సౌమ్యంగా వుంటారు. కానీ ఈ తహసీల్దారు మాత్రం సామాన్య ప్రజలంటే ఆమెకు మరీ చులకన అని ప్రజలంటున్నారు. ఆమె మాట్లాడటంలోనే కోపం ధ్వనిస్తుంది. సామరస్యం అన్న మాట వుండదు. తమ పని కోసం వచ్చిన వారు ఎంత మర్యాదగా మాట్లాడినా సరే…చీదరించుకుంటూనే వుంటుంది. అలాంటి పరిస్థితులు చూసి, చూసి విసిగిపోయిన వాళ్లు ఏదైనా అడిగితే చాలు అసలు మీరెవరు? అంటుంది. అసలు ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగురాలుగా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన వుందా? లేదా? అన్న అనుమానం కలగక మానదు. ఆమెను ఎవరూ ప్రశ్నించొద్దు. ఒక వేళ ప్రశ్నిస్తే గద్దిస్తుంది? తహసీల్దారుగా తన అధికారాలు వినియోగిస్తానని బెదిరిస్తుంది. మహిళా అధికారి కావడంతో పనుల కోసం వచ్చే వారు ఎంతో ఓపికతో, ఎంత కాలమైనా ఎదురు చూస్తారు. ఏళ్ల తరబడి పనులు కాకపోయినా గత్యంతరం లేక కార్యాలయం ముందు పడిగాపులు పడుతుంటారు. ఎప్పుడైనా కనికరించకపోతారా? అని ఎదురుచూసే వారికి నిరాశే మిగులుతోంది. పని కోసం వచ్చే వారి కాళ్లు అరిగిపోవాలే గాని పని కాదట. అంతలా పని మీద నిర్లక్ష్యం వున్నప్పుడు ఉద్యోగం ఎందుకు చేస్తున్నట్లు అని కూడా ప్రజలంటున్నారు. ఇలా ప్రజలను ఇబ్బందులకు గురి చేసే అధికారులపై మీడియా ప్రజల తరుపున కథనాలు రాస్తే మహిళాధికారులు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకా అవసరమైతే కులాన్ని కూడా ముందుకు తెచ్చే వారు కూడా వున్నారు. చేయాల్సిన పనులు సకాలంలో, సక్రమంగా చేస్తే ప్రజలే చేతులెత్తి దండం పెడతారు కదా! జీవితాంతం గుర్తుంచుకుంటారు కదా!! అది వదిలేసి పనుల కోసం వచ్చే వారిని ఏళ్లకేళ్లు తిప్పుకుంటే ఏమొస్తుంది. ప్రజల్లో అసహనం పెరిగేదాకా చూడడమెందుకు? వారి చేత శాపనార్థాలు పెట్టించుకోవవడం ఎందుకు? ఆమె పలకరింపే కోపంగా వుంటే ప్రజలు తహసీల్దారు కార్యాలయానికి ఎలా వస్తారు ? అంటే తహసీల్దారు కార్యాలయానికి ఎవరూ రావొద్దన్నట్లా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

ఇంతకీ ఏం జరిగింది? 

నస్పూర్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి తన భూమిలో ఇతరులు అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నారని, ఆ స్థలం తనకు చెందినది ట్రిబ్యునల్‌ ను ఆశ్రయించాడు. హైకోర్టును కూడా ఆశ్రయించాడు. అతనికి ఫేవర్‌ గా కోర్టు కూడా స్టేటస్‌ కో జారీ చేసింది. ఆ స్టేటస్‌ కో అమలు చేయాలని సదరు వ్యక్తి కలెక్టర్‌ ను కలిసి వినతిపత్రం అందించాడు. స్పందించిన కలెక్టర్‌ సంబంధిత ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఆర్డీవో నస్పూర్‌ తహసీల్దారుకు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయమై సదరు భూ యజమాని గత ఏడాది కాలంగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. తనకు చెందిన స్థలంలో ఇతరులు అక్రమంగా నిర్మాణాలు సాగిస్తున్నారు. నాకు న్యాయం చేయండని వేడుకున్నాడు. అయినా ఆమె కరగలేదు. ఒక దశలో మేడం హై కోర్టు ఆదేశాలు కూడా అమలు కాకపోతే మేం ఎవరికి చెప్పుకోవాలి…మీరే కాపాడాలి మేడం…నాకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మా స్థలంలో అక్రమ కట్టడాలు ఇప్పటికే నాలుగయ్యాయి.అని ఎంత మొత్తుకున్నా …హై కోర్ట్‌ ఆర్డర్‌ అయితే అమలు చేయాలా? అంటూ కోర్టు దిక్కరణకు కూడా తహసీల్దారు పాల్పడిరదని పిర్యాదు దారుడు నేటిధాత్రికి వివరించాడు. అంతే కాకుండా కలెక్టర్‌ ఆదేశాలు కూడా వున్నాయి. ఈ విషయాన్ని సదరు వ్యక్తి తహసీల్దారు కు గుర్తు చేశాడు. నేను కలెక్టర్‌ మాట వినేదేంది? కలెక్టర్‌ ఆదేశాలు పాటించాలా? అంటూ ఆ వ్యక్తిపై తహసీల్దారు జ్యోతి చిర్రుబుర్రులాడిరదని, నీ దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరింపులకు దిగిందట. ఇలా న్యాయం చేయాల్సిన తహసీల్దారు అన్యాయం చేస్తున్న వారిని వెనకేసుకురావడం ఏమిటి? హై కోర్టు ఆదేశాలు పాటించకపోతే ఉద్యోగం ఊడిపోతుందని తెలిసినా తహసీల్దారు కదలకపోవడం అంటేనే, ఆమె వల్ల ఎంత మంది సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు. కలెక్టర్‌ ఆదేశాలు అమలు చేయను అని తహసీల్దారు మాట్లాడడం, తన పరిధి దాటడమే..! హైదరాబాదు నుంచి ఏడాది కాలంగా తన స్థలం కోసం తిరుగుతున్న వ్యక్తి విసిగిపోయి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఎవరు? బాధ్యత వహిస్తారో? ఉన్నతాధికారుల చెప్పాల్సిన అవసరం వుంది. వృత్తిలో ఇంత నిర్లక్ష్యంగా వుంటున్న తహసీల్దారుపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది. తన బాధ్యతలు నిర్వర్తించాల్సింది పోయి, పై అధికారుల ఆదేశాలు పెడ చెవిన పెట్టే తహసీల్దారు సామాన్యులను ఎంత ఇబ్బందులకు గురి చేస్తారో అర్థం చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *