బాబాయ్‌…అబ్బాయ్‌!

జగన్‌ను జననేతగా నిలబెట్టడం కోసం…

జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసం…

వైఎస్‌. కుటుంబానికి తోడుగా….

జగన్‌ రాజకీయ జీవితానికి అండగా….

 

వై.వి. చేసిన త్యాగం….

చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం….

అదృష్టం అంటే ఏమిటి? ధనమా! దైవమా!! ఈ రెండూ కాదు…దైవ సేవలో తరించడం. ఆ సేవ ఒక్కసారి రావడమే ఎంతో అదృష్టం. అలాంటిది రెండుసార్లు టిటిడి. చైర్మన్‌ కావడం అన్నది పూర్వజన్మ సుకృతం. ఆ వ్యక్తే టిటిడి

చైర్మన్‌.వైవి.సుబ్బారెడ్డి. టిటిడి చైర్మన్‌ కోసం ఎంతో మంది నేతలు ఎదరుచూస్తుంటారు. కనీసం పాలకమండలిలో సభ్యుడైతే చాలు అనుకుంటారు. కలియుగ దైవాన్ని మనసు నిండేలా కళ్లారా చూసుకునే అవకాశం చాలు అనుకుంటారు. అలాంటి టిటిడి చైర్మన్‌ పదవి కోసం, దేవుని సేవలో తరించడం కోసం ఆరాటపడిన వారు వున్నారు. వారిలో సుబ్బిరామిరెడ్డి, ఆదికేశవులు నాయుడు, మురళీ మోహన్‌, బాపిరాజు లాంటి వారు ఆ పదవి కోసం ఎదరుచూస్తున్నట్లు కూడా చెప్పుకున్న సందర్భాలున్నాయి.

కాని ఊహించకుండానే కలియుగ దైవం రెండు సార్లు వరమివ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా టిటిడి చైర్మన్‌ ప్రకటనకు ముందే వివాదాలు సృష్టించి ఎలాగైనా వైవి.సుబ్బారెడ్డిని కాకుండా చేయాలని కూడా చాలా మంది ప్రయత్నాలు చేశారు. కాని ఆ కలియుగ దైవమే వాటిని పటాంపంచలు చేశారు. రెండు సార్లు వరసగా టిటిడి చైర్మన్‌ అయ్యేందుకు మార్గం వేశాడు. తన సన్నిధిలో కాలం గడిపేందుకు ఆశీర్వచనం ఇచ్చాడు. అసలు టిటిడి చైర్మన్‌ అన్నది పదవి కాదు. ఒక వరం. కలియుగ దైవానికి సేవ చేసుకునే పుణ్యకార్యం. ఒక రకంగా చెప్పాలంటే ఆయన సన్నిదే ఒక ఆధ్యాత్మిక ప్రపంచం. అది అందరినీ వరించేది కాదు. ఆ ప్రపంచాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అప్పగించడం అన్నది దైవ కృప లేకుండా జరిగేది కాదు. ఎవరైతే సుబ్బారెడ్డి మీద విమర్శలు చేశారో ఆ సోకాల్డ్‌ నేతలు ఎవరూ కనీసం ఏడాదికోసారైనా గోమాత సేవ చేసుకుంటారో లేదో తెలియదు. కాని సుబ్బారెడ్డి ఇంట్లో నిత్యం గోమాతలు పూజందుకుంటాయి. ఇంతకన్నా కలియుగ దైవానికి ప్రీతి పాత్రుడైన భక్తుడు ఎక్కడుంటాడు. అందుకే రెండు సార్లు ఆ అవకాశం ఆ దైవమే కల్పించాడు. తన సేవలో తరించడమన్నాడు. 

వైవి.సుబ్బారెడ్డి మాట్లాడే మాట, చెప్పే విషయం సూటిగా వుంటుంది. తన మనసులో ఏముంటుందో అది నిర్మొహమాటంగా చెప్పేస్తారు. ఎక్కడా ఎలాంటి సాగదీతకు తావుండదు. ఆయన చెప్పే విధానం అందరికీ నచ్చుతుంది. మనసులో ఒకటి, బైటకు ఒకటి చెప్పడం ఆయనకు తెలియదు. అందుకే ఆయనంటే అందరికీ ఇష్టం. ఆయనతో కాసేపు మాట్లాడితే జీవిత సత్యు తెలుస్తుందంటారు. రాజకీయాలకు ఎప్పుడొచ్చారు? ఎందుకొచ్చారంటే కూడా చాలా సింపుల్‌గా చెబుతారు. రాజకీయాలంటే ఏమిటో కూడా రెండు ముక్కల్లో తేల్చేస్తారు. అలాంటి నాయకులు చాలా తక్కువగా కనిపిస్తారు. వ్యక్తిని ఆరాంధించడం వేరు. ప్రేమించడం వేరు. ఆప్యాయత పంచడం వేరు. గుండెల్లో పెట్టుకోవడం వేరు. ఇవన్నీ ఒకే వ్యక్తిలో వుండడం అన్నది అరుదు. అవన్నీ నమ్మకానికి విలువలు. ఆ విలువతో కూడిన రాజకీయాలు చేయడం తెలిసిన నేత వై.వి. సుబ్బారెడ్డి. తనకు ఏం కావాలో కూడా ఆయన ఆలోచించుకోడు. కావాలనుకున్నది రాకపోతే కలకలమంటుంది. అందుకే వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ పోతే చాలు. అలాంటి సర్ధుకుపోయే మనస్తత్వం వున్న నాయకుడు వై.వి. సుబ్బారెడ్డి. జగన్‌కు అడుగడుగునా అండగా వుంటూ వస్తున్నాడు. ఆయన విజయాలలో పత్యక్ష్యంగా, పరోక్షంగా తన ముద్రను చూపించారు.

కొట్లాడుకోవడం కన్నా మాట్లాడుకోవడం కష్టం. సేవ చేయడం కన్నా, త్యాగం చేయడం కష్టం. అని పెద్దలన్నారు. అంటే మాటకు వున్న విలువ, త్యాగానికి వున్న చరిత్ర అంత గొప్పది. సహజంగా ఎవరైనా నేను నా కుటుంబం అనుకుంటారు. నేను బాగుంటే చాలనుకుంటారు. నా కుటుంబం ఆనందమే నాకు ముఖ్యమనుకుంటారు. కాని నేనేకాదు, నా చుట్టూ వున్న కూడా బాగుండాలనుకునేవారు కొందరే వుంటారు. అలాంటివారిలో బహు అదురైన వ్యక్తిత్వం వున్న నాయకుడు వైవి. సుబ్బారెడ్డి. మాటలో నెమ్మదనం…మనసులో గొప్పదనం..చేతల్లో చురుకుదనం కలగలిసిన నాయకుడు వైవి. సుబ్బారెడ్డి అంటారు. మాటను కూడా ఆలోచించి మాట్లాడతారు. చూసే చూపులో కూడా నిజాయితీని కనబర్చుతారు. ఈ సమాజంలో ఎదుటివారితో మాట్లాడితే, అయిన వారిని దగ్గరకు రానిస్తే ఏం అడుగుతారో? అనుకునేవారు వుంటారు. ఏ సాయమందించాల్సి వస్తుందో అనుకునే సన్నిహితులు, బంధువులు వున్న వారు వుంటారు. కాని త్యాగానికి నిర్వచనమైన, పర్యాయమైన నాయకుడు వైవి. సుబ్బారెడ్డి. ఈ రోజుల్లో ఎవరూ చేయలేని పనిని, చేయని పనిని కూడా నేను చేయగలని నిరూపించారు. సేవలు చేయడమే గొప్ప అనుకునే రోజులివి. త్యాగం అన్నది అంత సులువైన పని కాదు. అసలు త్యాగం ఎందుకు చేయాలని ప్రశ్నించే రోజులు. త్యాగం చేస్తే నాకేంటి అని ఆలోచించే రోజులు. కాని తన సతీమణి మనసులో ఏముందో కూడా తెలుసుకొని, ఆచరణలో పెట్టేంత గొప్ప గుణం ప్రతి భర్తలో కనిపించాలి. కాని అలా ఆచరించేవారు ఎంత మంది వున్నారు? కాని ఒక్కరున్నారు. ఆయనే వైవిసుబ్బారెడ్డి. తన తోడల్లుడైన వైఎస్‌. రాజశేఖరరెడ్డి ప్రమాదంలో మరణించిన తర్వాత తన అక్క కుటుంబం గురించి సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత మధనపడుతుందని అర్ధం చేసుకున్నాడు. కాని ఆమె ఆ విషయం ఆయనకు చెప్పలేక, తనను తాను సముదాయించుకోలేక సతమతమౌతున్న సందర్భం. అంతే ఆమె మనసులో వున్న ఆలోచనను అర్ధం చేసుకొని జగన్‌కు అండగా వుండడానికి తన వ్యాపారాలన్నీ వదిలేసి, వైఎస్‌ కుటుంబానికి అండగా నిలడడానికి నిర్ణయం తీసుకున్నాడు. తన తోడళ్లుడు కొడుకైన వైఎస్‌.జగన్‌ కోసం అన్నీ తానై, అండగా వున్నారు. ఇది ఎవరికీ తెలియని విషయం. అందుకే వైవి. సుబ్బారెడ్డి అంత ప్రత్యేకం. 

