తిరస్కరణ మంద! హస్తంలో సంత!?

 

 

` ఇంతకీ వాళ్ల బలమెంత?

` బిఆర్‌ఎస్‌ వదిలేసినంత?

`గత ఎన్నికలలో ఓడినంత?

` జనం మద్దతు లేనంత?

`గుంపంతా ఒంటరైనంత?

`జనం మనసులో లేనంత?

`జనమొద్దనుకున్న నేతలే ఏకమైనా గెలవలేనంత? 

`కాంగ్రెస్‌ కు కలిసిరాని లక్కంత?

`పొంగులేటి పెత్తనం ఎంత?

` కాంగ్రెస్‌ లో కలిశాక వీసమెత్తంత?

`ఖమ్మం లో పొంగులేటి చెల్లుబాటెంత?

`భట్టి విక్రమార్క చెప్పుచేతుల్లోకి వెళ్లేంత?

` జూపల్లి త్యాగమెంత?

`గత ఎన్నికలలో ప్రజలు తిరస్కరించినంత?

` ఇంతకీ లక్ష్యమెంత?

`మళ్లోసారి ఓడిపోయేంత?

`కాంగ్రెస్‌ ఆగమయ్యేంత?

 హైదరబాద్‌,నేటిధాత్రి:                             

రాష్ట్ర కాంగ్రెస్‌లో జోష్‌..ఇది నిజమైన మాటేనా? ఎవరు చెప్పారు? ఎవరు చెబుతున్నారు? ఎవరు సంకేతాలు ఇచ్చారు? కర్నాకట ఎన్నికలకు తెలంగాణకు సంబంధం ఏమిటి? కర్నాటకలో కాంగ్రెస్‌ గెలిస్తే తెలంగాణలో బూమ్‌ ఎందుకొస్తుంది? అక్కడి స్ధానిక పరిస్ధితులు, అవసరాలకు , తెలంగాణ వాస్తవ పరస్ధితులకు వ్యత్యాసం లేదా? తెలంగాణ గడ్డలో వున్న రాజకీయ చైతన్యం ఏమైనా తక్కువా? పక్క రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని తెలంగాణలో కాంగ్రెస్‌ వస్తుందా? గతంలో కర్నాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం అధికారంలోకి రాలేదా? కర్నాకటలో 1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వుంది. కాని చంద్రబాబు నాయుడు రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి తెలుగుదేశమే అధికారంలోకి వచ్చింది. పొరుగు రాష్ట్రంలో వున్న రాజకీయ పరస్ధితులు వేరు. మన పరిస్ధితులు వేరు. తర్వాత ఇక్కడ, అక్కడా కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వున్నప్పటికీ కర్నాకట ప్రభుత్వాలు ఆల్మట్టి ఎత్తు పెంచుతూ వెళ్లి తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేశాయి. రాజకీయాలను అంచనా వేయడం అంటే అక్కడ గెలిస్తే, ఇక్కడ గెలుస్తామన్న లెక్కలు ఎక్కడైనా వర్తిస్తాయేమోకాని రాజకీయాల్లో కాదు. పైగా కర్నాటక ప్రజలు బిజేపి పాలనపై విసుగెత్తి వున్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాల్సిన జేడిఎస్‌ కర్నాకటలో గోడ మీది పిల్లి వాటం రాజకీయాలు చేస్తూ వస్తోంది. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌ మెజార్టీ స్ధానాలు కైవసం చేసుకున్నా, వారిలో కొంత మందిని లాగేసి, బిజేపి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత పరిపాలనలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నది. అందుకే ప్రజలు బిజేపిని ఓడిరచారు. అక్కడ కాంగ్రెస్‌ తప్ప ప్రత్యామ్నాయం లేదు. దాంతో కాంగ్రెస్‌ గెలిచింది. అంతే కాని కాంగ్రెస్‌ పార్టీ ఏదో కొత్త లోకాన్ని సృష్టిస్తుందని కాదు…ఇది తెలిసికూడా కాంగ్రెస్‌ ఎగిరెగిరి పడుతోంది. ఊపు వాపుగా మార్చుకొని రాజకీయం మొదలుపెట్టినట్లు కలలుకంటోంది. 

 కర్నాటక ఎన్నికల దాకా బిజేపి మురిసింది. 

ఇక మాకు ఎదురులేదని చెప్పుకున్నది. అధికార బిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకుంటూ వచ్చింది. ప్రజలు మావైపే వున్నారు. ఇక ఎన్నికల జరగడమే తరువాయి…? అంటూ సన్నాయి నొక్కులు మూడేళ్లపాటు నొక్కారు. ఏమైంది? కర్నాకట ఎన్నికలతో ఒక్కసారిగా బిజేపిలో నిస్తేజం ఆవహించింది. అంతా సైలెంట్‌ అయ్యింది. ఆధిప్యత రాజకీయాలు ఒక్కసారిగా చల్లారాయి. ఆ పార్టీ వెంట పడుతున్నారంటూ చెప్పిన మాటలన్నీ నీటి మూటలయ్యాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారంటూ చెప్పిన మాట చెప్పకుండా చెప్పి, చెప్పి ఆశ పల్లకిలో ఊరేగారు. కనీసం బలమైన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఓడిపోయినప్పుడైనా బిజేపి కళ్లు తెరవాల్సివుండే! కాని ఆ పని చేయలేదు. ప్రజల మద్దతు మాకే వుంటూ ఊదరగొట్టింది. ఉట్టికెగురుదామనుకొన్నది. కాని వాస్తవ పరిస్ధితులు ఏమిటో కర్నాకట ప్రజలు చూపించే సరికి దిక్కులు చూస్తున్నది. ఇలాంటి సమయం కాంగ్రెస్‌కు బాగా కలిసి వచ్చినట్లు వుంది. అందుకే తెగ హడావుడి చేస్తోంది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రజలకు కొన్ని రోజులు ఎంటర్మైంట్‌ను ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 

అసలు కాంగ్రెస్‌లో చేరుతున్న నేతలు ఎవరు?

