భూదందా @297 ఎకరాలు

భూదందా @297 ఎకరాలు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలం తిమ్మాపూర్‌ హావేలి జక్కలొద్ది గ్రామంలో కంటికి కనపడకుండా, అధికారులెవరు వెళ్లకుండా, ఏం జరిగిన ప్రభుత్వ యంత్రాంగం అసలు దృష్టే సారించకుండా అక్షరాల 297ఎకరాల 38గుంటల భూమి కబ్జా రాబంధుల కబంధహస్తాల్లో చిక్కుకుంది. గత కొద్ది సంవత్సరాలుగా ఈ కబ్జా బాగోతం నడుస్తున్నా రెవెన్యూ యంత్రాంగం మొదలుకుని అన్ని శాఖలకు ఈ వ్యవహారం తెలిసినా ఎవరు కిమ్మనకుండా ఎవరి శాయశక్తులా వారు కబ్జారాయుళ్లకు సహకరిస్తుపోతున్నారు. నిఘా పెడుతున్నాం భూముల విషయంలో సర్కార్‌కు అన్ని నివేదికలు సమర్పిస్తున్నాం మేం అంతా పారదర్శకం అని చెప్పుకునే రెవెన్యూ ఇతర నిఘా సంస్థలు ఇప్పటి వరకు ఈ భూముల వ్యవహారంలో కాసింతైన శ్రద్ధ పెట్టలేదు. ఎకరాకు 50నుంచి 70లక్షల వరకు ధర పలుకుతున్న ఈ భూములు కబ్జాకోరులకు బంగారుబాతులా దొరికాయి. ఈ భూముల్లో కార్పొరేటర్‌ భర్త, ఖిలా వరంగల్‌ పిఎసిఎస్‌ మాజీ చైర్మన్‌ కేడల జనార్థన్‌ అన్యాయంగా పాగా వేసి ఉన్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక్కడి భూములను ఏదో రకంగా లాక్కుని తన వశపరుచుకునేందుకే కేడల రెవెన్యూ అధికారుల సహయంతో తతంగాన్ని మొత్తం నడిపిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. జక్కలొద్ది గ్రామంలోని 102 నుంచి 109, 120 నుండి 123, 126 నుండి 142, 143 నుండి 154 సర్వే నెంబర్లు గల భూములు మొత్తం 297 ఎకరాల 38గుంటల భూమికి అసలు పట్టాదారు మెహినోద్దీన్‌ ఖాద్రీ. ఆయనకు సంబంధించిన దాదాపు అన్ని భూములలో కేడల జనార్థన్‌ పాగా వేయడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని భూములలో ఇప్పటికే కబ్జాలో ఉన్న వారిని, టెనెంట్‌దారులను డిక్లరెంట్‌లను నయానో…భయానో లొంగదీసుకుని తనకున్న కబ్జా తెలివితేటలతో అప్పనంగా భూములను కొల్లగొడుతూ రెవెన్యూ రికార్డులకు ఎక్కుతూ అసలు హక్కుదారులకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ 297ఎకరాల 38గుంటల భూములకు సంబంధించి 15మంది టెనెన్సి అండ్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ యాక్ట్‌ 1950 (ఫైల్‌ నెంబర్‌ ఎఫ్‌ 4/20139/74 25-9-1975) ప్రకారం టెనెన్సి పట్టాలు పొంది ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్డీఓ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ టెనెన్సిని రద్దు చేయాలంటూ తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన కొంతమంది ల్యాండ్‌ ఆఫ్‌ రిఫామ్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించారు. ఇదే అదనుగా భావించిన కేడల 9వ అప్పిలెంట్‌ అయిన బండి అయిలయ్యకు ఏవో మాటలు చెప్పి అతని కబ్జాలో ఉన్న భూమిని