గంజాయ్, గుట్కా, గుడుంబా నియంత్రణపై పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం.

భూపాలపల్లి నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గంజాయి, గుట్కా, గుడుంబా అమ్మకాలు జరగకుండా సంయుక్తంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీం పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో గుడుంబా, గుట్కా, గంజాయి అమ్మకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ సమయంలో జిల్లాలో గుడుంబా, గుట్కాల అమ్మకం జరుగుతున్నాయని అదేవిధంగా కాటారం మండలంలో మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చి యువతకు గంజాయి అమ్ముతున్నారని సమాచారం వస్తుంది కాబట్టి జిల్లా అదనపు కలెక్టర్ రాజావిక్రమ్ రెడ్డి నేతృత్వంలో పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల అధికారులు సంయుక్తంగా గుడుంబా, గుట్కాలు, గంజాయి అమ్ముతున్నట్లు అనుమానం ఉన్న ప్రాంతాల్లో నిఘా ఉంచి ప్రత్యేకంగా దాడులు చేసి అవి అమ్మకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గుట్కాలు తినడం, గుడుంబా గంజాయి సేవించడం కూడా కరోనా వ్యాధి లాగానే చాలా అపాయకరమైనవని వీటి నుండి జిల్లాలోని యువతను కాపాడేలా అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం జిల్లా అదనపు కలెక్టర్ రాజావిక్రమ్ రెడ్డి, ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీధర్ రెడ్డి, భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, కలెక్టరేట్ ఏవో మహేష్ బాబు, తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *