నలుగురు కనబడగానే నాలుకకు శిగమొస్తదా?

`తొలి అడుగునాడే తొందరపాటు తప్పులు!

`తప్పుడు ప్రకటనలు…వివాదాస్పద వ్యాఖ్యలు!

`ప్రగతి భవన్‌ ప్రజల ఆస్తి…ఆ మాత్రం తెలియకుండా రాజకీయాలా?

`రాజకీయ నాయకులైతే ఏదైనా మాట్లాడొచ్చా!

`ఎవరైనా సామాన్యుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చట్టం ఊరుకునేదా?

`ప్రభుత్వ ఆస్థులు ధ్వంసం చేయమని చెప్పేవారు నాయకులా?

`దిక్కుమాలిన రాజకీయాల కోసం అంతగా దిగజారాలా?

`ఇలాంటి వ్యాఖ్యల వల్లే యువత చెడిపోయేది?

`జీవితాలు ఆగం చేసుకునేది…?

`ఎర్రబెల్లి ఉద్యమకారుడు కాదు, సరే రేవంత్‌ రెడ్డి ఏమిటి?

`చంద్రబాబుతో తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి ఉత్తరం రాయించింది మంత్రి దయాకర్‌ రావు.

`చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చింది ఎర్రబెల్లి.

` ఉద్యమకారులను బెదిరించేందుకు తుపాకీ పట్డుకొని పర్యటన చేసింది రేవంత్‌ రెడ్డి.

`సోనియా గాంధీని తిట్టిన తిట్టు తిట్డకుండా తిట్టింది రేవంత్‌ రెడ్డి.

`తెలంగాణ ఉద్యమకాలం ఒక్కసారైనా జై తెలంగాణ అన్న చరిత్ర రేవంత్‌ రెడ్డికి వుందా?

` తెలంగాణ వాది కాని వారు ముఖ్యమంత్రి కాలేరు?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

నవ్వి పోదురు గాని నాకేం సిగ్గు అన్నట్లా…నలుగురుని చూడగానే నాలుకకు శిగమొచ్చినట్లా..? ప్రగతి భవన్‌ పేల్చేయండని పిపిసి. అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రకటన ఏమిటి? సోయిలోనే వుండి మాట్లాడుతున్నాడా? లేక ఇంకేదైనా లోకంలో వున్నాడా? మైకంలో వున్నాడా? ప్రగతి భవన్‌ ఇప్పుడు ఖాళీగా లేదు. అందులో తెలంగాణ రాష్ట్ర పరిపాలనా వ్యవహారం సాగుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ అధికారిక నివాసంగా వుంది. అంటే వారికి హని తల పెట్టాలనే అర్ధం వచ్చేలా మాట్లాడడం పరిణతి చెందిన నాయకుడు చెప్పాల్సిన మాటలేనా? ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద కోపం వున్నా, బిఆర్‌ఎస్‌ మీద కసి వున్నా, ప్రజాస్వామ్య వ్యవస్ధలో ఎన్నికల వేధికగా ప్రజల ఆదరణతో విజయం సాధించి గెలిచి నిలవాలి. అలా రాజకీయాల్లో పై చేయి సాధించాలి. అంతే కాని నోరుంది కదా? అని దూల తీర్చుకునేందుకు ఏదైనా మాట్లాడతాంటే ఎలా? నరం లేని నాలుక ఏదిపడితే అది మాట్లాడితే జనం మెచ్చరు…నచ్చరు…రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ చాల రోజుల తర్వాత ఓ కార్యక్రమం చేపట్టింది. కాని ఇక్కడ కూడా వివాదం మూటగట్టుకోవడమే పార్టీ వంతైంది. ముఖ్యంగా పిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తొలి రోజు హాత్‌సే, హాత్‌ జోడో యాత్ర చేపట్టారు. ఇంత వరకు బాగానే వుంది. నలుగురు కనిపించగానే నాయకుల నాలుకలకు శిగమొస్తుందన్నట్లు రేవంత్‌ రెడ్డి తొలిరోజే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

