`ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుడే!
`దేశమంతా కదిలించుడే
`బిజేపిని ఎండగట్టుడే…
`ఇదా కేంద్ర పాలన…
`రైతు గోస వినిపించదు…
`నిరుద్యోగ సమస్య కనిపించదు..
` ఇంత దిగజారుడు తనం ఎక్కడా లేదు.
` ప్రాజెక్టులు కట్టరు…
` ఉద్యోగాలివ్వరు…
` రైతు సంక్షేమం పట్టదు…
`అమ్ముడు తప్ప కొత్తవి సృష్టించలేరు…
` రాష్ట్రాల ప్రగతి నిరోధకులను వదిలిపెట్టేది లేదు.
హైదరాబాద్,నేటిధాత్రి: ముఖ్యమంత్రి కేసిఆర్ అంతర్మధనంలో పడ్డాడు. ఆగమౌతున్నాడు. ఆలోచనలో పడ్డాడు. బిజేపితో ఎందుకు కయ్యం పెట్టుకున్నానని మధనపడుతున్నాడు. బెంబేలెత్తిపోతున్నాడు. బిఆర్‌ఎస్ బంద్ చేస్తడు. ఆ ఊసే ఎత్తడం లేదు. ఇలా రకరకాల వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిళ్లలో వినిపించాయి. కాని ఒక్కసారిగా వాటన్నింటినీ పటాపంచెలు చేస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ మహాబూబ్ నగర్‌లో బెబ్బులా గర్జించారు. బిజేపిని ఆటాడుకున్నాడు. తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. కేంద్రాన్ని కడిగిపారేశాడు. ప్రధాని మోడీని ఉతికి ఆరేశాడు. ఒక ప్రధాన మంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? అంటూ ప్రభుత్వాలను కూల్చడమే కేంద్రం పనా అంటూ ప్రశ్నించాడు. ప్రజలు తమను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్లే ఎన్నుకున్న సంగతి ప్రధానికి తెలియదా? మర్చిపోయారా? ప్రగతిలో పరుగులు పెడుగున్న రాష్ట్రాలను చూసి ఓర్వలేకపోతున్నారా? అంటూ కేంద్రాన్ని దుమ్ముదులిపాడు. అంతే కాదు కేంద్రంతో కొట్లాడడంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నట్లు తేల్చేశాడు. కేంద్రాన్ని నిలదీసుడే అని ఘంటాపథంగా చెప్పేశాడు. మహబూబ్‌నగర్ సభలో జై భారత్ నినాదాలు చేశారు. ప్రజల చేత చెప్పించాడు. బిఆర్‌ఎస్ జిందాబాద్ అనిపించాడు. నేను మీకోసం వున్నాడు. నా కోసం మీరు ఆలోచించండని కూడా చెప్పారు. ఇక కేంద్రం చేసిన తప్పులపై గళమెత్తుడే అన్నది మరోసారి గుర్తు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి నిలదీసుడే అని కూడా చెప్పారు. ఎనమిదేళ్ల కాలంలో కృష్ణానదీ జలాల వాటాలను తేల్చలేని దద్దమ్మ ప్రభుత్వం అని కేంద్రాన్ని ఎద్దేవా చేశారు. సమాఖ్య స్పూర్తిని వదిలి సాము చేస్తున్న బిజేపికి ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారన్నారు. తెలంగాణ బాగుపడడం కేంద్రం ఓర్వలేకపోతున్నదన్నాడు. దేశంలో తెలంగాణ కూడా ఒక భాగం. మన ప్రాంతం బాగుపడితే అది దేశానికే మంచి పేరు. కాని కేంద్రంలో కూర్చున్న నాయకులు తెలంగాణను రాజకీయంగా తమది కాదనుకుంటున్నారని అందుకే ఇబ్బందులు పెడుతున్నారని కేసిఆర్ ఆరోపించారు.
పద్నాళుగేళ్లపాటు తెలంగాణ కోసం కట్లాడినం.
