`నాయకులా నీతులు చెప్పేది?
`మీరా ఓటర్లను నిందించేది?
`ప్రజలపై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోండి?
`మీరు గెలవడం కోసం నోట్లు పంచడం నేర్చుకున్నారు?
`కోట్లకు కోట్లు అవినీతి సంపాదనకు ఎగబడ్డారు?
`కార్యకర్త నుంచి నాయకుడి దాకా ప్రచారానికి పైస లెకుండా కదలరు?
`ప్రజలు పనులొదిలి పెట్టుకొని మీ సభలకు రావాలా?
`రాజకీయాలను ఏనాడో భ్రష్టు పట్టించారు?
`డబ్బులివ్వందే ఓటు వేయడం లేదని నిందలేస్తారా?
`ఎన్టీఆర్ కాలం దాకా లేని పైసల రాజకీయాలు, ఇప్పుడెందుకు ఇష్టారాజ్యమయ్యాయి?
`గెలుపు గుర్రాలే ఎందుకు అవసరమౌతున్నాయి?
`ఎన్నికల ముందు నాయకులతో తిరిగిన మిగతా నాయకులు ఎందుకు దూరమౌతున్నారు?
`ప్రచారానికి వచ్చే నాయకులకు సకల సౌకర్యాలు లేకపోతే వస్తారా?
`రాజకీయాలను వ్యాపారం చేసి, ప్రజలను వంచిస్తోంది పార్టీలు కాదా?
`అన్ని పార్టీలు ఆ తాను ముక్కలే?
`జనం ఎప్పుడూ అమాయకులే!
`కోట్లు కొల్లగొట్టి, లక్షలు ఖర్చుపెట్టి జనం మీద నాట్యం చేస్తున్నవారే?
`జనాన్ని నిందించడమంటే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమే!
హైదరాబాద్,నేటిధాత్రి:
ప్రతి వాడు ప్రజలను నిందించేవాడే…ప్రతి వాడు నీతులు చెప్పేవాడే… ప్రతి వాడు ప్రజలను తప్పు పట్టేవాడే…ప్రతి వాడు తామేదో ప్రజలను ఉద్దరిస్తున్నట్లు చెప్పేవాడే…అక్కడికేదో ప్రజలకు ఏమీ తెలియదనన్నట్లు, అంతా వాళ్లకే తెలిసినట్లు, అందుకే నాయకులైనట్లు వాళ్లను గొప్పగా ఊహించుకుంటారు. నాయకుల అవతారమెత్తి పాలించే హక్కు మాకుందని చెప్పుకుంటున్నారు. నాయకులుగా చెలామణి అవుతున్నారు. ప్రజలనే నిందించే స్ధాయికి చేరుకున్నారు. అదేం దౌర్భాగ్యమో వాళ్లే ప్రజా ప్రతినిధులౌతున్నారు. ప్రజల నెత్తిన తాండవం చేస్తున్నారు. దేశమంతా నేతలంతా ఇలాగే వున్నారు…ప్రజలకు తాము లేకుంటే ఏమౌతారని మొసలి కన్నీరు కారుస్తుంటారు. పెత్తనం చేసేందుకే మేమంతా వున్నదని నిరూపిస్తున్నారు. ప్రజలు మారాలి…అంటూ సోది చెప్పడం అలవాటు చేసుకుంటున్నారు. నాయకులు మారాలా? ప్రజలే మారాలా? నోరుంది కదా? ఏది పడితే అది చెప్పడం అలవాటు చేసుకున్నారు. మీడియా కూడా ప్రజలను కాకుండా, తమనే చూపిస్తుంది కదా? అని ప్రజలను పలుచన చేయడం నాయకులు అలవాటు చేసుకున్నారు. వారికి నీతిభోధలు నేర్పడం అలవాటు చేసుకుంటున్నారు. ప్రజలు ఓట్లనాడు నోటు కోసం ఎదురుచూస్తున్నారంతగా చిన్నగా మాట్లాడడం మొదలుపెడతున్నారు. ప్రజలనే కించపరుస్తున్నారు. ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని మాట్లాడండి? ప్రజలు ఏనాడైనా మాకు ఇది కావాలని కోరారా? నోటిస్తేనే ఓట్లేస్తామన్నారా? వారికి లేని ఆలోచనలను సృష్టించింది నాయకులు. వారు వద్దని వారించినా వద్దంటే నామీదొట్టే అంటూ జనాన్ని మభ్యపెట్టి నోటు చేతిలో పెట్టింది నాయకులు. అవ్వా, అయ్యా, పెద్దయ్య, చిన్నయ్య, అక్కా చెల్లి, అన్నా, తమ్మీ అంటూ వరసల కలిపి, దేవుళ్లుగా కొలిచి వారిని బుట్టలో వేసుకొని,ఓట్లు దండుకోవడం అలవాటు చేసుకున్నది నాయకులు. ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకున్నది నాయకులు. ఆ తర్వాత మెల్లిగా మద్యం అలవాటు చేసి, ఎన్నికల సమయంలో మద్యం సరఫరా చేసి, ఓట్లనాడు ఓటు ఎటుపోతుందో అన్న అనుమానంతో నోటు జేబులో పెట్టడం అలవాటు చేసుకున్నది నాయకులు. కాని ఇప్పుడు ఆ నెపం జనం మీద తోసేస్తున్నారు…రూపాయి ఇవ్వందే జనం కదలడం లేదని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎప్పుడు కోరుకున్నా అది సమాజం శ్రేయస్సు కోసమే…
ప్రగతి కావాలని కోరుకుంటారు…అభివృద్ధి జరగాలని ఆశిస్తారు. పేదరికం లేని సమాజం నిర్మాణం కావాలంటారు. ఉపాధి చూపించమంటారు. పేదలకు కనీస సౌకర్యాల కల్పన కావాలంటారు. కూడు, గుడ్డ, గూడు సమకూర్చాలంటారు. ఆరోగ్యం కోసం వైద్యం కావాలంటారు. ఇవి ప్రజలకు కల్పించడం ప్రభుత్వాల ప్రధమ కర్తవ్యం. ఎన్నికల ముందు అమలు చేయలేని వాగ్ధానాల్విడం, ముందు ఓట్లు వేయించుకునేందుకు నోట్లివ్వడం, తర్వాత మర్చిపోవడం అలవాటు చేసుకున్నారు. అభివృద్ధిని ప్రశ్నించిన ప్రజలను నిందించడం నేర్చుకున్నారు. ఓట్లు ఊరికే వేశారా? అంటూ ఎదరు ప్రశ్నించడం నేర్చుకున్నారు. అదే గొప్ప తెలిగా భావిస్తున్నారు. ఇదేం ప్రజాస్వామ్య సూర్తి…మీరేం తక్కువ నాయకులరా? ప్రజలు ఏదైనా పని కోసం వస్తే ఊరికే చేసిపెడుతున్నారా? ఒక్కరైనా గుండెమీద చేయి వేసుకొని మేము రూపాయి అవినీతి చేయకుండా వుంటున్నామని చెప్పగలిగే నాయకులు ఏ పార్టీలోనైనా వున్నారా? సంతకానికి రూపాయి వసూలు చేయడం ఎక్కడైనా మానుకున్నారా? పనుల కోసం వస్తే ఓ రేటు…పైరవీల కోసం వస్తే ఓ రేటు అంటూ ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసుకొని ప్రజా సేవ ముసుగేసుకున్న నాయకులు ముందు మరాలి. తామున్నది ప్రజా సేవ పేరుతో రాజకీయం చేస్తూ, పదవులు అనుభవిస్తూ, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవం కాదు? నికార్సనైన సేవ చేసే నాయకులు ఏ పార్టీలోనైనా ఈరోజుల్లో కనిపిస్తారా? ఒక్కసారి మునుగోడు రాజకీయమే చూసుకుందాం…
తాను రాజీనామా చేస్తే మునుగోడుకు మేలు జరుతుంది. మునుగోడు అభివృద్ధి జరుగుతుంది. అంటూ ప్రజల కోసం, కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఇది మునుగోడులో రాజీనామాకు ముందు కోమటిరెడ్డి తిరకాసు తొలి వ్యాఖ్య? అమిత్షా ను పిలిచి మునుగోడులో సభ ఏర్పాటు చేసి, బిజేపిలో చేరిన సందర్భంలో ఇదే రాజగోపాల్ చెప్పిన మరో మాట…నాలుక మడతెట్టిన తీరు చూడలేదా? అమిత్షా రాజీనామా చేయమంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాజీనామా ప్రకటించానన్నారు. ఇందులో ఏది సత్యం…ఏదసత్యం!