అప్పనంగా కొనుగోలు చేసి కేసులో ఇంప్లీడ్‌ అయ్యాడు. కేసును సాకుగా చూపి పట్టా సంపాదించి అక్రమంగా భూమిని అమ్మేసి రంగశాయిపేటకు చెందిన ఓ మహిళకు భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించాడు. భూములు టెనెంట్స్‌లకు చెందినవి అని తెలిసి కూడా భూములను అమ్మి కేడల సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంలో కేడల భారీగానే సొమ్ము వెనకాల వేస్తే భూమిని సాగు చేస్తూ కబ్జాలో ఉన్న వారు మాత్రం మోసపోయినట్లు సమాచారం. ఇక్కడ విచిత్రం ఏంటంటే భూమిపై హక్కు ఉన్న టెనెంట్స్‌ 2008 సంవత్సరంలో శ్రీవెంకటేశ్వరా డెవలపర్స్‌కు భూమిని రిజిస్టర్‌ చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో కేడల జనార్థన్‌ మూడవ సాక్షిగా సంతకం చేస్తాడు. ఈ భూమి చట్టపరంగా వారిదే అని తెలిసిన కేడల దొంగచాటున భూమిని వెరొకరికి విక్రయించాడన్న మాట. అంతే కాదు జక్కలొద్ది ప్రాంతంలో వెతకుతున్నా కొద్ది కేడల చిత్రవిచిత్రాలు బయటపడుతున్నాయి. ఇక్కడి 133, 136, 145, 152 సర్వే నెంబర్లలో టెనెంట్స్‌ పట్టా పొందిన కాయిరున్నీసా బేగం, మరో ఇద్దరితో 2008 సంవత్సరంలో సేల్‌ కం జిపిఎ చేయించుకున్న కేడల నిబంధనలకు విరుద్ధంగా పట్టాదారు పాస్‌పుస్తకాలను పొందాడు (డాక్యుమెంట్‌ నెంబర్‌ 5/72/08) పైగా ఈ భూమి తనదేనంటూ కబ్జాలో ఉన్న అమాయకులపై కేసులు (ఓఎస్‌నెం.1141 ఆఫ్‌ 2012) వేసి ముప్పుతిప్పలు పెడుతున్నాడట. ఇలా కబ్జాలో ఉన్న వారిపై టెనెంట్స్‌పై తనకున్న రాజకీయ పలుకుబడితో కేసులు బనాయిస్తూ జక్కలొద్దిలో కేడల తన హవాను కొనసాగిస్తున్నాడు. ఎవరు ప్రశ్నించిన తనను ఎవరు ఏం చేయలేరనే కేడల తన పార్టీ అధిష్టానాన్ని సైతం దిక్కరిస్తూ అధినాయకత్వంపై తోచిన కామెంట్లు చేస్తుంటాడు. ఎవరు తననేం చేయలేరని ‘పిల్లి కల్లు మూసుకుని పాలు తాగినట్లు’ ప్రవర్తిస్తాడు. ఇంత జరుగుతున్న పార్టీ ఇతనిపై చర్యలు తీసుకోకపోవడం పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగం తన శక్తి మేర సహకారం అందిస్తుండటంతో కేడల రెచ్చిపోతున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి.

రెవెన్యూ అధికారులను కలవనున్న కేడల బాధితులు

జక్కలొద్ది ప్రాంతంలో భూమి అసలు హక్కుదారులను, నిరుపేద రైతులను తన కబ్జా తెలివితో ముప్పుతిప్పలు పెడుతున్న కేడల భూకబ్జాలపై బాధితులు రెవెన్యూ అధికారులను కలవనున్నట్లు తెలిసింది. జిల్లా రెవెన్యూ అధికారుల ముందు తమ బాధలు చెప్పుకుని న్యాయం చేయాలని వేడుకోనున్నట్లు బాధితులు తెలిపారు. అవసరమైతే తమ భూముల విషయంలో న్యాయం జరగడానికి టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ను కలసి తమ గోడు వెళ్లబోసుకుంటామని బాధితులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!