ఎనమిదేళ్లుగా తిప్పుకుంటున్న ఏఈ

`రూ.20 వేలు తీసుకొని కూడా బిల్లుల్విడంలేదు

`నేటిధాత్రిని ఆశ్రయించిన బాధితుడు రాజబాబు!

`ఎనమిది లక్షల కోసం ఎనమిదేళ్లుగా ఎదురుచూపు

`ఎప్పుడగినా ఇదిగో…అదిగో అంటూ ఏఈ దాటవేత

`ఏడెనమిది సార్లు చెప్పిన జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు!

` అయినా ఏఈ బిల్లులు ఇవ్వలేదు

`2014లో చేసిన పనులు…ఇంకా రాని బిల్లులు

`అప్పులు తీరక, వడ్డీలకు వడ్డీలతో బతుకు గుళ్ల

`ఇలాంటి అధికారుల మూలంగా ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి

`ఆఫీసుకు నెలకోసారి కూడా రాడు…వచ్చినా ఎప్పుడొస్తాడో..ఎప్పుడు వెళ్తాడో తెలియదు

`బాధితులకు కంటికి కనిపించడు

`చేసిన పనులకు బిల్లులివ్వడు బాధితులు గోడు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఒక కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించడానికి ఎనమిదేళ్లా? ఆశ్యర్యంగా వుందా? అవును కొన్ని విషయాలు వినడానికి విచిత్రంగానే వుంటాయి. కాని అనుభవించేవారికి ఎంత నరకంగా వుంటుంది. వినడానికే ఇంత బాధపడుతున్న పాఠకులకు, అనుభవిస్తున్న బాధితుడు ఎంత నలిగిపోవాలి. ఇంకా బిల్లు చెల్లింపు ఊసు లేదు. రూపాయి ఇచ్చింది లేదు. ఇస్తానని ఖచ్చితంగా ఒక తేదీ చెప్పింది లేదు. తిరుగు ఎంత కాలం తిరుగుతావో…నీ ఓపిక ఎంతుందో చూస్తానన్నంతగా ఓ ఏఈ నిర్వాకమిది. చిక్కడు…దొరకడు….నెలకోసారి కూడా కార్యాలయానికి సరిగ్గా రాడు?…వచ్చినా ఎప్పుడొస్తాడో…తెలియదు? ఎంత సేపు కార్యాలయంలో వుంటాడో అన్నది ఎవరికీ తెలియదు? వచ్చింది, వెళ్లింది వార్త తప్ప ఏఈ కనిపించడు? ఏఈ బాధితులు చెబుతున్న మాట…

కాంట్రాక్టర్లుగా లక్షలాది రూపాయల పనులు చేసి బోరు మంటున్న బాధితులు. చేసిన పనులకు ఏళ్లకేళ్లుగా బిల్లులు చేతికి రాకపోతే, బతికేదెలా? చేసిన అప్పులు చెల్లించేదెలా? సమాజంలో ఒకప్పుడు హుందాగా తిరిగిన కాంట్రాక్టర్లు రోడ్డెక్కాలంటే భయపడుతున్నారు. బాధపడుతున్నారు. అప్పులు ఇచ్చిన వాళ్లకు బిల్లులు రాగానే తీర్చేస్తామని చెబుతుంటే విసుక్కుంటున్నారు. ఎన్ని సార్లు చెబుతారని తిట్టుకుంటున్నారు. ఏం చేయమంటారు? ఇస్తా…ఇస్తా…అన్న మాట తప్ప ఇవ్వడు…ఇలా ఏళ్లకెళ్లు తిప్పుకుంటూ పోతాడో? అన్నది కూడా అర్ధం కాని పరిస్ధితి. అయినా ఇంత కాలం తిప్పించుకోవడం ఏమిటి? అసలు విషయం తేల్చడు…బిల్లులు చెల్లించడు..? ఇదో రకమైన వేధింపే…అని చెప్పడానికి వేరే మార్గమే లేదు…

                అతని పేరు రాజా బాబు…ఓ సాధారణ కాంట్రాక్టర్‌. 2014 వరకు ఏవో చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేసుకుంటుండేవారు. ఆ పనులతో సమాజంలో గౌరవంగా బతికేవాడు. పైగా తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు. ఎనమిదేళ్లుగా ఏఈ బాధితుడు…పగబట్టినట్లే ఏఈ ఎనమిదేళ్లుగా తిప్పుకుంటుంటే ఏడ్వలేక, నవ్వలేక, లక్షలాది రూపాయలు వదులుకోలేక, కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. కన్నీటిని దిగమింగుకుంటున్నాడు. 2014 చివరలో మహాదేవ్‌పూర్‌ పట్ణణంలో తన స్నేహితుడితో కలిసి, సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాడు. రోడ్డు పూర్తయింది. అధికారుల చేయాల్సిన విధులు పూర్తి చేశారు. ఎంబిలు రూపొందించారు. చెక్కు కూడా ఇచ్చారు. అప్పుడు మహాదేవ్‌ పూర్‌ ఏఈగా అశోక్‌కుమార్‌ వున్నారు. అయితే ఆ సమయంలో చెక్కు చెల్లలేదు. ఇంతలో ఏఈ. అశోక్‌ కుమార్‌ తబాదలైపోయాడు. ప్రస్తుత ఏఈ వచ్చాడు. ఆ సమయంలో ప్రత్యేకంగా అశోక్‌ కుమార్‌ సదరు రాజా బాబుకు బిల్లులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అప్పుడు సరే అన్నాడు…అదే మాట ఎనమిదేళ్లవుతున్నా చెబుతూనే వున్నాడు. కాని బిల్లులు చెల్లించడం లేదు. అలా ఏఈ దగ్గరకు తిరిగి,తిరిగి వేసారి, రాజాబాబు ఈ విషయాన్ని పెద్ద పల్లి జడ్పీ చైర్మన్‌ పుట్టా మధుకు దృష్టికి తీసుకెళ్లాడు. పట్టా మధు కూడా కనీసం ఓ ఏడెనమిది సార్లు చెప్పి వుంటారు… పుట్ట మధు ఫోన్‌ చేసిన ప్రతీ సారి రేపే ఇచ్చేస్తానని చెప్పడం, తర్వాత ఏఈ అందుబాటులోకి రాకపోవడం…? ఇదీ ఎడేళ్లుగా రాజాబాబు పడుతున్న అవస్ధ. 

