ముందస్తు సాకులు…సేమ్‌ సీన్‌

ముందస్తు సాకులు…సేమ్‌ సీన్‌

నేటిధాత్రి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీలోని ఏపీ సీన్‌నే రిపీట్‌ చేశారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ముఖాముఖి ఏకి పారేసిన చంద్రబాబు దేశ రాజధానిలోను అదే సీన్‌ను కొనసాగించారు. సిట్టింగ్‌ ఎంపీలు, మంత్రులతో కలసి ఢిల్లీకి వెళ్లిన ఆయన వైఎస్సార్‌సీపీ, ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవిఎంలు ట్యాంపరింగ్‌ అయ్యాయని తమకు అనుమానంగా ఉందని కౌంటింగ్‌ కాకముందే బాబు కొత్త పల్లవి అందుకున్నారు. అయితే చంద్రబాబు చేసిన ఈ కామెంట్లపై ఏపీలో రకరకాల విమర్శలు వినవస్తున్నాయి. ఓటమికి కావల్సిన సాకులను బాబు ముందస్తుగానే వెతుక్కుంటున్నాడని పలువురు విమర్శిస్తున్నారు.

రాష్ట్రం రావణకాష్టం

ఆంధ్రప్రదేశ్‌లో ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందని తాము అనుమానిస్తున్నట్టు చంద్రబాబు ఆరోపించారు. శని, ఆదివారాలు ఢీల్లీలోనే ఉంటానని, ఈవీఎంల వ్యవహారాన్ని పలు పార్టీల జాతీయ నేతల దష్టికి తీసుకెళ్తానన్నారు. ఏపీ చరిత్రలో ఇంతటి అరాచకాలను ఎప్పుడూ చూడలేదన్నారు. దీనికి కారణం ఎవరు అని ఈసీ బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించారు. శనివారం మధ్యాహ్నం చంద్రబాబుతో సహా 15మంది టిడిపి ప్రతినిధుల బందం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసింది. రాష్ట్రంలో పోలింగ్‌ జరిగిన తీరు, ఈవీఎంలలో తలెత్తిన లోపాలు తదితర అంశాలను ఈసీ దష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ఇష్టప్రకారం అధికారులను బదిలీ చేసుకుంటూ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని ధ్వజమెత్తారు. దీంతో రాష్ట్రంలో ప్రజాజీవనం స్తంభించిపోయిందన్నారు. ఉదయం నుంచి తిండీ, నీళ్లు లేకుండా ఓటర్లు క్యూలైన్లలో ఇబ్బందులు పడ్డారన్నారు. రాజ్యాంగ సంస్థలన్నింటినీ దెబ్బతీస్తున్నారని దేశంలోని అన్ని పార్టీలూ ఘోషిస్తున్నాయని చెప్పారు. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ వ్యవస్థాగతంగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించే పద్ధతి మళ్లీ రావాలన్నారు. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరించి కారణాలు చెప్పకుండానే అధికారులను బదిలీలు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం అధికారాలను సైతం గుర్తించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవీఎంల మొరాయింపుపై వైఎస్సార్‌సీపీ ఒక్క మాటా మాట్లాడలేదన్నారు.

మోడీ సూచనలతో ఈసీ ఏకపక్ష వైఖరి

వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులతో భారీగా ఓట్లు తొలగించారని, ఈ అంశంపై టిడిపి ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోలేదన్నారు. తమ నేతలపై రాజకీయ దురుద్దేశంతో వ్యవహరించారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ తప్పుడు ఫిర్యాదులతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. ఓటువేసే ప్రాథమిక హక్కును కాపాడటంలో ఈసీ విఫలమైందని విమర్శించారు. రాష్ట్రానికి అవసరమైన మేర పోలీసు బలగాలను పంపలేదన్నారు. 50శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు కచ్చితంగా లెక్కించాలని డిమాండ్‌ చేశారు. 50శాతం వీవీప్యాట్‌లు లెక్కించడానికి ఆరు రోజులు సమయం పడుతుందని ఈసీ చెబుతోందని, బ్యాలెట్‌ విధానంలో అయితే ఒట్ల లెక్కింపు ఒక్క రోజులో పూర్తయ్యేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మోడీ సూచనల మేరకే ఈసీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులనూ పట్టించుకోవడం లేదన్నారు.

తెల్లవారు వరకు పోలింగ్‌..ఇదేం ప్రజాస్వామ్యం?

సీఎస్‌ను ఏకపక్షంగా బదిలీచేసి సీబీఐ కేసుల్లో ఉన్న ఐఏఎస్‌ను సీఎస్‌గా నియమించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఈవీఎంలు పనిచేయకపోయినా పట్టించుకోలేదని, తెల్లవారుజాము వరకు పోలింగ్‌ జరిగిందంటే ఇదేం..ప్రజాస్వామ్యం..ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రజల ఓపికను పరీక్షించిందంటూ సీఎం తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హత్య జరిగినా..మహిళలపై దాడి జరిగినా ఈసీ పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో వేలసంఖ్యలో ఈవీఎంలు ఫెయిల్‌ కావడానికి కారణమేంటని నిలదీశారు. ప్రపంచంలో చాలా దేశాలు పేపర్‌ బ్యాలెట్‌లు వాడుతున్నాయని సీఎం గుర్తు చేశారు.

ఆ స్లిప్పులు లెక్కించేందుకు 6 రోజులా?

పోలింగ్‌ ఆలస్యానికి కారకులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈవీఎంల పనితీరుపై అందరికీ సందేహాలు ఉన్నాయని, తప్పుడు విధానాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పేపర్‌ బ్యాలెట్‌లపై అందరికీ అవగాహన ఉంటుందని చెప్పారు. ఇందుకోసం 22 రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించాయన్నారు. బ్యాలెట్‌ను లెక్కించేందుకు 16గంటల సమయం పడుతుందని, మరి వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించేందుకు ఆరురోజుల సమయం ఎందుకు అని ప్రశ్నించారు. వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలంటే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.

 

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version