మల్కాజ్గిరి (మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా),22 అక్టోబర్ (నేటిధాత్రి):
సమాజంలో గొప్ప వాళ్ళు ఇంకా గొప్పగా, పేదవారు ఇంకా పేదలు అవుతున్నారు అనడానికి ఇదే నిదర్శనం. మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని పటేల్ నగర్ లో నివసిస్తున్న ప్రమోద్(21) పవన్ (17) ఇద్దరు అన్నదమ్ములు, పెయింటింగ్, డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆరు సంవత్సరాల క్రితం తల్లి విజయలక్ష్మి అనారోగ్యంతో మరణించింది. అద్దె ఇంట్లో తండ్రి నరసింహులు (45) తో జీవనం కొనసాగిస్తున్న అన్నదమ్ములకు విధి రాతవల్ల ఊహించని సంఘటన తమ తండ్రి నరసింహులు శుక్రవారం రాత్రి హఠాన్మరణం చెందారు.తండ్రి అంతక్రియలకు కూడా చిల్లి గవ్వలేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని పటేల్ నగర్ కి చెందిన మధు మానవసేవే మాధవసేవ వాట్సప్ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజును సంప్రదించి, నరసింహులు అంతక్రియలకు ఆర్థిక సహాయం కోరడం జరిగింది. వెంటనే ఈ విషయాన్ని తమ వాట్సాప్ గ్రూప్ లో సభ్యులకు తెలియజేయడంతో మానవతాదృక్పథంతో 24 మంది సభ్యుల సహకారంతో నరసింహులు అంతక్రియలకు 16 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని నరసింహులు ఇద్దరు కుమారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు, ఉదారి సత్యనారాయణ యాదవ్, జగపతి, సత్యనారాయణ, తో పాటు స్థానికులు మధు, తదితరలో పాల్గొన్నారు. నరసింహులు అంతక్రియలకు ఆర్థిక సహాయం అందించిన వాట్సాప్ గ్రూప్ సభ్యులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు.