నో ఫైర్‌ సేఫ్టీ!?

దొరలెవరు? దొంగలెవరు?

ఎలాంటి సర్టిఫికేషన్‌ లేని ఆసుపత్రులు, విద్యా సంస్థలు!

సర్టిఫికెట్లు ఇవ్వలేదని అధికారులు?

ఉన్నట్లు నమ్మిస్తున్న ఆసుపత్రులు, విద్యా సంస్థలు?

ఆన్‌ లైన్‌ అప్లికేషన్లు, భోగస్‌ సర్టిఫికెట్లు?

రోహిణిలో ఫైర్‌ ఆక్సిడెంట్‌ మర్చిపోయారా?

కళ్యాణ లక్ష్మి షాపింగ్‌ మాల్‌ కథ కంచికేనా?

ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా?

ప్రమాణాలు గాలికొదిలి, ప్రాణాలు పోగొడతారా?

ఆసుపత్రులా, నరకానికి తెరిచిన ద్వారాలా?

విద్యా సంస్థల్లో పిల్లల ప్రాణాలకు భరోసా ఎలా?

వ్యాపారం తప్ప, ప్రాణాలకు విలువే లేదా?

భయం లేని తనంతో ఇరుకు భవనాలలో ఆసుపత్రులు?

ఏ ఒక్క ఆసుపత్రి సేఫ్టీగా లేదు?

విద్యా సంస్థల్లో సౌకర్యాలు లేవు?

అంతా గోల్‌ మాల్‌ గోవిందం?

ప్రజల ప్రాణాలతో చెలగాటం?

వెలుగు చూస్తున్న భయంకరమైన నిజాలు?

పట్టింపు లేని అధికారులు?

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రులకు వెళ్తున్నారా? ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆలోచనతో నరక కూపాలకు దారులు వెతుక్కుకుంటున్నారా? పెద్దాసుపత్రులు ఎన్ని పైసలు ఖర్చైనా సరే అనుకుంటున్నారా? పైపైన మెరుగులు చూసి మోసపోతున్నారా? ఆసుపత్రి చూస్తే ఎంతో పెద్దదిగా వుందని భ్రపడుతున్నారా? భరోసా మీద లెక్కలేసుకుంటున్నారా? ఒక్క క్షణం ఆగండి! అవి ఆసుత్రులు కాదు…నరకానికి నకళ్లు…నరకలోకానికి దారులు…! ద్వారాలు తెరిచిన వైకుంఠదామాలు? బతికుండానే చితిమంటలు పేర్చే స్మశానాలు…అదృష్టం బాగుండి…వైద్యం కోసం వెళ్లినా, ప్రాణం నయమైనా, భూమ్మీద నూకలు బాగుంటే గాని, క్షేమంగా ఇల్లు చేరలేరు? అయినవాళ్లను కళ్లారా చూసుకోలేరు.. ఏ మాత్రం కిందమీదైనా మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రాణాలతో చూసుకోలేరు…అంతా బాగుందనుకున్న సమయంలోకూడా అంతా బూడిదైపోవచ్చు…ఇది కథ కాదు…ఆసుత్రుల్లో జరిగుతున్న అగ్ని ప్రమాదాల పరిణామాలు…బతికుండగానే నిప్పుల పాలై, అరుపులు, ఆర్ధనాదాలు పెట్టుకుంటుంటే ప్రాణాలు పోతుంటే సజీవ సాక్ష్యాలుగా, బూడిద రూపాలుగా మారిన బతుకులెన్నో…వున్నాయి..? ఇవి ఆసుత్రుల సంగతి….

ఇక బడుల సంగతి మరీ ఘోరం….

