నేతల అక్రమ దందాల కోసమేనా గన్‌మెన్లు నేతల ముసుగు వ్యాపారులు…అండగా గన్‌ మెన్లు?

 

`ప్రభుత్వం బద్నాం తప్ప ప్రయోజనం లేదు.

`కొందరు నాయకులు ప్రజల్లో వున్నది లేదు…ప్రజాసేవ చేస్తున్నది లేదు…

`పార్టీ కోసం పని చేస్తున్నది అంతకన్నా లేదు…

`పార్టీని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు మాత్రం బాగానే చేసుకుంటున్నారు.

`గన్‌ మెన్లతో ప్రజలను బాగానే బెదిరిస్తున్నారు.

`బాధితులు దగ్గరకు రాకుండా గన్‌ మెన్ల సహకారంతో కాలం గడిపేస్తున్నారు.

`వ్యాపారాల పేరిట ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నారు.

`వీళ్ల వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదు…చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడంలో ఆరితేరిపోయారు.

`ప్రజల్లో పరపతి కోసం పాకులాడడం తప్ప, పార్టీకి చేస్తున్న మేలేమీ లేదు.

`ఆధిపత్య రాజకీయాలతో పార్టీకి మరింత నష్టం చేస్తున్నారు.

`ఎవరికి వారే గొప్పలకు పోతున్నారు.

` కార్యకర్తలకు పనికొచ్చింది లేదు…పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నది లేదు….

`పార్టీ పనులకు ముందట పడుతున్నది లేదు…

`పదవులు అనగానే ముందుంటారు….పని చేయమంటే వెనకుంటారు…

` ప్రధాన నాయకులు వస్తున్నప్పుడే హడావుడి చేస్తారు…

`గన్‌ మెన్లు వుంటే తప్ప గడపదాటరు…

`గత కాలం కాదు…ఇప్పటి చోటా నాయకులకు వచ్చిన ఇబ్బందేమీ లేదు…

` గతంలో నక్సలైట్ల నుంచి రక్షణ కోసం ఇచ్చేవారు…

`ఇప్పుడు గన్‌ మెన్ల అవసరం ఎందుకో స్పష్టత లేదు.

`చిట్‌ ఫండ్ల వ్యాపారులకు, రియలెస్టేట్‌ వ్యాపారులకూ గన్‌ మెన్లు…

` ప్రత్యర్థులను బెదరించేందుకు ఉపయోగపడుతున్నారు…

` సెటిల్మెంట్లలో నేతలకు రక్షణగా వుంటున్నారు.

` గన్‌ మెన్ల వ్యవస్థ దుర్వినియోగానికి కారణమౌతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

నాయకులంటే ఓ నాలుగు కార్లు, నలభై మంది అనుచరులు, ఓ నలుగురు గన్‌మెన్లు అబ్బో ఆ సెటప్పే వేరు. ఎంత హోదా? ఎంత దర్పం…నాయకుడు కాలు బైట పెడుతుంటే చాలు ఆ హడావుడే వేరు…ఇంట్లోనుంచి భయలుదేరుతున్నప్పటి నుంచి మళ్లీ నాయకుడు ఇంటికి చేరుకునేదాకా ఆ హంగూ ఆర్భాటం వుంటే తేప్ప నాయకులమన్న భావన వారిలోనే వుండడం లేదు. అందుకే ఎలాగైనా అధికార పార్టీలో చేరాలి. తమ గురించి తాము చెప్పుకోవాలి. పార్టీకి ఇంత చేస్తా…అంత చేస్తా అని చెప్పాలి. పరపతి పెంచుకోవాలి. ప్లెక్సీలు కట్టాలి… పార్టీ పరమైన కార్యక్రమాలలో విసృతంగా పాల్గొంటున్నట్లు నటించాలి. గతంలో తన హోదాను పదే పదే గుర్తు చేయాలి. రాజకీయాలలో వున్నంత కాలం గన్‌మెన్లను కొనసాగించుకోవాలి. వారు ఆ నాయకుడికి రక్షణగా వుండాలి. ఇది నాయకులకు ఫ్యాషన్‌ అయిపోయింది. ఒకప్పుడు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్లు కూడా గన్‌మెన్లు వద్దనుకునేవారు. ముఖ్యంగా గుమ్మడి నర్సయ్య , సున్నం రాజయ్య లాంటి నాయకులు గన్‌మెన్లు లేకుండానే ప్రజల్లో తిరిగేవారు. ఒకప్పటి సిపిఐ, సిపిఎం. రాష్ట్ర స్ధాయి నాయకులు కూడా గన్‌మెన్లు లేకుండానే ప్రజల్లో తిరిగేవారు. కాలం మారింది. చిన్న చిన్న నేతలు కూడా గన్‌మెన్లను ఏర్పాటు చేసుకునే రాజకీయ సంస్కృతి పెరుగుతోంది. ఒకరిని చూసి ఒకరు…నాకేం తక్వువ అనుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో గన్‌మెన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. దర్పం వెలగబెడుతున్నారు. ప్రభుత్వం ఇద్దరు గన్‌మెన్లను ఏర్పాటు చేస్తే, అదే తరహాలో మరో నలుగురు ప్రైవేటు వ్యక్తులను సెక్యూరిటీగా ఏర్పాటు చేసుకుంటున్నారు. వారు కూడా గన్‌మెన్లేనేమో అన్న భ్రమ కల్పిస్తున్నారు. ఇలాంటి నాయకులు తెలంగాణలో వందల్లో వున్నారు. 

