` దేశ వ్యాప్తంగా రాహుల్ కు పెరిగిన మద్దతు.
` ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి…
` ఎమర్జెన్సీ తర్వాత పరిస్థితులు పునరావృతం కానున్నాయా?
` ప్రతిపక్షాలు అన్నీ ఏకమై బిజేపితో పోరాటం చేయనున్నాయా?
` మేధావులు సైతం రాహుల్ సస్పెన్షన్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
`బిజేపి సెల్ఫ్ గోల్ చేసుకున్నదా?
` ఒక్కసారిగా రాహుల్ ఇమేజ్ పెరిగిందా?
`పప్పు అన్న వాళ్లకు నిప్పుగా తోస్తోందా?
`భారత్ జోడో యాత్ర రాహుల్ నాయకత్వ పటిమ పెరిగిందా?
` ఇటీవల లోక్‌సభలో రాహుల్ ప్రసంగాలలో పదునుపెరిగిందా?
` అందుకే బిజేపి భయపడుతోందా?
` రాజకీయ కక్ష సాధింపులు ప్రజాస్వామికం.
` బిజేపి మాకేం సంబంధం అంటే ప్రజలు అమాయకులు కాదు.
` రాజకీయ ఆరోపణలపై కక్షలు సమంజసం కాదు.
` అలా అయితే చట్ట సభల్లో ఎవరూ వుండరు?
`రాహుల్ విషయంలో నేరపూరిత నిరూపణకు ఆస్కారం లేదు.
హైదరాబాద్,నేటిధాత్రి:
అది త్యాగాల కుటుంబం. ప్రాణాలను సైతం లెక్క చేయని కుటుంబం. ఇద్దరు నేతలను కోల్పోయిన కుటుంబం. అయినా దేశం కోసం వారి ఆరాటంలో మార్పు రాలేదు. పోరాటంలో వెరవలేదు. ఆపలేదు. ప్రజల గుండెల్లో నిలిచింది ఆ కుటుంబం. ప్రజల సంక్షేమం కోసం అలుపెరగని ప్రయాణం ఆపలేదు. ఆపదలున్నాయని తెలుసు. పసి వయసులోనే నానమ్మను కోల్పోయి, జీవితం అంటే ఏమిటో అర్ధం కాని దశలోనే నాన్నను కోల్పోయి, జీవితం అంధకారమైనా, దేశమే కుటుంబంగా బతికిన కుటుంబం. ఎప్పుడు ఏమౌతుందో అన్న భయం వెంటాడుతున్న వెవరని కుటుంబం. భాదలున్నాయి. బరువు బాద్యతలున్నాయి. అయినా అది తెగింపును నింపుకున్న రక్తం. ధైర్యాన్ని నిండుగా నింపుకున్న జాతి ప్రవాహం. భయాన్ని దరి చేరనివ్వని ధీటైన మనసు..పోరాటంలో అలసిపోయినట్లు చరిత్ర లేదు. అపజయాలకు కుంగిన క్షణం లేదు. స్వాతంత్య్రం కోసం పోరాటంలో ఆ కుటుంబమంతా ముందుండి నడిచి గొప్పచరిత్రకు నిదర్శనం. అలాంటి కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీని వేధించడం అంటే తమ రాజకీయ చరిత్రను తామే సమాధి చేసుకుంటున్నట్లే.
చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
ఇది గొప్పగా చెప్పుకున్నప్పటికీ ఎంతో మంది రాజకీయ నాయకులపై వున్న కేసులలో ఎక్కడా పురోగతి లేకపోయినా, కేవలం రాహుల్ గాంధీ కేసు మాత్రమే ఎందుకు తెరమీదకు వచ్చిందన్నదానిపై దేశంలో విపరీతమైన చర్చ జరుగుతోంది. నిజానికి రాజకీయ నాయకులు ఎవరు తప్పు చేసినా వారికి శిక్ష పడాల్సిందే..అవినీతి చేసిన వారిని తొలగించాల్సిందే..ఇంతవరకు బాగానే వుంది. కాని రాజకీయంగా చేసిన వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకొని, పరువునష్టం దావాలో కూడా జైలు శిక్ష పడడం, దానిని ఆసరగా చేసుకొని రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం పెద్ద దుమారైపోయింది. దేశ వ్యాప్తంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఒకసారి మూలాల్లోకి వెళ్లే వాయినాడ్ ఎంపి రాహుల్ గాందీ మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సెక్షన్ 8(3) కింద లోక్‌సభ సెక్రెటరియేట్ అనర్హత వేటువేసింది. ఈ చట్టం ప్రకారం రాజకీయ నాయకులు దోషులుగా తేలితే వేటు పడుతుంది. కాని రాహుల్ విషయంలో ఆ చట్టం అమలు సమంజసం కాదన్నది కాంగ్రెస్ పార్టీ వాదన. న్యాయ నిపుణుల సూచన కూడా…నేరాల స్వభావం..తీవ్రతను బట్టి ఆ చట్టం అమలు చేయాలి. కాని వ్యక్తి స్వేచ్చకు సంబంధించిన ఆర్టికల్ 14కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ అనర్హత వేటు వుందన్నది నిపుణులు చెబుతున్న మాట. సహజ న్యాయ సూత్రాల అమలులో లోక్‌సభ సెక్రెటరియేట్ స్పందన న్యాయ సమ్మతం కాదన్నది కాంగ్రెస్ ఫార్టీ శ్రేణుల వాదన. నిజానికి రాహుల్‌గాంధీ చేసిన రాజకీయ ప్రసంగంలో దొర్లిన తప్పు తీవ్రమైన నేరం కాకపోవచ్చు. అందుకే ఆయన పడిన వేటు నాయకత్వం రాటు దేలేందుకు ఉపయోగపడుతుందని కొందరి అంచనా. ఎందుకంటే గతంలోనూ ఇందిరా గాంధీ కూడా ఇలాగే చిక్‌మంగళూర్ నుంచి గెలిచిన తర్వాత అనర్హత వేటును ఎదుర్కొన్నారు. తర్వాత ఆమె తిరుగులేని నాయకురాలుగా చరిత్రకెక్కారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా భవిష్యత్ దేశ నాయకుడుగా మారుతాడన్నది కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్న మాట.
రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు అన్నది ఒక రకంగా ఆయనకు ఊహించని రాజకీయ భవిష్యత్తుకు మార్గం వేస్తుందన్నది చాలా మంది చెప్పుకుంటున్న మాట.
రాజకీయంగా ఆయనకు ఎంతో మైలేజీ తెచ్చిపెట్టేదే. ఎందుకంటే ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ కూడా ప్రజల కోసం ప్రశ్నిస్తూనే వుంటానని పునరుద్ఘాటించారు. దాంతో ఆయనకు దేశంలో మరింత మద్దతు పెరిగిందని అంటున్నారు. ఇదిలా వుంటే దేశంలోని అన్ని ప్రతిపక్షాల సంపూర్ణ మద్దతు దొరికింది. ఇంత కాలం ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యే తరుణం ఎలా వస్తుందని ఎదురుచూస్తున్న వారికి ఇదొక మంచి సందర్భంగా మారింది. ఎందుకంటే గతంలో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాకిస్తాన్‌ను ఓడిరచి, ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన మహిళగా గుర్తింపు పొందిన ఇందిరకు అప్పటి పార్టీ శ్రేణులు, ప్రపంచ దేశాల పొగడ్తలు ఆమెలో ఒక నియంతను నిద్రలేపాయి. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అన్నంత ప్రచారం చవిచూసింది. దాంతో ప్రతిపక్షాల చేసే విమర్శలు ఆమెకు చిరాకును తెచ్చాయి. ఈ సమయంలో తన రాజకీయ జీవితానికి ఎవరూ ఎదురు రాకుండా చూసుకోవాలని, దేశంలో ఎమర్జెనీ ప్రకటించింది. అభాసుపాలైంది. ఆ సమయంలో ప్రతిపక్షాలన్నీ ఏకమై, జైలు జీవితం గడుపుతున్న వారు సైతం గెలిచి, ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని కూలదోశారు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకున్న ఇందిరా గాంధీ మారిన మనిషిగా పేదల కోసం గరీభీ హటావో వంటి పధకాలను అమలు చేసి మెప్పు పొందారు. అమ్మగా కీర్తించబడ్డారు. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీకి మద్దతుగా ఏకమైన ప్రతి పక్షాలు మళ్లీ చరిత్రను తిరగరాస్తాయని చెప్పొచ్చనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
నిజానికి ఈ విషయంలో బిజేపి సెల్ఫ్ గోల్ చేసుకున్నదని అర్ధమౌతోంది.
ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక, రాహుల్ గాంధీ లాంటి నాయకులను కట్టడి చేయాలన్న ఆలోచనతో కోర్టు తీర్పును అనుసరించి వెంటనే వేటు వేయడం రాహుల్‌కు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ప్రధాని నరేంద్ర మోడీ, బిజేపి నేతలు మాజీ ఎంపి. రేణుకా చౌదరిని షూర్పనక అంటూ గేలి చేసిన సందర్భాలున్నాయి. అలా ప్రతి రాజకీయ విమర్శను కూడా పరిగణలోకి తీసుకుంటూ, వేదించాలని చూస్తూ పోతే చట్ట సభల్లో ఎవరూ మిగలరు. అందరూ ఏదో ఒక వివాదంలో లేకుండా వుండరు. అందరూ జైలు బాట పట్టాల్సిందే అనడంలో సందేహం లేదు. నిన్నటిదాకా పప్పు పప్పు అంటూ ఎగతాళి చేసిన వాళ్లే ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ వాడుతున్న పదునైన పదజాలం బిజేపికి ఇబ్బంది కరంగా మారింది. పైగా ఆదాని విషయంలో రాహుల్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడం, దాట వేయడం వంటివి దేశ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇది బిజేపి నేతలకు బాగా అర్ధమైంది. అందుకే రాహుల్ గాందీకి వాయిస్ లేకుండా చేస్తే సరిపోతుందనుకున్నారు. కాని దేశంలో ఏ జాతీయ నాయకుడు చేయని సాహసాలు రాహుల్ గాందీ చేస్తున్నాడు. ఇప్పటికే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా భారత్ జోడో యాత్ర పూర్తి చేశారు. మరో విడత పాదయాత్రకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. ఈ సమయంలో ఆయన సభ్యత్వం రద్దు కావడం మరింత కలిసొచ్చే అంశమే అవుతుంది. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ప్రజా స్వామ్యంలో చోటు లేదు. రాజకీయ అరోపణలకు క్షక్షలు సమాధానం కాదు.