విమోచనమే అయితే నిజాంను రాజ్ ప్రముఖ్ ఎలా అయ్యారు?
`సెప్టెంబరు17న విలీనం జరగడం మూలంగానే తెలంగాణ ఇండియాలో కలిసింది!
`తెలంగాణ సాయుధ పోరాటం ముస్లిం వ్యతిరేక పోరాటం కాదు!
`నిజాం కు వ్యతిరేకంగా ఎంతో మంది ముస్లింలు పోరాటం సాగించారు.
`తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఒక దశలో అప్పటి ఇండియన్ ఆర్మీతో కూడా పోరాడారు!
`బిజేపి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముస్లిం, హిందూ పోరాటంగా అర్థమొచ్చే ప్రచారం చేయొద్దు!
`నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో షోయాబుల్లా ఖాన్ వంటి జర్నలిస్టు వున్నాడు!
`తొలి అమరుడు షేక్ బందగీ ముస్లిమే!
`తెలంగాణ ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే, నిజాం ప్రపంచ కుభేరుడెలా అయ్యాడు!
`సర్థార్ వల్లభ్ భాయ్ తెలంగాణ విమోచనమే చేయిస్తే నిజాంను శిక్షించాలి కదా!
`ఏడాదికి లక్ష రూపాయల భరణంతో రాజ్ ప్రముఖ్ గా గౌరవించారు?
`ప్రజలను గందరగోళ పర్చకండి!
`చరిత్రకు మరకలద్దకండి!
`ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఒక కీలక ఘట్టం!
`ప్రపంచానికి ఒక చైతన్యం నింపిన ఘట్టం.. దోపిడీ వ్యవస్థకు గుణపాఠం!
`తెలంగాణలో మువ్వన్నెల జాతీయ జెండా ఎగిరిన రోజు….దేశ సమైక్యతలో, సమగ్రతలో తెలంగాణ భాగమైన రోజు…?
హైదరాబాద్,నేటిధాత్రి: విత్తు ముందా…చెట్టు ముందా? అన్నదానికి ఇప్పటికీ సమాధానం లేనట్లే, తెలంగాణ విషయంలోనూ సెప్టెంబర్ 17 అనేది విలీనమా? విమోచనమా? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఏ రకంగా అన్వయించినా ఏదో లోపం కనిపిస్తూనే వుంటుంది. విమోచనం అని నిర్ధారిస్తే వందల ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి. విలీనమంటే కూడా అనేక ప్రశ్నలు కళ్ల ముందు మెదులుతాయి. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ సందిగ్ధతను నివృత్తి చేసిన వారు లేరు. ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటైనా 1952 తొలి ఎన్నికలు జరిగేదాకా కూడా జరిగిన సైనిక పాలన, పౌర పాలనల్లో కూడా అనేక వివాదాలున్నాయి. మేజర్ జనరల్ జేఎస్. చౌదరి నేతృత్వ సైనిక పాలన తెలంగాణ ప్రజలను అనేక రకాల ఇబ్బందులకు గురిచేసిందనేది కూడా ఓ చరిత్ర. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్పటి గవర్నరైన ఎంకే. వెల్లోడి నేతృత్వంలో పౌర ప్రభుత్వం ఏర్పాటు చేశాక తెలంగాణలో పోలీసు చర్యలు తగ్గాయి. హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికలకు ముందు సాగించిన సైనిక పాలన తెలంగాణలో 40 వేల మంది రైతుల మరణానికి కారణమైనట్లు అప్పట్లో పెద్దఎత్తున ఆరోపణలు రావడంతోనే ఎంకే. వెల్లోడి పాలన వచ్చింది. ఎం.కే. వెల్లోడి కేరళకు చెందిన ఓ ఐపిఎస్ అధికారి. ఆయనను హైదరాబాద్ రాష్ట్ర పౌర ప్రభుత్వంలో నలుగురు మంత్రులు పనిచేస్తే అందులో బూర్గులు రామకృష్ణారావు వున్నారు. 1952 ఎన్నికల తర్వాత బూర్గుల ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అప్పుడు కూడా సెప్టెంబర్ 17ను విమోచన దినంగా చేసుకున్నట్లు ఆధారాలు లేవు. ప్రభుత్వం కుదురుకోకముందే అప్పటి కేంద్ర ప్రభుత్వం బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో తెలంగాణ 9 జిల్లాలుగా, మరో 5 జిల్లాలు మహారాష్ట్రలో, 3 జిల్లాలు కర్ణాటకలో కలపడంతో అసలు హైదరాబాద్ రాష్ట్ర ఉనికే లేకుండాపోయింది. కాకపోతే మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు 1957 నుంచి హైదరాబాద్ విలీన దినోత్సవాలను నిర్వహిస్తున్నాయి. కాని ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 