`రైతు సుభిక్షమే కేసిఆర్ లక్ష్యం
`ఒకనాడు ఎండిన తెలంగాణను చూసి తల్లడిల్లిన కేసిఆర్
`ఎన్ని బోర్లేసినా చుక్క కళ్ల చూడని మల్లారెడ్డి గోస చూసిన కేసిఆర్.
`చెరువుల్లో నీళ్లు లేక, పొలాలకు నీరందక ప్రతి ఏడు ఎండుడే!
`తెలంగాణ వస్తే తప్ప సాగు కష్టాలు కడతేరవని జెండా ఎత్తిన నాయకుడు కేసిఆర్
`రైతు బంధు అందులో భాగమే
`ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సాగు రంగంలో తెలంగాణ నెంబర్‌వన్ కోసమే
`తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశమంతా అమలు చేయాలి.
`దేశంలోని అన్ని రాష్ట్రాల రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కేసిఆర్ కల.
`దేశంలోని రైతులందరికీ రైతు బంధు, రైతు భీమా అమలు కావాలి.
`దేశమంతా మంచినీటి సమస్య తీరాలి.
`గఇవన్నీ దేశమంతా అమలు కావాలంటే దేశానికి కేసిఆర్ నాయకత్వం రావాలి.
హైదరాబాద్,నేటిధాత్రి:
సాగు సల్లగుండాలే..రైతు సంతోషంగా వుండాలి. ఆనందంగా వుండాలి. సుభిక్షంగా వుండాలి. పెదవులుపై చిరునవ్వులు తొనికిసలాడాలి. కాలం కావాలని మొగులు వైపు, కరువు రావొద్దని కాలం వైపు, పంటలెండిపోవద్దని మధనపడొద్దు. సాగు నీటి కటకట అసలే రావొద్దు. పల్లె పచ్చగుండాలి. పాడి పంటలతో కళకళలాడాలి. చేనంతా పచ్చని పైట కప్పుకోవాలి. రైతులకు బంగారు సిరులు పండాలి. వృత్తులు పునరుజ్జీవం కావాలి. మావన వనరుల అభివృద్ధికి మళ్లీ జీవం పోయాలి. దేశమంతా రైతుకు ఆసరా కావాలి. ప్రభుత్వాలు భరోసా కావాలి. రైతును ఆదుకునే పాలకులు కావాలి. రైతును అడుగడుగనా అండగా నిలిచే ప్రభుత్వాలే వుండాలి. రైతు పెట్టుబడి కష్టం రాకుండా చూసుకోవాలి. అందుకు ప్రభుత్వాలే పెట్టుబడి సాయం అందించాలి. తెలంగాణలో అమలౌతున్న రైతు బంధు దేశమంతా అమలు కావాలి. రైతు ఒకరి సాయం కోసం అర్దించే పరిస్ధితి రావొద్దు. అప్పుల పాలు కావొద్దు. ఈ సాగు మా వల్ల కాదని వ్యవసాయం వదిలేయొద్దు. రైతు ఏడ్చే రోజు అసలే రావొద్దు. ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ లక్ష్యం. ఇది తెలంగాణలో నెరవేరిన స్వప్నం. అంటే నిజమైన కల. ఆ కల దేశమంతా కలగా మిగిలిపోకూడదు. తెలంగాణలో రైతు ఎంత సుభిక్షంగా వున్నాడో దేశమంతా అలాగే రైతు ఆనందంగా వుండాలి. గతంలో అంతో ఇంతో రైతు సంక్షేమం మీద కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సారించేవి. కాని కేంద్రంలో బిజేపి వచ్చిన తర్వాత రైతు గోసలు మరింత పెరిగాయి. ఈ ఏడెనెమిదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టిన పాపాన పోలేదు. తెలంగాణలో కాలం అబ్బురపడేలా, ఇతర రాష్ట్రాలు అసూయ పడేలా మూడేళ్లలో కాలేశ్వరం…ఆరేళ్లలో మల్లన్న సాగర్ తోపాటు, అనేక రిజర్వాయర్లు పూర్తి చేసుకున్నాము. తెలంగాణలో నీటి గోస లేకుండా చేసుకున్నాము…మరి దీన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోలేకపోతున్నాయి. అందుకు కారణం దేశంలోని అనేక మెజార్టీ రాష్ట్రాలలో బిజేపి ప్రభుత్వాలు వుండడమే కారణం. అరవై ఏళ్ల ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఏనాడూ సమైక్య పాలకులు తెలంగాణ కోసం ఆలోచించలేదు.
తెలంగాణకు అన్యాయం చేయకుండా వుండలేదు. 1956 నుంచే అన్యాయం చేస్తూ వచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏకమైన సమైక్య రాష్ట్ర్రం ఏర్పాటు అయిన సమయంలోనే తెలంగాణ రెండుకోట్ల మిగులు బడ్జెట్ వున్న రాష్ట్రం. 4 కోట్లు లోటుతో వున్నది అప్పటి ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రం. తెలంగాణ నిధులన్నీ ఆంధ్రకు తరలించారు. అక్కడ ప్రాజెక్టులు, కాలువలు కట్టుకున్నారు. తెలంగాణ ఎండబెట్టారు. ప్రాజెక్టులకు మొండిచేయి చూపారు. ఆనాడు ప్రశ్నించిన కొందరు నాయకులే గాని, నిలదీసిన నాయకులు లేరు. ఎదిరించి నిలబడిన నాయకులు లేరు. తెలంగాణలో ఉద్యమ స్వరూపం సాగుతున్నా, ఉవ్వెత్తున సాగేంత కొండంత అండ నాయకత్వం తెలంగాణ లేదు.2001లో కేసిఆర్ రూపంలో ఒక ఉద్యమ స్వరూపం ఎవరెస్టు శిఖరమంత బలమైంది ప్రజల ముందు నిలబడిరది. మనిషి బక్క పల్చనే కాని, బలం వెయ్యేనుగుల బలమంతది అని ప్రజల నమ్మారు. కేసిఆర్ వెంట నడిచారు. ఆ సమయంలో కేసిఆర్ చూసిన తెలంగాణ సాగు గోసలు అన్నీ ఇన్నీ కావు. తలాపున గోదారి పారుతున్నా ఉత్తర తెలంగాణ ఎప్పుడూ ఎండడమే తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలోనే అతి పెద్ద కాలువ అంటూ చెప్పుకోవడానికి తప్ప, నీరు పారడానికి వీలు లేకుండా కాకతీయ కాలువను మార్చారు. కాలువ తప్ప నీరు లేకుండా చేశారు. మరి ఇప్పుడు ఏడాది మొత్తం ఆ కాలువ కళకళలాడుతుంటోంది. నిజామాబాద్ నుంచి ఖమ్మం సరిహద్దు దాకా సాగునీరు మోసుకెళ్తోంది. కాళేశ్వరంలో ఉత్తర తెలంగాణలోని ప్రతి పల్లెలో నీటి సిరులు జళజళ పారుతున్నాయి. ప్లోరైడ్‌ను తరిమేసేలా అటు ఖమ్మంతోపాటు, ఇటు నల్లగొండలో ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన మంచీనీరు అందుతోంది…తెలంగాణ సాధిస్తే ఇవన్నీ సాధ్యమా? అని అనుకున్నవారు కూడా ఆ నిజాన్ని కల్లారా చూస్తున్నారు…తెలంగాణ ప్రగతిని చూసి మురుస్తున్నారు. అందుకే నిన్నటి గోసను మర్చిపోవద్దు. నిన్న పడిన కష్టం కల అనుకోవద్దు.
నిలిచి గెలిచిన తెలంగాణను మళ్లీ ముంచేవాళ్లు కాచుకొని కూర్చున్నారు. అసలు ప్రగతి అంటే అర్ధం కూడా తెలియని నాయకులు ప్రతిపక్షాలలో మాటల గారడీ నేర్చుకున్నారు. మాయ మాటలు చెప్పే వారిని నమ్మొద్దు. తెలంగాణ సరిహద్దులు కూడా సరిగ్గా తెలియని వాళ్లంతా మాకు ఒక్కసారి చాన్స్ ఇవ్వండంటున్నారు. వచ్చిన తెలంగాణను మూడేళ్లులోనే ఆగం చేసేందుకు సీమాంధ్ర నేతల కనుసన్నల్లో పనిచేసి ఓటుకు నోటు కేసులో ఇరుకున్నవాళ్లు వాళ్లు కూడా తెలంగాణను పాలిస్తామంటున్నారు. పరాయి వాళ్ల చేతుల్లో తెలంగాణను పెట్టేందుకు దాసోహం అంటున్నారు. తెలంగాణ గురించి కనీసం ఉచ్చరించే అర్హత లేని వాళ్లంతా ఇప్పుడు నీతులు చెబుతున్నారు. ఏనాడు తెలంగాణ జెండా మోసిన దాఖలాలు లేని వాళ్లంతా తెలంగాణలో పెత్తనం కోసం నయవంచన కపట నాటకాలాడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. వారి మాయల్లో పడొద్దు. కుప్ప మీద పడి తినాలని చూస్తున్నారు. దోచుకొని తినాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. నీరు పెట్టి, దుక్కి దున్ని, విత్తు నాటి, పంట పండిరచి, కుప్ప నూడ్చాక కుప్ప మీద పడి తినడానికి గోతి కాడ నక్కల్లా కాచుకొని కూర్చున్నారు. కుప్ప నూడ్చడానికి కష్టపడ్డవారిని ప్రజలు మర్చిపోవద్దు. అధికారం కోసం అడ్డదారులు తొక్కే వాళ్లుంటారు. సమాజం గురించి సోయి లేని వారు పార్టీల పేరు చెప్పుకొని నయవంచన కోసం వస్తుంటారు. అధికారంలోకి రావాలని తంటాలుపడుతుంటారు. ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో కనిపించని వాళ్లంతా ఇప్పుడు తెలంగాణ మీద పెత్తనం కోసం అర్రులు చాస్తున్నారు. ఒక్కనాడు జై తెలంగాణ అనేందుకు నోరు రాని వాళ్లు, ఆనాడు నోరు లేని వాళ్లు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద నోరేసుకొని మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఒక్క దూం..ధాం కార్యక్రమంలో పాల్గొన్న చరిత్ర లేని వాళ్లంతా దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నారు. పచ్చగా వున్న తెలంగాణలో చిచ్చుపెడుతున్నారు. అభివృద్ధి అంటే ఏమిటో అర్ధం కూడా తెలియని వాళ్లు, ఆ మాటలు చెబితే ఎలాగూ తెలంగాణ ప్రజలు వినరని తెలుసు.
వారిని నమ్మరని తెలుసు. వారిని దగ్గరకు రానియ్యరని తెలుసు. అందుకే కులం చిచ్చు ఒక వైపు, మతం మత్తు ఒకవైపు నమ్ముకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. దేవుని పేరు చెప్పి, మనుషులను చీల్చి రాజకీయం చేయాలనుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త అన్నది జనం అందరూ గమనించాలి. తెలంగాణ సాగు రంగంలో వేస్తున్న విప్లవాత్మక అడుగులు ఎలా వున్నాయో చూసేందుకు అనేక రాష్ట్రాలనుంచి రైతు నాయకులు వచ్చారు. రెండు రోజుల పాటు ప్రగతి భవన్‌లో వున్నారు. తెలంగాణలోరైతులకు అందుతున్న సంక్షేమ పథకాలు తెలుసుకున్నారు. రైతు బంధు విశిష్టతను స్వయంగా చూసి ఎంతో సంతోషంగా కొనియాడారు. రైతు భీమా వంటి వినూత్నమైన పధకం గూర్చి చర్చ చేశారు. పంట కొనుగోలు లో రాష్ట్ర ప్రభుత్వం చొరవ, ముఖ్యమంత్రి కేసిఆర్ విజన్ తెలుసుకున్నారు. మిషన్ కాకతీయతో చెరువుల అభివృద్ధి , వాటికి పూర్వ వైభవం ఎలా వచ్చింది. ఇప్పుడు వాటి పరిస్దితి ఎలా వుంది. తెలంగాణ ఎలా కరువును దూరం చేసుకున్నది. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని,ఇంటింటికి ఎలా అందించుకుంటోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలలో ఈ పధకాలు ఎందుకు అమలు కావడంలేదు? అన్నదానిపై పెద్దఎత్తున చర్చ జరిగింది. రైతులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా ఎలా సాధ్యం? తెలంగాణ ఎలా సుసాధ్యం చేసింది? దేశమంతా ఎందుకు అమలు కావడంలేదు. అక్కడి పాలకులకు ఎందుకు చిత్తశుద్ది లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఆ సోయి ఎందుకు లేదు? ఇవన్నీ పొరుగు రాష్ట్రాల రైతులు కళ్లారా చూసి, ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రజెంటేషన్‌తో తెలుసుకున్నారు. దేశానికి కేసిఆర్ ఎలా ఆదర్శం కావాలో, దేశానికి కేసిఆర్ నేత అయితే ఎలా వుంటుందో అన్నది ఆ రైతు నాయకులే ఆయా రాష్ట్రాలలో చెప్పడానికి సిద్దంగా వున్నారు. దేశంలో వినూత్నమైన మార్పు కేసిఆర్ నాయకత్వం నుంచే మరో కొత్త తరం ఆవిష్కరణ జరగనుందని భవిష్యత్తు చెబుతోంది.