పిల్లల భవిష్యత్తు మీద గంపెడాశలతో, మార్కెట్లో ప్రచార పటాటోపాన్ని చూసి, వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్లలో చేర్పిస్తున్నారా? లక్షల రూపాయలు పోయినా ఫరవాలేదు…పాఠాల గురించి ఆలోచిస్తున్నారే గాని, మీ పిల్లల ప్రాణాల గురించి ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా? ఆ బడులు ఎంత వరకు సేప్టీ అన్నవి తెలుసుకుంటున్నారా? అడ్మిషన్ల కోసం వెళ్లినప్పుడు ఫీజులు గురించి అడిగి తెలుసుకుంటున్నారే గాని, మా పిల్లల్ని చేర్పిస్తే, ఎంత వరకు బడి సురక్షితమని, తమ పిల్లలు క్షేమమని తెలుసుకుంటున్నారా? గొర్రెలు దూరినట్లు దూరి, లక్షలు లక్షలు చెల్లించి పిల్లల ప్రాణాలపై ఆశలు వదులుకుంటున్నారా? ఎంత సేపు ర్యాంకెంత? వారి చదువెంత? భవిష్యత్తులో అమెరికా దూరమెంత? అందుకు అయ్యే ఖర్చెంత? అంటూ లెక్కలేసుకుంటున్నారే గాని, బడి బాగుందా? బడి నిర్మాణం నాణ్యతా ప్రమాణాలున్నాయా? అన్న కనీస అవగాహన తల్లిదండ్రులకు వుంటుందా? ఇవేవీ మనకే పట్టడం లేదు? ఇక యాజమాన్యాలకేం పడుతుంది? వారికి భయమేముంటుంది? అధికారులకెలా పడుతుంది? పుట్టగొడుగుల్లా…పిట్ట గూడుల్లా…గాలి కూడా సరిగ్గా దూరని గదులతో, అంతస్థుల మీద అంతస్ధులుగా కట్టిన బడిలో చదివిస్తున్నారు..చదవు కొంటున్నారు…ప్రమాదాలు జరిగినప్పుడు కడుపుకోతలు మిగిల్చుకుంటున్నారు…జీవితాంతం జీవచ్చవాలుగా బతుకుతున్నారు…

   మరి షాపింగు మాల్స్‌…పండగలు…పబ్బాలు…శుభ కార్యాలు…

కొద్ది రోజుల్లో ఇంటి నిండా ఆనందాలు…సంతోషాలు…బంధువులు..కొత్త బంధుత్వాలు…పెళ్లిళ్లు…పేరంటాలు…పుట్టిన రోజులు ఇలా వేడుకల కోసం కొత్త బట్టలు, ఇతర సామాన్లు కొనుగోలు కోసం షాపింగులకు మాల్స్‌కు వెళ్తున్నారు…? కాని అడుగు వేసేప్పుడు తొలి మెట్టులోనే ధరలు తక్కువట? అని ముచ్చట్లు పెట్టుకుంటామే గాని, అడుగు లోపల పెట్టినంత సులువుగా బైట పడతున్నారా? అన్నది ఆలోంచికుంటున్నారా? లేదు…అందరూ వెళ్తున్నారు…మేం వెళ్తున్నాం…ఇంతే…మనలో చాలా మంది ఆలోచన అంతే…అంత దూరం వరకే….? ఎవరు మారాలి? ఎవరు మార్చాలి? ఎవరిది తప్పు? ఎవరిది లోపం? ఎవరిది పాపం? ఎవరిది నేరం? రా…రామ్మంటూ అందమైన లోకం కనిపించినంత అందంగా భవనం వుంటే చాలా? దానిలో సౌకర్యాల కల్పనతోపాటు, ప్రమాదాలు జరక్కుండా ప్రమాణాలున్నాయా? ఇది ఎవరు తెలుసుకోవాలి? జనమా? ప్రభుత్వమా? ఇవేవీ ఆయా శాఖలకు పట్టవా? జనం చచ్చిపోతున్నా…కదలరా? 

  అధికారులు ఏం చేస్తున్నారు? భవనాల నిర్మాణం దగ్గర నుంచే నిర్లక్ష్యం?