17ను గుర్తించడానికి కూడా ఇష్టపడలేదు. ఆనాటి నుంచి కమ్మూనిస్టు పార్టీలు ఎంత పోరాటం చేసినా అధికారికంగా తెలంగాణ విలీన దినోత్సవాన్ని నిర్వహించలేదు. అప్పటికీ నైజాం రాజ్యం ఇండియాలో కలపడం అన్నది విలీనమా? నైజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి కావడం విమోచనమా? అన్నదానిని కూడా ప్రభుత్వాలు క్లారిటీ ఇవ్వలేకపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి నవంబర్ 1నే రాష్ట్రావతణ దినోత్సవంగా జరుపుకోవడం ఆనాయితీగా వచ్చింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్‌ఎస్ పార్టీ సెప్టెంబర్ 17 విలీన దినోత్సవాన్ని నిర్వహించాలని కోరింది. కాని విమోచనం అన్నదానిపై ఆ పార్టీ కూడా విముక్తి దినోత్సవంగా జరపాలనే కోరింది. తెలంగాణ వచ్చాక మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం విముక్తి దినోత్సవాన్ని నిర్వహించేలేదు. ప్రతిపక్షాలు ఎంత అడిగినా ముఖ్యమంత్రి కేసిఆర్ పార్టీ పరంగా చేసుకోవడానికి అనుమతినిచ్చాడే గాని, ప్రభుత్వం తరుపున జరపలేదు. ఉద్యమ కాలంలో మాత్రం సెప్టెంబర్ 17ను ఒక రాజకీయ అస్త్రంగా టిఆర్‌ఎస్ మల్చుకుందని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పుడు బిజేపి అదే దారిలో నడుస్తోంది.
బిజేపిలో తెలంగాణ విమోచనం అంటున్నా , ప్రజల్లో గందరగోళం ఇప్పటికీ వుంది. దానిని నివృత్తి చేయడం గత డెబ్బై ఏళ్లుగా ఎవరికీ సాధ్యం కాలేదు. ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూస్తే, దేశ స్వాతంత్య్రం వచ్చే నాటికి 612 చిన్న చిన్న సంస్ధానాలు స్వపరిపాన సాగిస్తున్నాయి. అందులో కొన్ని పెద్ద రాజ్యాలు కూడ వున్నాయి. వాటిలో హైదరాబాద్ రాజ్యమనేది అన్నింటికన్నా పెద్దది. చిన్న చిన్న సంస్ధానాలన్నీ స్వాతంత్య్రం రాగానే దేశంలో విలీనమయ్యాయి. కాని హైదరాబాద్ నిజాం రాజ్యం మాత్రం విలీనం కాలేదు. ఇండియాలో విలీనం కావడాని నిజాం ససేమిరా? అన్నాడు. దాంతో ఆపరేషన్ పోలో అనేది నిర్వహించి, హైదరాబాద్‌ను కేవలం 5 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం స్వాదీనం చేసుకున్నది. లొంగిపోయిన నిజాంను అప్పటినుంచి 1964 వరకు రాజ్ ప్రముఖ్‌గా( ప్రస్తుతం గవర్నర్) నియమించింది. ప్రతి ఏటా లక్ష రూపాయల భరణం కూడా ఇస్తూ వచ్చింది. ఒక వేళ ఆనాడు కేంద్ర ప్రభుత్వం అప్పటి హైదరాబాద్‌ను నిజాం నుంచి విముక్తి చేశారనుకుంటే ఆయనకు రాజ్ ప్రముఖ్‌గా పదవి ఇచ్చేవారు కాదు. విలీనం చేసుకున్నామన్న భావనతో, లొంగిపోయిన నిజాం రాజుకు గౌరవం ఇచ్చి సత్కరించినట్లే లెక్క. అంతే కాదు నిజాం లొంగిపోయినా, తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేస్తున్న ఆనాటి రైతాంగం మీద సైనిక చర్యలు ఆగలేదు. హైదరాబాద్ రాష్ట్రంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమయంలో నిజాం, రజాకార్ల మూలంగా 10 వేల మంది రైతులు మరణిస్తే, కేంద్ర ప్రభుత్వం అణిచివేత వల్ల సుమారు 40 వేల మంది రైతులు మరణించారని చరిత్ర లెక్కలు చెబుతోంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పటి హైదరాబాద్ ప్రజలకు విలీనమే బహుమతిగా ఇచ్చినట్లు లెక్క. కేంద్రం విమోచనమే బహుమతి చేస్తే 40 వేల మంది రైతులు మరణించేవారు కాదు. కేంద్ర సైనిక చర్యల్లో భాగంగా రజాకార్ల నాయకుడు కాశిం రజ్వీని బంధించి అప్పటి వరంగల్ జైలుకు తరలించిన కేంద్ర ప్రభుత్వం నిజాం సూచన మేరకు ఆయనను విడుదల చేసింది. కాశిం రిజ్వి పాకిస్తాన్ వెళ్లేందుకు అనుమతినిచ్చింది. అంటే ఈ సంఘటన కూడా తెలంగాణ విమోచనమని చెప్పడానికి కూడా వీలు లేకుండాచేసింది.
