హైదరాబాద్,నేటిధాత్రి:
నమ్మకమన్న పదం ఎంత బలమైందో, కేసిఆర్ పాలన అంత స్వర్ణయుగమైందని చెప్పడానికి ఎలాంటి సందేహంలేదు. తెలంగాణ ఏర్పాటుతోనే పీడిత ప్రజల కష్టాలు,కన్నీళ్లు తీరుతాయని నమ్మి, బలమైన ఆకాంక్షతో, బరువైన ఆశయంతో, పట్టుదలను సమాజానికి నింపి, ముందుండి నడిచి, సాధ్యమా అన్న పదాన్ని నిఘంటువులో లేకుండా చేసేలా తెలంగాణ సాధించిన ధీరుడు కేసిఆర్ చేతిలో పాలనతో తెలంగాణ మాగాణం బంగారమైపోయింది. పసిడి సిరులు పండేందుకు ఎదరు చూస్తోంది. నీటి జాడలు లేక, నెర్రలు బారి, కడుపులోనుంచి తన్నుకొచ్చే దు:ఖంతో కంటినిండా నీరును నింపుకొని, ఒలికించినా, పచ్చి జాడలేకుండాపోయిన, పొలాలు చూసి కుమిలిపోయిన రైతన్న కళ్లలో ఆనందభాష్పాలు రాలి ముత్యాలయ్యేంతగా మురిసిపోయే రోజులొచ్చాయి. ఎద్దుఏడ్చిన ఎవుసం అన్నది ముఖ్యమంత్రి కేసిఆర్‌కు తెలుసు. అందుకే ఎవుసం సాగాలి. పండగ కావాలి. రైతు రాజు కావాలన్నదే కేసిఆర్ కల. అసలు తెలంగాణ సాధనే రైతుకోసం. పొలంకోసం. పచ్చని పల్లెకోసం. పచ్చని పాడిపంటలకోసం. మొత్తంగా నీటికోసం. ఆ కల జాలువారేలా ప్రతి ఊరు చెరువు ఎండాకాలంలో కూడా నిండి పొలాలకు పారుతుంటే, రైతుకు అంతకన్నా ఆనందమేముంది. కేసిఆర్‌కు అంతకన్నా సంతోషమేముంది. తెలంగాణ ఎలా వస్తుంది అన్న వారు, తెలంగాణ వస్తే ఏమైతదన్నవారు ఇప్పుడు చూసి ఆనందపడుతున్నారు. గర్వపడుతున్నారు. చిమ్మచీకట్లు కమ్మేసే పల్లెలు చూసిన తెలంగాణ ప్రజలకు పల్లె వెలుగులు చూసి మురిసిపోతున్నారంటే ఇంతకన్నా ఆనందమేముంది. ఒకటా రెండా, నాలుగేళ్లకాలంలో ఉద్యమకారుడు పాలకుడైతే పాలన ఎంత స్వర్ణమయమో, కాలం స్వర్ణయుగమో చరిత్రే తనను తాను మురిసిపోతోంది. పారే నీరు చూసి, పొలాల్లోకి రాకుండాపోతున్నాయే అని కళ్లనుంచి కన్నీరులొలి, కడుపలో దు:ఖం తన్నుకుంటూ వస్తుంటే, పెదవులు అదిమి పట్టుకొని, ఎర్రబడుతున్న కళ్లను తూడ్చుకుంటూ, నా తెలంగాణ పొలాలు ఈ నీటితో తడుస్తాయో అని కలలుకన్న కేసిఆర్, ఆ కలలు నిజం చేసే దేవుడయ్యాడు. అపర భగీరధుడయ్యాడు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ పల్లెలు పచ్చని వనాలై, వర్రెలనుంచి నీటి జాలులు వారి, పొలాలు నిండే రోజులు రానున్నాయి. ఎన్నికల మందు ఇచ్చిన హమీలే కాదు, ప్రతి పేదకు అండగా, తోడుగా నిలిచే పథకాలు దేశంలో ఎక్కడా లేని సంక్షేమ ఫలాలు అందిస్తూ, అందరిలోనూ చిరునవ్వును చూసేందుకు సాగుతన్న పాలన కేసిఆర్‌ది. నీరు లేక ఎవుసం సాగక, ఎండే పంటలు చూసిగుండెలు బాదుకోవడం కాన్న, బొంబాయి పోయి బతకడం మేలనుకొని, ఊళ్లు ఖాళీ చేసి, వలసలు పోయిన తెలంగాణ పల్లెలు మళ్లీ కళకళలాడి, ఊరుకు చేరుకున్న జనం సంబరాలు చేసుకుంటున్నారు. ఎవుసం చేసుకుంటే చాలు అనుకుంటున్నారు. రైతు బంధు పథకంతో ఏటా రైతుకు పెట్టుబడి రెండు పంటలు ఇస్తుంటే, ఇక ఎవుసం రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. తెలంగాణ భావి తరాలకు ఆదర్శం. తెలంగాణ వస్తే ఏమౌతుందని ప్రశ్నించిన వారికి సమాధానం. మన దేశంలో వ్యవసాయమంటేనే వాతావరణంతో జూదంలాంటింది. మన చేతుల్లో లేనిది. ఆరుగాలం కష్టించాలన్నా డబ్బు కావాలి. పంటలు పండిరచాలన్నా డబ్బుకావాలి. తీరా పంట చేతికొస్తుందన్న నమ్మకం లేని పని వ్యవసాయం. నీళ్లులేకపోతే, మబ్బులెప్పుడుపడతాయా అని ఎదురుచూడాల్సిన స్థితి. తొలకరితోనే చిరునవ్వు నవ్వుకొని, అప్పులు చేసి, భూమి దున్ని, విత్తనాలు, ఎరువులు కొని, సాగు చేయడమే తెలంగాణ రైతుకు తెలిసింది. నీరు వుండదని తెలిసినా, ఆశతో సాగించేదే తెలంగాణ వ్యవసాయం. ఆ కాలం పోయింది. నీరు లేదన్న బాధ లేదు. విత్తనాల కొరత లేదు. ఎరువుల కోసం పడిగాపులు పడాల్సిన పని లేదు. క్యూలైన్లలో ఎండలో నిలబడాల్సిన పనిలేదు. పోలీసుల లాఠీ చార్జిలు లేవు. దళారీ వ్యవస్థ అసలే లేదు. ఇక అప్పుకోసం రైతు ఎదురు చూడాల్సిన పని లేకుండా కూడాపోయింది. ఒక రైతు పాలకుడైతే, ఎవుసం బాధ తెలిస్తే, ఆ సహృదయుడు రైతు పక్షానే ఆలోచిస్తే అది తెలంగాణ ప్రభుత్వమౌతుంది. ముఖ్యమంత్రి కేసిఆర్ అవుతాడు. రైతు మురిసే కాలం వచ్చేసింది. వేలకు వేలు ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సిన పని లేదు. తెలంగాణ ప్రభుత్వమే ఏటా ఎనమిది వేలు ఎకరాకు పెట్టుబడి అందిస్తోంది. విత్తనాలు, ఎరువులు, భూమి దున్నకానికి పనికొచ్చేలా ఆదుకుంటోంది. కరంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియిని కాలంనుంచి రెప్పపాటు కరంటు పోని రోజులు తెచ్చింది కేసిఆర్. చీకటి రోజులు చూసిన తెలంగాణ ప్రజలకు పగటి పూట వెలుగులు నింపే కాలం వస్తుందని ఎవరూ ఊహించలేదు. అందుకే తెలంగాణ కావాలన్నది. నిన్నటి రోజుల్లో కరంటు లేక ఎండే పంటలు, చేతికొచ్చే సమయానికి సకాలంలో నాణ్యమైన విద్యుత్ అందక, నీరందక పంటలు ఎండిపోవడమే చూసిన కళ్లతో, 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ వచ్చింది. ఆరుగంటల పాటు నిరంతర విద్యుత్ కావాలంటే కూడా ఇవ్వని రోజులనుంచి, నిరంతరం కరంటు రైతుకు అందుబాటులోకి వచ్చింది. ఎండిన బావులు, అడుగంటిన భూగర్భజాలలు, గంటపాటు నిరంతరంగా నీరందంచలేని బోర్లు, పంటలు ఎండిపోతుంటే, చూసి తట్టుకోలేక ఎన్ని బోర్లు వేసినా చుక్క కానరాక, రైతు కంట కన్నీరు మిగిలిన రోజులనుంచి, తెలంగాణ పల్లెల్లో నీటి కాలువలు. ఇదీ నేటి తెలంగాణ. వానలు కరిస్తేగాని చెరుల్లోకి చుక్క చేరని కాలంనుంచి, ఏడాది పొడవునా, చెరువుల్లో నీరు చూస్తున్న కాలం. ఇదంతా ముఖ్యమంత్రి కేసిఆర్ సంకల్పం. ఆయన చలించిన వైనం. రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ సాగిన తెలంగాణ ఉద్యమంలో మొదటి ప్రాధాన్యతలో వున్న నీటికోసం ఆయన పడిన తాపత్రయం రైతుల కళ్లలో ఆనందాన్ని నింపుతోంది. తెలంగాణ పల్లెల్లో వెలుగులు నింపుతోంది. రైతు బంధు పథకం వచ్చాక, రైతుకు రొక్కం చేతికొచ్చాక, వ్యవసాయం మీద భరోసా పెరిగింది. ఆనందం తాండవమాడుతోంది. పల్లెలు తొలకరి కోసం ఎదరు చూస్తున్నాయి. బంగారుతెలంగాణకు బాటలు పడుతున్నాయి. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు నవ్వని రాజ్యం బాగుపడదని సామెత. కాని తెలంగాణలో రైతు నవ్విన రాజ్యం వచ్చింది. ఎవుసం చేయలేక, ఊరు విడిచి వెళ్లలేక, కడుపు కట్టుకొని బతకలేక నరకయాతన పడి, వలసలు వెళ్లి బతికిన తెలంగాణ రైతన్నల రాకతో పల్లెలు మురుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర పాలనలో చిన్న నీటి పారుదల పేరుతో రూపాయి బడ్జెట్ లేని శాఖలు ఏర్పాటు చేసి,తెలంగాణ ఎమ్మెల్యేను మంత్రిని చేసి, ఇదే తెలంగాణకు పండగ పో అన్న చరిత్ర గతానిది. కాని నేడు తెలంగాణలో ఎటు చూసిన ప్రాజెక్టుల నిర్మాణాలు. పారుతున్న జలాలు.