 ఒకప్పుడు తెలంగాణలో గన్‌మెన్లు కావాలని నాయకులు వేడుకున్నా అప్పటి పాలకులు ఇచ్చేవారు కాదు.

 అప్పట్లో నక్సలైట్లతో అడుగడునా సమస్యే వుండేది. ఎక్కడినుంచి ఎలా దాడి చేస్తారో అన్న భయం నాయకుల్లో వుండేది. అయినా ఎమ్మెల్యేలకు, ఆ స్ధాయి నాయకులకే గన్‌మెన్లు వుండేవారు. అంతకన్నా తక్కువ స్ధాయి నాయకులకు గన్‌మెన్లను ఇవ్వకపోయేవారు. అలా నష్టపోయిన నాయకులు కూడా వున్నారు. మరి ఇప్పుడు పెద్ద నాయకులు అంటే వేరు..కాని చిన్న చిన్న నాయకులకు గన్‌మెన్లు ఎందుకు అవసరపడుతున్నారన్నదానిపై ఎవరూ దృష్టిపెట్టడం లేదు. గతంలో లాగా నక్సలైట్ల బెడద లేదు. మరే రకమైన ఇబ్బందులు లేవు. ఏవైనా వుంటే వ్యక్తిగత ఇబ్బందులు, వ్యాపారాల సమస్యలు మాత్రమే వున్నాయి. రాజకీయంగా అసలు నాయకులకు ఇబ్బందులు లేవు. ప్రతిపక్షాల పాత్ర లేదు. వారి ఊసు లేదు. వారికి బలం లేదు. ఆయా పార్టీలు పెరుగుతాయన్న నమ్మకం లేదు. మరి గన్‌మెన్లు నాయకులకు ఎందుకు అవసరమౌతున్నారు. 

 ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఓ నాయకుడికి ప్రభుత్వం గన్‌మెన్లను ఉపసంహరించింది.