రాష్ట్రం ఒక బలమైన నాయకుడిని కోల్పోయింది. రాష్ట్రమంతా కొలిచే దైవమంటి నాయకుడు లేకుండాపోయాడు. జగన్‌ కుటుంబం శోఖసంద్రంలో మునిగిపోయింది. రాష్ట్రమంతా మూడు రోజుల పాటు టివిలకే అతుక్కుపోయింది. ఏ క్షణమైనా వైఎస్‌. వస్తున్నాడన్న మాట వినిపిస్తుందా? అని ఆశగా ఎదురుచూసిన క్షణాలున్నాయి. అదిగో వచ్చే, ఇదిగో వచ్చే అన్న వార్తలు వింటూ, గుండెలు అదిమి పట్టుకొని కూర్చున్నవారు ఎంతో మంది వున్నారు. కనీసం వంటలు కూడా చేసుకోని కుటుంబాలు కొన్ని లక్షలున్నాయి. వైఎస్‌. మరణం గురించి తెలిసి కొన్ని వందల గుండెలు ఆగిపోయాయి. రాష్ట్రంలో గుండె సంబంధమైన వ్యాధులతో ఎవరూ బాధపడకుండా వుండాలని, ఆరోగ్య శ్రీ తెచ్చిన కొన్ని లక్షల మంది ఆరోగ్యాలను కాపాడిన దేవుడు, లేడని తెలిసి గుండెలాగిపోయిన కుటుంబాలను కూడా చూసుకోవాల్సిన బాధ్యత జగన్‌ మీద పడిరది. అటు కుటుంబం. ఇటు రాష్ట్రం. రాజకీయాలు. వైఎస్‌. మరణం తట్టుకోలేక ప్రాణాలు పోయిన వారి కుటుంబాల కోసం జగన్‌ ముందు వున్న బరువైన బాధ్యతల్లో పాలు పంచుకోవాలి. జగన్‌ ప్రమేయం లేకుండా సాగుతున్న రాజకీయాలను పసిగట్టాలి. జగన్‌కు తెలియకుండానే సాగిన సంతకాల సేకరణ మూలంగా అప్పటికే జగన్‌ను నిందించడం మొదలైన సమయం. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న సమయంలో జగన్‌ ఓదార్పు యాత్రను ఆపడం. చివరికి జగన్‌ మీద సిబిఐ కేసులు నమోదు చేయడం. ఆయనను జైలుకు పంపడం. అంతా గందరగోళం. ఆ కుటుంబానికి ఏం జరగుతుందో అర్ధం కాని అయోమయం. జగన్‌ను రాజకీయంగా తొక్కేయడమే కాకుండా, ప్రజల్లో లేకుండా కొంత కాలం దూరం చేస్తే, జనం మర్చిపోతారన్న కుత్సిత రాజకీయాలు సాగిన దుర్మార్గ కాలం. ఆ సమయంలో అటు కుటుంబానికి, ఇటు పార్టీకి రెండు కళ్లలాగా కంటికి రెప్పలాగా కాపాడడంలో వైవి. సుబ్బారెడ్డి పోషించిన పాత్ర అసామాన్యమైంది. 

