బొందలగడ్డకు ఎసరు…?
వరంగల్ నగర శివారు ప్రాంతమైన పైడిపల్లి గ్రామ బొందల గడ్డకు ఎసరోస్తోంది. యధేచ్ఛగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేయటానికి సిద్దపడుతున్నారు. చుట్టపక్కల ప్రాంతాల్లోని చెరువుల్లోని మట్టిని, ప్రభుత్వ భూముల్లోని మొరాన్ని తవ్వి వ్యాపారం చేస్తున్నారు. పనిలో పనిగా స్మశాన వాటికలోనూ వెంచర్ వేయటానికి మొరాన్ని తరలించేందుకు సిద్దపడటం, స్మశానంలోని గోరీని ద్వంసం చేయటం చర్చానీయాంశంగా మారింది. మట్టి, మొరం దందాతో పాటు స్మశానవాటికను ఫలహారంగా మార్చుకునేందుకు ‘తిలాపాపం తలా పడికెడు’ అన్న చందంగా ఇదంతా స్థానిక ప్రజాప్రతినిధుల అండతోనే జరుగుతుందనేది బహిరంగ రహస్యంగా మారింది. రియల్ వ్యాపారులు యధేచ్ఛగా మట్టి, మొరం తవ్వకాలు చేస్తూ , స్మశానవాటికను ఫలహారంగా మార్చుకునేందుకు సిద్దపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నోరు మెదుపకపోవటానికి కారణమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మకై ప్రభుత్వ భూముల్లోని మొరం, చెరువుల్లోని మట్టితో వ్యాపారం చేస్తున్నారని, చివరికి స్మశానాలను కూడా వదలటం లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. అయితే స్మశానవాటికను వెంచర్ గా మాచ్చేందుకు అందులోని గోరీని ద్వంసం చేసిన ఆనవాల్లు కనిపిస్తున్నప్పటికీ పైడిపల్లి గ్రామ శివారులో మట్టి, మొరం దందాపై తమకేమీ తెలియదన్నట్లుగా 1వ డివిజన్ కార్పొరేటర్ వాఖ్యానిస్తున్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టడం చర్చానీయాంశంగా మారింది. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు చేపతమ చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సిన అవసరముంది.