నవ్విపోదురు గాక మాకేమి సిగ్గు…!
”నవ్వి పోదురు గాక మాకేమి సిగ్గు” అన్న చందంగా గ్రేటర్ వరంగల్ నగర కార్పొరేటర్లు వ్యవహరిస్తున్నారు. శనివారం అంతర్గత సమావేశం పేరుతో నిర్వహించిన గ్రేటర్ వరంగల్ నగర పాలక వర్గం సమావేశంలో కొంత మంది కార్పొరేటర్ల భర్తలు సైతం దర్బాజగా హాజరయ్యారు. సమావేశ ప్రోటోకాల్ కాగితాలకే పరిమితమైంది. సమావేశానికి ఎవరు హాజరవుతున్నారో తెలియని పరిస్థితి దాపురించింది. మహిళా కార్పొరేటర్లతో పాటు వారి భర్తలు సైతం సమావేశానికి హాజరు కావటంతో సమావేశం కలెగూరగంపగా మారింది. సమావేశానికి హాజరు కావాల్సిన నగర మేయర్ డుమ్మాకొట్టి ఓ ప్రయివేటు విద్యాసంస్థ తాళ్ళపద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభ కార్యక్రమానికి వెళ్లారు. నగర మేయర్, తూర్పు ఎమ్మెల్యే, కమిషనర్ తూర్పు కార్పొరేటర్లు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నగర మేయర్ లేకపోవటం విమర్శలకు తావిస్తోంది. సమావేశంలో మహిళా కార్పొరేటర్లతో పాటు వారి భర్తలు దర్జాగా హాజరై హవా సాగించటం, పార్టీ కా ర్యకర్తలు సమావేశానికి హాజరవ్వటాన్ని తూర్పు ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పకపోవటం కమిషనర్ కూడా నోరు మెదుపకపోవటం గమనార్హం.
సమావేశానికి దర్జాగా హాజరైన మహిళా కార్పొరేటర్ల భర్తలు…
కీలక సమావేశంగా చెప్తున్న నగర పాలకవర్గం సమావేశానికి మహిళా కార్పొరేటరైన 7 డివిజన్ కార్పొరేటర్ కెడల నద్మ భర్త కెడల జనార్తన్, 15వ డివిజన్ కార్పొరేటర్ శారదజోషి భర్త సురేష్ జోషి, 21వ డివిజన్ కార్పొరేటర్ మేడిది రజిత భర్త మదుసుదన్, 22వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్లి భాగ్యలక్ష్మి భర్త మరుపల్లి రవి సమావేశానికి హాజరై దర్జాగా ముందువరుసలోనే కూర్చోని ” నవ్విపోదురు గాక మాకేమి సిగ్గు” అన్నట్లుగా వ్యవహరించటం చర్చానీయాంశంగా మారింది. గతంలోనూ పలు సమావేశాలకు సతులతో పాటు పతులు హాజరై హవా సాగించిన పరిస్థితి ఉందని వీరు ఇక మారే పరిస్థితి లేదని పలువురు చర్చించుకోవటం గమనార్హం. అధికారులు అడ్డుచెప్పకపోవటమే ఇందుకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.