  ప్రభుత్వ అధికారిక భవనం ప్రగతి భవన్‌కూ నక్సలైట్లు కూల్చేయాలని అనడం సరైంది కాదు…

ఒక బాధ్యత గల్గిన నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు. నాయకులు సమాజానికి మార్గదర్శకంగా వుండాలి. వివాదాలు లేని ఆదర్శవంతమైన జీవనం వుండాలి. అంతే గాని తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సబబు కాదు… ప్రజస్వామ్య వాదులెవరూ? హర్షించరు. నాయకులు చెప్పే మాటలు ప్రజల హర్షించే విధంగా వుండాలి. మెచ్చుకునేలా వుండాలి. మేధావులు గొప్పగా చర్చించుకునేలా వుండాలి. అంతే కాని సామాన్య ప్రజలు కూడా చీదరించుకునేలా వుండకూడదు. ప్రగతి భవన్‌ కూల్చేయమని చెప్పి, రేవంత్‌రెడ్డి ఎలాంటి సంకేతాలు పంపుతున్నట్లు? అన్నది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రగతి భవన్‌ అన్నది ప్రజల సొత్తు. ప్రభుత్వ భవనం. ఏ పార్టీ అధికారంలో వుంటే పార్టీ ప్రభుత్వ పాలకుల కోసం నిర్మాణం చేబడిరది. ప్రజల పన్నుల ద్వారా జరిగిన నిర్మాణం ప్రగతి భవన్‌…నిజంగా తాను రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనున్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ అంగీకరించరు. ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఆ మాత్రం వున్న సానుభూతిని కూడా హరించేలా వుండకూడదు. పార్టీ ఇప్పటికే కష్టాలలో వుంది. ఇప్పటి దాకా కాంగ్రెస్‌లోనే రేవంత్‌ రెడ్డి మీద సరైన అభిప్రాయం లేదు. ఆయనకు పార్టీ పరంగా సీనియర్ల నుంచి ఆదరణ లేదు. తప్పని పరిస్ధితుల్లోనే సీనియర్లు రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని భరిస్తున్నారు. ఇది యదార్ధం. అలాంటప్పుడు కాంగ్రెస్‌ను గట్టెక్కించేలా రేవంత్‌రెడ్డి వ్యవహార శైలి వుండాలే తప్ప, పార్టీని నిండా ముంచేలా వుండకూడదు. 

 అసలు రేవంత్‌ రెడ్డి హాత్‌సే, హాత్‌ జోడో యాత్ర చేపట్టడంలో ఆంతర్యంలో అర్ధం లేనిదిగా మిగిలిపోకూడదు.

తొలినాడే ఒక్క మాటతో అందరి చేత చీవాట్లు పడే స్ధితి తెచ్చుకోవడంతో ఆ యాత్ర పరమార్ధం మారిపోయేలా చేసుకున్నాడు. ఒకనాడు తెలంగాణలో ఎంతో మంది యువకులు ఆనాటి నాయకుల మూలంగా అడవిబాట పట్టారు. ఎంతోమందికి పుత్ర శోకాలు మిగిల్చారు. ఇప్పటికీ తెలంగాణలో అనేక పల్లెల్లో ఆ కన్నీటి జాడలు ఇంకలేదు. ఆ కుటుంబాలు ఇంకా ఆ గాయాలనుంచి తేరుకోలేదు. ఎంతో మంది తల్లిదండ్రులు తమ కంటి ముందే పిల్లలు చనిపోతుంటే కడుపుకోతలు అనుభవించారు. ఆ కన్నీటీ జీరలు, చారలు వారి ముఖాల మీద ఇప్పటికీ కనిపిస్తూనేవుంటాయి. గతంలో రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీ ఇలా నక్సలైట్లను వాడుకొని అధికారంలోకి వచ్చింది. ఒకసారి మర్రిచెన్నారెడ్డి, మరోసారి వైఎస్‌.రాజశేఖరరెడ్డి. అయితే ఆ రోజులు వేరు…ఇప్పుడున్న పరిస్దితులు వేరు. ఆనాడు తెలంగాణలో ఆకలి, కరువు, నిరుద్యోగం…ఆంధ్ర నాయకుల పెత్తనం, తెలంగాణ వెనుకబాటు తనం ఇవన్నీ నాడు యువతను అడవిబాట పట్టేలా చేశాయి. ఎంతో మంది యువత అర్ధాంతంగా జీవితాలను ముగించాల్సివచ్చింది. ఎంతో మంది తల్లిదండ్రులకు కడుపు చిచ్చు మిగిల్చింది. 

ఏ నక్సలైట్ల పేరు చెప్పి అధికారంలోకి వచ్చారో అదే కాంగ్రెస్‌ పార్టీ ఓసారి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి రూపంలో, మరోసారి వైస్‌.

రాజశేఖరెడ్డి రూపంలో తెలంగాణలో రక్తపాతం పారించారు. అలాంటి కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ యువతను బలి చేసే కుట్రలకు తెరతీస్తే ప్రజలు క్షమించరు. ఇప్పటికైనా కుళ్లు, కుతంత్రాలతో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ, ముఖ్యంగా రేవంత్‌రెడ్డి చూడాలనుకోవడం సరైంది కాదు. అందుకు యువతను బలి చేసేందుకు రాజకీయాలు చేయొద్దు. ఏ నాయకుడైనా యువకులు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని చెప్పాలి. అంతే కాని అడ్డదారుల తొక్కమని, అక్రమ మార్గాలు ఎంచుకొమ్మని చెప్పొదు. నక్కలైట్ల యుగం అన్నది ఒకనాటి కధ…చెరిగిపోయిన కథ. ఆ గాయాన్ని రేపడం అంటే తప్పు చేయడమే..పాపం చేయడమే! తెలంగాణ వచ్చాక ముఖ్యమర్రతి కేసిఆర్‌ తమ ప్రభుత్వ ఎజెండా నక్సలైట్ల ఎజెండా అమలు చేయడమే అన్నారు. అది ఒక బాధ్యత కల్గిన నాయకుడు చెప్పాల్సిన మాట అది…అంతే కాని రేవంత్‌రెడ్డిలాగా ప్రజల్లో అలజడి రేపే వ్యాఖ్యలు చేయకూడదు. ఒక వేళ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక సామాన్యుడు చేస్తే చట్టం ఊరుకుంటుందా? ఇప్పటికే పిడీ యాక్ట్‌ పెట్టేవాళ్లు…ఇప్పటికీ కనీసం సానుభూతి పరులుగా వున్నారని తెలిసినా వారి జాడ పట్టుకొని చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మరి నాయకుడైనంత మాత్రాన రేవంత్‌రెడ్డి లాంటివారు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు…ఎవరూ హర్షించరు. 

    ఇక తెలంగాణ ఉద్యమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు లేడు సరే…మరి రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమానికి చేసిన మేలేమిటి?

 ఆయన పాల్గొన్న ఉద్యమాలేమిటి? తెలుగుదేశం పార్టీలో వుంటూ రెండు కళ్ల సిద్దాంతాని అనుసరించి, తెలంగాణ వాదాన్ని సమాధి చేయాలని చూసి వారిలో రేవంత్‌రెడ్డి ఒకరు. ఇది చరిత్ర సత్యం..దాన్ని ఇప్పుడు కప్పుపుచ్చుకోవాలని చూసినా దాగేది కాదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉత్తరం ఇవ్వడంలో కీలకపాత్ర పోషించింది ఎర్రబెల్లి దయాకర్‌రావు. 2008లో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసేలా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి, దసరా రోజు తెలుగుదేశం శ్రేణుల చేత జై తెలంగాణ అనిపించింది దయాకర్‌రావు. మరి రేవంత్‌రెడ్డి ఏం చేశాడు? అన్నది ఇప్పటి యువతకు తెలియాల్సిన అవసరంవుంది. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న వేళ, తెలంగాణ వ్యతిరేకులను తెలంగాణ వాదులు అడుగడుగుగా అడ్డుకుంటున్న సమయం అది. తెలంగాణకు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమేయాలి…ప్రాంతం వాడే మోసం చేస్తే పాతరపెట్టాలని సూచించిన కాలోజీ స్పూర్తి మాటలు బాగా చెప్పుకుంటున్న రోజులవి. ఆ సమయంలో కరీంనగర్‌లో తెలుగుదేశం పార్టీ సమావేశాలకు వెళ్తు, తెలంగాణ వాదులు అడ్డుకుంటే కాల్చేస్తానని హెచ్చకరికలు జారీ చేసేలా రేవంత్‌ రెడ్డి గన్‌ పట్టుకొని వెళ్లిన సందర్భం ప్రజలు అప్పుడే మర్చిపోలేదు. అలాంటి రేవంత్‌రెడ్డి ఇప్పుడు తాను తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకుంటే సరిపోదు. ఇక తెలంగాణ విషయంలో సోనియా గాంధీ వల్ల, కాంగ్రెస్‌ వల్ల ప్రజల్లో వైషమ్యాలు సృష్టించబడుతున్నాయని, ఆంధ్రా, తెలంగాణ ప్రజల్లో అంతరం పెంచి రాజకీయ పబ్బం గుడుపుకుంటున్నారని ఎన్ని నిందలు వేయాలో అన్ని రేవంత్‌రెడ్డి వేశాడు…సోనియా గాంధీని దెయ్యం…అన్నాడు…మరి ఇప్పుడు కాంగ్రెస్‌లో వుండి నీతులు వల్లిస్తే, మొసలి కన్నీరు ఎవరైనా నమ్ముతారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!