శభాష్‌ శ్రీమంతులారా!

`భూమి వున్న పేదల ఇంటి నిర్మాణం కోసం సిఎం ప్రకటన భేష్‌.

`ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తే, అదనంగా ఇంటికెంతైనా భరిస్తాం.

`ఎన్ని ఇండ్లకైనా వెనుకాడం.

`గతంలో ప్రకటించినట్లు లబ్ధి దారులకు ఐదు లక్షలు మంజూరు చేయండి. 

`ఎంతో మంది శ్రీమంతులు, ఎన్నారైలు ముందుకొచ్చే అవకాశం వుంది.

`ప్రభుత్వం ఇస్తామన్న ముడు లక్షలలో గృహ నిర్మాణ కార్మికులకే సగం వెచ్చించాల్సి వస్తుంది!

`యాభై గజాలలో ఇంటికి కనీసం ఆరున్నర లక్షలు ఖర్చయ్యే అవకాశం.

`రాష్ట్రంలో గుప్తదానాలు చేసే, శ్రీమంతులను కదిలిస్తే సరి…

`దాతలుగా ముందుకొచ్చేందుకు ఎంతో మంది రెడీ.

`దాతల పర్యవేక్షణలోనే ఇంటి నిర్మాణాలు సాగాలి.

`రూపాయి కూడా అవినీతి కాకుండా వుంటుంది.

`ఇది అమలు చేస్తే వచ్చే ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ మళ్ళీ బంపర్‌ మెజారిటీ.

`రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎంతో మంది దాతలు ముందుకొచ్చే అవకాశం వుంది.

`ఎన్నారైలు కూడా సహకారం అందుతుంది.

`అనేక మంది దాతలు, శ్రీమంతులు, ఎన్నారైలు నేటిధాత్రి తో చర్చించారు.

`ప్రభుత్వం ముందుకొస్తే మేం సహకరిస్తామంటున్నారు. 

`ఇలాంటి విజయం చరిత్రలో నిలిచిపోతుంది.

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ చొరవ దేశమంతా ఆదర్శమౌతుంది.

`మన చుట్టూ వున్న శ్రీమంతులంతా కలిసొచ్చే అవకాశం వుంది.

` ఒకసారి మాలాంటి వాళ్లను పిలిచి సిఎం మాట్లాడితే అన్ని విషయాలు చర్చిస్తాం.

`సరికొత్త భాగస్వామ్య చరిత్రకు శ్రీకారం జరుగుతుంది.

`సొంత ఇళ్లు లేని వారంటూ ఎవరూ తెలంగాణలో వుండరు.

`అందరికీ ఇళ్లు ఇచ్చిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మానవసేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. ఆ మాటలతో పేదలకు సేవ చేసేందుకు ఎంతో మంది మనసున్న వాళ్లు కూడా సిద్ధంగా వున్నారు. శ్రీకృష్ణుడు లాంటి స్నేహితుడున్నా, నోరు తెరిచి అడగలేని కటిక దరిద్రం అనుభవించాడు కుచేలుడు. అలాంటి కుచేలుల్లు ఎంతో మంది మన సమాజంలో వున్నారు. ఎంతో మంది శ్రీమంతులైన కృష్ణుడి లాంటి వారు కూడా మన చుట్టే వున్నారు. కుచేలుడు నాకు ఇది కావాలని అని ఏనాడు కృష్ణుడిని అడక్కపోయినా, ఆదుకున్నాడు. కుచేలుడిని శ్రీమంతుడిని చేశాడు. అలాగే సమాజంలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది పేదలకు చేయూతనిచ్చేందుకు మన రాష్ట్రంలో కూడా ఎంతో మంది సామాజిక సృహ వున్న శ్రీమంతులున్నారు. వాళ్లు పేదలకు సాయం చేడయానికి కూడా సిద్ధంగా వున్నారు. కాకపోతే ప్రభుత్వం వారిని పిలిచి మాట్లాడితే ముందుకొస్తామన్న భావనను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. 

    రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు వుండకూడదన్న ఆలోచనతో స్ధలం వున్న వారు ఇల్లుకట్టుకోవడానికి ప్రభుత్వం రూ.3లక్షలు అందజేస్తుందని ప్రకటించారు.

 ఓ వైపు డబుల్‌ బెడ్‌ రూంల ఇండ్ల నిర్మాణం జరుగుతోంది. మరో వైపు పాత ఇండ్ల స్ధానంలో కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్నవారికి, స్ధలం వుండి ఇల్లు కట్టుకునే స్ధోమత లేని వారికి ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించేందుకు సిద్దమైంది. అందుకు అవసరమైన ధరఖాస్తులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్వీకరిస్తోంది. కాకపోతే ప్రభుత్వం ఇచ్చే ఈ ఆర్ధిక సాయానికి మరింత తోడైతే, పేదవారు కూడా గొప్పగా కలగనేటు వంటి ఇంటి నిర్మాణం చేయొచ్చు. అందుకు అసరమైన ఆర్ధిక తోడ్పాడు కల్పించేందుకు చాలా మంది సేవాతత్పరులైన శ్రీమంతులు ముందుకొచ్చేందుకు సిద్దంగా వున్నారు. నేటిధాత్రిలో చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు, రాష్ట్రంలో వున్న రియలెస్టేట్‌ వ్యాపారులు, రాజకీయ నాయకులు ఈ విషయంపై చర్చించారు. వాళ్లు ముందుకొచ్చే అవకాశాలున్నట్లు వెల్లడిరచారు. ఈ ప్రయత్నం సక్సెస్‌ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబం అంటూ వుండదు. ప్రతి వ్యక్తికి ఇల్లుంటుంది. ఇది ఒక చరిత్రను సృష్టిస్తుంది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శవంతమౌతుంది. తద్వారా దేశం మొత్తం ఇలాంటి అనేకం జరిగే అవకాశం వుంది. 

     రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు లక్షల రూపాయలతో 50 గజాలలో( 450 ఎస్‌ఫ్‌టి) ఇంటి నిర్మాణం సాధ్యం కాదు.

  ఖర్చు సుమారు రూ.6లక్షలకు పైగా అవుతుంది. గృహ నిర్మాణం చేపట్టే కార్మికుల ఖర్చే దాదాపు లక్షన్నరకు పైగా అవుతుంది. అలాంటి సమయంలో ప్రభుత్వం ఇచ్చే మూడు లక్షల్లో సగం కార్మికులకే వెచ్చించాల్సివస్తుంది. అది మరింత పెరిగే అవకాశం కూడా వుంది. మిగతా సొమ్ముతో ఇల్లు నిర్మాణం జరగదు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న ఆ ప్రాజెక్టుకు ఇబ్బందులు వచ్చే అవకాశం వుంది. అందవల్ల ప్రభుత్వం కనీసం రూ.5లక్షల వరకు చెల్లిస్తే, అదనంగా అయ్యే ఖర్చును ఆ గ్రామంలో నిర్మాణం చేసే ఇళ్లను దత్తత తీసుకునే శ్రీమంతులు భరిస్తారు. దాంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. పేదలకు ఎంతో సౌకర్యవంతమైన అందమైన ఇంటి నిర్మాణం జరుగుతుంది. ఒక తరమంతా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసిఆర్‌ను గుండెల్లో పెట్టుకుంటుంది. భవిష్యత్తు తరం కూడా గొప్పగా చెప్పుకుంటుంది. టిఆర్‌ఎస్‌(బిఆర్‌ఎస్‌)ను జీవితంలో మర్చిపోరు. మరో పార్టీకి ఓటు వేయరు. నిజానికి పేదలు ఇంటి స్ధలం అన్నది గ్రామాల్లో ఖచ్చితంగా వుంటుంది. వాళ్లందరికీ ఇంటి నిర్మాణం ప్రభుత్వానికి పెద్ద సమస్య కాకపోవచ్చు. ఎందుకంటే ఎంతో మంది సామాజిక సేవ చేయాలన్న ఆలోచన వున్నవారు కూడా కలిసొచ్చే అవకాశం వుంది. మన చుట్టూ వున్న నాయకులే కాదు, వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, రియలెస్టేట్‌ వ్యాపారులు, వీరికి తోడు ఎంతో మంది ఎన్‌ఆర్‌ఐలు కూడా ఊళ్లకు దత్తతు తీసుకోవడం కోసం ముందుకొచ్చేందు ఉత్సాహంగా వున్నారు. 

 ఒక్కసారి ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆ దిశగా ఆలోచన చేసి, ఎవరైతే ఉత్సాహంగా వున్నారో అలాంటి వారికి ఒక్క పిలుపిస్తే చాలు. 

ఎంతో మంది కదిలేందుకు సిద్దంగా వున్నారు. కొత్తగా పునర్మిర్మాణం పూర్తి చేసుకున్న యాదాద్రి గర్భగుడికి బంగారు తాపడం కోసం ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఒక్క పిలుపునిస్తే వందలాది కిలలో బంగారం పోగైంది. అలాగే ప్రతి పేదకు ఇంటి నిర్మాణం పేరుతో భాగస్వాములయ్యేవారు ముందుకు రండి..అని కేసిఆర్‌ చెబితే చాలంటున్నారు. అందుకు మేం సిద్దంగా వున్నట్లు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి ముఖ్యమంత్రితో చర్చించేందుకు ప్రతి క్షణం సిద్దంగా వుంటామంటున్నారు.  

 ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఓ మనసున్న వ్యక్తి సుబాష్‌రెడ్డి.  

 ప్రభుత్వం ప్రకటించిన డబుల్‌ బెడ్‌ ఇండ్ల నిర్మాణంలో తన సొంత నిధులు జత చేసి అందమైన ఇండ్లను నిర్మాణం చేసి ఇచ్చాడు. అదనంగా కొన్ని కోట్ల రూపాయలు ఖచ్చు చేశాడు. అంతే కాదు ఆ గ్రామంలో కోట్ల రూపాయల సొంత నిధులతో అత్యాధునికమైన హంగులు, సౌకర్యాలతో కూడిన స్కూలు నిర్మాణం చేశాడు. లైబ్రరీ ఏర్పాటు చేశాడు. ఆ చుట్టు పక్కల గ్రామాలలో అనేక గుళ్ల నిర్మాణానికి సాయపడ్డాడు. ఇలా రాష్ట్రంలో పేదల కోసం ఆలోచించేవారు ఎంతో మంది వున్నారు. వారందరికీ కూడా ఇలాంటి సేవలో భాగస్వాములు కావాలన్న ఆలోచన కూడా వుంది. వారందరినీ ఏకం చేసి, పేదలకు సాయం చేసేలా చేసేందుకు ప్రభుత్వం ముందుకొస్తే , ఇండ్ల నిర్మాణంలోగొప్ప విప్లవమే వస్తుందంటున్నారు.  

అయితే ఇలాంటి ఇండ్ల నిర్మాణం ప్రభుత్వ సంస్ధలు , కాంట్రాక్టర్లు కాకుండా ముందుకొచ్చే దాతల పర్యవేక్షణలో జరగాలి. 

అప్పుడే ఎలాంటి అవినీతి ఆస్కారం వుండదు. జ్యాపం అసలే జరగదు. అనుకున్న సమయానికి ఇండ్లు పూర్తవుతాయి. ప్రజలకు అందుబాటులోకి తెస్తారు. ఎందుకంటే అదనంగా వాళ్లు పెట్టే ప్రతి పైసా ఆ ప్రజలకు చెందాలన్న ఆలోచన దాతలకే వుంటుంది. కాని ప్రైవేటు కాంట్రాక్టర్‌కో, లేక ప్రభుత్వ ఉద్యోగులకో వుండకపోవచ్చు. అందువల్ల ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో వున్న శ్రీమంతులకు ప్రభుత్వం ఆహ్వానం పలికితే తెలంగాణకు గర్వకారణమే కాదు, దేశానికి ఆదర్శమౌతుంది. పేదల జీవితాల్లో వెలుగు నిండుతుంది. సొంత ఇల్లు కల ఎంతో మందికి నెరవేరుతుంది. సొంతది ఎంత చిన్న ఇళ్లయినా సరే వుంటే చాలనుకునే వారికి, మరింత గొప్ప ఇంటిని అందించే అవకాశం వుంటుంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఒక్కసారి దీనిపై మనసుపెడితే, ఒక్క ఆలోచన చేస్తే రాష్ట్రమంతా ఏక కాలంలో కొన్ని లక్షల కొత్త ఇండ్లకు శ్రీకారం జరుతుంది. కొత్త రాష్ట్రం కొత్త ఇండ్లతో కళకళలాడుతుంది. కేసిఆర్‌ కీర్తి అజరామరమౌతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!