 అన్నది ఒకసారి బాగా ఆలోచించాలి. ముందుగా ఖమ్మం జిల్లాకు చెందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అనూహ్యంగా తెలంగాణ రాజకీయాలపైకి వచ్చారు. 2014 ఎన్నికల్లో వైసిసి తరుపున ఎంపిగా గెలిచారు. కాని తెలంగాణలో వైసిపి పార్టీని నిర్వహించడం తన వల్ల కాదని తేల్చుకున్న ఆంధ్రప్రదేశ్‌ సిఎం. జగన్‌ , అక్కడి రాజకీయాల మీదనే దృష్టిపెట్టారు. తెలంగాణలో వైసిపిని వదిలేసుకున్నారు. అదే సమయంలో తెలంగాణలో అధికారంలో వున్న బిఆర్‌ఎస్‌లోకి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరిపోయారు. ఇంత వరకు బాగానే వుంది. నిజంగా పొంగులేటి ఎంతో సమర్ధవంతమైన నేత అని తనకు తాను గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప, ఆనాడు వైఎస్‌. జగన్‌ మూలంగా గెల్చిన నేతలే తప్ప, వ్యక్తిగత ప్రతిష్ట అంతగా వున్న నేత కాదు. కాని తనకు తాను అతిగా ఊహించుకున్న శ్రీనివాస్‌రెడ్డి రాజకీయ పరిమితి, పరిజ్ఞానం ముఖ్యమంత్రి కేసిఆర్‌కు తెలుసు. అందుకే ఎక్కడ వుంచాలో అక్కడ శ్రీనివాస్‌రెడ్డిని వుంచారు. అయితే గత ఎన్నికల్లో తాను జిల్లా మొత్తం గెలిపించుకొస్తా అని చెప్పిన శ్రీనివాస్‌రెడ్డి మూలంగానే బిఆర్‌ఎస్‌ అనుకున్నంత మేర సీట్లు సాధించలేదన్నది నిజం. అందుకే ఆయన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్‌ ఇవ్వలేదు. ఆనాటి నుంచి ఆయన ఎప్పుడు సమయం దొరుకుతుందా? అనుకుంటూ ఎదురుచూస్తున్నాడు. రాష్ట్రంలో బిజేపి కొంత ఊపు మీదకు వచ్చిందన్నది గ్రహించి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలోని కొంత మందిని ఇబ్బందులకు గురి చేయడం మొదలు పెట్టడంతో శ్రీనివాస్‌రెడ్డి తన అసమ్మతి గళం వినిపించడం మొదలు పెట్టారు. వీలు చిక్కినప్పుడల్లా తన అసంతృప్తిని వెల్లగక్కుతూ వచ్చారు. ఆఖరుకు బిఆర్‌ఎస్‌నుంచి బైటకు వెళ్లి, బిజేపిలో చేరాలని అనుకున్నాడు. కర్నాకటలో కాంగ్రెస్‌ గెలవడంతో ఆయన తన రూట్‌ మార్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయంతీసుకున్నాడు. ఖమ్మం జిల్లానుంచి బిఆర్‌ఎస్‌ను అసెంబ్లీ గేట్‌ దాకా రానివ్వను అంటూ శపథాలు చేస్తున్నాడు. నిజంగా ఆయనకు అంత శక్తి వ ఉంటే గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఎందుకు సీట్లు తేలేకపోయాడు? నిజానికి అప్పుడు బిఆర్‌ఎస్‌ మంచి ఊపు మీద వున్నది. ఎవరూ ఊహించనంత మెజార్టీని సొంతం చేసుకున్నది. మరి అలాంటప్పుడే పొంగులేటి పనితనం ఎక్కడా కనిపించలేదు. 

 నిజానికి తెలంగాణలో బిఆర్‌ఎస్‌ అత్యంత బలంగా వుంది.

 ప్రస్తుత తరుణంలో ప్రతిపక్షపాత్ర ఎవరిది అన్నదానిపై చర్చ జరగాల్సిన సమయంలో , పొంగులేటి చేస్తున్న వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు వారికున్న బలమెంత? వారి రాజకీయ అనుభవం ఎంత? పొంగులేటితో పాటు కాంగ్రెస్‌లో చేరుతున్నవారి రాజకీయ చరిత్ర ఎంత? గతంలో ప్రజలు ఎందుకు వారిని ఓడిరచారు? అన్నదానిని ప్రజలు పరిగణలోకి తీసుకోకుండానే ఎన్నుకుంటారా? ఇదిలా వుంటే కాంగ్రెస్‌లో చేరుకముందు వున్న ప్రాధాన్యత చేరిన తర్వాత గాని తెలియదు. కాంగ్రెస్‌ మహాసముద్రం. అందులో ఎవరికి ప్రత్యేక ప్రాధాన్యత వుండదు. గుర్తింపు అసలే వుండదు. అలాంటిది సిఎల్‌పి నాయకుడైన భట్టి విక్రమార్క ప్రాతినిధ్యాన్ని కాదని పొంగులేటికి ప్రాధాన్యత ఇస్తారని నమ్ముడం అంటే మబ్బులను చూసి, ముంత ఒలకబోసుకున్నట్లే…అంటే పొంగు చల్లారినట్లే? అంతే…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!