అన్నీ అసత్య ప్రచారాలేనా!?

`నిజమెంతన్నది కరిమింగిన వెలగపండేనా!

`నేతి బీరకాయలో నెయ్యేనా?

`నిప్పులేనిదే పొగరాదే?

`నాయకులు నోరువిప్పకపోతే ప్రచారం ఆగదే?

`దాటవేస్తే దాగుతుందా?

`కొందరి విషయంలోనే ఎందుకిలా?

`విచిత్ర రాజకీయాలు?

`డైలమాలో నాయకులు?

`వెళ్ల లేక, వుండలేక ఏ దిక్కూ కానరాక?

`చౌరస్తాలో మనసు…నోరు తెరిస్తే మునుగు?

`అటు, ఇటూ, ఎటూకాని ఆగంలో భవిష్యత్తు!?

`నాయకులు తేల్చుకోలేని న(వ)యా రాజకీయం?

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

వారి చేతులో వారి జీవితముంటే వాళ్లు నాయకులెందుకౌతారని ఓ సామెత. నాయకులకు కూడా తెలియకుండానే కొన్ని సార్లు వారి ప్రమేయం లేకుండానే జీవితాలు పరుగెత్తుతూనే వుంటాయి. ఆయాసపడుతూనే వుంటాయి. నిత్యం ఆగమ్యగోచరమైన ప్రయాణం సాగుతూనే వుంటుంది. కాకపోతే అప్పుడప్పుడూ అధ్భుతాలు కూడా వారి జీవితాల్లో జరుగుతుంటాయి. కాకపోతే ప్రతి క్షణం అనుమానమే? ప్రతి క్షణం ఒక అపనమ్మకమే? అయినా ఆగదు ప్రయాణం. నదుల్లో నీరు ఎన్ని అవరోధాలనైనా ఎదుర్కొని ఎలా సాగుతుందో నాయకులు కూడా అంతే …ఒక్కసారి ఆగితే ఇక అంతే…ఆ నాయకుడికి ముందుకు దారి మూసుకుపోయినట్లే…గమ్యం ఆగమైనట్లే…అందుకే నాయకులు ఎక్కడా ఆగాలనుకోరు…ఎప్పుడూ ఏదో ఒక ఆప్షన్‌తో రెడీగా వుంటారు… ఇది ఎంత పెద్ద నాయకుడైనా సరే…స్ధిరత్వం వచ్చే సరికి రాజకీయాలు కూడా లేకుండాపోయిన వాళ్లు కూడా చాల మందే వున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఊహలు వేరు..నిజాలు వేరు..నమ్మకాలు వేరు…విశ్వాసాలు వేరు…ఆఖరుకు నిట్టూర్పులు మిగిలే రాజకీయాలు వేరు…ఇవన్నీ దాటుకొని సాఫిగా సాగుతుందనుకున్నా, కాలం సహకరిస్తుందన్నది కూడా లేకపోవచ్చు. ఎవరు ఎప్పుడు సుడిగుండాలలో చిక్కుకుంటారో…వాటికే ఎదురెళ్లి చిక్కుకుంటారో చెప్పడానికి అనేక విషయాలున్నాయి….

                  ఈ మధ్య విసృతమైన ప్రచారం జరుగుతున్న నాయకుల్లో ఈటెల రాజేందర్‌ 

            ముందు వరసలో వున్నారు.

