`ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో బిజేపిపై రవిచంద్ర ఘాటు వ్యాఖ్యలు.
`సిరిసిల్లను సిరుల సిల్ల చేసిన ఘనత కేటిఆర్ ది.
`ఒకనాడు సిరిసిల్ల అంటే ఉరిసిల్ల అనేవారు.
`తెలంగాణ ఉద్యమ కాలంలోనే కేటిఆర్ సిరిసిల్లకు ప్రగతి బాటలు వేశారు.
`తెలంగాణ వచ్చాక సిరిసిల్ల రూపురేఖలు మార్చారు…
`ఇటీవల సిరిసిల్లలో జరిగిన సెస్ ఎన్నికలలో ఘోరంగా ఓడినంక కూడా బిజేపి కళ్లు తెరవలేదు.
` బిజేపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా సాగునీటి ఒక్క ప్రాజెక్టైనా కట్టారా?
`తెలంగాణ లో ఇస్తున్నట్లు రైతుబంధు ఇస్తున్నారా?
`ఆసరా పింఛన్లు తెలంగాణలో ఇచ్చినంత ఎక్కడైనా ఇస్తున్నారా?
`తెలంగాణలో అమలౌతున్న సంక్షేమ పథకాలు ఎక్కడైనా వున్నాయా?
` రైతులను నుంచి నేరుగా ధాన్యం సేకరణ బిజేపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా జరుగుతోందా?
`బిజేపి నేతలు పూటకో మాట…గడియకో అబద్దం అలవాటు చేసుకున్నారు.
`ప్రజలను తప్పుదోవ పట్టిస్తామని పగటి కలలుగంటున్నారు.
` కేంద్రంలో ఏటా రెండు కోట్ల కొలువులు ఎప్పుడో మర్చిపోయారు.
` రాష్ట్రంలో కొలువుల జాతరను చూసి బెంబేలెత్తిపోతున్నారు.
`యువత ఇక బిజేపిని పట్టించుకోరని ఉక్కిరిబిక్కిరౌతున్నారు.
`ఏం చేయాలో తోచక ఆగమాగమౌతున్నారు.
`అసత్యాలు, అర్థ సత్యాలు ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు.
`బిఆర్‌ఎస్ ను చూసి భయపడుతున్నారు.
`బిఆర్‌ఎస్ అభివృద్ధి నినాదం ముందు బిజేపి ఏ వాదం పని చేయదని తెలిసి తెల్ల మొహం వేస్తున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఒక దారిలేదు. దిక్కు దివానం లేదు. ప్రజలు ఆదరించే పరిస్ధితి లేదు. ఆ పార్టీలకు దిశా నిర్ధేశం ఏదీ లేదు. ఎప్పుడు ఏ విధంగా వుంటారో వారికే అర్ధం కాదు. ఎప్పుడు ఏం మాట్లాడుతుంటారో అర్ధమే వుండదు. ఇప్పుడు మాట్లాడిన మాటకు, గంట తర్వాత మాట్లాడే మాటలకు పొంతన వుండదు. ఒక నాయకుడు మాట్లాడే మాటకు, అదే పార్టీలో మరో నాయకుడు మాట్లాడే మాటలకు సంబంధమే వుండదు. ఎవరు ఏం మాట్లాడాలన్నదానిపై కూడా స్పష్టత వుండదు. ప్రజల్లో వారికి స్ధానమే లేదు. ప్రజలను మెప్పించాల్సిన సందర్భంలో వాళ్లు చేసే అనవసరమైన హంగామాను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. వారికి రాష్ట్ర ప్రగతి మీద ప్రేమ లేదు. దేశ రాజకీయాల మీద అవగాహన లేదు. ఎంత సేపు విమర్శలు చేస్తూ కూర్చుకుంటే సరిపోతుంది. లేని వివాదాలను సృష్టించి పబ్బం గడుపుకుంటే సరిపోతుందన్న ధోరణి తప్ప బిజేపికి పని , పాట లేదన్నట్లే వుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రతిపక్షాలను తూర్పారపట్టారు. నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్ర రావుతో ఆయన పంచుకున్న విషయాలు రవిచంద్ర మాటల్లోనే….
ప్రతిపక్షాలు మాట్లాడే పొంతన లేని మాటలు చాలా విచిత్రంగా వుంటాయి.
