ఎంత దూరమైనా ఒక అడుగుతోనే మొదలౌతుంది. ఎంతటి గ్రంధమైనా అక్షరంతో మొదలై పదకోశమౌతుంది. అలాంటి అక్షరాలను నిత్యం లక్షలాదిగా రాసులుపోసి నేటిధాత్రి పత్రికా ప్రయాణం మొదలు పెట్టి ఇప్పటికీ 17వసంతాలు పూర్తయింది. 18వ పడిలో అడుగిడి అక్షర యానంలో అలుపులేని ప్రయాణం సాగిస్తోంది. ఈ పదిహేడేళ్లలో వేస్తూ వస్తున్న ప్రతి అడుగు ఒక చరిత్రే…ప్రతి అక్షరం ప్రత్యేకమే…
అడుగు మొదలుపెట్టడం సులువే…అది నడకగా మారి ప్రయాణమైతే గాని దాని విలువ తెలియదు. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో మలుపులు. ఎన్నో ఆటంకాలు. అవరోదాలు. అయినా అలసట లేని అక్షర ప్రయాణం. ఒక్క మాటలో చెప్పాలంటే రాసే ప్రతి అక్షరానికి విలువ లెక్కిస్తూ ఖర్చు చేస్తే గాని పత్రిక పాఠకుల ముందుకు రాదు. ఇలా నిత్యం పురిటినొప్పులే…పదిహేడు సంవత్సరాలుగా అనుభవిస్తున్న వేధనే… పురిటి నొప్పులే… ప్రాణం మీదకు వచ్చినా తల్లి బిడ్డకోసం ఓర్చుకుంటుంది. అలాగే సమాజ చైతన్యం, ప్రగతి కోసం పత్రిక నిత్యం ఆరాటపడుతుంది. కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, వెతలు, బెదిరింపులు, దాడులు, కార్యాలయాల ధ్వంసాలు, నాయకుల వింత వ్యాఖ్యలు, కొన్ని సార్లు గిట్టని వారి శాపనార్థాలు, వార్తలు నచ్చని వారి చీదరింపులు అనేకం వుంటాయి. అయినా పాఠకుల కోరిక మేరకు, జనాభిప్రాయాన్ని ప్రతిబింబించడమే నేటిధాత్రి కర్తవ్యం… అవినీతి, అక్రమాలకు ఎదురొడ్డి నిలబడి, తెగింపు ప్రయాణంలో అన్యాయంపై అక్షర సమరం సాగిస్తున్నాము. ఈ ప్రయాణంలో అలుపు లేదు. వెనుకడుగు లేదు. నేటిధాత్రిని దాత్రిని ఉఫ్ మని ఊదేస్తామని శఫథాలు, బీరాలు పలికిన వారు కూడా వున్నారు. కేసులు పెట్టి ఇంబందుల పాలు చేయాలని చూశారు. మానసికంగా ఇబ్బందులు ఎదురైతే తమ దారికొస్తారని కొందరు చూశారు. ఏ సమాజమైనా మంచీ చెడు వుంటుంది. అందులో మీడియా కూడా వుంటుంది. మహాత్మాగాంధీకే తప్పలేదు… సమాజ చైతన్యం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం పత్రికలు నడిపారు. చరిత్రకే చారిత్రక సత్యమయ్యారు. ప్రతి పత్రికకు శత్రువులే కాదు…మిత్రులు, శ్రేయోభిలాషులు, హితులు, సన్నిహితులు వుంటారు. అక్షరాలను బతికించే ఔదార్యం వున్న వాళ్లు వుంటారు. వెన్నంటి వుంటారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటారు. అలాంటి మంచి మనసున్న వాళ్లు నేటిధాత్రికి తోడౌతున్నారు…తోడుగా సాగుతున్నారు. ఎందరో మహానుభావులు. అందులో నా శ్రేయోభిలాషులు ఎంతో గొప్ప మనసున్న వాళ్లు. వాళ్లకు వేల వేల దండాలు….పాఠకులకు శతకోటి వందనాలు. మా అక్షరం మీ కోసం… నేటిధాత్రి సమాజం కోసం…
ఇట్లు
మీ కట్టా రాఘవేంద్రరావు
ఛీఫ్ ఎడిటర్.