నాయకులు నోరు తెరిస్తేనే అబద్దం…మాట మాట్లాడితే అసత్యం…నిలబడితే స్వార్ధం…అడుగేస్తే అన్యాయం…ఇంతకన్నా చెప్పుకోవడానికి నాయకుల తీరులో, వ్యవహారంలో కొత్తమీ లేదు. ఇలాంటి నాయకులు రాజకీయాల్లో నిండిపోయి, అవినీతి, ఆశ్రిత పక్షపాతంలో కూరుకుపోయి, అక్రమ సంపాదనకు అలవాటు పడి ప్రజలు మారాలా? డబ్బుకు ప్రజలు అమ్ముడుపోతున్నారా? మద్యం ఇస్తేగాని మాట వినడం లేదా? చెప్పడానికి కనీసం సిగ్గనిపించాలి. ఐదేళ్ల నాడు ఇచ్చే ఐదు వందల రూపాయలతో ప్రజలు ఐదేళ్లు బతుకున్నారా? మీరు జాలిపడి ఎన్నికల నాడు నోటు ప్రజలచేతికిస్తున్నారా? నాయకులు సిగ్గు శరం పూర్తిగా వదిలేశారు…నిజాలు చెప్పడం ఏనాడో మానేశారు…కనీసం చెప్పే అబద్దమైన కాండ్రిరచి మీద ఉమ్మేస్తుందేమో! అన్న భయం లేకుండా నోరుంది కదా? అని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అందుకే నిస్సిగ్గుగా తమకు తాము గురివింద సామెతను నిజం చేస్తున్నారు. ప్రజలను మభ్యపెడతారు…నాయకులౌతారు.
పార్టీలో క్రియాశీలమౌతారు…అప్పుడు పైలా పచ్చీసు ఆట మొదలుపెడతారు? పార్టీ కార్యక్రమాలకు సొంత నిధులు ఖర్చు చేస్తారా? లేదు. అందుకు అవసరమైన నిధులు సేకరిస్తారు. ఏదైనా సభ నిర్వహణ అంటే చేతిలోనుంచి పెట్టుకుంటారా? లేదు. మళ్లీ వ్యాపారుల మీద పడతారు…అందులో నుంచి సభలకు వచ్చే ప్రజలకు నగదిస్తారు? ప్రజలు పనులు వదులుకొని వచ్చినందుకు వారికి గిట్టుబాటు కావొద్దా? కడుపు వుండేది నాయకులకేనా? ప్రజలకు కాదా? సభలేమో! ప్రచారాలేమో!! కాని ప్రజలు ఎండల్లో రావాలి. ఎండలో నిలబడాలి. నాయకులు చెప్పే సొల్లు వినాలి. ఇదంతా పుణ్యానికి రావాలి. మరి అదే నాయకులు ఎక్కడైనా ప్రచారానికి వెళ్తే ఊరికే వెళ్తారా? అక్కడి నాయకులను పీడిరచుకొని తినరా? సౌకర్యాల ఏర్పాట్లలో చుక్కలు చూపించరా? ప్రచారం పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణంలో సంచులు నింపుకొని రారా? మరి మీరైతే సంచులకు సంచులకు తెచ్చుకోవచ్చు? కాని ప్రజలను మారమంటారు? ఇదేం న్యాయం…!ఇంకా పెద్ద నాయకుల తీరు చెప్పుకుంటే అబ్బో ఆ చరిత్రలే వేరు…పెద్ద నాయకులకు కదలాలంటే లక్షలు కావాల్సిందే…అద్దాల హోటళ్లలో మకాం ఏర్పాటు చేయాల్సిందే…వారు అడిగినన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిందే…! ఎక్కడ తేడా వచ్చినా, ఆగమాగం చేయాల్సిందే…ఎవరినైతే గెలిపించాలని వచ్చారో…వారిని ఓడిరచేందుకు కూడా వెనకాడని రాజకీయాలు చేయాలి…ఇంత దుర్మార్గమైన నాయకత్వాలు కూడా దేశంలో కనిపిస్తున్నాయి. కాని వీళ్లు నీతులు చెబుతారు. ప్రజలు మారమంటారు…ప్రజలకు వాతలు పెడతారు? పన్నుల మీద పన్నులేసి ముక్కు పిండి వసూలు చేస్తారు..ధరలు పెంచుతారు…అన్నీ వడ్డిస్తారు…ప్రజల కోసమే ఇవన్నీ చేస్తున్నామంటారు…? కాలం మారింది. పార్టీలు మారుతున్నాయి? నాయకులు మారుతున్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు ఎలా మభ్యపెట్టాలో నేర్చుకొని, కొత్త తరం రాజకీయాలు ఇవే అంటూ రుచి చూపిస్తున్నారు…అందరూ అందరే…అందుకు ఏ పార్టీ మినహాయింపు కాదే!! ఏ నాయకుడు సుద్దపూస కాడులే!!!