 ఏ భవనం ఎలాంటి అవసరాలకు ఉపయోగించాలో కూడా తెలుసుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తించకుండా పర్మిషన్లు ఇవ్వడం? చేతులు తడుపుకోవడం…ఆపై దులుపుకోవడం? ఇదేనా బాధ్యత కల్గిన అధికారులు చేయాల్సింది? రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్ధితి. ముఖ్యంగా హన్మకొండ, వరంగల్‌ జిల్లాల సంగతే చూస్తే, తాజాగా విచిత్రమైన సందర్భం కనిపిస్తోంది. గతంలో హన్మకొండ బస్టాండ్‌ పరిసరాల్లో కనిపించే లాడ్డింగ్‌లన్నీ ఆసుపత్రులైపోయాయి? అసలు ఒక ఆసుపత్రి ఏర్పాటుకు ఎన్ని రకాల నియామాలు అమలు చేయాలన్నదానిపై కూడా ఎవరికీ అవసరంలేదు. ఎంతో కాలం దూరం వెళ్లాల్సిన పనిలేదు. ఆ మధ్య రోహిణీ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలు మన కళ్లముందే వున్నాయి. అయినా ఏ ఒక్క అధికారి కదిలింది లేదు. ఆసుపత్రులు సందర్శించింది లేదు. వాటిని మూసేసింది లేదు…మరి అవి ఎలా నడుస్తున్నాయి? ఇరుకైన స్థలాలు…ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగడానికి కూడా అవకాశం లేని బిల్డింగుల్లో పెద్ద పెద్ద ఆసుపత్రుల నిర్వహణ జరగడం జనాలకు ప్రాణగండం కాదా? ఎంతో పేరున్న ఆసుపత్రి అని కలరింగులిచ్చుకునే రోహిణీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగితే ఎంత పెద్ద నష్టం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఆరోగ్యం బాగు చేసుకుందామని వచ్చి రోహిణీలోచేరి, వేలాది రూపాయలు ఖర్చు చేసుకొని అగ్నిప్రమాదం మూలంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు? మరి అలాంటి ఆసుపత్రి మీద తీసుకున్న చర్యలేమిటో ఇప్పటి వరకు తెలియదు? జిల్లా వైద్యశాఖ ఉన్నతాధికారి ఏం చేశాడో తెలియదు? ఏం రిపోర్టు ప్రభుత్వానికి అందించాడన్నది ఎవరకీ తెలియదు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు బాదితుల పక్షాన నిలవాల్సిన అధికారి ఎందుకు చర్యలు తీసుకోలేదన్నదానిపై ప్రశ్నించిన ప్రభుత్వ పెద్దలు లేరు? ఆ అధికారిపై చర్యలు లేవు? కాని ఆ అధికారి ఇచ్చిన రిపోర్టు మూలంగా మళ్లీ ఆసుపత్రికి అనుమతి ఎవరిచ్చారన్నది తెలియదు? ప్రజలకు ఏమీ తెలియదు? ప్రభుత్వానికి ఏమీ తెలియదు? కాని ఆసుపత్రి నడుస్తుందన్నది అందరికీ తెలుసు. ప్రజలు ప్రాణాలు అగ్ని ఆహుతి అయ్యాయని తెలుసు. మొత్తం మీద ఆసుపత్రి వర్గాలు పెద్దలను ప్రసన్నం చేసుకున్నారన్నది తెలుసు….

   మాకేం తెలియదు…అంటూ చేతులు దులుపుకోవడం మాత్రమే తెలిసిన ఫైర్‌ డిపార్టు మెంటు ఏం చేస్తోంది? 

ఎలా సర్టిఫికెట్లు జారీ చేస్తోందని నేటిధాత్రి ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వరంగల్‌ లాంటి నగరాల్లో మున్సిపల్‌ ఫైర్‌ విభాగం, జిల్లా ఫైర్‌ విభాగమంటూ విడదీసి చోద్యం చూస్తున్నారు…ఏదైనా ఘటన జరిగితే మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్నారు…? నెల నెల ఆసుపత్రుల నుంచి మమాళ్లు తీసుకుంటున్నారు? చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదిలా వుంటే హన్మకొండ, వరంగల్‌ జిల్లాల్లో వున్న ఆసుపత్రుల నిర్వాహాకులు ప్రభుత్వ అధికారుల సంతకాలు, స్టాంపులు కూడా తయారు చేసుకొని, ఏకంగా సర్టిఫికెట్లు కూడా తయారు చేసుకొని, ఆన్‌లైన్‌ సర్టిఫికెట్లు పొందుతున్నట్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలా సర్టిఫికెట్లు తయారౌతున్నాయన్న సంగతి ఫైర్‌ డిపార్టుమెంటుకూ తెలుసు….కాని కదిలేవారేరీ…పట్టుకునేవారేరీ…కేసులు నమోదు చేసేవారేరీ? అందరూ అందరే…నెల నెల తమకు అందాల్సినవి అందుతున్నాయా? లేదా అన్నది అధికారులు చూసుకుంటున్నారు? మా జోలికి రాకుండా వుంటున్నారని ఆసుపత్రి వర్గాలు చెల్లింపులు చేసి చేతులు దులుపుకుంటున్నారు? ప్రమాదాలు జరిగినప్పుడు చూసుకుందామన్న నిర్లక్ష్యంగ వ్యవహరిస్తున్నారు? రోహిణీ లాంటి అంత పెద్ద ప్రమాదం జరిగితే ఏం జరిగింది? మనకేం జరుగుతుందన్న నమ్మకంతో ప్రజల ప్రాణాలతో చెలగామాడుతున్నారు…అలాంటి ఆసుపత్రులు…విద్యా సంస్ధలు…షాపింగ్‌ మాల్స్‌…ఆయా శాఖల పనితీరు….అధికారుల అలసత్వాలు…నిర్లక్ష్యాలపై మీ నేటిధాత్రిలో త్వరలో వరస కథనాలు…భయంకరమైన నిజాలు…అరచేతిలో ప్రజలు ప్రాణాలు….కాసుల కక్కుర్తిలో అధికారులు…వారి బాగోతమంతా ఇక వరుసగా….!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!