పాపం రేవంత్ ఒంటరి పోరాటం…ఒక్కడుగా ప్రయాణం!
సీనియర్లు నెగలనివ్వరు!
జూనియర్లు ఎటు నిలబడతారో అర్థం కాదు!
ఏ ముహూర్తాన కాంగ్రెస్ లో చేరిండో గాని అంతా ఆగమాగమే!
టిడిపిలో వున్నప్పుడే నయముండే!
పిసిసి పదవిలో వున్నా వినేవారెవరూ లేరాయే!
మాట చెల్లుతలేదాయే!
టిఆర్‌ఎస్, బిజేపి మధ్య కాంగ్రెస్ నలిగిపోవట్టే!
రోజు రోజుకూ పార్టీ చిక్కి శల్యం కాబట్టే?
`ఎటు చూసినా లుకలుకలేనాయే!
`మునుగోడులో మునుగుడో తేలుడో తెలువలేకపోవట్టే!
`ఎవరు ముంచుతున్నారో తెలిసినా చేసేదేమీ లేదాయే!
`కాలం కలిసొచ్చేలా లేదాయే!
`గ్రాఫ్ రోజు రోజుకూ పడిపోవట్టే!
హైదరాబాద్,నేటిధాత్రి:
ఏమేమో…! అనుకుంటాం..అన్నీ అవుతాయా..ఏంటి? ఇది ఓ సినిమాలో డైలాగ్. ఇప్పుడు సరిగ్గా ఇది పిపిసి ప్రెసిడెంటు రేవంత్‌రెడ్డికి సూటౌతోంది. కాంగ్రెస్ పార్టీలో అందరూ పిసిసి అధ్యక్షులు కావాలనుకుంటారు. కాని ఏ కొందరికో అవకాశం వస్తుంది. అది కూడా వేళ్లమీద లెక్కపెట్టేంత మందికి మాత్రమే ఆ అవకాశం వరిస్తుంది. అందులో రేవంత్‌రెడ్డి లాంటి వారికి పిపిసి ప్రెసిడెంటు పదవి అన్నది బంపర్ ఆఫర్ లాంటిదే. కాకపోతే దాని ఫలితాలు అనుకున్న రీతిలో రావడం లేదు…ఇదే ఇక్కడ పెద్ద మైనస్..అంగట్లో అన్నీ వున్నా…అన్నది ఇక్కడ నిజమౌతోందని కూడా చెప్పొచ్చు. గతంలో పిసిసి ప్రెసిడెంటు పదవి అన్నది గొప్ప వరంగా భావించేవారు. అలా అదృష్టం కూడ కలిసొచ్చేది. అప్పుడు ఆ పదవి పెద్ద కొండ. నాయకత్వానికి పెద్ద అండ. అదేంటో గాని తెలంగాణ వచ్చాక పిసిసి పదవి అన్నది గుడిబండగా మారింది. పిసిసి అధ్యక్షుడు కావాలనుకున్న వారికి కలిసి రావడంలేదు. పదవి వచ్చిన వారికి అసలే కలిసి రావడంలేదు. ఇప్పుడు పిపిసి పదవి అన్నది ముళ్ల కిరీటైమైపోయింది. కోరికోరి పదవి కావాలనుకునేవారు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం కూడా ఎదురుకానున్నది. తెలంగాణ రాగానే నాకంటేనాకు పిసిసి అని చాలా మంది కోరుకున్నారు. ఆ రేసులో పొన్నాల లక్ష్మయ్య గెలిచారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినట్లే అనుకున్నాడు. తెలంగాణ తొలి పిసిసి అధ్యక్షుడయ్యాకు పొన్నాల లక్ష్మయ్య, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి నేనే అన్నంతగా కలలుగన్నాడు. కాని పాపం ఆయనే జనగామలో గెవలేదు. ఆశలు బోల్తా కొట్టాయి. ఆపై పదవి బరువైంది. తాను మోయలేన్నంత దాకా వచ్చింది. భారమెక్కువైంది. పార్టీని నడపడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదని తెలుసుకున్నాడు. ఖర్చుపెట్టాలంటే చుక్కలు లెక్కబెట్టాల్సివస్తుందని గుడ్లుతేలేశాడు. నెల నెల పార్టీ కోసం సొమ్ము నీళ్లలా ఖర్చు చేయడం తన వల్ల కాదని చేతులెత్తేశాడు. పదవి తనకు తాను వద్దనుకున్నాడు. వదులుకున్నాడు.
సహజంగా పిసిసి అధ్యక్ష పదవిలో వున్నవారు ఎప్పుడు దిగిపోతారా? మాకు ఎప్పుడు అవకాశం వస్తుందా? అని ఎదురుచూస్తారు. పొన్నాల మాత్రం ఎప్పుడు దిగిపోతాడా? అని ఎవరూ చూడలేదు. అది కూడా పొన్నాలకు రంది తెచ్చిపెట్టింది. ఎలాగో అలాగా ఆఖరకు పదవి వదిలించుకొని ఫ్రీ బర్డ్ అయ్యాడు. రెండో కృష్ణుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చాడు. ప్రజలు, పార్టీ నేతలు ఆయనపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. పైగా ఆయన అప్పటికే కోవర్టు అన్న ముద్రను వేసుకున్నారు. అలా జరిగిన ప్రచారాన్ని ఆయన ఏనాడు పెద్దగా పట్టించుకోలేదు. నేను కోవర్టును కాదని కూడా ఆయన ఏనాడో తిప్పికొట్టే ప్రయత్నం చేయలేదు. ఆఖరుకు ప్రభుత్వం మీద పెద్దగా యుద్దం చేసింది లేదు. ఆఖరుకు తన సోదరుడు కౌషిక్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లోకి వెళ్తుంటే ఆపలేదు. కాకపోతే ఆయనే పంపాడని అనేవారు అంటారు. అది ఎంత వరకు నిజమో! కాదో!! ఆయన ఏనాడు చెప్పలేదు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్‌రెడ్డి వస్తూ వస్తూనే జాక్ పాట్ కొట్టేశారు. కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంటు అయ్యారు. ఫైర్ బ్రాండ్ అన్న బిరుదును నిలబెట్టుకుంటారని అందరూ అనుకున్నారు. కాని గత 2018 ఎన్నికల్లో ఓడిపోయి, తానేం తీస్మార్ ఖాన్‌ను కాదని నిరూపించుకున్నారు. కాకపోతే పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగో టిక్కెట్టు తెచ్చుకొని గెలిచి, పోయిన పరువును నిలబెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆశలు పెంచుకొంటూ, ఎన్నో అవాంతరాల మధ్య పిసిసి అధ్యక్ష పదవి దక్కించుకున్నాడు. అప్పటి నుంచి రేవంత్‌రెడ్డికి పాపం కంటి మీద కునుకు లేకుండాచేసుకున్నాడు. స్వయంకృతాపరాధం చూపించే ఫలితం చేదు రుచి చూస్తున్నాడు. పాపం మొదటినుంచి రేవంత్‌ది రాజకీయాల్లో ఒంటరి ప్రయాణమే…
ఒకనాడు టిఆర్‌ఎస్‌లో వున్నా తనదైన శైలి రాజకీయాలతో ముందుకు సాగాలని అక్కడా ఒంటరి తనాన్నే భరించాడు. తర్వాత టిడిపిలో చేరినా తెలంగాణ ఉద్యమం, ఆపై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో టిడిపిలో కూడా ఒంటరి రాజకీయ ప్రయాణమే దిక్కయ్యింది. ఆఖరకు కాంగ్రెస్‌లో చేరి, పిపిసి అధ్యక్షుడైనా ఇప్పుడూ ఒంటరి పోరు చేయాల్సి వస్తోంది. రేవంత్‌రెడ్డి పిసిసి అధ్యక్షుడు కాకముందు ఆయనను అడుగడుగునా పార్టీలో అడ్డుకున్నవారే…ఆయనను పిసిసి కాకుండా అనుక్షణం అడ్డంకులు సృష్టించిన వారే…దాంతో ఆనాడైనా, ఈనాడైనా ఆయనకు ఒంటరి ప్రయాణమే దిక్కౌవుతోంది. సీనియర్లు ఆయననెక్కడ నెగలనిస్తారు? కొంత కాలం విహెచ్ రూపంలో, మరి కొంత కాలం జగ్గారెడ్డి రూపంలో, ఇందులో ఆది నుంచి కోమటిరెడ్డి సోదరుల రూపంలో రేవంత్‌కు సీనియర్లు ఊరిపిసలుపనివ్వడంలేదు. ఒక రకంగా చెప్పాలంటే నేల నాకిస్తున్నారు. తన ప్రమేయం లేకున్నా సరే ఆఖరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్ధితి వచ్చింది. నోటిదురుసు ఆయనను ఇంత దూరం తీసుకొచ్చింది. అదుపు తప్పకపోతే ఒక తంటా…తప్పితే ఒక తంటా అన్నట్లు తయారైంది. ఆఖరుకు ఇటీవల మునుగోడులో పర్యటిస్తున్న సందర్భంలో కొందరు మహిళలు రేవంత్‌ను ఎందుకొస్తున్నారని ముఖం మీదే అడగడం, వద్దు వద్దు రావొద్దంటూ చెప్పడంతో ఆయన పరువు మరింత పోయిందనే చెప్పాలి.