తెలంగాణ సాధించుకున్నం. తెలంగాణ వచ్చిన రెండేళ్లలో కరంటు కష్టాలు తీర్చుకున్నం. రెండేళ్లలో సాగు రంగానికి కూడా ఇరవైనాలుగు గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేసుకుంటున్నాం. అంతే కాదు ఒక రైతు ఎన్ని బోర్లు వేసుకున్నా, ఎన్ని మోటార్లు పెట్టుకొన్నా సరే… రైతు బాగుపడడమే మనకు కావాల్సింది. ఒకనాడు మహబూబ్ నగర్ జిల్లాలో ముప్పై ఎకరాల భూమి వున్న రైతు కూడా హైదరాబాద్‌లో కూలి చేసుకున్న సంఘటనలున్నాయి. దౌర్భాగ్య పరిస్ధితులు ఎదుర్కొన్న రోజులున్నాయి. అంతే కాదు బొంబాయి లాంటి ప్రాంతాలకు వలసలు వెళ్లిన సమయం అందరం చూసిందే…మరి నేడు వలసలు వెళ్లిన రైతులంతా తెలంగాణకు వచ్చారు. వారి వారి పల్లెలో సాగు చేసుకుంటున్నారు. రైతు బంధు అందుకుంటున్నారు. ఎవరికీ ఎదురు చూడకుండా పెట్టుబడి సాయం పొందుతున్నారు. మహబూబ్‌నగర్ పక్కనే వున్న కర్ణాకట రాష్ట్ర ప్రజలు తాము తెలంగాణలో కలుస్తామంటున్నారు. వ్యవసాయ పనులు చేసేందుకు అక్కడినుంచి ఇక్కడికి కూలీకి వస్తున్నారు. ఇదీ తెలంగాణ సాధించిన విజయం అని కేసిఆర్ అన్నారు. తెలంగాణలో ప్రతి పల్లెకు మిషన్ భగీరధ ద్వారా సురక్షితమైన మంచినీరు అందిస్తున్నాం. గుజరాత్‌లో కనీసం మంచినీటి సరఫరా కూడా సరిగ్గాలేదు. దేశ రాజధానిలో ఇప్పటికీ మంచినీటి సౌకర్యం పూర్తిగా లేదు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాలు అనుసరించాలని చెప్పాల్సిన కేంద్రం ఓర్వలేని తనాన్ని ప్రదర్శించడం విడ్డూరమన్నారు. దేశంలో ఎక్కడన్నా తెలంగాణలో అమలౌతున్న సంక్షేమ పధకాలు అమలౌతున్నాయా? అని ప్రశ్నించారు. ఓర్వలేని తనం వున్నవాళ్లు ప్రజలు మాయ చేయాలని చూస్తారు. వారి మాటలు నమ్మి ఆగం కావొద్దన్నారు. తెలంగాణ తెచ్చుకొని కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటు చేసుకొని, ప్రజలకు ప్రభుత్వసేవలు మరింత అందుబాటులోకి తెచ్చుకున్నామన్నారు. అదే ఉమ్మడి రాష్ట్రంలోవుంటే మహబూబ్‌నగర్‌కు ఐదు మెడికల్ కాలేజీలు వచ్చేవా? అని కేసిఆర్ గుర్తు చేశారు. తాను మహబూబ్ నగర్ ఎంపిగా వున్న సమయంలోనే తెలంగాణ సాధించాను. పాలమూరు` రంగారెడ్డి పూర్తి చేయాల్సిన అవసరం వుంది. పనులు జరగుతున్నాయి. అవి పూర్తయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కనీసం ముప్పై లక్షల ఎకరాలకు సాగునీరు అందుతందని కేసిఆర్ చెప్పారు.
అందుకే ఇక దేశమంతా కదిలించే ప్రయత్నం చేయాల్సిందే…
బిజేపిని అడుగడుడునా ఎండగట్టాల్సిందే. వ్యవస్ధలను నిర్వీర్యం చేస్తున్న బిజేపిని ఎండగట్టాల్సిందే అని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. రాష్ట్రాల ప్రగతిని అడ్డుకుకే కేంద్రాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. రైతు గోస వినిపించడదు. రైతుల గోడు పట్టదు. దేశంలో గత డెబ్బైఏళ్లలో ఎన్నడూలేని విధంగా రైతులు ఏడాది కాలం పాటు రోడ్లపై వుండి ధర్నాలు, నిరసలను చేశారు. రైతులను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ శక్తుల కోసం పనిచేస్తోందని కేసిఆర్ అన్నారు. దేశంలో ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, నిరుద్యోగ సమస్యను విపరీతంగా పెంచిందని కేసిఆర్ కేంద్రాన్ని దుయ్యబట్టారు. ఎంత సేపూ రాజకీయాలు తప్ప, అభివృద్ధి గురించి చర్చించిన సందర్భమే కనిపించడం లేదన్నారు. ఇంత దిగజారుడు తనం ప్రపంచంలో ఎక్కడా ఏ రాజకీయ పార్టీలోనూ కనిపించదన్నారు. కేంద్రంలో బిజేపి అధికారంలోకి వచ్చిన ఈ ఎనమిదేళ్లలో కేంద్రం సొంతంగా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది లేదు. పూర్తి చేసింది లేదు. మన దేశంలో పుష్కలమైన జల వనరులున్నాయి. దేశమంతా సస్యశ్యామలమయ్యేంత నీటి వనరులున్నాయి. ఏటా మన దేశంలో సుమారు 60వేల టిఎంసిల నీరు సముద్రాల పాలౌతోంది. అందులో కనీసం సగం నీటిని వినియోగించుకున్నా, దేశం ఏనాడు బాగుపడేది. ఆహారభద్రతలో ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలబడేదని కేసిఆర్ అన్నారు. తెలంగాణ నమూనాగా జరిగిన అభివృద్ధి దేశమంతా జరగాలి. తెలంగాణలో అమలౌతున్న అన్ని సంక్షేమ పథకాలు దేశమంతా అమలు కావాలి. సంక్షేమరాజ్య నిర్మాణం జరగాలన్నదే తన ప్రధాన ద్యేయమని కేసిఆర్ చెప్పారు. అందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
గతంలో ప్రభుత్వాలు నెలకొల్పిన ప్రభుత్వ రంగ సంస్ధలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై వుందన్నారు.
దేశంలో బిజేపి రాజకీయంగా బరితెగింపును ప్రజల ముందు దోషిగా నిలబెట్టాల్సిందే. కేంద్రం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అసవరం వుందన్నారు. లేకుంటే దేశ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని కేసిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు వచ్చి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడతామని అనడం ఎంత వరకు కరక్టు అని నిలదీశారు. వారికి చేత కాదు…అభివృద్ధి చేస్తున్న రాష్ట్రాలను చూసి ఓర్వలేని బిజేపిని ఓడిరచడమొక్కటే ప్రజల కర్తవ్యం కావాలన్నారు. ప్రగతి శీల శక్తులు ఏకం కావాలన్నారు. యువత దేశంలో ఏం జరుగుతుందన్నదానిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.