సబితపై చర్యలున్నట్లా? లేనట్లా!?

సబిత నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి?

అబార్షన్‌ వికటించడంతో రియా కు పంపి చేతులు దులుపుకున్న సబిత.

రియా లోనూ సరైన వైద్యం అందక శ్రీ చక్రకు గర్బిణి రజితను తరలింపు.

సకాలంలో శ్రీ చక్ర స్పందించకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన రజిత.

ఇద్దరు ఆడపిల్లలను అనాధలు చేశారు.

అబార్షన్లు వృత్తిగా చేసుకొని అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సబిత.

ఇంత పెద్ద సంఘటన జరిగినా అధికారులలో చలనం ఎందుకు లేదు?

సబితను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదు?

సకాలంలో సరైన వైద్యం అందించని ఆసుపత్రులకు నోటీసులెందుకివ్వలేదు?

మృతురాలు రజితకు స్కానింగ్‌ చేసిన డయాగ్నస్టిక్‌ పై చర్యలేవి?

ఆసుపత్రుల లైసెన్స్‌ లు రద్దు చేయరా?

మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కు పిర్యాదు చేయరా?

డాక్టర్ల పట్టా క్యాన్సిల్‌ చేయరా?

రజిత ప్రాణం బలిగొన్న వారిపై కేసులడవా?

కలెక్టర్‌ కలుగజేసుకుంటే గాని ముందుకు కదిలేలా లేదు?

                              హైదరాబాద్‌,నేటిధాత్రి: కడుపులో పడ్డ పాపానికి ఓ పసిగడ్డు ప్రాణం చిద్రమైపోయింది. కడుపుకోతను సైతం దిగమింగుకున్న ఓ ఆడకూతురు అర్ధాంతరంగా తనువు చాలించింది. ఎంతో భవిష్యత్తు వున్న ఆమెకు అబార్షన్‌ చేసి ప్రాణం తీశారు. ఇదంతా జరిగి నెల దగ్గరకొస్తున్నా, అధికారులకు అంతా తెలిసినా ఇంత నిర్ధయగా ఎలా వుండగలుగుతున్నారు? కనీసం కర్తవ్యం కూడా ఉన్నతాధికారులకు గుర్తు రావడం లేదా? ఓ నిండు ప్రాణం పోయిందన్న కనికరం కూడా లేదా? అసలు భ్రూణ హత్యలు చేయడం నేరమని తెలిసినా సబిత అనే వైద్యురాలు ఎలా అబార్షన్లు సాగిస్తోంది. ములుగు జిల్లా మల్లం పల్లిలో ఏకంగా తన క్లినిక్‌కే ప్రభుత్వ ఆమోదిత కుటుంబ నియంత్రణ కేంద్రమని బోర్డు తాటికాయంత అక్షరాలతో రాసుకొని పాపపు పనులు చేస్తుంటే తెలియడం లేదా? అసలు అధికారులకు సమచారం లేదా? రజిత అనే మహిళకు అబార్షన్‌ వికటించడంతో తమ ఆసుపత్రికి రిఫర్‌ చేశారని సాక్ష్యాత్తు రుయా ఆసుపత్రికి చెందిన వైద్యుడే నేటిధాత్రికి వెల్లడిరచడం జరిగింది. మరి అదే ఆసుపత్రి ప్రభుత్వ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారా? లేక ఒత్తిళ్లకు లొంగి అధికారులు అసలు విషయం దాచి పెడుతున్నారా? ఏం జరుగుతోంది. నేటిధాత్రి వద్ద అదే ఆసుపత్రి చెప్పిన స్పష్టమైన సమాచారం వుంది.

