ఆలేరు ముక్కొణపు పోరు!

హస్తం ప్రభావం కూడా తక్కువేం కాదు?

బలమైన గులాబిలో మోత్కుపల్లి గుబులు?

గొంగిడి సునీతకు హాట్రిక్‌ దక్కేనా?

కారులో మొదలైన కుతకుతలు?

నిన్నటి దాక గొంగిడి సునీతకు ఎదురులేదు?

సెకండ్‌ క్యాడర్‌ కనుచూపు మేర కూడా లేదు?

మోత్కుపల్లి కారెక్కడంతో సరికొత్త సమీకరణాలు?

మోత్కుపల్లిని ఒత్తిడి చేస్తున్న అనుచరులు?

గతంలో ఐదుసార్లు ఆలేరు ఎమ్మెల్యే?

ఇప్పటికీ పోటీకి సై…సై?

తెరాసలో చేరడంతో చిగురించిన ఆశలు?

గొంగిడి సునీతకు మొదలైన తలనొప్పులు?

కమల వికాసంలో ఎదురుచూపు?

ఇంతకీ జనమెటువైపు?

కారుకు కలిసొచ్చే దగ్గర సొంత కుంపటిలో పొగలు?

                        ఒకరిది హీట్రిక్‌ కోసం ఆరాటం…మరొకరిది ఎలాగైనా పోగొట్టుకున్న చోట వెతుక్కోవాలన్న పోరాటం…ఇంకొకరిది పార్టీకి ఇప్పుడిప్పుడే ఊపొస్తోంది. గెలిస్తే నాకు కూడా పేరొస్తుందన్న ఉబలాటం…..సందిట్లో సడేమియా లాగా గతాన్ని ముందేసుకొని, చరిత్రను తవ్వే పనిలో మరో నాయకుడు వున్నాడు. అవకాశం వస్తే నేను కూడా పోటీ చేస్తానంటున్నాడు. కాకపోతే నాలుగో నేత ఆశలకు పెద్దగా ఫలించే సూచనలు లేవు. ముగ్గురు మాత్రం పక్కా…ఈ ముగ్గురు మధ్యే పోటీ అన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. 

                    తెలంగాణ ఉద్యమంలో గొంగిడి సునీత, ఆమె భర్త మహేందర్‌రెడ్డి కీలకమైన భూమిక పోషించారు. దాంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలేరు నియోజకవర్గం నుంచి ఆమెకు అవకాశం కల్పించారు. 2014లో గెలిచారు. 2018లో జరిగిన ఎన్నికల్లోనూ మళ్లీ టిక్కెట్టు ఇచ్చారు. రెండోసారి కూడా గెలిచారు. అయితే ఆ ఎన్నికల సమయంలో పెద్దఎత్తున వివాదాలు కూడా చెలరేగిన నియోజకవర్గం కూడా ఆలేరే…ఆలేరు చెందిన గుండాల మండలం జనగాంలో చేర్చడాన్ని ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో ఆ ఎన్నికల్లో గొంగిడి సునీత గెలుపుపై ప్రభావం పడుతుందని అందరూ అనుకున్నారు. కాని ఆమె ఎంతో చాకచక్యంగా ఎన్నికల తర్వాత ఎలాగైనా గుండాలను యాదాద్రి జిల్లాలో కలిపేందుకు కృషి చేస్తానని గట్టిగా మాటిచ్చారు. గెలిచారు. ఈ ఒక్క వివాదం తప్ప ఆమెపై మరేరకమైన ఆరోపణలు అప్పటికి లేవు. నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గొంగిడి సునీత బాగానే అభివృద్ధి చేస్తుందన్న మాటతో పాటు, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆమె విజయానికి బాటలు వేశాయి. ఇంత వరకు బాగానే వుంది. మళ్లీ గెలిచింది. ప్రభుత్వ విప్‌గా ప్రమోషన్‌ పొందింది. కాని ఆ తర్వాత ప్రజలను , అభివృద్ధి పనులు పట్టించుకున్నట్లు కనిపించడం లేదన్న మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. అంతే కాదు నియోజకవర్గంలో ఆమె ఎవరికీ మేలు చేసినట్లుగాని, అలాగని కీడు చేసినట్లు లేదు. కేవలం రియలెస్టేట్‌ మీద వ్యాపారం తప్ప ఈ దఫా విప్‌ గొంగిడి సునీత పెద్దగా నియోజకవర్గం అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్న అసంతృప్తులే వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఆలేరు నియోజకవర్గం నుంచి ఈసారి ముఖ్యమంత్రి కేసిఆర్‌ పోటీ చేసే అవకాశాలున్నాయన్న వార్తలు మొదలైనప్పటినుంచి ఆమెలో కొంత నిస్తేజం కనిపిస్తుందని కూడా అంటున్నారు. ఎగిరెగిరి దంచినా అదే కూలీ, ఎగరకుండా దంచినా అదే కూలి అన్నట్లు, నియోజకవర్గం మీద ఎంత దృష్టిపెట్టి అభివృద్ధి చేసినా టిక్కెట్టు ఇస్తారో లేదో లేదో అన్న డైలామాలోనే చాలా కాలంగా వుంటున్నారని అంటున్నారు. ఇదిలా వుంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలేరుపై నుంచి పోటీ చేయొచ్చని అనుకుంటున్న తరుణంలోనే మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు బిజేపిని వదిలి కారెక్కారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా ఈ మధ్య ఆయనకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. దళిత బంధు అమలులో కూడా ఆయనను ముందు పెడుతున్నారు. యాదగిరి గుట్టకు ముఖ్యమంత్రి ఎప్పుడొచ్చినా, గుడి ప్రారంభ సమయంలోనూ మోత్కుపల్లికి ఎనలేని ప్రాధాన్యతనిచ్చారు. ఇది కూడా గొంగిడి సునీతలో కొంత అసంతృప్తికి కారణమైందని కూడా అంటున్నారు. ఓ వైపు ముఖ్యమంత్రి ఆలేరుకు వస్తారన్నది, మరో వైపు మోత్కుపల్లి ఎలాంటి ఎత్తులు వేస్తారో అన్నది కూడా పెద్ద చర్చనీయాంశంగానే వుంది. కాకపోతే గొంగడి సునీత చేసిన నియోజకవర్గ అభివృద్ధి గురించి చెప్పాల్సి వస్తే, ఒక్క యాదగిరి గుట్ట పునర్నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించడం తప్ప, ప్రత్యేకించి చెప్పుకోవడానికి ఏమీ లేదని కూడా అంటున్నారు. యాదాద్రి పరిసరాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయని సంతోషించాలో, లేక సామాన్యలకు అందుబాటులో లేకుండా పోయాయని బాధపడాలో తెలియని పరిస్ధితిలో నియోజకవర్గం వుందంటున్నారు. ఏది ఏమైనా ఆమెపై విమర్శలు, వివాదాలు లేకపోయినా అభివృద్ధి గురించి ఈ దఫా ఆమె పట్టించుకోలేదన్న మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. 

                                   ఇక 2009 ఎన్నికల్లో ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచిన బూడిద బిక్షమయ్య గౌడ్‌ అప్పట్లో మంచి పేరునే సంపాదించుకున్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత కొంత కాలానికి రియలెస్టేట్‌ వ్యవహారంలో కొన్ని చిక్కుల్లో చిక్కుకున్నాడు. దాంతో కాంగ్రెస్‌ను వదిలేసి కారెక్కారు. అక్కడ తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఆశించాడు. కాని అక్కడ పలకరించేవారు లేకుండాపోయారు. ఆయనకు ఏదైనా పదవి వస్తుందేమో అన్న ఆశతోనే గత కొంత కాలం క్రితం వరకు ఎదురుచూశారు. ఇక తనకు ఎలాంటి పదవి లభించేలా లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎలాగూ టిఆర్‌ఎస్‌ ఇవ్వదు. ఇంకా ఆ పార్టీలో వుండడం ఎందుకు అనుకొని బిజేపిలో చేరారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో సీట్లు, రఘునందన్‌, ఈటెల గెలపుతో ఊపులా భావిస్తున్న బిజేపిని నమ్ముకొని బిక్షమయ్య గౌడ్‌ ఆ పార్టీలో చేరాడు. ఆలేరు నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ ఎంతో బలంగా వుంది. ఆ పార్టీ తర్వాత బిజేపినే బలంగా వుందన్న మాటలే వినిపిస్తున్నాయి. దాంతో తన మాతృ సంస్ధ అయిన కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా బిక్షమయ్య గౌడ్‌ బిజేపిలో చేరారు. తన మీద తనకన్నా, బిజేపి మీద పెంచుకున్న నమ్మకం తనను గట్టెక్కిస్తుందేమో అన్న ఆశతో చేరినట్లున్నారు. సహజంగా హైదరాబాద్‌కు సమీపంలో ఆలేరు వుండడం, బిజేపికి కొంత కలిసి వచ్చే అంశం. నగర రాజకీయ ప్రభావం ఇక్కడ కూడా కనిపించే అవకాశాలున్నాయన్నది బిక్షమయ్య అంచనా వేసినట్లున్నారు. నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్‌ రాజకీయాలకాన్న, ఎలాంటి తలనొప్పి లేని బిజేపి బెటర్‌ అని అకున్నట్లున్నారు. కమలంతీర్ధం పుచ్చుకున్నారు. కాకపోతే ఇంకా ఆయన తన ప్రచారాన్ని మొదలు పెట్టలేదు. నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడే కావడం కూడా ఆయనకు కలిసివస్తుందన్న నమ్మకంతో వున్నట్లు తెలుస్తోంది. 