నిండుతున్న చెరువులు. ఏడాదంతా పారుతున్న గోదారి జాలాలు. గొలుసు కట్టు చెరువులు ఒకదాని తర్వాత ఒకటి నిండుతూ, భూగర్భజలాలు పెంచుతూ, పొలాలకు నీరుచేరుతోంది. పొలాలు ధాన్యాగారాలౌతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తులు పెరిగుతున్నాయి. గిట్టుబాటు ధరలు అందుతుండడంతో రైతు మోములు నవ్వులు విరబూస్తున్నాయి. వీటన్నింటికీ తోడు రైతులు తొలకరితో మురిసినా, ఎవుసం చేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేక, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి, మోస పోకుండా, ప్రభుత్వమే వారికి పెట్టుబడిని నగదు రూపంలో అందించి ఆసరాగా నిలుస్తోంది. ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం కావొచ్చు. దేశంలోఎక్కడా ఏ రాష్ట్రంలో ఇలాంటి సంక్షేమంగురించి ఆలోచన చేసి వుండకపోవచ్చు. రైతు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకొని ఓట్లు అడుక్కొని గెలిచి, రైతును నట్టెట ముంచి పాలకులను చూసిన తెలంగాణ ప్రజలు మొదటి సారిగా రైతుకు ఆర్థిక భరోసాను కూడా కల్పించిన ప్రభుత్వాన్ని కొత్తగా చూస్తున్నారు. కళ్లనిండా ఆశలను పెంచుకుంటున్నారు. వడ్డీకి వడ్డీ చక్రవడ్డీల పేరుతో ఇచ్చిన అప్పును పంట చేతికి రాగానే ముక్కు పిండి వసూలు చేసుకునే ప్రైవేటు వడ్డీ వ్యాపారుల మూలంగా ఆరుగాలం శ్రమించి పండిరచిన పంట కళ్లకద్దుకొని చూసుకునే అవకాశం రైతుకు దక్కేది కాదు. పైగా సరైన గిట్టుబాటు ధర రాక, పాత అప్పు తీరక, మళ్లీ కొత్త అప్పుచేసి, మళ్లీ ఎవుసం చేస్తేగాని తెల్లారని రోజులు అవి. ఎవరికైనా ఆశ వుంటుంది. ఒకరైతుల ఒక పంట పండిరచి, ఎంతో కొంత లాభాలు ఆర్జించిండని తెలిసినా,కనీసం అప్పులు తీర్చుకున్నాడని తెలిసినా, అదే పంటను తాను వేసి, అప్పులు తీర్చుకుందామని ఆశపడిన రైతు ఆశలు అడియాసలై, ధరలు పడిపోయి, పంటలు ఎండిపోయి బతుకు మీద విరక్తికలిగి తనువు చాలించిన రైతులు ఎంతో మంది వున్నారు. ఇకపై అలాంటి పరిస్థితి ఎప్పుడూ తలెత్తొద్దని ఏఏ కాలాలలో , ఏఏ భూముల్లో ఎలాంటి పంటలు పండిరచాలో రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, వుండేందుకు పెద్దఎత్తున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించి, గత ఏడాది తెలంగాణలో కందులు, మిర్చి సాగు ప్రోత్సహించడంతో రికార్డు స్థాయి ఉత్పత్తులు వచ్చాయి. రైతుల ఇంట సిరులు నిండాయి. రైతు శ్రేయో రాజ్య భావనకు అర్థం ఇదే. రైతు రాజ్యానికి నిదర్శనమిదే. రైతే రాజు అన్న పదానికి అర్థం ఇదే. రైతే దేశానికి వెన్నెముక అంటే ఇదే. బంగారు తెలంగాణ అంటే ఇదే. దేశానికి ఆదర్శవంతమైన పాలన అంటే కేసిఆర్‌దే. రైతు మెచ్చిన రాజ్యం నిర్మాణమయ్యిందే తెలంగాణ. రేపటి చిరునవ్వుల కాంతి తెలంగాణ. రైతు ఇంట సిరుల పంట తెలంగాణ. బంగారుతెలంగాణ.పండగై, భరోసా, రైతు ఇంట సిరుల పంటలై, ఇంటికి వెలుగులౌతాయనడంలో సందేహంలేదు. ఎనమిదేళ్ల ప్రస్థానంలో అనేక సవాళ్లు, అనేక మలుపులు ఎదురైనా, ఎదురొడ్డి నిలుస్తూ, సంక్షేమానికి ఊపిరిపోస్తూ, నిలుస్తున్నా పాలనకు ప్రజలనుంచి కేసిఆర్‌కు జేజేలు, బంగారు తెలంగాణకు బాటలు పడ్డాయి.