కాంగ్రెస్ లో ముదిరిన రాజకీయ సంక్షోభం..
# ఎమ్మెల్యే సీతక్కతో సహా 12 మంది కీలక నేతలు రాజీనామా
# కాంగ్రెస్ పార్టీ వ్యవహారంపై ముందే చెప్పిన
నేటిధాత్రి దినపత్రిక
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం పట్ల నేటిధాత్రి దినపత్రిక చెప్పింది నిజమైంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల నేటిధాత్రి ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తూనే ఉన్నది. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ల వర్గం మరోవైపు పోరుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. సీనియర్ల వివాదం నడుస్తుండగానే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలు సంచలన కీలక నిర్ణయం
తీసుకున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన 12 మంది ముఖ్య నేతలు ఆదివారం తమ పదవులకు రాజీనామా చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క,సీహెచ్ విజయరమణారావు,
కల్వంపల్లి సత్యనారాయణ, సుభాష్ రెడ్డి,పటేల్ రమేష్ రెడ్డి,చిలుమ మధుసూదన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి,దొమ్మాటి సాంబయ్య, జంగయ్య యాదవ్,చారగొండ వెంకటేష్, సత్తు మల్లేష్, శశికళ యాదవరెడ్డి వంటి కీలక నేతలంతా టీపీసీసీ వ్యవహారాల ఇన్చార్జీ మాణిక్యం ఠాగూర్ కు రాజీనామా లేఖను పంపించారు. తమకు పదవులు ఇవ్వడం వల్ల సీనియర్లు అసంతృప్తితో ఉన్నారని,తమ పదవులు వారికి ఇవ్వాలంటూ లేఖలో పేర్కొన్నారు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నేతల ఆరోపణలను తిప్పికొట్టేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వర్గం సిద్ధమైంది. ప్రధానంగా అసంతృప్తి నాయకులు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూనే ఆయా నాయకుల వ్యాఖ్యలు పార్టీని ఏ విధంగా దెబ్బతీసేటట్టు ఉన్నాయో స్పష్టం చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ను బలహీనపరిచే కుట్రకు అసంతృప్తి నేతలు తెరతీస్తున్నారనే దిశలో గట్టిగా స్పందించాలని రేవంత్ వర్గం భావిస్తోంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి నష్ట నివారణ చర్యలు అధిష్ఠానం చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులు జోక్యం చేసుకుని అసంతృప్తి నేతలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఏఐసీసీ కార్యదర్శులు అసంతృప్తి నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.