                       ఇక రేవంత్‌ రెడ్డి రాకతో కొంత ఉత్సాహాన్ని కనబర్చుతున్న కాంగ్రెస్‌లో ఆలేరులో పెద్దగా పేరున్న నాయకుడు లేడు. బిక్షమయ్య గౌడ్‌ తర్వాత అంతటి స్ధాయిని కనబర్చిన నాయకులు లేరు. కాకపోతే ఆలేరు కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న బీర్ల అయిలయ్య నియోజకవర్గంలో దూసుకుపోతున్నాడనే అంటున్నాడు. కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ డిక్లరేషన్‌లోని అంశాలతోను పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు మాత్రం బాగానే చెప్పుకుంటున్నారు. ప్రతి గ్రామంలో రచ్చబండ ఏర్పాటు చేసుకుంటూ తన ప్రచారం ప్రారంభించినట్లు చెప్పుకుంటున్నారు. పైగా ఆయన అనేక సేవా కార్యక్రమాలు కూడా పెద్దఎత్తున చేపడుతున్నారని సమచారం. పార్టీని వాడుకొని వదిలేసిన, అవకాశ వాదులకన్నా, నిత్యం ప్రజల్లో వుంటూ, అనేక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీర్ల అయిలయ్య కొంత మెరుగే అన్న సానుకూల దృక్పథం ప్రజల్లో కనిపిస్తోందంటున్నారు. 

                               ఆలేరులో పేరుకు ముక్కొణపు పోటీ కనిపిస్తున్నా, అంతర్లీనంగా చతుర్ముఖ పోటీ వున్నట్లే వుంది. తానేం తక్కువ. తనకేం తక్కువ. ఐదుసార్లు ఆలేరు నుంచి, ఒకసారి తుంగతుర్తి నుంచి ఎదురు లేకుండా, తిరుగులేని రాజకీయాలు చేసిన నాకన్నా పెద్ద నాయకుడు ఎవరున్నారంటూ మోత్కుపల్లి కూడా తాను బరిలో వుంటే ఎలా వుంటుందనేదాన్ని పరిశీలిస్తున్నాడట. తన సొంత మనుషుల దగ్గర తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడట. తాను ఇంకా ఫిట్‌గానే వున్నానని, రాజకీయ పదవుల మీద ఆశ లేకపోయినా, ప్రజలు సేవ చేయాలన్న ఆలోచన తగ్గలేదంటున్నారట. తాను ఎంతో నిజాయితీ కలిగిన నాయకునని, ఇప్పటికీ కనీసం సొంత ఇల్లు కూడా లేని నాయకుడినని, నా లాంటి రాజకీయ నాయకులు ఈ సమాజానికి ఆదర్శమంటున్నారట. నాలాంటి నాయకులే ఈ కలుషిత రాజకీయాలను మార్చాలని అంటున్నాడట. తన లాంటి నాయకులను చూసైనా రాజకీయాల్లో మళ్లీ అవినీతికి తావులేని రోజులు వస్తాయన్న నమ్మకం వుందని, నిజాయితీ అంటే ఎలా వుంటుందో, అభివృద్ధి అంటే ఎలా చేయాలో చేసి చూపిస్తానని కూడా తన అనుయాయులతో చెప్పుకుంటున్నాడట. మరి కారు టిక్కెట్టు ఎవరిని వరించినా, టిఆర్‌ఎస్‌ మాత్రం నియోజకవర్గంలో బలంగా వుంది. ఇద్దరు బలమైన నాయకులు పార్టీ కోసం కాకుండా, వ్యక్తిగత రాజకీయాలు చేస్తే మాత్రం నియోజకవర్గ అధికారం కారు నుంచి జారి పోవడం మాత్రం ఖాయం…? తేరుకోకపోతే రాజకీయ అలజడి మొదలై మునకలేయడం తధ్యం..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!