పార్టీ పరువు తీస్తున్న ప్రబుద్దులు?

`ఏ సంఘటన జరిగినా టిఆర్‌ఎస్‌ కే ముడి?

`అందరూ కండువాలు కప్పుకోవడంతోనే ఈ చిక్కుముడి?

`పార్టీలో చేర్చుకునే ముందు ఆలోచించండి?

`జిల్లా, మండల స్థాయి నాయకత్వాలు ఏం చేస్తున్నాయి?

 

`ఏ ఘటనలోనైనా కనిపించేది ఇతర పార్టీల నుంచి నేతలే…?

` టిఆర్‌ఎస్‌ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నావారే?

`పార్టీ పరువు తీస్తున్నారు?

`ప్రజల్లో చులకన చేస్తున్నారు?

`సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు?

`పార్టీ పరువు గంగలో కలుపుతున్నారు?

`వాళ్లంతా టిఆర్‌ఎస్‌ అన్న ప్రచారం విసృతంగా ప్రజల్లోకి పంపుతున్నారు?

`జిల్లా విభాగాలు, మండల విభాగాల పర్యవేక్షణ అవసరం?

`ఇతర పార్టీలకు పని చేస్తూ టిఆర్‌ఎస్‌ కండువా కప్పుకుంటున్న వాళ్లను గుర్తించండి?

`గోడమీద పిల్లులను నమ్మకండి?

`ఉద్యమ పార్టీకి బలమైన త్యాగాల పునాదులున్నాయి?

`అవకాశవాదులను దరిచేరనివ్వకండి?

`ఏ మాత్రం అనుమానం వచ్చినా వారిని పక్కనపెట్టండి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 వేరు పురుగు చేరి వృక్షంబు చెరచురా…అని పెద్దలు చెప్పినట్లు, పార్టీని పరువు తీసేందుకు కూడా కొందరు తయారౌతుంటారు. ఏ చెట్టు నీడ కింద వుంటున్నారో ఆ చెట్టుకు చెడ్డపేరు తెచ్చేస్తుంటారు. తమ పబ్బం గడుపుకునేందుకు పార్టీని వాడుకుంటుంటారు. తన పరువు పోతుందని ఆలోచించలేని వ్యక్తులు పార్టీ పరువు గంగలో కలుపుతున్నారు. ఈ మధ్య ఎక్కడ విన్నా, ఏ వివాదం గురించి వినపడినా అందులో టిఆర్‌ఎస్‌ నాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. నిజానికి టిఆర్‌ఎస్‌ కార్యకర్త అంటే ఒక ఉద్యమకారుడు. త్యాగధనుడు. సుధీర్ఘ కాలం పాటు పార్టీ కోసం పనిచేస్తున్న సైనికుడు. అటుకులు బుక్కి కూడా పార్టీ కోసం పనిచేసిన వాడు. ఉద్యమ కాలంలో ఇల్లూ వాకిలి పట్టించుకోనోడు. తెలంగాణ వస్తే అందరి తలరాతలు మారుతాయని బలంగా నమ్మినవాడు. అలాంటి ఉద్యమకారులైన తెలంగాణ వాదులు ఎలాంటి తప్పులు చేయరు. కాని ఉద్యమ కాలం తెలియని వాళ్లు, ఉద్యమ విలువ తెలియని వాళ్లు, త్యాగం అంటే ఏమిటో తెలియని వాళ్లు, ఆకలిని చంపుకొని ఉద్యమానికి ఊపిరిపోయని వాళ్లు మాత్రమే పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు ఆగమ్య గోచరమౌతుందని, అంధకారమౌతుంది, స్వార్ధం కోసం టిఆర్‌ఎస్‌లో చేరిన వాళ్లే ఎక్కువగా వివాదాలలో చిక్కుకుంటున్నారు. టిఆర్‌ఎస్‌ కండువా కప్పుకోవడంతో వాళ్లంతా టిఆర్‌ఎస్‌ వాళ్లే అనే ప్రచారం సాగుతోంది. నిజానికి అలా వివాదాల మయమౌతున్న నాయకులందరూ ఇతర పార్టీలనుంచి వచ్చిన వాళ్లే…ఇతర పార్టీల వాసనలు ఇంకా వున్న వాళ్లే…మళ్లీ అవసరమనుకుంటే గోడ దూకేవాళ్లే…అంతే కాని టిఆర్‌ఎస్‌ కోసమే జీవితాంతం పనిచేసేవాళ్లు కాదు…పార్టీ కోసం ప్రాణాలుపెట్టేంత విశ్వాసపాత్రులు కాదు. అందుకే ఏదైనా తమ వల్ల తప్పు జరిగితే అది పార్టీకి చెడ్డ పేరు వస్తుందని అసలే ఆలోచించరు. మధనపడేవాళ్లు, అసలు తప్పులే చేయరు. ఇలా అనేక సంఘటలలో బాధ్యులైన వాళ్లలో కొన్ని విషయాలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నం నేటి ధాత్రి చేస్తోంది. ఆ మధ్య ములుగు జిల్లాలో మొగుళ్ల భద్రయ్య అనే వ్యక్తి మీద దాడి జరిగింది. 