` ఏఈకి రూ.20 వేలు కూడా ఇచ్చాను?: 

చేసిన అప్పులకు వడ్డీల మీద వడ్డీలు చెల్లించడం తప్ప, అసలు చెల్లించలేకపోతున్నాను. బిల్లులు వస్తే అప్పులు తీర్చుకుందామనుకుంటే జీవితం ఎండమావులౌతున్నాయి రాజాబాబు ఆవేదన చెందుతున్నాడు. ఏఈ మనసులో పెట్టుకొనే ఇదంతా చేస్తున్నాడని అర్ధమై, ఓ 20 వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని కూడా చెప్పాడు. అయినా ఆయన వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ఇంకా ఇంకా కావాలన్నట్లు ఆయన ఆలోచన తెలుస్తోంది. కాని ఇప్పుడున్న పరిస్ధితుల్లో అప్పు పుట్టే పరిస్ధితి కూడా లేదు. కుటుంబం గడవడమే కష్టంగా వుంది. అలాంటి సమయంలో కూడా ఇంకా కొంత ఇస్తేనే తప్ప బిల్లులు ఇవ్వనన్నట్లే ఏఈ వున్నారు అని రాజాబాబు బోరున విలపిస్తున్నాడు. ఇన్నేళ్లు గడుస్తున్నా అయ్యో! అన్న కనికరం కూడా ఏఈకి లేదు. నాకేంటి అన్న ధోరణి తప్ప మరేం కనిపించడం లేదు. ఇలాంటి అధికారులుంటే ఇక సమాజం ఎలా బాగుపడుతుందని రాజబాబు అంటున్నాడు. 

` నేటిధాత్రి వార్తలు చూశాక…మాకు ఒక గొంతులా కనిపించింది?: 

ఈ మధ్య ఏఈ ఆగడాలపై వరస కథనాలు రాస్తున్న నేటిధాత్రి మాకు కొండంత అండగా కనిపించింది. మూడు రోజుల క్రితం ఓ బాధితుడు నేటిధాత్రిని ఆశ్రించాడని తెలియగానే అతనికి బిల్లులు వచ్చాయని తెలిసింది. దాంతో మాకు నమ్మకం ఏర్పడిరది. అందుకే నేటిధాత్రి మా బాధ చెప్పుకోవాలనుకున్నాను. నా వేధన చెప్పుకుంటున్నానని రాజు అన్నారు. ఈ ఎనమిదేళ్లలో బిల్లులు రాక, మరే పనులు చేయలేక, ఆఖరకు కొత్త పనులు కూడ ఏఈ ఇవ్వక అనేక అవస్ధలు ఎదుర్కొంటున్నామని రాజాబాబు చెప్పుకొచ్చాడు. తనలాంటి వారు ఎంతో మంది ఏఈ బాధితులున్నారని, వారి వద్ద నుంచి కూడా పెద్ద మొత్తంలో ఆశించే తమలాంటి వారిని ఏఈ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని రాజాబాబు వాపోయాడు. 

` డామిట్‌ కథ అడ్డం తిరగింది?: 

తన తప్పును కప్పిపుచుకునేందుకు ఏఈ కలెక్టర్‌కు పిర్యాధు చేయాలనుకొని వెళ్లి, నేటిధాత్రి కథనాలను గురించి చెప్పుకున్నట్లు తెలిసింది. అయితే దాంతో తన గోతిని తానే తవ్వుకున్నట్లు ఆయన పై అధికారులు తిట్ల దండం అందుకున్నారట. నీ వల్ల మేం కూడా ఇబ్బందులు ఎదుర్కొనే స్ధితికి తీసుకొస్తున్నావని ఏఈని తిట్టిపోస్తున్నారట. కాంట్రాక్టర్‌ నుంచి ఏకంగా తమ కార్యాలయంలోనే డబ్బులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయని, దాంతో తాము వివరణిచ్చుకునే పరిస్ధితి తీసుకొచ్చావని డిఈ గరమైనట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బాధితులకు న్యాయం జరగాలన్నదే నేటిధాత్రి అభిమతం…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!