నయా మాఫియా! రియల్‌ ఫైట్‌!!

 

`రియల్‌ రంగంలో సరికొత్త దందా.

`వెంచర్ల మీద దాడులు…

`వెంచర్లే టార్గెట్‌…

`ఆక్రమణలకు దిగుతున్న సరికొత్త రియల్‌ వ్యాపారం…

`దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురిచేయడం…

`భయపడతారో లేదో అని ట్రయల్‌ వేయడం…

`ఏ మాత్రం వణికినా వెంచర్‌ ని అధీనంలోకి తీసుకోవడం…

`కొన్న వారి గురించి అవసరం లేదు!

`అమ్మిన వారిని భయపెట్టిస్తే చాలు…

`వెంచర్‌ లాక్కునే ఎత్తుగడలు…

`కొందామంటే భూములు లేవు…

`అమ్ముదామంటే వెంచర్లు లేవు…

`ఏర్పాటైన వెంచర్లలో పాగా వేస్తే చాలు…

`బలం ప్రదర్శిస్తే చాలు…

`నిన్నటి దాక పక్కోడి భూములు లాక్కునేవారు…

`ఇప్పుడు వెంచర్లే ఆక్రమించుకునేందుకు చూస్తున్నారు…

`అక్రమ ఆక్రమణ దౌర్జన్యాలపై సిపి. రంగనాథ్‌ ఉక్కు పాదం మోపుతున్నారు…

`భూముల వ్యవహారాలు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో కొత్త తరహా మోసానికి కొందరు తెరతీస్తున్నారు…

`కింది స్థాయి పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఆరోపణలు…

`తాజాగా రాంపూర్‌ లో జరిగిన ఘటనే సాక్ష్యం…

`ఇంత వరకు కేసు నమోదు చేయకపోవడంతో అనుమానాలకు ఊతం…

`సిపి.గారు ఇలాంటి వాటిపై ఒక్కసారి దృష్టి పెట్టండి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని పెద్దలు ఊరికే అనలేదేమో! 

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దిక్కుమాలిన మార్గాలన్నీ అన్వేషిస్తోంది….బెదిరింపులు, దౌర్జన్యాలతో పాటు, ఏకంగా వెంచర్లే ఆక్రమించుకునే జిత్తుల మారి పోకడలు మొదలయ్యాయి. ఇంత కాలం రైతుల భూములు, అమాకుల భూములు లాక్కున్నారు…ఆక్రమించుకున్నారు…కబ్జా చేశారు…అనే వార్తలే వింటూ వస్తున్నాం…ఇప్పుడు ఆ దశ దాటింది….గత్యంతరం లేని పరిస్థితి ఎదురౌతోంది. నగరానికి దగ్గరలో భూములు అమ్మకానికి లేవు…కొనుగోలు లేదు…సాగు మాట దేవుడెరుగు నివాసాలకు నగరానికి దగ్గరలో జాగలే లేవు…రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు పని లేదు…బిజినెస్‌ లేదు…లక్షలు, కోట్ల సంపాదన చూసిన వారికి చిల్లి గవ్వ రావడం లేదు…భూముల జాడలు లేవు…వెంచర్లేద్దామంటే దొరకడం లేదు….మరి ఏం చేద్దాం… చినమాయను, పెద్ద మాయ మింగడమే అని సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు చెప్పిన దారిని ఎంచుకున్నారు…ఇప్పటికే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి, అమ్మకానికి సిద్దంగా వున్నా సరే…అమ్ముడు పోయినా సరే వెంచర్లో అడుగుపెడితే సరి…దౌర్జన్యం చేస్తే సరి… ఆక్రమించుకుంటే సరి…. వెంచర్‌ నాదేనని ఏవో పాత కాగితాలు చూపిస్తే సరి….బలం, బలగం వుంటే సరి…అవతలి వ్యక్తి భయపడితే మరీ మంచిది..ఇంకే ముంది…కన్ను పడిన వెంచర్‌ మనదే…పెత్తనం లాక్కోవడమే…అసలైన వారిని తరిమేయడమే…ఇదే ఇప్పుడు మొదలైన అసలు సిసలైన రియల్‌ ఫైట్‌….

వరంగల్‌ సమీపంలోని రాంపూర్‌ లో సర్వే నెం. 558/A, 560/A లో 4 ఎకరాల 4 గుంటల స్థలాన్ని ఇద్దరు రియల్‌ వ్యాపారులు డెవలప్మెంట్‌ చేశారు. 

