`తెలంగాణకు ఏం చేస్తారో చెప్పరు?
`కేసిఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పరు?
`కనీసం లేవనెత్తిన అంశాలు ప్రస్తావించరు?
`ఎందుకొస్తున్నారని అడిగితే సెప్టెంబరు 17 అంటారు?
` కృష్ణా జలాల వాటా తేల్చమంటే, మునుగోడులో ముంచేస్తామంటారయ?
` గెలిపిస్తే తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోస్తామంటారు?
`కరంటు మోటార్లు పెట్టమని చెప్పాలంటే, కాళ్లల్లో కట్టెలు పెడతామంటారు?
`గ్యాస్ ధరలు తగ్గించమంటే, కుటుంబ రాజకీయాలంటారు?
`పొంతన లేని సమాధానాలు చెప్పి మభ్య పెడుతుంటారు?
`కూల దోసుడు తప్ప నిలబెట్టడం కుదరదంటారు?
`చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా గాయి గత్తర చేస్తామంటారు?
`మతం మాయలో ఓట్ల జాతరను నమ్ముకున్నారు?
`తెలంగాణలో అస్థిరతను సృష్టించాలని చూస్తున్నారు?
హైదరాబాద్,నేటిధాత్రి:
అడిగిందానికి మాత్రం సమాధానం చెప్పం? అవసరం లేని విషయాలన్నీ మాట్లాడతాం? ప్రజలకు అక్కరకొచ్చే మచ్చట్లు మాత్రం చెప్పం? ప్రపంచంలోకి అన్ని విషయాలు ప్రస్తావిస్తాం? దేశం కోసం, ధర్మం కోసమని మాత్రమే చెబుతాం? ఆ ధర్మమేమిటో మాత్రం చెప్పం? ప్రజల మీద ఇలా భారం వేయడం ధర్మమా? అన్నది కూడా ఆలోచించం? ప్రజలున్నది, ఎన్నుకున్నది భారాలు మోసేందుకు అని మాత్రం ధరలు పెంచి చెబుతాం? వారి నడ్డి మీద వాతలు పెట్టినా భరించాలని చెబుతాం? అది దేశం కోసమే? అని చెబుతాం? ఇదీ బిజేపి పరిస్ధితి. తెలంగాణకు మీద కన్నేశాం…వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే అంటారు? అన్నీ సరే తెలంగాణకు ఏం చేస్తారో చెప్పమంటే చెప్పరు? ఇప్పటికీ విభజన చట్టం పొందు పర్చిన వాటిని ఇమ్మంటే ఇవ్వరు. ఇస్తామని విభజన చట్టంలో చెప్పిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్‌కు తరలించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఊసెత్తడమే లేదు. గిరిజన యూనివర్సిటీ గురించి అడిగీ అడిగీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే గోసకొచ్చింది. అయినా కేంద్రం ఇవ్వదు. బిజేపి తరుపున ఎవరూ మాట్లాడరు? రాష్ట్రానికి చెందిన ఏ బిజేపి నాయకుడు కేంద్ర పెద్దలకు గుర్తు చేయరు. అడిగితే నోరు నొప్పి పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వమే అడగాలి. కాని ఆ బాధ్యత బిజేపి నేతలు తీసుకున్నది లేదు. అడిగింది లేదు. తెచ్చింది లేదు. కాని మాటలు మాత్రం కోటలు దాటుతాయి? అనేది టిఆర్‌ఎస్ ప్రధాన ఆరోపణ.తాజాగా ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక్కటే మాట అడిగారు.
