వస్తారు సరే..ఏమిస్తారు!?

ప్రధాని మోడీ తెలంగాణను కనికరిస్తారా?

`తెలంగాణ మీద వరాలు కురిపిస్తారా?

`మాటలే మూటలనుకొమ్మంటారా?

`విభజన హామీలేమైనా ప్రకటిస్తారా?

`జాతీయ ప్రాజెక్టులు మంజూరు చేస్తారా?

`నాలుగు మాటలు చెప్పి వెళ్లిపోతారా?

`పార్టీ శ్రేణులకు బాగా కష్టపడండి మాత్రమే చెప్పి ఊరడిస్తారా?

`సభ సూపర్‌ అని భుజం తట్టి పండగ చేసుకోమంటారా?

`బిజేపి నాయకులు చెప్పుకోవడానికేమైనా మాటిస్తారా?

`బయ్యారం ముచ్చట చెబుతారా?

` గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడతారా?

` రైల్వే కోచ్‌ తూచ్‌ అనలేదనేమైనా అంటారా?

`పాలమూరు-రంగారెడ్డి ముచ్చటెత్తుతారా?

`ఈసారైనా దయచూపుతారా?

 హైదరాబాద్‌,నేటిధాద్రి: 

దేశ ప్రధానమంత్రి ఏ రాష్ట్రానికైనా పర్యటనకు వెళ్తున్నాడంటే ఆ రాష్ట్ర ప్రజలు సహజంగా ఎన్నో ఆశలు పెట్టుకుంటుంటారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడైనా ఏ ప్రధాన మంత్రి వచ్చినా అనేక నిధులు, ప్రత్యేక పధకాలు ప్రకటనలు, అమలు మొదలైనవి చేసేవారు. దేశంలో ప్రతష్టాత్మకంగా అమలౌతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం యూపిఏ 1లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ 2005 సెప్టెంబర్‌లో ఉమ్మడి రాష్ట్రంలో అనంతపూర్‌నుంచి పైలెట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోడీ చాలా సార్లు వచ్చారు. కాని ఏనాడు తెలంగాణకు ఎలాంటి ప్రకటనలు పెద్దగా చేయలేదు. అందుకే ఆసారైనా తెలంగాణకు ఏవైనా వరాలు కరిపిస్తారా? అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిజేపి శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకుంటే ప్రధాని వచ్చాడు. వెళ్లాడు అంటే రేపటి రోజు బిజేపి నేతలు చెప్పుకోవడానికి కూడా ఏమైనా వుండాలంటే కూడా ఈసారి తప్పనిసరిగా ప్రధాని హమీలు ఇస్తారన్న నమ్మకంతో వున్నారు. గతంలో కూడా ఎన్ని సార్లు వచ్చినా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఎన్నికల సమయంలో వచ్చినా ఎలాంటి హమీలు లేకుండానే వెనుదిరిగారు. కాని ఈసారి ప్రధాని మోడీ పర్యటన మీద బిజేపి శ్రేణులు బోలెడు ఆశలుపెట్టుకున్నారు. వారిని నెరవేర్చుతాడా? లేక ఎప్పటిలాగా నాలుగు మాటలు చెప్పి వెళ్లిపోతాడా? అన్న సందేహం కూడా వ్యక్తమౌతోంది. 

సహజంగా ప్రధాన మంత్రి మోడీ పర్యటన చాలా విభిన్నంగా సాగుతుంది. 

ఎన్నికల సమయంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడ వరాలు కురిపించడం అలవాటు. కాని గత ఎన్నికల సమయంలో బిజేపి ప్రచారానికి ఒకటి రెండుసార్లు వచ్చిన ఆయన ప్రచారం చేశాడే గాని వరాలు ప్రకటించలేదు. నిజానికి ఈసారి పర్యటన ఎన్నికల మూడ్‌లోనే వుంటుందన్న వాదనలు వినిస్తున్నాయి. పొరుగున కర్ణాటక ఎన్నికలు జరుగుతున్నాయి. మరో ఏడెనమిది నెలల్లో తెలంగాణలోనూ ఎన్నికలు రానున్నాయి. ఈ సమయంలో కూడా ప్రధాని మోడీ ఎప్పటిలాగే వచ్చి వెళ్లిపోతే మాత్రం అది బిజేపి నష్టమే అంటున్నారు. ప్రధాన మంత్రి మోడీ ఇలాంటి సమయంలో వచ్చినా తెలంగాణకు కొన్ని పనులైనా ప్రకటించకపోతే ప్రజలుకు బిజేపి శ్రేణులు సమాధానం చెప్పుకోలేరు.

ఎందుకంటే ఉత్తరాధి రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే అక్కడ వరాలు కురిపించిన అనుభవం మోడీకి వుంది. బీహార్‌ లాంటి రాష్ట్రానికి సుమారు 80వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రకటించిన అనుభవం మోడీకి వుంది. అలా ఉత్తరాధిలోని అనేక రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. పొరుగన వున్న మహారాష్ట్రకు అనేక నిధులు మంజూరుచేశారు. గుజరాత్‌ విషయంలో ఇక చెప్పనవసరం లేదు. అన్నీ అక్కడికే అన్న అపవాదలు వుండనే వున్నాయి. దక్షిణాదిపై బిజేపి చిన్న చూపు చూస్తుందన్న అపవాదు ఎలాగు వుంది. దాన్ని తుడిచేసేందుకైనా ఈసారి ప్రధాని తెలంగాణకు ఏవైనా ప్రకటిస్తారన్న నమ్మకం బిజేపి శ్రేణుల్లో వుంది. నిజానికి తెలంగాణపై బిజేపి పెద్దలకు ఎలాంటి ప్రేమ లేదన్న ప్రచారం కూడా వుండనే వుంది. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో సాక్ష్యాత్తు నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అభ్యర్ధిగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు, బిఆర్‌ఎస్‌ నాయకులు గుర్తు చేస్తూనే వుంటారు. తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మాటలు ఇప్పటికే అనేక సార్లు ప్రధాని మోడీ మాట్లాడడం తెలిసిందే. అంతే కాకుండా ఎలాంటి సమయం సందర్భం లేకుండానే కూడా తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటు తలుపులు మూసి, ఆంధ్రప్రదేశ్‌ విభజన చేశారని అన్నారు. ఇది కూడా తెలంగాణ ప్రజలు మనస్సు చివుక్కుమన్నదే. మరి అలాంటి వ్యాఖ్యలు ప్రజలు గుర్తు చేసుకోకుండా వుండాలంటే తెలంగాణ మీద బిజేపికి కూడా ప్రేమ వుందని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా ప్రధాని తెలంగాణకు వరాలు కురిపిస్తే గాని లాభం వుండదు. 

 ఆర్థికంగా దేశానికి ఆదాయాన్ని సమకూర్చుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అన్నది రాష్ట్ర ప్రభుత్వం, బిఆర్‌ఎస్‌ ఫార్టీ లెక్కలతో సహా అనేకసార్లు ప్రజల ముందు వుంచిన సంగతి తెలిసిందే.

 తెలంగాణను నుంచి వెళ్తున్న నిధులకు, కేంద్రం వాటా అందుతున్న నిధులకు పొంతన లేదన్నది కూడా అనేక సార్లు చర్చకు వచ్చింది. గత జిహెచ్‌ఎంసి ఎన్నికల ముందు ఈ విషయంపై అటు బిఆర్‌ఎస్‌కు, ఇటు బిజేపికి పెద్ద మాటల యుద్దమే జరిగింది. తెలంగాణకు ఇప్పటికే రెండులక్షల కోట్లరూపాయలు అందించినట్లు బిజేపి నేతలు చెప్పుకునేవారు. కాని ఆ లెక్కలు తప్పని బిఆర్‌ఎస్‌ వాదించినట్లే అధికారిక లెక్కలు కేంద్ర బిజేపి పెద్దలు బైట పెట్టడంతో రాష్ట్ర బిజేపి నేతల నోటికి తాళంవేసినట్లైంది. ఇక తెలంగాణకు విభజన సమయంలో ఇచ్చిన హామీలు కేంద్రం ఒక్కటి కూడా అమలు చేయలేదు. వాటి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా, ఉత్తరాలు రాసినా స్పందన లేదు. విభజన హామీలే కాకుండా గతంలో యూపిఏ 2 ఇచ్చిన హహాలు కూడా కొన్ని అమలు జరగలేదు. తెలంగాణకు ఐటిఐఆర్‌ అనే ప్రతిష్టాత్మక సంస్ధను యూపిఏ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనుల కూడా సిద్దం చేసింది. ఆ ప్రాజెక్టు మూలంగా తెలంగాణకు ఐటి రంగంలో పెద్దఎత్తున్న పెట్టుబడులు, కంపనీలు వచ్చేవి. లక్షలాది ఉద్యోగాలు యువతకు కల్పించబడేవి. కాని ఆ అవకాశం బిజేపి ప్రభుత్వం చేజార్చింది. ఆ ప్రాజెక్టును గుజరాత్‌కు తరలించింది. యూపిఏ హయాంలో ఇచ్చిన మరి కొన్ని హామీలలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి. కాని దాని ఊసే లేదు. కేంద్రం ఏనాడు స్పందించింది లేదు. ఇక కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ అన్నది తెలంగాణ కల. ఆ కలను అలాగే పదిలంగా కూడా వుంచలేదు. దానిని కూడా గుజరాత్‌కు తరలించుకుపోయారన్నది రాష్ట్ర ప్రభుత్వం వాదన. ఇక నల్లబంగారమైన సింగరేణి బ్లాక్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా, కేంద్రం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దానికి బిజేపి చెప్పే సమాధానం, బిఆర్‌ఎస్‌ చెప్పే విషయానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. కాని ప్రజల్లో గందరగోళం మాత్రం వుంది. అలాంటి సమస్యను నివృత్తిచేయాల్సిన బాధ్యత మాత్రం కేంద్రంపైనే వుంది. మరి ప్రధాని మోడీ దీనిపై ఏమైనా మాట్లాడతారా? లేదా? అన్నది తేలాల్సివుంది.. ఇక తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ అన్నదానిపై ఎన్నో ఆశలున్నాయి. కాని ఇప్పటికీ నెరవేరలేదు. నిజామాబాద్‌లో గెలిచిన వారం రోజుల్లో పసుపు బోర్డు తెస్తామన్నారు. కాని దాని బదులు అంతకన్నా గొప్పదే ఇచ్చారని బిజేపి నేతల వాదన. పసుపు బోర్డు మాత్రం రాలేదన్నది బిఆర్‌ఎస్‌ వాదన. కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే మెడికల్‌ కాలేజీలలో తెలంగాణకు చోట దక్కకపోవడం విచారకరం. అంతే కాదు వాటికి అనుబంధంగా వుండే నర్సింగ్‌ కాలేజీలు కూడ ఇవ్వకపోవడం శోచనీయం. మరి ఆ విషయంలో ఏదైనా క్లారిటీ ఇస్తారా చూడాలి. ఇక సాగునీటిప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకోసం పలుమార్లు అడిగింది. కాని కేంద్రం ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మూడేళ్లలోనిర్మాణం చేసి, తెలంగాణకు నీళ్లు అందిస్తున్నారు. మరో పెద్ద ప్రాజెక్టు పాలమూరు` రంగారెడ్డి కూడా మొదలుపెట్టనుంది. కనీసం దాని కోసమైనా కేంద్రం ఏమైనా ప్రకటన చేస్తుందా? చూడాలి. ఎందుకంటే పొరుగున వున్న కర్ణాకటలోని అప్పర్‌ భద్రకు జాతీయ హోదా ఇచ్చింది. కాని తెలంగాణకు ఒక్కటి కూడ ఇవ్వలేదు. ఇలాంటి కోరికల నడుమ ప్రధాన మంత్రి తెలంగాణ పర్యటన సాగుతున్న వేళ ప్రజలు ఎదురుచూడడం సహజం. మరి తన సహజమైన శైలితో ప్రధాని వరాలు ప్రకటిస్తారా? లేక ఎప్పటిలాగా నేతలను భుజం తట్టి, బాగా కష్టపడండి? అధికారంలోకి తేండి! సూచిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే…నేడు ప్రధాని నోటి వెంట మాటలా? తెలంగాణకు మూటలా? అన్నది మాత్రం అందరూ ఎదురుచూస్తున్నదే? తెలంగాణకు ఆల్‌ద బెస్ట్‌ అనుకోకతప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!