`రాజకీయ అసహనం కలెక్టర్ల మీద చూపిస్తారా?
`పిడిఎస్ కు సంబంధించిన చట్టంలో ఏముందో కేంద్ర మంత్రికి తెలుసా?
`ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చదివింది ఎవరు ఏది చెప్పినా వినడానికా?
`కేంద్ర మంత్రి అయినంత మాత్రాన అంత హూంకరింపు అవసరమా?
`వాళ్లు ఐఏఎస్‌లు అనుకుంటున్నారా?
`కిరాణ షాపుల్లో గుమస్తాలనుకుంటున్నారా?
`పది మందిలో ఐఏఎస్ లను నిలదీస్తారా?
`తప్పు చేస్తే కడిగేయండి…కానీ నేతల అసహనం కలెక్టర్లపై చూపడం సరైందా?
` రేషన్ షాపుల్లో ఫ్లెక్సీలు పెడితే కాపాడాల్సిన పని కలెక్టర్లదా?
`అరగంటలో మళ్ళీ వస్తాను? అని కలెక్టర్ కు బెదిరింపులు సబబా?
`ఒక్క ముక్క పట్టుకొని కలెక్టర్ ను అవమానకరంగా చూస్తారా?
`ఇలాంటి విషయంలో ఐఏఎస్‌ల ఐక్యత ఎందుకు కొరవడిరది?
హైదరాబాద్,నేటిధాత్రి:
వాళ్లు ఉన్నత విద్యావంతులు…ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్ష రాసి పాసైన వారు. సమాజంతోపాటు, ప్రపంచ జ్ఞానం తెలిసినోళ్లు. ఐఏఎస్ కోసం పడే శ్రమ అంత ఇంతా కాదు. కొన్ని వందల సంవత్సరాల పూర్వం జరిగిన సంఘటనలతోపాటు, పాలనలో పద్దతులు, నేటి తరం దాకా అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలు కూడా తెలిసిన వాళ్లు. ప్రభుత్వ నిర్వహణ అంతా తెలిసిన వాళ్లు…నిర్వహించేవాళ్లు…మన ప్రజాస్వామ్య దేశంలో నాయకులు తీసుకునే నిర్ణయాలను అమలు చేసేవాళ్లు. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చే హామీలు గెలిచిన తర్వాత వాటి అమలుకు వీరి మీదే ఆధారపడతారు. ప్రభుత్వం వేసే ప్రతి అడుగులో ఐఏఎస్‌లదే కీలక పాత్ర. ప్రభుత్వ నిర్వహణలు సరిగ్గా సాగాలన్నా వాళ్లదే కీలక భూమిక. రాష్ట్రాలలోనైనా, కేంద్రంలోనైనా ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల పాత్ర అనన్య సామాన్యమైంది. వారు విధి నిర్వహణ కోసం పడే తపన, చేసే శ్రమ పైకి కనిపించకపోయినా, కాలం ఎటుపోతుందన్నది కూడా చూసుకోకుండా పనిచేయాల్సి వుంటుంది. అలా అంకితభావంతో పనిచేయడమే వారికి తెలుసు. ఎందుకంటే ఐఏఎస్ చదువు అన్నది ఒక కల. ఆ కల నెరవేర్చుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. కొన్ని సంవత్సరాల పాటు కఠోర శ్రమ చేసి, సమాజానికి సేవ చేయాలన్న తపనతో వస్తారు. సమాజంలో ఉన్నతమైన గౌరవం వున్న ఉద్యోగం అన్న ఆలోచనతో కొందరు వస్తారు. కొందరు జీవిత లక్ష్యం ఐఏఎస్ కావాలన్న కోరికతో వస్తారు. ఎలా వచ్చినా వారు ఐఏఎస్ అన్నది కావాలంటే మాత్రం ఎంతో శ్రమించాలి. ఎంత కష్టపడినా ఒక్కొసారి అనుకున్న ర్యాంకు రాకపోతే, మళ్లీ మొదటి మెట్టు నుంచి మొదలు పెట్టి సక్సెస్ సాధిస్తారు. అలాగే జీవితంలోనూ సక్సెస్ సాధించాలని, గొప్ప అధికారి అని పేరు కోసం పనిచేస్తారు. పేదల సంక్షేమం కోసం పనిచేస్తారు. పేదలకు సేవ చేస్తారు. సమాజ శ్రేయస్సు కోసం శ్రమిస్తారు. ఏసి గదుల్లో వుంటారని కూడా అనుకుంటుంటాం…కాని సమాజానికి విపత్తు ఎదురైతే అందరికంటే ముందు అక్కడ ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు వుంటారు. అలాంటి అంకితభావంతో చేసే ఉద్యోగం. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు, రాజకీయ నాయకుల పెత్తనాలు, పార్టీలకు చెందిన నేతల వేధింపులు కూడా చూస్తుంటారు. అయినా ఎక్కడా తొనకరు. నోరు మెదపరు. ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయరు. ప్రభుత్వన్ని అభాసు పాలు చేయరు. అన్నింటినీ దిగమింగుకొని, ఐఏస్‌ఎస్ పూర్తయిన తర్వాత చేసే ప్రతిజ్ఞను ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఉద్యోగ జీవితం గడుపుతుంటారు…ఐఏఎస్ పూర్తయిన తర్వాత ఎక్కడ పోస్టింగ్ వేసినా వెళ్తారు. కొండ కోనల్లో వుంటే జిల్లాల్లో కూడా పనిచేస్తారు. అంతటి అంకితభావం వున్నవాళ్లు…వాళ్లే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉద్యోగులు…! అలాంటి ఓ కలెక్టర్‌పై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశమంతా చర్చిస్తోంది.
ముఖ్యంగా తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మాజీ ఐఏఎస్ అధికారులు సైతం నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. ఐఏఎస్ అధికారులంటే అంత చులకనగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం విషయంలో ఎంత వాటా ఇస్తుంది? ఎంత ఖర్చు చేస్తుంది? ఈ వాటల సంగతి ఏమిటి? అన్నదానిపై కలెక్టర్‌కు అవగాహన వుండకపోవడం అంటూ వుండదు. కొన్ని సమయాల్లో కేంద్ర మంత్రులు గాని, రాష్ట్ర మంత్రులు గాని కొన్ని సందర్భాలలో వారి సమాధానాన్ని ఇష్టపడరు. అందుకే చాలా సమయాల్లో ఐఏఎస్‌లు ప్రభుత్వ పెద్దలతో సమీక్షల్లో వున్నంత కలుపుగోలు తనంగా ప్రజల్లో వున్నప్పుడు వుండరు. అందుకే రాష్ట్ర ప్రభుత్వపెద్దలైనా, కేంద్ర ప్రభుత్వ పెద్దలైనా ఏదైనా ప్రశ్నించినప్పుడు చాలా కూల్‌గా సమాధానం చెప్పడానికే ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాలలో ఏం సమాధానం చెబితే ప్రభుత్వ పెద్దలు ఎలా రియాక్టవుతారో అన్న అనుమానంతో కూడా నోరు మెదపరు. ఇదే ఇక్కడ జరిగి వుండొచ్చు. అయినా ఓ కలెక్టర్‌ను పది మందిలో అందులోనూ ఓ రేషన్ దుకాణం వద్ద నిలదీయం ఏమిటి? సమీక్ష సమావేశాల్లో ఇలాంటి ప్రశ్నలు వేశారంటే వేరు విషయం? అంతే గాని రాజకీయ ప్రత్యర్ధులపై విరుచుకుపడినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలెక్టర్ మీద ఆక్రోశంతో మాట్లాడడాన్ని ప్రజలు కూడా హర్షించడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో రేషన్ షాపుల ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేస్తారని ఒక కేంద్ర మంత్రి చెప్పడం ఏమిటి?
ఇప్పటి వరకు ఏ కేంద్ర మంత్రికి ఇలాంటి ఆలోచన రాలేదేమో! ప్రజా పంపిణీ వ్యవస్ధ ఏమైనా భారతీయ జనతాపార్టీ ఏర్పాటు చేసిన వ్యవస్ధనా? ప్రధాన మంత్రి మోడీ ఫోటోను రేషన్ షాపుల ముందు పెట్టడం అంటే ఆయన పరువు పెంచినట్లౌవుందా? తగ్గించినట్లౌవుతుందా? పైగా కలెక్టర్లు ఆ ప్లెక్సీలు వున్నాయా? లేదా? ఎవరైనా తొలగించారా? అంటూ వాటిని మానిటరింగ్ చేస్తూ వుండాలా? రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించినట్లు, గతంలో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి గా వున్న సమయంలో అప్పటి ప్రధాని మన్మొహన్ సింగ్ ఫోటో పెట్టారా? పైగా నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో రేషన్ సరుకులు అందజేత విషయంలో అదంతా రాష్ట్ర ప్రభుత్వ క్రెడిట్ అంటూ చేసిన వీడియోను కూడా టిఆర్‌ఎస్ విడుదల చేసింది. అంటే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన విషయం అబద్దమని రుజువైనట్లే కదా? ఆ మధ్య ఉల్లి రేటు విపరీతంగా పెరిగింది? మార్కెట్‌లో ఉల్లి రేటు ఎంత వుందో తెలుసా?
