‘లేఖ’లో…ఏముంది…?
వరంగల్ అర్బన్ జిల్లా ఇంటర్మీడియట్ డిఐఈవో కార్యాలయంలో భారీ అవినీతి జరిగిందని, అవినీతికి డిఐఈవో లింగయ్య పూర్తి బాధ్యత వహించాలని, విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన వారిని వెంటన సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు వరంగల్ అర్బన్‌జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీనికి ‘గుమ్మడికాయ దొంగ ఎవరంటే..భుజాలు తడుముకున్న’ చందంగా ఇంటర్మీడియట్ డిఐఈవో లింగయ్య తాము ఏ తప్పు చేయలేదు..తామంతా సత్యహరిశ్చంద్రులమంటూ, తమపై తప్పుడు వార్తలు ప్రచురితం చేస్తున్నారు, తప్పుడు ఫిర్యాదులు వస్తున్నాయి,తమపై లేనిపోని నిందలు వేస్తున్నారని ‘నేటిధాత్రి’ తమపై పనిగట్టుకొని వార్తలను రాస్తున్నారని, వాటిని నమ్మొద్దనే విదంగా డిఐఈవో లింగయ్య ఓ వినతిపత్రాన్ని కలెక్టర్‌కు ఇచ్చారని విశ్వసనీయసమాచారం.
తాము తప్పే చేయలేదని కలెక్టర్‌కు వినతి
నవ్విపోదురు గాక ‘నాకేమి సిగ్గు’ అన్నట్లుగా..డిఐఈవో కార్యాలయంలో అవినీతికి ఆజ్యంపోసి, లక్షల రూపాయాల ప్రభుత్వ సొమ్మును అక్రమంగా దొంగపేర్లతో నొక్కేసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతూ తాము సత్యహరిశ్చంద్రులమంటు తమకు తామే సర్టిఫికెట్ పుచ్చుకొని అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా వరంగల్ అర్బన్‌జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించుకున్న విషయం బయటికి పొక్కడంతో ఆయన అబద్దాల ఆటలను, మాయలగారడీని, లింగయ్య వ్యవహరించిన తీరుపై విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
డిఐఈవోను వివరణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశం..?
తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తమపై తప్పుడు వార్తలు రాస్తున్నారని కలెక్టర్‌కు డిఐఈవో లింగయ్య ఇచ్చిన వినతిపత్రానికి కలెక్టర్ స్పందిస్తూ ఏ విషయంలో, ఎవరు తప్పుడు వార్తలు రాశారు, ఏమి రాశారు, ఎందుకు రాశారు, ఏ అంశాలపై రాశారు వివరణ ఇవ్వాలని కలెక్టర్ డిఐఈవో లింగయ్యను ఆదేశించినట్లు సమాచారం.
నేటికి స్పందించని డిఐఈవో లింగయ్య
డిఐఈవో లింగయ్య కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రంపై వివరణ ఇవ్వాలని డిఐఈవోను కలెక్టర్ ఆదేశించినా ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం పట్ల జిల్లాలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి నెలకొన్నది. వివరణ ఇవ్వాలని కలెక్టర్ కోరి వారంరోజులు అవుతున్నా నేటి వరకు డిఐఈవో లింగయ్య ఎందుకు వివరణ ఇవ్వలేకపోయాడో అంతుచిక్కని వాతావరణం నెలకొన్నది. ఆయన తప్పే చేయకపోతే, అవినీతికి పాల్పడకపోతే ఇప్పటి వరకు ఎందుకు వివరణ ఇవ్వలేదో అంతుచిక్కడంలేదు. అవినీతికి పాల్పడింది నిజమే అయినందున వివరణ ఇవ్వలేకపోతున్నాడా? వివరణ ఇస్తే ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని వెనకడుగువేస్తున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.