సరే మంచో చెడో ఇన్నేళ్లకైనా ఒక అడుగు ముందుకు పడిరదనే అనుకుందాం…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమైకత్యా దినోత్సవం అంటోంది. బిజేపి విమోచన దినోత్సవం అంటోంది. ఈ రెండు ప్రభుత్వాలలో బలమైన కేంద్రంలో అధికారంలో వుండి నిర్ణయాత్మక శక్తిగా వున్న బిజేపి తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిపిసి ఏడు మండలలాను తిరిగి మళ్లీ తెలంగాణకు ఇస్తామని చెప్పగలరా? అంతే కాకుండా ఇప్పటికీ అటు కర్నాటకలోనూ, ఇటు మహారాష్ట్రలోనూ విలీన దినోత్సవాలు జరుపుకుంటున్న ఎనమిది జిల్లాలను తిరిగి తెలంగాణలో కలిపే ప్రకటన ఏదైనా చేస్తారా? అదే జరిగితే నిజంగా బిజేపి చిత్తశుద్ధిని తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తారు. కాని కేవలం రాజకీయాల కోసం మాత్రమే సెప్టెంబర్ 17ను వాడుకుంటామంటే ప్రజలు స్వాగతిస్తారని అనుకోలేం. ఎందుకంటే బిజేపి చెబుతున్న విషయాలు అన్నీ వాస్తవాలు కావు. రజకార్ల దాష్టికాలనే ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లాలని చూస్తే, ఇప్పటి వరకు గ్రామాల్లో వున్న ముస్లిం, హిందువుల ఐక్యతకు బీటలు వారుతుంది. ఇది తెలంగాణ సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకుంటే హైదరాబాద్ రాష్ట్రంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో హిందువులే కాదు, ముస్లింలు కూడా వున్నారు. నిజాం బాధితుల్లో అనేక మంది ముస్లింలు కూడా వున్నారు. అందులో తొలి అమరుడుగా చెప్పుకోవాల్సిన వారిలో షేక్ బందగీ వున్నాడు. కలాన్ని ఖడ్గంగా చేసి నిజాం ప్రభుత్వం మీద అక్షరాలను సంధించిన షోయబుల్లా ఖాన్ కూడా ముస్లిమే. ఆయనను చాదర్‌ఘాట్ వద్ద చేతులు, కాళ్లు నరికి అత్యంత కిరాతకంగా చంపింది నిజాం ప్రభుత్వమే…అంతే కాదు నిజాం కు వ్యతిరేకంగా కామ్రేడ్స్ అసోసియేషన్ అనే సంస్ధ స్ధాపించిన ముగ్ధుం మొహినుద్దీన్ కూడా ముస్లిమే…ఇలా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో ముస్లింలు వున్నారు. అంతే కాదు నిజాం రాజ్యంలో హిందువులకు తీరని అన్యాయం జరిగిందనో, చేశారని చెప్పడానికి కూడా వీలు లేదు. ఆనాటి ఉస్మానియా యూనివర్సిటీలో రామానంద తీర్ధ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి జన్మదిన వేడుకలకు అనుమతినిచ్చింది కూడా నిజామే…! అందువల్ల తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 అన్నది ఒక చారిత్మ్రాక ఘట్టమే…కాదని ఎవరూ అనలేరు. కాని దాన్ని ఓ వర్గానికి ముడిపెట్టడమే సరైంది కాదు. పైగా అది విమోచనం అనడానికి కూడా వీలు లేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో సుమారు పది లక్షల ఎకరాలు నాటి భూస్వాముల చెర నుంచి రైతులు విడిపించుకున్నారు. మరి భూములు సైనిక పాలన కాలంలో మళ్లీ భూస్వాముల చేతుల్లోకి వెళ్లాయి. ఏ విస్నూర్ దొర మీద తెలంగాణ ప్రజలు పోరాటం చేసి, జనగామ రైల్వే స్టేషన్‌లో అంతమొందించారో…ఆయన కుమారుడినే తెలంగాణ ప్రజలు అసెంబ్లీకి పంపారు. మరి దీన్నే మంటారు…! అందువల్ల తెలంగాణ ఇండియాలో విలీనమైన రోజుగానే సెప్టెంబర్ 17ను భావించాలే గాని, విమోచన అనడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదు. ఏది ఏమైనా ఆనాటి నుంచి సెప్టెంబర్ 17 తెలంగాణ రాజకీయాలకు వేధికగానే వుంది. ఇప్పుడూ అదే వేధికగా రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారుతోంది.