-ఎవరినీ కలవడు! ఎవరినీ కలుపుకుపోడు!?
– 2018లో ఓటమికి అదే కారణం?
-అయినా మారని తీరు!
-ఉప ఎన్నికలలో పార్టీ నేతలు ఎంత వద్దన్నా…కూసుకుంట్లకే దక్కిన టికెట్!
-అన్నీ మర్చిపోయి కూసుకుంట్లను గెలిపిస్తే, కూసుకుంట్లలో విశ్వాసం లేదు?
-ఇప్పటికీ ఎమ్మెల్యే మారడం లేదు?
-ఆయనలో మార్పు వస్తుందన్న నమ్మకం పార్టీ శ్రేణులలో లేదు?
– ఎన్నికైన నుంచి ప్రజల్లో వుంటున్నది లేదు?
– కార్యకర్తలతో సమావేశమైంది లేదు?
– వచ్చే ఎన్నికల గురించి ఆలోచన లేదు?
-పార్టీకి నష్టం జరుగుతుందన్న బాధ లేదు?
-నాయకులు కలవాలని కోరుతున్నా సమయం ఇవ్వడం లేదు?
-హడావుడిగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమం?
-నాయకులకు అందని ఆహ్వానం?
-అసంతృప్తితో రుగులుతున్న పార్టీ గణం?
– సార్వత్రిక ఎన్నికలలో కూసుకుంట్లను మార్చితే గాని లాభం వుండదు?
-టికెట్ రాదనే కూసుకుంట్ల ఒంటెద్దు పోకడలు?
– నూతన నాయకత్వం కోసం మునుగోడు ఎదురుచూపు?
– వెంటనే పార్టీ స్పందిస్తేనే మునుగోడు దక్కు!
హైదరబాద్,నేటిధాత్రి:
మునుగోడు…తెలంగాణ రాష్ట్రంలో ఈ నియోజకవర్గం ప్రత్యేకతను సంతరించుకున్నది. ఇటీవల మరింత చర్చలో వున్నది. రాజకీయ చర్చకు వేదికౌతోంది. ఎమ్మెల్యేగా వున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అతి విశ్వాసంతో రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. దాంతో తెలంగాణనే కాదు దేశమంతా మునుగోడు వైపు చూసింది. మునుగోడు నియోజకవర్గం రాజధాని నగరమైన హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో వుండే నియోజకవర్గం. సమస్యల నిలయమైన నియోజకవర్గం. ప్రజలకు ఒకప్పుడు కనీసం మంచినీరు కూడా అందలేని నియోజకవర్గం. ఫ్లోరైడ్ భూతం పట్టిపీడిస్తే విలవిలలాడిన నియోజకవర్గం. ఉమ్మడి నల్లగొండ అంటేనే ఫ్లోరైడ్ బాధితులకు నియలం. మునుగోడు అంటే అన్ని ప్రాంతాలకంటే ఎక్కువ శాతం ఫ్లోరైడ్ వున్న ప్రాంతం. ఆ నియోజకవర్గ గ్రామాలకు ఇతర ప్రాంతాలను నుంచి ఆడపిల్లను ఇవ్వాలన్నా ఇచ్చేవారు కాదు. ఉద్యోగులు కూడా ఆ మునుగోడుకు వెళ్లాలంటే భయపడేవారు. అక్కడి నీళ్లు కొంత కాలం తాగితే చాలు..శరీరంలో వచ్చే మార్పులకు జీవితాలు చిద్రమయ్యే పరిస్థితి వుండేది. అయినా ఉమ్మడి రాష్ట్రంలో నలభై ఐదేళ్లు పాలించిన కాంగ్రెస్ పట్టించుకోలేదు. పదిహేడేళ్లు పాలించిన తెలుదేశం పార్టీ ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపలేదు. ప్రజలకు కనీసం గుక్కెడు మంచినీరు ఇవ్వలేదు. దీనిపై ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ ఉద్యమ సమయంతో పాదయాత్ర కూడా జరిపారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్లినా పరిష్కరించలేదు. కాని తెలంగాణ వచ్చిన వెంటనే, కొద్ది రోజుల్లోనే మునుగోడు నియోజకవర్గం మొత్తానికి పైలెట్ ప్రాజెక్టు కింద ఇంటింటికీ మంచినీటి సరఫరా చేశారు.
దశాబ్దాల తరబడి ప్రజల జీవితాలను చిద్రం చేసిన ఫ్లోరైడ్ రక్కసిని పారద్రోలాడు ముఖ్యమంత్రి కేసిఆర్ .
అలాంటి నియోజక వర్గం ఎమ్యెల్యే అంటే అంకితభావంతో పని చేయాలి. ఎన్ను ప్రజలకు వున్న సమస్యల పరిష్కారానికి ఎంత కృషి చేయాలి. తెలంగాణ మొత్తం మీద మునుగోడును ఎంతో అందంగా, ఆదర్శంగా, సమస్యలు లేని నియోకవర్గంగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశయం. కాని మునుగోడు ఎమ్యెలే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేన్నది ఆదినుంచి వున్న ఆరోపణే. 2014 ఎన్నికల్లో మునుగోడు నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంత మనసుపెట్టి, శ్రద్ద పెట్టి మునుగోడును అభివృద్ధి చేసినా, ప్రజలు కూసుకుంట్లను ఓడిరచారంటే ఆయన వ్యవహార శైలి ఎలాంటిదో అర్దం చేసుకోవచ్చు. అయినా కూసుకుంట్లకు మరో అవకాశం వచ్చింది. 2018 ఎన్నికల్లో కూసుకుంట్ల మీద గెలిచిన రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. మళ్లీ కూసుకుంట్లకు అవకాశంవచ్చింది. ఆ ఉప ఎన్నికల సమయంలోనే మునుగోడుకు చెందిన బిఆర్‌ఎస్ నేతలు కూసుకుంట్లకు టిక్కెట్ ఇవ్వడాన్ని స్వాగతించలేదు. అయినా పార్టీ మీద అభిమానం, ముఖ్యమంత్రి కేసిఆర్ మీద వున్న గౌరవంతో అందరూ సహకరించారు. నిజానికి ఆ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ శ్రేణులు ఏ మాత్రం అశ్రద్ద చేసినా, కూసుకుంట్ల ఓడిపోయే తరుణం. అయినా అందరూ కలిసికట్టుగా పనిచేశారు. కూసుకుంట్లకు పూర్తి స్ధాయిలో సహకరించారు. తమకు ఎంత అసంతృప్తి వున్నా పార్టీకోసం పనిచేయాన్న కసితోపని చేశారు.
విభేదాలన్నీ పక్కనపెట్టారు. మొత్తానికి పదివేల మెజార్టీతో కూసుకుంట్లను గెలిచించారు.
ఆ సమయంలో పది వేల ఓట్ల మెజార్టీ అంటే సామాన్యమైన మాట కాదు. బిఆర్‌ఎస్ పార్టీ నాయకుల, కార్యకర్తల బలానికి అంకితభావానికి సంకేతం. ఇలా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రజలకు చేరవ కావడంలో విఫలం కావడం అన్నది బిఆర్‌ఎస్ నాయకులకు ఆందోళనకు గురిచేస్తోంది. 2014 ఎన్నికల్లో గెలిచి పార్టీని పట్టించుకోలేదు. పార్టీకోసం ఎలాంటి పనులు చేయలేదు. నాయకులకు మేలు చేయలేదు. కార్యకర్తలను కనీసం పరిగనలోకి తీసుకోలేదు. దాంతో 2018లో తెలంగాణ అంతటా బిఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టిస్తే మునుగోడులో మాత్రం కూసుకుంట్ల ఓడిపోయారు. నిజానికి ఆ ఎన్నికల్లో కూసుకుంట్ల బంపర్ మెజార్టీతో గెలవాలి. ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి కేసిఆర్ మీద ఎంత ప్రేమ వున్నా, ఎమ్యెల్యేపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తి మూలంగా బిఆర్‌ఎస్ మునుగోడులో ఓడిపోయింది. అయినా కూసుకుంట్ల కళ్లు తెవరలేదు. మరోసారి అవకాశం కల్పించారు.