అన్ని రకాల అనుమతులు పొందారు. భూమి చదును చేశారు. ప్లాట్ల హద్దులు ఏర్పాటు చేశారు. అవసరమైన రోడ్లు వేయించారు. కరంటు సౌకర్యం కల్పించారు. వెంచర్‌ ఏర్పాటు చేశారు. అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. అనుకోకుండా కొందరు వ్యక్తులు ఇటీవల ఆ వెంచర్‌ లోకి చొరబడి నానా బీభత్సం సృష్టించారని తెలిసింది. వెంచర్‌ లో విద్యుత్‌ వైర్లు కట్‌ చేశారు. హద్దు రాళ్లు తొలగించారు. రోడ్లు ధ్వంసం చేశారు. వెంచర్లో టెంటు ఏర్పాటు చేసి ఈ స్థలం మాదీ అని డిపార్ట్మెంట్‌ చేసిన వారిని బెదిరించారు. వెంటనే వెంచర్‌ ఖాళీ చేసి వెళ్లిపొమ్మని దౌర్జన్యానికి దిగారు. దాంతో వెంచర్‌ డెవలపర్స్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఆ స్థలం డెవలప్మెంట్‌ చేసిన వారి వద్ద పూర్తి డాక్యుమెంట్లు వున్నాయి. అన్ని రకాల అనుమతులు వున్నాయి. ఆ స్థలానికి చెందిన కొత్త పాస్‌ పుస్తకాలున్నాయి. కానీ కొందరు ఆ స్థలం మాదని రావడం, డెవలప్మెంట్‌ చేసిన వారిని బెదిరింపులకు, భయభ్రాంతులకు గురిచేశారు. పోలీసులు రావడం వివరాలు సేకరించడం, దౌర్జన్యం చేసిన వారి వద్ద సరైన ఆధారాలు లేవని తేల్చారు. వారిది తప్పని ఒప్పించారు. కానీ ఇంతవరకు వారిపై కేసు నమోదు చేయలేదు. లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన సౌకర్యాలను నాశనం చేశారు. ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదన్న దానిపై సర్వత్రా విమర్శలు ఎదురౌతున్నాయి. అక్రమ దారుల దాడులు వెంచర్లకు చేరితే రియలెస్టేట్‌ వ్యాపారం దారి తప్పే ప్రమాదం వుంది. అందుకే వరంగల్‌ సిపి. రంగనాధ్‌ వివరాలు తెలుసుకొని వెంచర్‌ మీద దౌర్జన్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. సిపి. రంగనాధ్‌ ఇంత స్టిక్ట్‌ గా వున్నప్పటికి కొందరు పోలీసు అధికారుల వల్ల డిపార్ట్మెంట్‌ కు వస్తున్న మంచి పేరు, ఇలాంటి సంఘటనల వల్ల తగ్గే అవకాశం వుంది. నిజా నిజాలు నిగ్గు తేల్చి బాధితులకు న్యాయం జరగాల్సిన అవసరం ఏర్పడిరది. 

 

వరంగల్‌ సిపిగా రంగనాధ్‌ వచ్చాక నగరంలో చాలా వరకు శాంతి నెలకొంది. తర,తమ అనే భేదం లేకుండా తప్పు చేసిన వారెవరైనా సరే వారిని వదలిపెట్టడం లేదు. ఇలా గతంలో ఎప్పుడు ప్రజలు చూడలేదు…ముందు ప్రక్షాళన డిపార్ట్మెంట్‌ నుంచే మొదలుపెట్టారు. అవినీతి అధికారుల భరతం పట్టాడు. డిపార్ట్మెంట్‌ పరువు తీసిన వారి పని పట్టాడు. విధుల్లో నిర్లక్ష్యం చేసిన వారిని పక్కనపెట్టాడు. ప్రజలను ఇబ్బంది పెట్టిన పోలీసు అధికారులను సక్రమ మార్గంలో పెట్టారు. ముందు ఇళ్లు శుభ్రం చేసిన సిపి. సమాజంలో ప్రజలను వేధించిన వారిని ఆరేశాడు… ప్రజల భూములు ఆక్రమించుకున్న వారి భరతం పట్టాడు. ఏ పార్టీ నాయకుడైనా సరే తప్పు చేస్తే క్షమించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశాడు. ప్రభలకు అండగా వుంటున్నాడు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా సాగుతున్నారు. మాకు అన్యాయం జరుగుతోందని ఎవరు కంప్లైంట్‌ చేసినా, చిన్న మెసేజ్‌ చేసినా స్పందిస్తున్నారు. బాధితులకు న్యాయం చేస్తున్నాడు. గతంలో పోలీసు అధికారులను జనం గొప్పగా పొగిడిన సందర్భాలే చూశాం…కానీ ఇప్పుడు సిపి. రంగనాధ్‌ చిత్ర పటానికి కు ప్రజలు పాలాభిషేకం చేయడం చూస్తున్నాం…పదేళ్ల నుంచి నలుగుతున్న సమస్యైనా సరే పది నిమిషాలలో పరిష్కరిస్తున్నారు. తాజాగా ఓ మైనారిటీకి చెందిన వ్యక్తి భూమిని ఓ పార్టీ నాయకుడు ఆక్రమించడంపై పిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగి బాధితుడికి న్యాయం చేశారు.ఇలా బాధితులకు అండగా నిలుస్తున్నారు. పోలీసు వ్యవస్థ మీద మరింత నమ్మకం పెంచుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!