అంటూ నేషనల్ మీడియా ప్రశ్నిస్తే నేను ఉల్లిపాయ తినను అంటూ సమాధానం దాట వేశారు. కాని బాధ్యత కల్గిన మంత్రికి ఉల్లి రేటు ఎంతో తెలియదని చెప్పడం, సమాధానం దాట వేయడం ఔచిత్యమేనా? అలాంటిది ఎప్పుడో చేసిన పిడిఎస్ చట్టంలోని అంశాలపై ప్రతి కలెక్టర్‌కు అవగాహన వుండాల్సిన అవసరం లేదు. సంబంధిత పౌరసరఫరాల శాఖ మంత్రికో, సెక్రెటిరికో అవగాహన వుంటే చాలు…! రేషన్ షాపులకు సరఫరా అవుతున్న వస్తువులన్నీ ప్రజలకు చేరువౌతున్నాయా? లేదా? అన్నది కూడా ఎవరైనా ఫిర్యాధు చేస్తే తప్ప కలెక్టర్లకు తెలియకపోవచ్చు. అంతే గాని రేషన్ షాపుల్లో ఏం జరుగుతుందన్నదాని మీదే కలెక్టర్లు శ్రద్దపెడుతూ కూర్చుంటే ఇక వారు చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టేసుకోవాల్సిందే… ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ పరిపాలన విభాగంలో ముఖ్య పాత్రదారులా? లేక కిరాణ షాపుల్లో గుమస్తాలా? అన్నది నాయకులు తెలుసుకోవాలి. అయినా ఒక కలెక్టర్ మీద కేంద్ర మంత్రి అంత హూంకరింపు అవసరమా? అన్నది సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల్లో సీరియస్‌గా జరుగుతున్న చర్చ. రాజకీయ అసహనం కలెక్టర్ల మీద చూపించడం అన్నది సరైందేనా? పైగా వారికి ఇచ్చే గౌరవం ఇవ్వకుండా చులకనగా చూడొద్దు. అందుకే కొంత మంది ఐఏఎస్‌లు తాము నాయకులు కావాలన్న ఆలోచన రావడానికి కారణాలు కూడా ఇలా నాయకులు చేసే పెత్తనాలే కారణమన్నది కూడా చెప్పుకుంటున్నారు. జిల్లా కలెక్టర్లుగా, మంత్రిత్వ శాఖల కమీషనర్లుగా ఐఏఎస్‌లు ఏదైనా తప్పు చేస్తే వారిని కడిగేయడంతో తప్పు లేదు.
కాని ఏ తప్పు లేని సందర్భం..ప్రజల్లో ఏదో ఒక సంచలనం కోసం కేంద్ర మంత్రి చేసిన పని తప్ప అందులో మరేం లేదు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌ను కేంద్ర మంత్రి అవమానించడాన్ని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తప్పుపట్టారు. ఐఏఎస్‌లకు సంఫీుభావం తెలిపారు. అయితే ఐఏఎస్‌లలో ఐక్యత లేకపోవడం కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. గుజరాత్‌లో ఇటీవల జైలు నుంచి అత్యా చారం, హత్య కేసుల్లో నిందితులు విడుదల కావడాన్ని తప్పు పడుతూ సిఎంవో సెక్రెటరీ స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలపై బిజేపి శ్రేణులు పెద్దఎత్తున ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయినా ఆమెకు ఐఏఎస్‌లు సంఫీుభావం వ్యక్తం చేయడం లేదు. సివిల్ సర్వీసెస్‌లో వున్నప్పుడు ప్రభుత్వాల మీద ప్రకటనలు చేయొద్దు. కాని ఒక మహిళగా సాటి మహిళకు జరిగిన అన్యాయాన్ని స్మితా సబర్వాల్ గుర్తు చేయడాన్ని కూడా తప్పంటే ఎలా? ఆమె ప్రభుత్వ ఉద్యోగి అయినంత మాత్రాన సమాజంలో ఆడవారి మీద జరిగే అన్యాయాలపై, అకృత్యాలపై కూడా నోరు మెదపొద్దా?
ఈ సమాజంలో సామాన్య మహిళల ప్రశ్నలకు అంత గుర్తింపు వుండదు. ఉన్నత విద్యావంతులైన మహిళల మాటలకు ఎంతో గుర్తింపు వుంటుంది. వారి ప్రశ్నలపై సమాజంలో చర్చ జరుగుతుంది. ఆ ప్రశ్న సమాజంలో చైతన్యానికి ఒక వేధికౌతుంది. ఆమెను కూడా రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం సరైందికాదు. ఇక గతంలో ఉమ్మడిరాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించలేక, వారి ఒత్తిళ్లను అడ్డుకోలేక మహిళా ఐఏఎస్‌లైన శ్రీలక్ష్మి లాంటి వారు ఎంతటి శిక్షలను అనుభవించారో తెలియందికాదు. అందుకే తప్పు చేస్తే ఎంతటి స్ధాయిలో వున్న అధికారినైనా ప్రశ్నించే హక్కు, అధికారం పాలకులకు వుంటుంది. కాని తమకు సంబంధం లేని విషయాల్లో కూడా వారిని దోషులను చేసినా, వారిపై విరుచుకుపడినా, పది మందిలో చులకన చేసినట్లు మాట్లాడినా ఐఏఎస్ అధికారుల సంఘం ఉపేక్షించడం కూడా మంచిది కాదు. ఇలాంటి సందర్భాలలో వారికి ఐక్యత ఎంతో అవసరం. ఎవరైతే చిన్న చూపు చూడబడ్డారో వారికి మిగతా ఐఏఎస్ అధికారులు వారికి అండగా నిలబడడం కూడా ఎంతో ముఖ్యం.