రజిత అనే మహిళలకు సబితే అబార్షన్‌ చేసిందనే విషయాన్ని ఆసుపత్రి వర్గాలే వెల్లడిరచాయి. తమ వద్దకు వచ్చే సరికే రిజిత ఆరోగ్య పరస్ధితి కొంత క్రిటికల్‌గా వుందన్న సంగతి రియా ఆసుపత్రి వర్గాలే చెబుతున్నాయి. తమ ఆసుపత్రిలో వైద్యం అందుతున్న సమయంలో కార్డియా ఎఫెక్ట్‌తో వెంటనే ఆ మహిళను శ్రీ చక్రకు తరలించడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అసలు ఇలా అబార్షన్లు వికటించిన పేషెంట్లను ఎలా అడ్మిట్‌ చేసుకుంటున్నారు. ఏ చిన్న గాయమైనా పోలీసు కేసు తప్పని సరి అని మనం అనుసరిస్తాం…అలాంటిది గర్భస్రావం జరిగిన మహిళ ఎలాంటి పరిస్ధితిలో వచ్చిందో ఆసుత్రులకు తెలిసే ఎలా చేర్చుకుంటున్నారు? సహజంగా గర్భిణీలకు ఎదురయ్యే సమస్యలపై వైద్యం చేయడం వేరు? భ్రూణ హత్యల పేరుతో సాగే దందాకు ఆసుపత్రులు సహకరించడం వేరు? మరి అలాంటి కేసులను తాము అంగీకరించమని ఆసుపత్రులు నిర్ణయానికి వస్తే, అబార్షన్లనే వృత్తిగా పెట్టుకొని ప్రజల ప్రాణాలతో వ్యాపారం సాగిస్తున్నవారి ఆటలు సాగవు కదా? ఇక అలాంటి పనులు చేయకుండా వుంటారు కదా? ఎందుకు ఆ దిశగా ప్రైవేటు ఆసుపత్రులు నిర్ణయాలు తీసుకోవడం లేదు. అందిన కాడికి దోచుకోవచ్చు…వైద్యం పేరుతో లక్షలు వసూలు చేయొచ్చున్న దుర్భుద్ది తప్ప మరేం కనిపించడం లేదు. అందుకు వైద్య శాఖలో ఉన్నతాధికారుల ఆశీస్సులు లేకుండా ఈ తంతంతా జరిగే అవకాశమే లేదు. 

సబితను నేనే మూడుసార్లు పట్టుకున్నానని ఓ జిల్లాకు చెందిన అధికారి నేటిధాత్రికి వెల్లడిరచారు. గతంలో సబిత ఇలాంటి అబార్షన్లు సాగిస్తున్న విషయం తెలిసిన సమయాల్లో ఆమెను పట్టుకున్న సందర్భాలలో తానే స్వయంగా వున్నానని, తానే ఆమెను పట్టుకున్నానని కూడా డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వో కూడా నేటిధాత్రితో చెప్పారు. మూడు సార్లు పోలీసులు కేసులు ఎదుర్కొని, మూడుసార్లు జైలు జీవితం అనుభవించిన సబిత అయినా మారకపోవడానికి వైద్య శాఖ ఉన్నతాధికారుల నిర్లిప్తత కారణం కాదా? సబిత అనే వైద్యురాలు ఏకంగా రాష్ట్రంలో కొన్ని వందల మంది ఆర్‌ఎంపిలతో కూడిన నెట్‌వర్క్‌ నెరుపుతోంది. ఎక్కడో మారు మూల ప్రాంతంలో ఇలాంటి ఆసుపత్రి ఒకటి ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలోనే సంచలనంగా మారినా ఎవరికీ కనిపించడం లేదా? సబితను చూసి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇంకా అనేక చోట్ల ఇలాంటి సంస్ధలు పుట్టగొడుగుల్లా వెలిశాయన్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి రజితకు సంబంధించిన వైద్యం విషయంలో ఏం జరిగిందన్నదానిపై రియా ఆసుపత్రి నుంచి అధికారులు పూర్తి స్ధాయి సమాచారం సేకరించినట్లు లేదు. ముందుగా జరిగిన ఒప్పందం మేరకు మాత్రమే రిపోర్టు తయారు చేసినట్లు కనిపిస్తోంది. లేకుంటే ఈ పాటికి రుయామీద కూడ చర్యలు తీసుకునేవారు. ఇక ఈ మధ్యే కొత్తగా వెలసిన శ్రీ చక్ర ఆసుప్రతి వ్యవహారం మరో విధంగా వుంది. ఆ ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలున్నాయన్నది, ఎలాంటి వైద్యం అందుతోందన్నదానికి రజిత మరణమే ఒక సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఎలాంటి సేఫ్టీ మెజర్‌మెంట్లు లేకుండా ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో అసలు వైద్యం అందుతున్న తీరు, వైద్యులపై కూడా పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆ రెండు ఆసుపత్రుల మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది. ఇలాంటి విషయాలలో పాలు పంచుకున్న ఈ రెండు ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటే గాని, భవిష్యత్తులో మిగతా ఆసుపత్రులు కూడా నేరపూరితమైన పనులు చేయడానికి ముందుకు రావు. ప్రజల ప్రాణాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించరు. ఈ విషయాలను జిల్లా వైద్య ఉన్నతాధికారులు ఆ రెండు ఆసుపత్రులకు సంబంధించిన లైసెన్సులు రద్దు చేయాల్సిన అవసరం వుంది. వైద్యం చేసిన డాక్టర్లపై కూడా చర్యలు తీసుకోవాలి. వారి పట్టాలపై మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు పిర్యాధు చేయాలి. వారి పట్టాలు రద్దు చేయించాలి. ఇలా కఠినంగా వుంటే తప్ప , వైద్యులు ప్రజల ప్రాణాలతో ఆటలాడుకోరు. వైద్యాన్ని వ్యాపారం చేసి కాసుల కోసం కక్కుర్తి పడరు.

ఒక సబితపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సిన అవసరం విస్మరిస్తున్నారు. గతంలో అబార్షన్లకు రెడీ అవుతున్న సందర్భంలోనే పట్టుకొని కేసులు నమోదు చేసిన వైద్య శాఖ ఉన్నతాధికారులు, ఇప్పుడు ఏకంగా ఆమె మూలంగా ఒక మహిళ ప్రాణం పోతే కూడా ఎందుకు కదలడం లేదు? సరైన ఆధారాలు లేవన్న నెపాన్ని ఎలా రూపొందించుకుంటున్నారు. మృతురాలు రజిత భర్తను బెదిరింపులకు కూడా గురిచేసినట్లు స్పష్టమౌతోంది. ఎందుకంటే అబార్షన్‌ చేయించడం అన్నది అమాయకులైన వారికి తెలియకపోవచ్చు. వారికి తెలిస్తే ఇలాంటి పనులు చేయడానికి దైర్యం చేయరు. కాని అమాయకులకు అసలు విషయం చెప్పకండా తమ స్వార్ధం కోసం, కాసుల కక్కుర్తి కోసం సబిత ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. ఇప్పుడు అబార్షన్‌ చేయించడానికి తీసుకొచ్చినవారిపై కూడా కేసు నమోదు చేస్తారని అతన్ని భయపెట్టినట్లు తెలుస్తోంది. దాంతో రజిత భర్త కూడా జరిగిన ఘోరాన్ని దిగమింగుకొని, సబిత లాంటి నరరూప రాక్షసులను వెనకేసుకొస్తున్నారు. సజహంగా ఇలాంటి విషయాల్లో అమాయకులైన ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత అధికారులదే…నిజం చెప్పడానికి సామాన్యులకు ఎలాగూ ఇబ్బందికరమైన పరిస్ధితే…కాని పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? అంటూ సెంటిమెంటు డైలాగులు చెప్పి, ఎంతో కొంత ముట్ట జెప్పి, సబితపై కేసు రాకుండా చూసుకోవడంలో అధికారులు కూడా కీలకపాత్ర పోషించారన్నది ఇక్క స్పష్టంగా తెలిసిపోతోంది. ఏలాంటి ఒత్తిడి లేకపోతే ఎవరైనా నిజమే చెబుతారు. ఇద్దరు ఆడపిల్లలను అనాధలు చేసిన వారిని ఊరికే వదిలేయొద్దనేది ప్రజా సంఘాలనుంచి వస్తున్న డిమాండ్‌. 

ఒక మహిళ వైద్యురాలై వుండి, సాటి ఆడ ప్రాణం పురుడు పోసుకోకుండా, పురిట్లోనే కొన్ని వందల ప్రాణాలు చిదిమేస్తున్న సబితను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. అన్ని రకాలైన ఆధారాలు ఆమెను దోషిగానే చూపిస్తున్నాయి. సబిత సాగిస్తున్న వ్యవహారం ఇప్పటిది కాదు. ఇప్పటికి ఆమె పసి ప్రాణాలు తోడేసిందో ఆ లెక్క అటుంచితే, రజిత లాంటి అమ్మాయిలెందరి ప్రాణాల పోవడానికి కారణమైందో కూడా తెలియాల్సివుంది. వృత్తిలో నేరమయమైన పనిని ఎంచుకొని వ్యాపారం సాగిస్తూ, గొప్పగా చెలామణి అవుతున్న సబితను శిక్షించాలంటున్నారు. జిల్లా కలెక్టర్‌ ఈ విషయంపై సీరియస్‌గా దృష్టిపెడితే తప్ప ఈ సంగతి తేలేలా లేదని ప్రజలంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!