నెక్కొండ, నేటిధాత్రి:
నెక్కొండ మండలం అప్పల రావు పేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో బుధవారం జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బూరుగుపల్లి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గణిత శాస్త్ర ఉపాధ్యాయులు రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో విద్యార్థులను బృందాలుగా విభజించి గణితశాస్త్రంలో క్విజ్ పోటీ నిర్వహించారు . ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.
బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమములో ప్రధానోపాధ్యాయులు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అనడానికి రామానుజన్ జీవితమే నిదర్శనం అన్నారు. తొలి దశలో ఆశించిన ఫలితాలు రాకున్నా విద్యార్థులు నిరుత్సాహం చెందకుండా ముందుకు సాగితే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రవీంద్రనాథ్ సౌభాగ్య లక్ష్మి , యాకయ్య భూలక్ష్మి ,యాకూబ్ పాషా,రమేష్ తదితరులు పాల్గొన్నారు.