హైదరాబాద్, జూన్, 12:
తాను వ్యాపార పరంగా ఎదగడానికి, తద్వారా రాజకీయంగా రాణించడానికి దోహదపడిన గ్రానైట్ కుటుంబాన్ని జీవితంలో ఎన్నడూ విస్మరించబోనని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఏ పదవి లేకుండానే గ్రానైట్ పరిశ్రమ కు ఎంతో చేశానని, ఇప్పుడు
ఎంపీగా ఎన్నికైన తర్వాత ఈ పరిశ్రమ ను కాపాడుకోవడంలో ముందుంటానని పేర్కొన్నారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన రవిచంద్రను తెలంగాణ గ్రానైట్ పరిశ్రమ యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా సన్మానించారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి తరలివచ్చిన వందలాది మంది గ్రానైట్ యజమానుల సమక్షంలో ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీపిరిశెట్టి శంకర్ అధ్యక్షతన జరిగిన సభలో రవిచంద్ర మాట్లాడారు. తనకు రాజ్యసభ సభ్యుడిగా సీఎం కేసీఆర్ అవకాశం కల్పించడానికి గ్రానైట్ పరిశ్రమ ఎంతో దోహదం చేసిందని, అలాంటి
పరిశ్రమ తనకు కన్నతల్లి వంటిదని అన్నారు. ఈ పరిశ్రమ లో ఉన్న వాళ్లంతా తన కుటుంబ సభ్యులని.. వాళ్లకు ఏ కష్టం వచ్చినా కుటుంబ పెద్దగా ముందుంటానని రవిచంద్ర హామీ ఇచ్చారు. పెద్ద మనసు చేసుకుని, పెద్దల సభకు పంపిన సీఎం కేసీఆర్ కు గ్రానైట్ పరిశ్రమ ఎప్పుడూ రుణపడి ఉండాలని అన్నారు.
సభకు ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గ్రానైట్ కుటుంబం నుంచి ఇంత కాలం నేనొక్కడినే ఎంపీగా ఉన్నానని.. ఇప్పుడు రవిచంద్ర కూడా ఎంపీగా ఎన్నికవడం సంతోషకరమన్నారు. పరిశ్రమకు ఇక
మీదట తామిద్దరం అండగా ఉంటామని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కు ఒకే సారి రెండు రాజ్యసభ పదవులు ఇచ్చిన కేసీఆర్ ను గ్రానైట్ పరిశ్రమ మరొవద్దని అన్నారు.
ఈ సభలో గ్రానైట్ పరిశ్రమల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాయల నాగేశ్వరరావు, ప్రతినిధులు పాటిబండ్ల యుగంధర్, ఉప్పల వెంకటరమణ, గంగుల ప్రదీప్, జిల్లా అశోక్, చక్రధర్ రెడ్డి, శరాబందీ, తుళ్లూరి కోటేశ్వరరావు, పుసులూరి నరేందర్, తమ్మినేని వెంకట్రావు, ఫణి కుమార్, శ్రీధర్, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.