ప్రొఫెసర్ సార్ కబ్జాపురాణం
ఆయన పిల్లలకు విద్యాబుద్దులు నేర్పే రిటైర్డు అయిన ప్రొఫెసర్. సమాజంలో బాద్యతాయుతమైన, గౌరప్రదమైన స్థానం కలిగినవాడు. చెడుమార్గంలో వెళుతున్న వారిని సరిదిద్ది సక్రమార్గంలో పంపించాల్సిన వాడు. కానీ ఇన్ని సంవత్సరాల ప్రొఫెసర్‌గిరి, అనుభవాన్ని, చదువు, తెలివితేటల సారానంతటిని రంగరించి కబ్జా పురాణానికి తెరలు తీశాడట. పదవివిరమణ జరిగాక చేతినిండా ఏదో పని ఉండాలి అనుకున్నాడో ఏమో తెలియదు కానీ తన ఇంటి పక్కనే ఉన్న స్థలంలో పాగావేసి కబ్జా పురాణాన్ని మహాజోరుగా నడిపిస్తున్నాడట. ఇంటి పక్కనే ఖాళీ జాగ కనపడటంతో తన ప్రొఫెసర్ తెలివినంతటిని ఉపయోగించి ఉన్న స్థలానికి ఖాళీ స్థలాన్ని జోడిస్తే విశాలమైన జాగ సొంతం అవుతుందని ఆలోచిస్తున్నాడట. దీంతో ఖాళీస్థలం యజమాని లబోదిబోమంటున్నారు. ప్రొఫెసర్ సార్ కబ్జా బుద్దితో తాము చుక్కలు చూస్తున్నామని, ఈ స్థలం నీది కాదు…మొర్రో అన్న ఎంత మాత్రం వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం…హన్మకొండ నగరంలోని వడ్డేపల్లి సమీపంలోని ఎక్సైజ్‌కాలనీలో సర్వే నెంబర్ 298/1లో కోటిచింతల కిరణ్‌కుమార్ అనే వ్యక్తి 2018 నవంబర్ నెలలో నల్లా ఇమ్మాన్యువల్ అనే అతని వద్ద నుండి 346గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. కొనుగోలు చేయగానే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. భూమిని కొనుగోలు చేసిన నంబరులో భూమి వద్దకు వెళ్లి పనులు చేయించడానికి ఉపక్రమించాడు. అంత రిటైర్డు ప్రొఫెసర్ రూపంలో ఓ అడ్డుపుల్ల తగిలింది. ఈ భూమి తనదంటూ కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పనిచేసి పదవివిరమణ పొందిన కె.కొండల్‌రెడ్డి నోటరీ పేపర్‌తో ఈ స్థలాన్ని తాను ఎప్పుడో కొనుగోలు చేశానని స్థలాన్ని కొనుగోలు చేసిన కిరణ్‌కుమార్‌ను బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు బాధితుడికి అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. దీంతోనయిన పని అవుతుందనుకుంటే అదీ కాలేదు. కిరణ్‌కుమార్‌ను సవాల్‌చేస్తూ కొండల్‌రెడ్డి కోర్టుకెక్కాడు. కోర్టు అక్కడ కూడా బాధితుడికే అనుకూలంగా తీర్పు చెప్పింది. ప్రొఫెసర్ తీరును తప్పుపట్టించి అయిన ప్రొఫెసర్ సార్ తన ప్రయత్నాలను మానుకోవడం లేదు. నయానో, భయానో బాధితుడిని తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు. పైరవీకారులు ప్రజాసంఘాల నాయకులు, పార్టీ నాయకుల పేరుతో తిరిగేవారితో సెటిల్మెంట్కు దిగాడు. అయిన బాధితుడు ససేమిరా అన్నాడు. దీంతో ప్రొఫెసర్ సార్ కొంతమంది సెటిల్మెంట్ రాయిళ్ల సూచనలతో అది 298/1 సర్వే నెంబర్‌కాదని 294 సర్వే నెంబర్ అని కొత్త పల్లవి అందుకున్నాడు. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌తో 298/1 సర్వేనెంబర్లో పక్కా గృహాన్ని నిర్మించుకున్న ప్రొఫెసర్ సాబ్ తన ప్రహారీగోడ పక్కస్థలాన్ని 294 సర్వే నెంబర్ అంటూ కొత్త పల్లవి అందుకోవడంలోనే పక్కా కబ్జా బుద్ది బయటపడుతుందని బాధితుడు అంటున్నాడు. 298/1 సర్వే నెంబర్ ప్రొఫెసర్‌కు అతని స్థలాన్ని సంబంధించిన స్తలం డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయని, తన స్థలం కూడా అదే సర్వే నెంబర్ కావడంతో ఇది నాది అంటున్నా ప్రొఫెసర్‌ను అప్పుడే రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించుకోలేదు…? ఇంటి స్థలం కాగితాలు పక్కాగా ఉండి..ఖాళీస్తలం కాగితాలు లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తారని కేవలం నోటరితో స్థలాన్ని కొనుగోలు చేసినట్లు నాటకం ఆడుతున్నాడని బాదితుడు కిరణ్‌కుమార్ ఆరోపించాడు. తన స్థలాన్ని అప్పనంగా స్వాధీనం చేసుకోవడానికే రిటైర్డు ప్రొఫెసర్ నోటరీతో తనను ఇబ్బందులు పాలుచేస్తున్నాడని కోర్టు తనకు అనుకూల తీర్పు చెప్పిన, సర్వేయర్ 298/1 సర్వేనెంబర్ భూమి ఇదేనని తేల్చిన వినడం లేదని అన్నాడు.
పట్టింపులేని తహశీల్దార్…?
298/1 సర్వేనెంబర్లో 346గజాల స్థల విషయంలో ఇంత వివాదం నడుస్తున్న హన్మకొండ తహశీల్దార్ మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. సర్వే నెంబర్ విషయంలో ప్రొఫెసర్ కొండల్‌రెడ్డి కిరికిరి పెడుతుండగా సర్వేయర్ అది 298/1 సర్వే నెంబర్ అని తేల్చిన చర్యలు తీసుకోవడంలో తహశీల్దార్ వెనుకాడుతున్నట్లు సమాచారం. పంచనామా నిర్వహించాలని కోరిన ప్రొఫెసర్ సహకరించడం లేదనే సాకుతో నెలలు గడుస్తున్న తహశీల్దార్ కనీసం స్పందించడం లేదట. తహశీల్దార్ ప్రొఫెసర్‌తో కుమ్మక్కై బాదితుడు ప్రశ్నిస్తున్నప్పుడల్లా పొంతన లేని సమాధానాలు చెప్తున్నట్లు తెలుస్తోంది. తహశీల్దార్ పంచనామా నిర్వహించి నివేదిక సమర్పిస్తే స్థల వివాదం ముగుస్తుంది. కానీ తహశీల్దార్ అందుకు ఎంతమాత్రం పూనుకోవడం లేదని బాధితుడు కిరణ్‌కుమార్ అంటున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఉన్న తగదాను పరిష్కరించి, అది గొడవలకు దారితీయకుండా ఉండేందుకు పంచనామా నిర్వహించాలని స్థానిక పోలీస్ అధికారి తహశీల్దార్‌ను కోరిన నిర్లక్ష్యధోరణి తప్ప తహశీల్దార్ సమస్య పరిష్కారం చేసేందుకు సహకరించడం లేదని తెలుస్తోంది. ప్రొఫెసర్ కొండల్‌రెడ్డి పక్షాన ఉండేందుకు అతను యత్నిస్తున్నట్లు సమాచారం. ఇకనైన తహశీల్దార్ పంచనామా నిర్వహించి తమకు న్యాయం చేయాలని, ప్రొఫెసర్ పంచనామాకు సహకరించడం లేదనే సాకులు చెప్పవద్దని బాధితుడు కిరణ్‌కుమార్ కోరుతున్నాడు.
లోటస్ కాలనీలో మరో ఇద్దరు ప్రొఫెసర్ల భూబాగోతం
త్వరలో…