ఆ వ్యక్తి మీద దాడి చేసిన వాళ్లు టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు అన్న ముద్ర పడిరది. కాని నిజానికి మొగుళ్ల భద్రయ్య మీద దాడి చేసిన వాళ్లు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు. కాని వాళ్లు టిఆర్‌ఎస్‌ కండువా కప్పుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు. పనులేమో టిఆర్‌ఎస్‌ పేరు చెప్పి చేస్తుంటారు. రాజకీయమేమో కాంగ్రెస్‌కు అనుకూలంగా చేస్తుంటారు. ఇలా చాలా సంఘటనలున్నాయి. ఇక భూముల ఆక్రమణల విషయంలోనూ సేమ్‌ ఇదే తంతు. రియలెస్టేట్‌ చేసే మెజార్టీ వ్యాపారులు ఏదో ఒక పార్టీలో వున్నట్లు కలరింగ్‌ ఇస్తుంటారు. తెలంగాణ ఉద్యమం బలంగా సాగుతున్న సమయంలో వారిలో ఏ ఒక్క రియలెస్టేట్‌ వ్యాపారి టిఆర్‌ఎస్‌కు సపోర్టు చేసిన వాళ్లు కాదు. ఆనాడు అధికారంలో వున్న కాంగ్రెస్‌కు సానుకూలంగా వున్నావాళ్లే..కాని తెలంగాణ రాగానే, టిఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే వాళ్లుంతా టిఆర్‌ఎస్‌ కండువాలు కప్పుకున్నారు. ఒక్క రోజులో వాళ్లంతా కండువాలు మార్చుకోగానే టిఆర్‌ఎస్‌ నాయకులైపోయారు. పెద్దలుగా చెలామణి అవుతున్నారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వాళ్లంతా పార్టీలో కీలకమౌతూ వచ్చారు. ఉద్యమ కారులను దూరం జరుపుతూ వచ్చారు. దాంతో అసలైన తెలంగాణ వాదులు ఇప్పటికీ చాలా మంది కార్యకర్తలుగానే మిగిలిపోయారు. కాని గెలుపు గుర్రాలుగా, ఎన్నికల సమయంలో ఏదో రకంగా సాయం చేస్తున్నామన్న భావన కల్పించేవాళ్లంతా టిఆర్‌ఎస్‌ పేరు చెప్పుకొని వ్యాపారాలు సాగిస్తున్నారు. అందులోనూ భూముల ఆక్రమణలు కూడా జరుపుతున్నారన్న అపవాదులు ఎదుర్కొంటున్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా సరే అందులో టిఆర్‌ఎస్‌ నాయకుల పాత్ర అన్నది వినపడకుండా వుండడం లేదు. కారణం ఇలాంటి నేతల మూలంగానే పార్టీ పరువు బజారున పడిరది. ఇక ఆ మధ్య ఓ దివ్యాంగుడిని సర్పంచ్‌ కాలుతో తన్నిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నిజానికి ఆ సర్పంచ్‌ టిఆర్‌ఎస్‌ నాయకుడు కాదు. సర్పంచ్‌గా తన హవా నడవాలంటే టిఆర్‌ఎస్‌లో చేరితే తప్ప ఆగడాలు చేయలేనని తెలుసుకున్నాడు. టిఆర్‌ఎస్‌ తీర్ధం పుచ్చుకున్నాడు. ఇక మహబూబ్‌ నగర్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ ఎంపిటిసీ ఓ వృద్ధ దంపతులపై దాడి చేశారన్న వార్తలు వచ్చాయి. అక్కడ కూడా ఇదే జరిగింది. ఆ ఎంపిటిసి నిజానికి టిఆర్‌ఎస్‌ ఎంపిటిసి కాదు. ఇక తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ టిఆర్‌ఎస్‌ ఎంపిటిసిని బెదిరించి రియలెస్టేట్‌ వ్యాపారులు భూములు ఆక్రమించుకున్నారని వార్త వచ్చింది. అంటే అసలైన కార్యకర్తలు ఇలా ఇబ్బందులు పడుతున్నారు. మధ్యలో తమ అవసరాల కోసం, వ్యాపార అవకాశాల కోసం, అవసరమైతే రాజకీయ పదవుల కోసం పార్టీలో చేరిన వాళ్లే ఎక్కువ మంది ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. ఇక వైరల్‌గా మారిన ఓ ఆడియోలో ఓ నేత ,మహిళతో జరిపిన సంభాషణ లో టిఆర్‌ఎస్‌ నాయకుడు అనేది బాగా వినిపిస్తోంది. కాని నిజానికి ఆ నాయకుడు కూడా తర్వాత కాలంలో టిఆర్‌ఎస్‌లో చేరిన వ్యక్తే. అంటే తప్పు చేసేవాళ్లు ఏ పార్టీలో వున్నా తప్పు చేస్తుంటారు. ఆ వ్యక్తులు ఇతర పార్టీలో రాజకీయ అవసరాలు తీరవన్న ఆలోచనతోనే టిఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారే కాని, వాళ్లంత అవకాశ వాదులు. కాలాన్ని బట్టి గోడలు దుంకుతూ వుంటారు. అలాంటి వాళ్ల వల్లనే పార్టీ భ్రష్టు పట్టిపోతుందని అసలైన తెలంగాణ వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