దాంతో ఆ నాయకుడి వద్ద పనిచేసిన గన్‌మెన్లు కంట తడిపెట్టుకున్నారు. వారిని ఆ నాయకుడు ఓదార్చడం అన్నది పెద్ద సంచనలంగా మారింది. అసలు గన్‌మెన్లు ప్రభుత్వ ఉద్యోగులు. వారు ఎవరి వద్ద డ్యూటీవేస్తే వారికి రక్షణ కల్పించాలి. అంతే కాని నాయకుడికి గన్‌మెన్లను తొలగిస్తే, ఆ గన్‌మెన్లు ఏడ్చేంత పరిస్ధితి ఎందుకొస్తుంది. నాయకుడిమీద వారికి గౌరవం వుండొచ్చు. అలాంటప్పుడు ఉద్యోగం వదిలి ఆయనకు అనుచరులు చేరాలి. అంతే కాని ఇలా పోలీసు వ్యవస్ధను భ్రష్టు పట్టించకూడదు. ఇదిలా వుంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా గన్‌మెన్‌ వ్యవస్ధను వినియోగించుకొని నాయకులు చేస్తున్న ప్రజా సేవ కన్నా, వ్యాపారాలే ఎక్కువ. గతంలో నాయకుడంటే పూర్తి స్ధాయిలో నాయకత్వమే వుండేది. కాని ఇప్పుడు నాయకుడు ఖచ్చితంగా ఏదో ఒక వ్యాపారం చేయాలి. రియలెస్టేట్‌ రంగంలో ఆరి తేరాలి. ఇతర వ్యాపారాల వ్యాపకాలు వుండాలి. అప్పుడే ఆ నాయకుడికి పరపతి అన్నంతగా మారిపోయింది. చిన్న చిన్న నాయకుడు కూడా రాజకీయల్లో వుండాలన్నా, పదవుల పందేరలంలో ముందు వరసలో నిలబడలన్నా, తూకలంలో పదవులు కొనుక్కొవాలన్నా అంగబలం, ఆర్ధబలం ఎంతో అవసరం. ఇదే ఇప్పటి నాయకుల్లో వుండాల్సిన అసలైన క్వాలిటీ…కాని కొందరు నాయకులు అటు ప్రజలకు దగ్గరగా వుంటున్నది లేదు. ప్రజా సేవ చేస్తున్నది లేదు. పార్టీల కోసం పనిచేస్తున్నది లేదు. పార్టీల బలం పెంచేందుకు దోహదపడుతున్నది లేదు. కాని పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు హంగూ, ఆర్భాటం కావాలి. ముందూ వెనక మందీ మార్భలం కావాలి. అందులో నలుగురు గన్‌మెన్లు వుండాలి. ఇదంతా ప్రజా సేవ కోసం అనుకునేరు! కాదు…వ్యాపారం కోసం…వ్యాపారంలో నెంబర్‌ వన్‌ కావడం కోసం..వ్యాపారంలో పోటీ లేకుండా చూసుకోవడం కోసం… అవసరమైతే మోసం చేయడం కోసం… తనకు ఎవరూ ఎదురు తిరగకుండా వుండడం కోసం…

ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా వుంటున్నట్లు నటించే చాలా మంది నాయకులు రియలెస్టేట్‌లతోపాటు, చిట్‌ఫండ్‌ వ్యాపారాలు బాగా సాగిస్తున్నవారే వున్నారు. 

వారికి ప్రజల నుంచే తిరుగుబాటు ఎదురౌతున్న సందర్భాలుంటున్నాయి. అందువల్ల వారిని నుంచి తప్పించుకోవడం కోసం, ప్రజలు వారి దరి చేరకుండా వుండడం కోసం, ప్రజలు ఆ నాయకుల వద్దకు రావడానికి కూడా భయపడపడడం కోసం గన్‌మెన్లు ఉపయోగపడుతున్నారు అన్న అపవాదులున్నాయి. ఇక రియలెస్టేట్‌ వ్యాపారాల్లో జరిగే లావాదేవీలలో గన్‌మెన్లను ముందు పెట్టి పనులు పూర్తి చేస్తున్న నాయకులు కూడా చాలా మందే వున్నారు. గన్‌మెన్ల ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తున్నారన్నది భహిరంగ రహస్యమే…ఇందుకేనా గన్‌మెన్ల వ్యవస్ధ వున్నదీ? అన్నది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నేతలతో ప్రభుత్వం కూడా బద్నామౌతుందన్న మాటలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పార్టీలకు చెందిన నేతలే కొందరు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో ఓ పదవి నిర్వహించిన నాయకులు ఇప్పటికీ గన్‌మెన్లు రక్షణలో వుంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి నాయకులకు గన్‌మెన్లను తొలగించడమే మేలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా చిట్‌ఫండ్‌ వ్యాపారాల్లో వున్న నాయకులు చేస్తున్న మోసాలను గన్‌మెన్ల సహకారం బాగా ఉపయోగపడుతోందన్నది స్వరత్రా వినిపిస్తున్న మాట. అలాంటి నాయకులతో అమాయకులైన ప్రజలు ఎంతో మంది మోసపోతున్నారు. చిట్టీలు వేసి సర్వం కోల్పోతున్నారు. ఇలా ప్రజలను ఇబ్బందులకు గురిచేసే నాయకులను గుర్తించి వారికి వున్న గన్‌మెన్లను తొలగించాల్సిన అవసరం వుంది. లేకుంటే ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వచ్చే ప్రమాదముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!