ఎందుకొస్తున్నావ్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా…మా కృష్ణానదీ జలాల వాటా గురించి తేల్చకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఆ వాట గురించి తేల్చేస్తే మునుగోడు నియోజకవర్గంలో నిర్మాణాలు పూర్తయినా ఎత్తి పోతల పథకాలకు నీరు లేకుండా పోతోంది. రిజర్వాయర్లు నిండుకుండాపోతున్నాయన్నారు. దీనికి అమిత్‌షా సమాధానం చెప్పలేదు. కేసిఆర్ ఈ విషయం ప్రస్తావించాడని ఏ బిజేపినాయకులు అమిత్‌షాకు చెప్పలేదు. కాని కాళేశ్వరం గురించి మాత్రం మాట్లాడారు. మొన్న ఏ జలశక్తి శాఖ మంత్రి చెప్పిన విషయాలను అమిత్‌షా ఎందుకు రూడీ చేయలేకపోయాడు? అంటే కేంద్ర మంత్రి షెకావత్ మాట్లాడిన మాటలు అబద్దమని పరోక్షంగా అమిత్‌షా ఒప్పుకున్నట్లే అయ్యింది? కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో ఒకటి బురదజల్లాలన్న ధోరణి తప్ప నిజాలు మాట్లాడాలన్న ఆలోచన అమిత్‌షాలో కనిపించలేదు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కల్లకుంట్ల కుటుంబానికి ఏటిఎంగా మారిందన్నారు. ఇది ప్రజలు కూడా హర్షించని విమర్శ. ఇకపోతే ముఖ్యమంత్రి కేసిఆర్ మునుగోడులో ఏర్పాటు చేసిన సభలో సూటిగా స్పష్టంగా బిజేపిని, అమిత్‌షాను కొన్ని ప్రశ్నించారు. దేశంలోని బిజేపి రాష్ట్రాల్లో లేని రకరకాల పెన్షన్లు తెలంగాణలో అమలౌతున్నాయి. వృద్దులు ఎంతో సంతోషంగా వున్నారు. మరి ఆయా రాష్ట్రాలలో తెలంగాణలో ఇచ్చినంత నగదును ఇవ్వడం లేదు. మరి మేమొస్తాం…అనగానే సరిపోదు…ఈ పెన్షున్లు పెంచుతారా? తగ్గిస్తారా? అన్న దానికి అమిత్‌షా ఎలాంటి స్పందన కనబర్చలేదంటే అర్ధమేమిటి? తెలంగాణలో అంతంత పెన్షన్లు ఎందుకిస్తున్నారని ఇప్పటికే కేంద్ర పెద్దలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సంగతి ముఖ్యమంత్రి కేసిఆరే స్వయంగా చెప్పారు. అది ఒక వేళ అబద్దమైతే అమిత్‌షా ఎందుకు ఖండిరచలేదు. మునుగోడులో బిజేపిని గెలిపిస్తే, తెలంగాణ ప్రభుత్వాన్ని ముంచేస్తామని చెప్పిన అమిత్‌షా తెలంగాణలో రైతుల కరంటు మోటార్లకు మీటర్లు పెట్టమని ఎందుకు చెప్పలేదు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన జరిపిస్తామని ప్రకటిస్తే చాలా?
అదే పెద్ద గొప్ప వరమని తెలంగాణ ప్రజలు సంతోషపడాలా? కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పెట్రోలు ధరలు తగ్గించిందా? నిత్యం పెరుగుతున్న పెట్రోధరలను రెండు సార్లు సవరించినా నిత్యం పెరగడంలో ఆగుదల వుందా? ఆగకుండా వుంటుందా? యూపిఏ ప్రభుత్వంలో పెట్రోల్ ధర 74 రూపాయలకు చేరితే సామాన్యుడు ఎలా బతికేదన్నారు? రోడ్లమీదకు వచ్చి ధర్నాలు చేశారు. ఆఖరకు ఉల్లిగడ్డ ధర పెరిగితే కూడా నానా హంగామా చేశారు. బిజేపి హాయాంలో ఉల్లి ధర ఎందుకు పెరగుతుందంటే ఉల్లి తినే అలవాటు మాకు లేదని తప్పించుకునే ప్రభుత్వ పెద్దలు ఎక్కడైనా వుంటారా? అంటే ప్రజలు ఉల్లి తినడం మానేయండని పరోక్షంగా చెప్పడం కాదా? ఒకప్పుడు పెట్రోల్ ధరలు పెరిగితే దేశానికి భారమా? ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగడం దేశం కోసం, ధర్మం కోసమా? రైతులకు గిట్టుబాటు ధరల ప్రకటన ఏనాడో మర్చిపోయిన కేంద్రం , విత్తనాలు, యూరియా, ధరలు పెంచి రైతుల సమస్యలను గాలికి వదిలేసినా ప్రశ్నించొద్దా? రైతులకు రైతు బంద్ పధకాలు ఉచితాలుగా అభివర్ణించడం అన్యాయం కాదా? పెట్టుబడి దారులకు లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేయడం దేశం కోసమా? అవి ధర్మం కోసమా? ఇలాంటి అనేక ప్రశ్నలు ముఖ్యమంత్రి లేవనెత్తారు. కాని వాటిలో ఏ ఒక్కటికీ అమిత్‌షా సమాధానం చెప్పలేదు. చెప్పడానికి ఏమీ లేదు. అందుకే తన రాజకీయం పక్కదారి పట్టించారు. ప్రజలను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారు. గతంలో రూ.50 గ్యాస్ ధర పెరిగితే గోల గోల చేసిన బిజేపి, సబ్సిడీకి మంగళం పాడిరది. సిలిండర్ ధర పదకొండు వందల యాభై రూపాయలు చేసింది. గ్యాస్ ధర తగ్గిస్తారా లేదా? అంటే గ్యాస్ బండ సైజు తగ్గిస్తామని, మహిళలు ఇంతింత సిలిండర్ మోయలేకపోతున్నారని చెబుతున్నారు. ఇలా ప్రజలు అడిగేదానికి, బిజేపి నేతలు చెప్పే సమాధానాలు ఎక్కడా పొంతన వుండదు. దేశంలో 11 రాష్ట్రాలలో బిజేపియేతర ప్రభుత్వాలు ఏర్పాటును జీర్ణించుకోలేని బిజేపి ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలదోసింది. బిజేపి ప్రభుత్వాలు ఏర్పాటుచేసింది. ఇప్పుడు తెలంగాణలోనూ అదే చేయాలని చూస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వాన్ని వణికించాలని ఏక్ నాధ్ షిండేలను తయారు చేస్తామంటోంది? ఇదినా? నైతికత అంటే నవ్వుతోంది? పడగొట్టడమే మాకు తెలుసన్న దాన్ని పదేపదే చెబుతోంది…ఎనమిదేళ్ల కాలంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి, వున్న ఉద్యోగాలు పోయేలా చేసింది. జిఎస్టీ పేరుతో పరిశ్రమలకు మంగళం పాడిరది. ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రైవేటు రంగానికి అప్పగిస్తోంది. అతి తక్కువ ధరకు వాటిని ప్రైవేటు వ్యక్తులకు అంటగడుతోంది. ఆ రుణాలు తీర్చలేని అదే ప్రైవేటు వ్యక్తులకు రుణాలు మాఫీ చేస్తోంది. పేదల నోరుకొడుతోంది. అన్నది ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన అరోపణ. ఇదిలా వుంటే నోట్ల రద్దు నుంచి మొదలు అన్నిట్లోనూ ప్రజలకు ఇబ్బందులు ఎదురౌతున్నా, ఓర్చుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వన్నీ అంగీకరిస్తున్నట్లు కాదని తెలుసుకోవాలి. అంతే కాకుండా రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చే కుట్రలకు తెరతీయం కూడా అంత మంచిది కాదు. మునుగోడులో బిజేపిజెండా ఎగరడం అన్నది కష్టం.అసలు దక్షిణాదిలో బిజేపికి అంత పెద్ద సీన్ లేదు. కర్ణాటక వరకే దాని పరిధి పరిమితం. తెలంగాణలో పాగా వేయాలన్న కుతూహలం బాగా వున్నప్పటికీ ప్రజలను మెప్పించి, ఒప్పించి వారికి మరింత మెరుగైన పాలన ఎలా చేస్తామన్నదానిని గురించి చెప్పకుండా రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తామంటున్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను పరిహాసమాడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారనేది టిఆర్‌ఎస్ ప్రధాన ఆరోపణ. అందుకే ఉద్యమాలు కొత్తకాని, పోరాటాలు పార్టీ పురుడు పోసుకున్న నాటి నుంచి తెలిసిన పార్టీయే టిఆర్‌ఎస్. అలాంటి టిఆర్‌ఎస్‌ను ఢీ కొట్టాలంటే ప్రజలకు మెరుగైన సేవల కోసం ఆలోచించాలే గాని, గాలి మాటలు చెప్పి, ప్రభుత్వాలను భయపెట్టి పాగావేస్తామంటే తెలంగాణలో అంత సులువు కాదు. ప్రజలు నమ్మరు.