  ఇలాంటి సమయాల్లో జిల్లా, మండల, గ్రామ శాఖల టిఆర్‌ఎస్‌ బాధ్యులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.

  రాజకీయంగాని, సామాజికంగా గాని, దౌర్జన్యపూరితమైన పనులు, దాడులు చేసిన వారిలో అసలైన ఉద్యమకారుల పేర్లు ఎక్కడా వినపించలేదు. కారణం వాళ్లంతా క్రమశిక్షణతో పనిచేస్తున్నవాళ్లు. కాని రాజకీయ అవసరాల కోసం వచ్చిన వాళ్లే వివాదాలు సృష్టిస్తున్నారు. అలాంటి వాళ్లను పార్టీ ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం వుంది. జిల్లా స్ధాయి నుంచి నుంచి, గ్రామస్ధాయి నాయకుల దాక పార్టీకి నష్టం తెస్తున్నవారిని ఏరేయాలి. వారిని పార్టీ నుంచి బైటకు పంపేయాలి. అప్పుడే వారికి మరో రాజకీయ జీవితం లేకుండాపోతుంది. ఏ పార్టీ వారిని తీసుకోవడానికి కూడా ఇష్టపడదు. అంతే కాకుండా ఎక్కడైనా వివాదం తలెత్తి పార్టీ పేరు బైటకు రాగానే, ఆ వ్యక్తులు పార్టీకి చెందని వాళ్లా, కాదా? అన్నది కూడా జిల్లా టిఆర్‌ఎస్‌ యంత్రాంగం ఓ స్పష్టతనివ్వాలి. లేకుంటే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా పార్టీ యంత్రాంగమే సుప్రిం. ఏది జరిగినా పార్టీ రాష్ట్ర పెద్దలే చూసుకుంటారు. మంత్రులే పట్టించుకుంటారు.. మాకేందుకు అని టిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకుల ఉపేక్షించొద్దు. తప్పు చేసిన వారిని వెంటనే పార్టీ నుంచి వెలివేయాలి. పార్టీకి నష్టం చేకూర్చారని తెలిసిన మరు క్షణమే వారిని సస్పెండ్‌ చేయాలి. ఆ వ్యక్తి చేసిన పనికి తమ పార్టీకి సంబంధం లేదని వెంటనే ప్రకటించాలి. అలా చేసినప్పుడే తప్పులు చేయడానికి ఏ నాయకుడైనా భయపడతాడు. తప్పులు చేయకుండా వుంటాడు. లేని పక్షంలో ఇలాగే వివాదాలు సృష్టిస్తుంటారు. పార్టీ మెడకు చుట్టేస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!