నేటిధాత్రి హనుమకొండ హసన్పర్తి మండలం సిద్దాపూర్ గ్రామం
నేటిధాత్రి కృషి ఫలించింది. శ్రీలతకు బ్యాటరీ ట్రై సైకిల్ అందింది. సిద్దాపురం గ్రామానికి చెందిన శ్రీలత గురించి నేటిధాత్రి ప్రత్యేక కథనం ప్రచురించింది.
దాంతో దివ్యాంగుల సంస్థ స్పందించింది. శుక్రవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి లు శ్రీలతకు బ్యాటరీ ట్రై సైకిల్ అందజేశారు. ఆమె కళ్లలో ఆనందం నింపారు. దివ్యాంగుల జీవితాలలో వెలుగులు నింపుతున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్ దివ్యాంగుల జీవితాలకు భరోసా నింపారు. వారికి రెండు సార్లు పెన్షన్ పెంచారు. ఇటీవలే మరో వెయ్యి రూపాయల పించన్ పెంచడం జరిగింది. అంతే కాకుండా దివ్యాంగులకు స్కూటర్లు, ట్రై సైకిళ్ళు, బ్యాటరీ సైకిళ్ళు అందించడం జరుగుతోంది. వారికి ఉపాధి కల్పన కోసం కూడా సబ్సిడీ రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ నేటిధాత్రి దినపత్రిక లో వార్తను చూసిన రోజే స్పందించడం జరిగిందన్నారు. అయితే శ్రీలతకు బ్యాటరీ ట్రై సైకిల్ ప్రత్యేకంగా తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దానిని సరికొత్తగా రూపకల్పన చేసి, ఈ రోజు బ్యాటరీ ట్రై సైకిల్ అందజేయడం ఆనందంగా వుందన్నారు. త్వరలోనే శ్రీలతకు అవసరమైన ఆర్థిక సహాయం సబ్సిడీ రుణం కూడా అందిస్తామని చెప్పారు.
నేటిధాత్రి కి శ్రీలత కృతజ్ఞతలు: తన దీన స్థితిని ఎవరూ పట్టించుకోకపోయినా, నేటిధాత్రి దినపత్రిక ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు, వారి జర్నలిస్టు బృందం తీసుకున్న చొరవకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నని చెప్పింది. మీడియా అంటే ఇంత కాలం వార్తలే అనుకున్నాను కానీ జీవితాలు నిలబెట్టేది అని అర్థమైందని శ్రీలత చెప్పారు. నన్ను ఎంతో మంది చూసి జాలి పడ్డారు. అయ్యో అన్నారే గాని ఆదుకోవాలన్న ఆలోచన చేయలేదు. కేవలం సామాజిక బాధ్యతతో తనేవరో తెలియని నేటిధాత్రి తన జీవితానికి వెలుగు వచ్చేలా చేసింది. అంతే కాకుండా తన ధీన గాథకు స్పందించి అదుకున్న ఎమ్మెల్యే ఆరూరి రమేష్, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి లకు జీవితాంతం రుణపడి వుంటానని చెప్పింది.