చల్లారిన పొంగు! త్రిశంకు స్వర్గంలో శీను!!

`కూడలిలో నిలిచిన ప్రయాణం…

`ఎటు వెళ్లాలో నిర్ణయం లేని గమ్యం.

`లక్ష్యం నిర్థేశించుకోలేని సుడి గుండం.

`దిక్కు తోచని వైనం..

`వచ్చిన వాళ్లను వద్దని…

`రమ్మన్న వాళ్లను ఆగమని…

`కొత్త కుంపటి ఎలా వుంటుందని..

`ఊగిసలాటకు చేరుకొని..

`తాడు బొంగురం లేని పార్టీలను నమ్ముకొని..

`అన్ని దారులు తనే మూసుకొని..

` బిఆర్‌ఎస్‌ ను కాదనుకొని..

`అటు..ఇటు కాని పద్మవ్యూహం పన్నుకొని..

`రెంటికీ చెడి…అందర్నీ కాదనుకొని…

`మంది మాటలు నమ్ముకొని…

` కూర్చున్న చెట్టు నరుక్కొని..

` దిక్కులు చూసే స్థితి తెచ్చుకొని…

`బిఆర్‌ఎస్‌ లో ఎవరినీ అసెంబ్లీ గేటు తాకనివ్వనంటివి!

` ఇంటి గేటు దాటలేకపోతుంటివి.

` ఖమ్మంలో శ్రీనివాస్‌ రెడ్డి పెట్టుకున్న పొగ..

` దారి తెన్నులేని నిశీదినెంచుకొని…

హైదరబాద్‌,నేటిధాత్రి:       

తొందర పడి ఒక కోయిలా ముందే కూసింది అన్నట్లు…ఎన్నికల ముందు అందరికంటే ముందే రాజకీయానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెరతీశారు. కాకపోతే …ఇంత కాలం ఆగి..ఆగి..ఇక ఆగలేను..నా ప్రతాపం ఏమిటో చూపుతాను..నేనేంటో రుచి చూపిస్తాను..నా సత్తా నిరూపిస్తాను…2014లోనే ఎంపిగా గెల్చిన నన్ను పక్కన పెట్టినా ఊరుకున్నారు. టిక్కెట్టు ఇవ్వకున్నా ఓర్చుకున్నాను. అయినా నన్ను గుర్తించకపోవడాన్ని కూడా జీర్ణించుకున్నాను. ఇంత కాలం ఓపిక పట్టాను. ఇక నావల్ల కాదు..నేనుండలేను…అంటూ అక్కడా..ఇక్కడా సమ్మేళనాలు, ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశాడు. బల ప్రదర్శనలు చేసి ఆఖరకు బిఆర్‌ఎస్‌కు రాంరాం అన్నాడు. ఇంతా జరిగితే ఏం సాధించాడన్నదే ఇక్కడ అసలు పాయింట్‌. పొంగు చల్లారినట్లు వుంది. త్రిశంకు స్వర్గంలో భవిష్యత్తు కనిపిస్తున్నట్లుంది. బిఆర్‌ఎస్‌ నుంచి బైటకు వచ్చిన నాడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల ఘాటుదనం తగ్గిపోయింది. ఆచి తూచి మాట్లాడేదాకా వచ్చింది. బిఆర్‌ఎస్‌నుంచి వచ్చి ఆ ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను అంటూ రెచ్చిపోయి మాట్లాడారు. మరి ఇప్పుడు ఆయనకే టిక్కెట్టు ఇచ్చేవారు లేకుండాపోతున్నారు. ఆవేశం తెచ్చిన అనర్ధం. తొందరపాటు ఫలితం పొంగులేటిని ఖమ్మం కూడలిలో నిలబెట్టింది. ఎటూ వెళ్లలేని స్ధితిలోకి నెట్టేసేంది. ఆయన ఆలోచన లేకుండా చేసిన పని, ఎవరికీ నచ్చకుండాపోతోంది. అప్పటికీ మంత్రి కేటిఆర్‌ స్వయంగా ఖమ్మం వెళ్లి పొంగులేటితో చర్చలు జరపడం జరిగింది. అయితే అనుయాయులు చెప్పిన మాటలో, చెప్పుడు మాటలో పట్టుకొని పొంగులేటి తన బలాన్ని అతిగా ఊహించుకున్నాడు. అలిగితేనే మంత్రి కేటిఆర్‌ ఆగమేఘాల మీద వచ్చాడు. కాస్త అసహనం చూపితే కేసిఆరే వచ్చేస్తాడనుకున్నాడో..ఏమో! కాని పది మంది అనుచురుల మాట విని మొదటికే మోసానికి తెచ్చుకున్నాడు. 

 మొన్నటిదాకా కనీసం బిఆర్‌ఎస్‌ నాయకుడు అన్న హోదా అయినా వుండేది.

 పొంగులేటి అంటే ఎవరు? అనే దాకా తెచ్చుకున్నాడు. నేడు ఇప్పుడు ఆయన ఎటు వెళ్లలేని స్దితిని తెచ్చుకున్నాడు. కాంగ్రెస్‌లో చేరినా ఆయన ఇమడలేని పరస్ధితి. రమ్మన్నప్పుడు బిజేపిలోకి రాకుండా, ఆలోచిస్తానని ఈటెల లాంటి వారిని సాగనంపాడు. నిజానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బిజేపిలోకి రావడం అన్నది ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఇష్టంలేదని సమాచారం. అందుకే ఈటెల రాజేందర్‌ బృందం ఖమ్మం వెళ్లినప్పుడు బండి సంజయ్‌ చేసిన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమంటున్నారు. పొంగులేటి కాంగ్రెస్‌లోకి వెళ్తాడన్న ప్రచారం కూడా జోరుగానే సాగింది. పొంగులేటికి అంతటి ప్రాధాన్యం ఇవ్వడాన్ని సీనియర్‌ కాంగ్రెస్‌నేతలే జీర్ణించుకోవడంలేదు. ఆఖరకు పిపిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా పొంగులేటి విషయంలో అంత ఆసక్తిని కనబర్చడం లేదు. బిఆర్‌ఎస్‌నుంచి బైటకు వచ్చిన తర్వాత పొంగులేటి పది సీట్ల మాటే ఆయనను అన్ని పార్టీలు దూరం పెట్టేందుకు ఆస్కారం ఏర్పడిరది. అసలు పొంగులేటి బిఆర్‌ఎస్‌నుంచి రావడానికి ఎంత తొందరపడ్డాడో..ఎక్కడా చోటు లేకుండా చేసుకొని ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. గతంలో ఆకస్మాత్తుగా అందిన రాజకీయభవితం ఎప్పుడూ అందుబాటులో వుంటుందని, ఎప్పుడూ కాలం ఒకేలా కలిసి వస్తుందని అనుకున్నాడో ఏమో! కాని పొంగులేటికి ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు కనీసం ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం వుందనేది కూడా ఆయనకే స్పష్టత లేకుండాపోతోంది. భవిష్యత్తు ఆగమ్యగోచరమైపోయింది. 

ఇప్పుడున్న పరిస్దితుల్లో బిఆర్‌ఎస్‌ను ఎదుర్కొవడం అంత సులువైన పని కాదు. 

అంత శక్తి ప్రతిపక్షాల్లో లేదని సాక్ష్యాత్తు ఈటెల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లాంటి సీనియర్లే ప్రకటిస్తుంటే, వారిని నమ్ముకొని పొంగులేటి బైటకు వచ్చి రాజకీయం అంధకారం చేసుకున్నాడు. ఇక ఆయనకు ఒంటరిపోరు తప్ప , ఏ పార్టీ సపోర్టు కష్టమే..ఒక వేళ ఏపార్టీలో అయినా చేరినా ఆయన కావాలనుకునే సీటు కూడా దక్కడం మరీ కష్టమే. ఎందుకంటే ఖమ్మం నుంచి పొంగులేటి పోటీ చేయాలని ఏకంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సవాలు విసిరాడు. ఆయన సవాలును పొంగులేటి స్వీకరించేందుకు సిద్దంగా లేడు. ఎందుకంటే ఆయన ఖమ్మం నుంచి కాకుండా ఇతర నియోజకవర్గాలపై దృష్టిపెట్టినట్లు గతంలో చెప్పుకున్నా, ఇప్పుడు అక్కడ ఆయన గెలిచే పరిస్తితిలేదు. కొంత కాలం ఆయన పాలేరునుంచి పోటీ చేస్తాడన్న ప్రచారం జరిగింది. ఆ స్ధానం నుంచి పోటీ చేస్తానంటూ ఇప్పటికే షర్మిల ప్రకటించింది. అంటే అక్కడ కూడా ధైర్యం చేసి, పొంగులేటి పోటీచేసే అవకాశం లేదు. ఒక వేళ షర్మిల పార్టీలో చేరితే తప్ప ఆయనకు అనుకున్న సీట్లు దక్కవు. పాలేరు అసలే దక్కదు. తెలంగాణలో ఏ ఆదరణ లేని షర్మిల పార్టీలో చేరితే పొంగులేటి రాజకీయం శూన్యం తప్ప, శుభారంభం వుండదు. ఒక వేళ ఒంటిపోరుకు సిద్దపడినా షర్మిలకు వ్యతిరేకంగా ఆయన పోటీచేసే అవకాశం లేదు. ఇక కొత్తగూడెంనుంచి పోటీ చేయాలనుకున్నా అక్కడ బిఆర్‌ఎస్‌ఎంతో బలంగా వుంది. అక్కడ బిఆర్‌ఎస్‌లో పోటీ కూడా ఎక్కువే వుంది. ఇప్పటికే గడల శ్రీనివాస్‌రావు అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, జాబ్‌ మేళాలు ఏర్పాటుచేసి ప్రజలకు చేరువయ్యాడు. పార్టీ టిక్కెట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయనకు టిక్కెట్టు ఇస్తే చాలు..గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందంటున్నారు. అంతే కాకుండా సిట్టింగ్‌ ఎమ్మెల్యే వనమా కూడా పార్టీకి అదనపు బలం అందించేందుకు సిద్దంగా వున్నాడు. అక్కడ కూడా పొంగులేటికి ఎలాంటి చోటు లేదు. అశ్వారావు పేట వంటి నియోజకవర్గాంలో రాజ్యసభ సభ్యుడు హెటిరో పార్ధ సారధి రెడ్డి కుటుంబం ఎటు వేలు చూపిస్తే అటే సుమారు ఎనమిది మండలాల ప్రజలు నిలస్తారు. హెటిరో పార్ధ సారధి ఎవరికి ఓటు వేయమంటే వాళ్లే గెలుస్తారు. అందువల్ల ఆ ఎనిమిది మండలాతో రెండు నియోజకవర్గాలలో బిఆర్‌ఎస్‌కు తిరుగువుండదు. ఇక జిల్లాలో బలమైన నాయకులుగా వున్న సీనియర్‌ నాయకుడు తుమ్మల నాగేశ్వరారావు జిల్లా మొత్తం శాసించే నాయకుడు. ఆయనను ఎదిరించి నిలవడం అన్నది పొంగులేటికి సాధ్యమయ్యే పని కాదు. పొంగులేటికి రాజకీయంగా దారి చూపిన వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు. వ్యాపర పరంగా ప్రోత్సహించిన నాయకుడు తుమ్మలనే కావడం గమనార్హం. అయితే తుమ్మల గత ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం పొంగులేటి అన్న ప్రచారం వుండనే వుంది. ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి రాజకీయాన్ని అడుగడుగునా అడ్డుకోవడం ఖాయం. ఇక ఖమ్మంలో బలమైన నాయకుడుగా, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర వున్నారు. ఆయనకు రాజకీయంగా, సామాజికంగా ప్రజలతో మమేకమైననాయకుడు. ఆయనకు జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున అభిమానులున్నారు. ఆయన ఒక్కమాట చెబితే చాలు..కదిలే జనం లక్షల్లో వుంటారు. లోక్‌సభ బిఆర్‌ఎస్‌ సభా నాయకుడు నామా నాగేశ్వరరావు బలమేమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని దశాబ్దాలుగా ఆయన జిల్లా రాజకీయాలను ఏలుతున్నారు. ఇక సండ్ర వెంకటవీరయ్య లాంటి వారు కూడా బలంగానే వున్నారు. ఇక కాంగ్రెస్‌ విషయానికి వస్తే రేణుకా చౌదరి లాంటి నాయకురాలు ఇప్పటికే పొంగులేటిని ఏకిపారేస్తున్నారు. మధిర నుంచి సిఎల్సీ నాయకుడు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాదయాత్ర నిర్వహిస్తూ, తాను సిఎం రేసులో వున్నాననే సంకేతాలు పంపుతున్నాడు. అలాంటి నాయకుడు వున్న కాంగ్రెస్‌లో ఖమ్మం జిల్లానుంచి పొంగులేటికి తగిన ప్రాధాన్యత అంటే కష్టమే..అందుకే తొంరపడి ముందే కూసిన పొంగులేలికి దారులన్నీ మూసుకుపోయాయి… వెతుక్కునేందుకు కూడా దారిలేకుండాపోయింది. పొంగు చల్లారింది. త్రిశంకు స్వర్గం మిగిలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!