మునుగోడును ఆయన ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చూసినా, ఎక్కడిక్కడ ఏదో ఒక అడ్డంకి ఎదురౌతూనేవుంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన రెండో రోజుకే మునుగోడులో కాంగ్రెస్ సభ ఏర్పాటు చేసి, సక్సెస్ చేస్తే తన ఇమేజ్ అమాంతం పెరుగుతుందని ఆశించాడు. కాని గ్రాఫ్ ఒక్కసారిగా వున్నది కాస్తా పడిపోయింది. అసలు ఇంత తొందరగా సభ పెట్టాల్సిన అసవరం ఏమొచ్చిందన్న ప్రశ్నలే మిగిలాయి. ఆఖరుకు కోమటిరెడ్డి సోదరుల మీద చేసిన వ్యాఖ్యలకు వివరణిచ్చుకోవాల్సివచ్చింది. సంచనలం సృష్టిస్తాననుకున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సారీ చెప్పాడు. జూనియర్లు, జిల్లా నేతలు ఎటువైపో కూడ ఇప్పటికీ రేవంత్‌రెడ్డికి ఓ క్లారిటీ లేదు.
పార్టీలో సీనియర్లు పని గట్టుకొని పగబట్టినంత రాజకీయాలు చేస్తుంటే కనీసం జిల్లా స్ధాయి నేతలు, జూనియర్లనైనా చూసి ధైర్యం తెచ్చుకుందామంటే అక్కడా ఆశలు నెరవేరడం లేదు. జిల్లా స్ధాయిలో తన వర్గాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలు లేకుండాపోతున్నాయి. వాళ్లు ఎటు నిలుస్తారో అన్నది తెలియకుండాపోతోంది. ఆ మధ్య సికింద్రాబాద్‌లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు శిక్షణా కార్యక్రమాలలో అనేక జిల్లాల నాయకులు రేవంత్‌రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భం చూసిందే… ఏ ముహూర్తానా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిండో కాని ఆనాటి నుంచి ఆగమాగమే…ఇక్కడ ఒక్కటే ఆయన అదుపు చేసుకోవాల్సింది! జనం కనిపించగానే నోరు గంగవెర్రులెత్తడం ఆపుకోవాలి. ఏం మాట్లాడుతున్నాడో కూడా గుర్తెరిగి మాట్లాడాలి. నాయకుడన్న తర్వాత మానసిక సంఘర్షణ సహజం. అందులో పార్టీని లీడ్ చేసే స్ధాయిలో వున్నప్పుడు మాట కన్నా, మౌనం ఎక్కువ మంచింది.
ఎందుకంటే గతంలో ఏ పిపిసి ప్రెసిడెంటు కూడా నిత్యం మీడియా ముందుకు వచ్చేవారు కాదు. ఏదైనా సీరియస్‌సమస్య వున్నప్పుడో, లేక వారానికి ఒకసారి మాత్రమే మీడియా ముందుకు వచ్చేవారు. దాంతో వారి వ్యాఖ్యలకు ప్రాధాన్యత వుండేది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు నిత్యం ప్రజల్లో వుంటున్నామన్న భ్రమల్లో మీడియా ముందు వుంటున్నారు. మీడియాలో నిత్యం కనిపిస్తే జనంలో వున్నట్లే అన్న భావనలో రాజకీయం నెరుపుతున్నారు. ఇదే వారి వైఫల్యాలకు కారణమౌతోంది. ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా ఏదో ప్రత్యేక సందర్భంలోనే మీడియా ముందుకు వచ్చేవారు. కాని రేవంత్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుబాటలో నడుస్తున్నాడు. నిత్యం మీడియాలో వుండడానికే ఇష్టపడుతున్నాడు. కాంగ్రెస్‌లో నగుబాటుకు గురౌతున్నాడు. టిఆర్‌ఎస్, బిజేపిల రాజకీయాల మధ్య నలిగిపోతున్నాడు. పార్టీలో మాట చెల్లుబాటు లేదు…ప్రజల్లో ఫైర్ బ్రాండ్ అన్న పేరు రోజు రోజుకూ తగ్గవట్టే…పార్టీలో లుకలుకలు…భవిష్యత్తుకు నీలి నీడలు…పాపం రేవంత్…అనుకుంటున్నారు.