తాజాగా సిరిసిల్ల అభివృద్ధి విషయంలో బిజేపికి చెందిన కొంత మంది నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విడ్డూరం. అసలు సిరిసిల్లలో సిరులు వెలుగులు నిండుతున్నాయి. అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో సిరిసిల్ల అంటే ఉరిసిల్ల అనేవారు. ఇప్పుడు సిరులు సిల్ల అంటున్నారు. ముఖ్యంగా మంత్రి కేటిఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలోనే సిరిసిల్ల అభివృద్ధి ప్రణాళిక మొదలు పెట్టారు. ఆ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సిరిసిల్ల రూపురేఖలే మార్చేశారు. ఒకనాడు ఆకలి సిరిసిల్లను, సిరుల సిల్లగా మార్చారు. ఇది జగమెరిగిన సత్యం. ఒకనాడేమో సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వెల్ మాత్రమే అభివృద్ది చెందుతున్నాయని మాట్లాడేదీ ఈ ప్రతిపక్షాలే…ఇప్పుడు సిరిసిల్లలో సమస్యలున్నాయని మాట్లాడుతున్నది ఈ ప్రతిపక్షాలే…అసలు వాళ్లు మాట్లాడేదాంట్లో ఏది నిజం…అన్నది వారికే స్పష్టత లేదు. అసలు సిరిసిల్ల అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్షాలకు లేదు. సిరిసిల్ల ఇప్పుడు సర్వాంగ సుందరంగా తయారైంది. అన్ని రకాల వసతులు తీర్చిదిద్దబడ్డాయి. హండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా అన్ని రంగాలలో సిరిసిల్ల అభివృద్ధి అన్నది రోల్ మాడల్‌గా వుంది. కాని ప్రతిపక్షాలు పూటకో వేషం వేయడం అలవాటు చేసుకున్నాయి. ప్రజలు వారి మాటలను వినడం లేదన్న అక్కసుతో లేనిపోనివి ప్రచారం చేస్తే తప్ప తమ వైపు చూడరన్న దిక్కుమాలిన వేషాలన్నీ వేస్తున్నారు. ఇక ఆ పార్టీకి చెందిన బండి సంజయ్ క్షణానికో మాట..పూటకో అబద్దం అలవాటు చేసుకున్నాడు. గత కొంత కాలంగా రాష్ట్రంలో కొలువులపై నిత్యం మొసలి కన్నీరు కార్చేవారు. కేంద్రంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014 ఎన్నికల్లో ప్రకటించిన బిజేపి ఒక్క కొలువు ఇచ్చింది లేదు. పైగా దేశ వ్యాప్తంగా వున్న కొలువులు తీసేస్తూ వస్తోంది. ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రైవేటు పరం చేస్తూ వస్తోంది. ఉపాధి అవకాశాలు ఏనాడో గాలికి వదిలేసింది. ఎంత సేపూ మత రాజకీయం తప్ప, ప్రజా సంక్షేమం పట్టని బిజేపి కూడా నీతులు వల్లిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే వుందని ప్రజలే చీ కొడుతున్నారు. రాష్ట్రంలో కొలువుల పండగ మొదలైంది. వేలాది ఉద్యోగాల నియామకాల ప్రక్రియ జరుగుతోంది. ఉద్యోగాల కల్పన అన్నది నిరంతర ప్రక్రియ. తెలంగాణ వచ్చాక లక్షముప్పైవేల ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించిన నాటి నుంచి వేలాది నోటిఫికేషన్లు వెలువడుతూనే వున్నాయి. గ్రూప్ వన్ వంటి ఉద్యోగాల ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష కూడా పూర్తయింది. గ్రూప్ 2 ప్రకటన జరిగింది. గ్రూప్3, గ్రూప్ 4 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. పోలీస్ రిక్రూట్ మెంట్ పెద్దఎత్తున సాగుతోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కల్పన చేసుకుంటూ పోతే ఇక యువత ఓట్లు కష్టమని బిజేపికి అర్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం యువతను బిజేపికి దూరం చేయడానికే ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తున్నారని బిజేపి అనడం దివాళాకోరు తనం కాదా? బాధ్యత కల్గిన నాయకుడు బండి సంజయ్ మాట్లాడాల్సిన మాటలేనా? విజ్ఞత వున్న వాళ్లు మాట్లాడాల్సిన మాటేనా…యువత బాగుపడాలని కోరుకునే వారు చెప్పాల్సిన మాటలేనా? ఈ మధ్య సిరిసిల్లలో జరిగిన సెస్ ఎన్నికల్లో బిజేపిని రైతులు ఎంత అసహ్యించుకుంటున్నారో ఓటు ద్వారా తీర్పు చెప్పారు. 15 డైరెక్టర్ల లో ఒక్కటి కూడా బిజేపి గెల్చుకోలేదు. కాని రాష్ట్ర్రంలో అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బిఆర్‌ఎస్‌ను చూసి బిజేపి భయపడుతోంది. దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న బిఆర్‌ఎస్‌ను కట్టడి చేయాలని కేంద్ర స్ధాయిలో చూస్తోంది. రాష్ట్ర స్ధాయిలో ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని అనుకుంటోంది. ప్రజలు బిజేపి చేస్తున్న కుటిల ప్రయత్నాలు అన్నీ గమనిస్తూనే వున్నారు.
బిజేపి పాలిత రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేశారా?
కనీసం తెలంగాణలో లాగా రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారా? తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం మెడమీద కత్తి పెట్టి మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేసే బిజేపికి రైతాంగ సంక్షేమం మీద సోయి వుందా? దేశ రాజధానిలో ఏడాదిన్నర పాటు రైతులు ఏక బిగిన ఎండనక, వాననక, చలిలోనూ పోరాటం చేసిన సందర్భం ఎన్నడైనా చూశామా? ఇదేనా బిజేపి సాధించిన ప్రగతి. రైతులను కార్లతో తొక్కించి చంపిన ఘనత బిజేపిది కాదా? ఆ పార్టీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా రైతు బంధు అమలౌతుందా? రైతు భీమా ఇస్తున్నారా? కళ్యాణ లక్ష్మి అన్నది ఎక్కడైనా వుందా? ఆసరా పించన్లు తెలంగాణలో ఇచ్చినంత ఇస్తున్నారా? వికలాంగుల పించన్లు తెలంగాణలో ఇచ్చినంత ఇస్తున్నారా? ఇంటింటికి మంచినీటి సరఫరా చేస్తున్నారా? తెలంగాణలో రైతుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం సేకరించినట్లు ఎక్కడైనా సేకరిస్తున్నారా? చెప్పుకోవడానికి ఒక్క మంచి పని కూడా లేని బిజేపి కోతలు కోయడం, ఆశల పల్లకిలో ఊరేగడం అలవాటు చేసుకున్నది. , ప్రజలను మాయ చేసి, మతాన్నిఅడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తామని చూస్తే తెలంగాణ ప్రజలు ఎంతో విజ్ఞలు. ఇతర పార్టీలలో నుంచి నాయకులను తెచ్చుకొని అద్దె నాయకులను చూసుకొని మురిసిపోతూ, మిడిసిపాటు ప్రదర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో దిక్కూ దివానం లేకుండా పోతారు. అసలు ఆ పార్టీకి రాష్ట్రంలో పోటీ చేయడానికి అవసరమైన స్ధానాలలో అభ్యర్థులే లేరు. కాని పోటీకి ఎగబడుతున్నారంటూ లేని గొప్పలు చెప్పుకుంటే అవి తాటాకు చప్పుళ్లే అవుతాయి, తప్ప నిజాలు కావు. ఇప్పటికైనా తెలంగాణ ప్రగతిని చూసి కళ్లు తెరవండి. అంతే కాని మంత్రి కేటిఆర్‌ను విమర్శిస్తే పెద్దవాళ్లు కాలేరు. ప్రజలు వారిని నమ్మరు. రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో దూసుకుపోయేలా చేయడంలో కేటిఆర్ పాత్ర చాలా గొప్పది. మున్సిపల్ మంత్రిగా పట్ణణాల రూపురేఖలు మార్చిన ఘనత కూడా కేటిఆర్‌ది. అలాంటి నాయకుడిపై ప్రతిపక్షాలు పేలే ప్రేళాపనలు ప్రజలు నమ్మరు. వారిని ఆదరించరు. వారికి స్ధానమివ్వరు. అసందర్భ ప్రేళాలపను ప్రజలు ఆహ్వానించరు. బిజేపిని ప్రజలు అసలు లెక్కలోకే తీసుకోరు. ఇది ముమ్మాటికీ నిజం…! బిజేపి నేతలు చెప్పే మాటలన్నీ అబద్దం!!