అయినా కూసుకుంట్ల తీరులో మార్పు రావడం లేదు.
ఇది ఇప్పుడు బిఆర్‌ఎస్‌లో పెరిగిపోతున్న ఆందోళనకు కారణమౌతోంది. తాజాగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఆ కార్యక్రమానికి సీనియర్లనైన పార్టీ నేతలను ఎమ్మెల్యే పివలేదని సమాచారం. ఆయన పిలవకపోవడంతో చాలా మంది సీనియర్లు అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. పరిస్దితి పట్టు తప్పేలా వుందని తెలియడంతో జిల్లా మంత్రి జగదీశ్వరరెడ్డి రంగంలోకి దిగి మళ్లీ కార్యక్రమం ఏర్పాటు చేయించారు. లేకుంటే ఈ అసంతృప్తి మరింత పెరిగితే. ప్రతిసారి మంత్రి జగదీశ్వరరెడ్డి ఇలా సర్ధుకునేలా చేస్తూ, ఆయనకు కూడా కూసుకుంట్ల వ్యవహారం తలనొప్పిగా మారిందన్న మాటలే వినిపిస్తున్నాయి. మంత్రి జగదీశ్వరరెడ్డి అండదండలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేయాల్సిన ఎమ్మెల్యే కూసుకుంట్ల నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నాడని అంటున్నారు. అసలు పార్టీలో కుంపటి రాజుకునేలా చేస్తున్న వ్యవహారమే కూసుకుంట్లదంటూ చాలా మంది సీనియర్లు ఆయనపై అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. గత ఎన్నికల ముందున్న అసంతృప్తి తగ్గాల్సిందిపోయి, మరింత పెరడానికి కూడా కారణం కూడా కూసుకుంటే అని అంటున్నారు. ఇక ఆయన వ్యవహార శైలి మారదని పార్టీ నేతలు కూడా గట్టి నిర్ణయానికి వచ్చారు. గతంలో ఓటమికి ఇదే కారణమైనా ఆయనకు తత్వం బోధపడలేదని బహరింగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అన్నీ మర్చిపోయి కలిసిపోతున్నా, ఎమ్మెల్యే పట్టించుకోకపోవడాన్ని నాయకులు జీర్ణించుకోవడం లేదు. నిజానికి మునుగోడు అన్నది బిఆర్‌ఎస్‌కు బలమైన ప్రాంతం.
ఆ నియోజకవర్గం నుంచి ఎంతో మంది బలమైన నేతలున్నారు.
వారందరి సహాకారం పొందిన కూసుకుంట్ల వారిని పట్టించుకోకపోవడం అన్నది పార్టీ వ్యతిరేకతను ప్రదర్శించడమే అవుతుంది. మేం సేవ చేస్తాం మొర్రో అని ఎంతో మంది నాయకులు గత ఎన్నికల మందు పార్టీకి ఎన్నో విన్నపాలు చేసుకున్నారు. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయాన్ని అందరూ శిరసావహించారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక్కసారి మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. 2018లో ఓడిపోయిన కూసుకుంట్లకు భవిష్యత్తులో టికెట్ నీదే అని హామీ ఇచ్చారట. అయితే అనుకోని వరంలా ఉప ఎన్నిక కలిసొచ్చింది. అది కూసుకుంట్లకు మరోసారి అవకాశం అందించింది. ఎంత మంది క్యూ కట్టినా , టిక్కెట్ ఆయనకే దిక్కింది. ఆయన అదృష్టం బాగుండి విజయం కూడా కూసుకుంట్లనే వరించింది. ఇలాంటి సమయంలో ఆయన ప్రజలకు ఎంతో కృతజ్ఞతగా వుండాలి. కాని అది జరగడం లేదన్నది నియోజక వర్గ ప్రజల మాట. అందుకే ఈసారి మాత్రం టిక్కెట్ ఖచ్చితంగా బిసి వర్గాలకు చెందిన నాయకులకే ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. కూసుకుంట్లను పక్కన పెట్టకపోతే ఇతర పార్టీలకు పూలలో పెట్టి సీటు సమర్పించుకన్నట్లే అని బాధపడుతున్నారు.