జగన్‌ జైలు నుంచి విడుదలైన తర్వాత ఎల్లవేళలా జగన్‌కు తోడుంటూ, డిల్లీ రాజకీయాలను పర్యవేక్షించే బాధ్యత వైవి. సబ్బారెడ్డి తీసుకున్నారు. 2014 ఎన్నికల్లో ఒంగోలు నుంచి పార్లమెంటుకు పోటీ చేసి గెలిచారు. 2018 ఎప్రిల్‌ 6న వైసిసి ఎంపిలంతా రాజీనామాలు చేశారు. ఆ తర్వాత ఆయన పార్టీ కోసం పని చేస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో ఎలాగైనా పార్టీ గెలవాలి. అసలు 2014 ఎన్నికల్లోనే వైసిసి గెలవాలి. నాడు మూడు పార్టీలు ఏకమైన సాగడం వల్ల వైసిసికి నష్టం జరిగింది. కాని బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. దాంతో జగన్‌లో మరింత కసి మొదలైంది. తెల్లారి లేస్తే తెలుగుదేశం పార్టీ అడుగడుగునా వైసిపిని ఇబ్బందులకు గురి చేస్తుంటే ఆయన వెన్నంటే వుంటూ, ఆయన కొండంత ధైర్యం ఇస్తూ ముందుకు సాగిన వ్యక్తి వై.వి. సుబ్బారెడ్డి. ఏనాడు తాను పదవుల కోసం ఆశపడలేదు. ఆశించలేదు. జగన్‌ను రాష్ట్రనేతగా చూడాలనుకున్నాడు. రెండు సార్లు రాష్ట్రంలో ఒంటి చేత్తో అధికారంలోకి తెచ్చిన వైఎస్‌ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని సహించలేక రాజకీయాల్లోకి వచ్చారు. జగన్‌కు అండగా నిలిచారు. ఆయన వేసిన ప్రతి అడుగునూ జాగ్రత్తగా వేయిస్తూ వచ్చారు. జగన్‌ జైలులో వున్నంత కాలం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. అటు కుటుంబానికి ధైర్యం చెబుతూ, ఇటు పార్టీని కాపాడుకుంటూ రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది భుజాన వేసుకున్న వారికే తెలుస్తుంది. 2014 ఎన్నికల్లో కూడా ఆయన ఒంగోలునుంచి పోటీ చేయాలని అనుకోలేదు. జగన్‌ ఒత్తిడి మేరకే పోటీ చేశారు. గెలిచారు. గత ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోలేదు. జగన్‌ సూచనల మేరకు నడుచుకున్నారు. పైగా జగన్‌ పాదయాత్రను కూడా దగ్గరుండి ప్రతి క్షణం పర్యవేక్షించారు. ప్రజల్లో మరింత నమ్మకాన్ని కల్గించేందుకు కూడా తన శక్తియుక్తులను కూడదీసుకొని పార్టీకి అఖండ మెజార్టీ వచ్చేందుకు కారకుడయ్యాడు. 

వైఎస్‌. రాజశేఖరరెడ్డి సోదరుడు దివంగత వైఎస్‌.వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీగా మంత్రి పదవి తీసుకున్నారే గాని, జగన్‌ను ఎందుకు ముఖ్యమంత్రిని చేయరని ఏనాడు ప్రశ్నించలేదు. వైఎస్‌ ఆత్మగా చెప్పుకునే నాయకుడైన కేవిపి. కూడా జగన్‌కు అండగా నిలవలేదన్నది వాస్తవం. వైఎస్‌ బతికున్నంత కాలం ఆయన ఆశీస్సులతో రాజకీయంగా వెలుగువెలిగిన ఎంతో మందినేతలు ఆ తర్వాత జగన్‌కు దూరమయ్యారు. జగన్‌పై చాటుమాటుగా చేయాల్సిన విమర్శలు చేశారు. ఆయనకు తోడుగా వుండడానికి రాలేదు. కాని తన తోడళ్లుడి కుటుంబం మళ్లీ ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం కోసం కృషి చేసిన ఏకైక నాయకుడు, బంధువు వై.వి. సుబ్బారెడ్డి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!