 పాపం ఆయన వేసే ప్రతి అడుగునూ ప్రతి వ్యక్తి ఆసక్తిగానే గమనిస్తున్నారని చెప్పకతప్పదు. నిప్పులేనిదే పొగరాదంటారు…అది ఈటెల విషయంలోనే ఎందుకు పదే పదే జరుగుతుందన్నది కూడా ఆసక్తిని రేపుతోంది. టిఆర్‌ఎస్‌లో వున్న సమయంలోనూ ఇదే జరిగింది. ప్రతిసారి ఏదో ఒక వివాదం తెరమీదకు వచ్చేది. ఆయన అనుకోకుండా స్పందించేవారో…లేక అతి నమ్మకంతో స్పందించేవారోగాని అక్కడ కొంప ముంచుకున్నారు. అది ఒక రకంగా చెప్పాలనుకుంటే చేజేతులా చేసుకున్నారు. నేను గులాబీ ఓనర్నే అన్నంత దూరం వెళ్లి ముందుకెళ్లే దారి మూసేసుకున్నారు. గమ్యం లేని ప్రయాణం కొని తెచ్చకున్నారు. టిఆర్‌ఎస్‌లో వున్నప్పుడు అన్న అదే మాట..ఇప్పుడు బిజేపి జెండాకు ఓనర్నే అనగలరా? అనలేరు..అంత సాహసం కలలో కూడా చేయలేరు…అని .అసలు ఆపార్టీలో ఇమడలేనేరు? అని ఆది నుంచి అందరూ అంటున్నదే…కాకపోతే ఆ క్షణం నీడ కోసం వెతుక్కున్నది నిను వీడని నీడను నేను అనుకునేదాకా వస్తుందా? అన్నది కూడా తెలియదు. లేక వీడిపోయే దాకా అక్కడ కూడా పొగపెడతారా? అన్నది కూడా ఆసక్తిగా మారింది. గత కొంత కాలంగా మీడియాలో ఎక్కువగా ట్రోల్‌ అవుతున్న నాయకుడు ఈటెల. ఆయన కమలం వదిలేసి చేయందుకునే ప్రయత్నాలలో వున్నారన్న మాత్రం వార్తలు అనేకం వస్తున్నాయి. గతంలోనూ ఇలాగే జరిగింది. 

                         ఓ టివిఛానల్‌ ముఖాముఖిలో ఆఖరు ప్రశ్నతోనే ఆయన కారు ప్రయాణంలో కుదుపుపై క్లారిటీ తెచ్చింది.

….కాకపోతే ఈటెల మైక్‌ తీసేసి వెళ్లిపోయారు? కాని అదే నిజమైంది. ఆ పొగే చుట్టేసుకుంది. ఈటెల పార్టీ నుంచి వెళ్లాల్సివచ్చింది. సైలెంటుగా వుండాల్సిన టిఆర్‌ఎస్‌లో నోటికి పని చెప్పారు…ప్రతిదాన్ని ఈటెల వివాదాం చేసుకుంటూ వచ్చారు…ఇప్పుడు నోరు తెరవాల్సిన సమయంలో మాత్రం మౌనముద్రలో కనిపిస్తున్నారు. అందులోనూ ఏది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అంటే ఇక్కడ కూడా ఈటెలకు పొగపెడుతున్నారన్న వార్త మాత్రం నిత్యం నలుగుతున్నది. ఏది నిజం..ఏది అబద్దమన్నది కాలమే తేల్చినా…ఈటెల పార్టీ మార్పు పై ట్రోల్స్‌ ఇప్పట్లో ఆగేలా లేవు…..ఆగుతుందో లేదో కూడా తెలియదు… ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పేరున్న మాజీ టిఆర్‌ఎస్‌ నాయకుడు నల్లాల ఓదేలు కాంగ్రెస్‌లో చేరడం ఈటెల రాజకీయం మీద ప్రభావం చూపనుందా? అన్న ప్రచారం కూడా మొదలైంది. నల్లాల ఓదేలుకు ఈటెల రాజేందర్‌కు మంచి సంబంధాలున్నాయి. ఈటెలకు బిజేపిలో సముచిత స్ధానం లేకపోవడం, ఆయనే పార్టీలో వుండాలా? వాద్దా? అన్న ఊగిసలాటలో వుండడం వల్లనే, నల్లాల ఓదేలును బిజేపిలోకి రమ్మని ఒత్తిడి చేయలేదన్నది కూడా ఓ గుసగుస. కాకపోతే ఈటెలను సంప్రదించిన తర్వాతే ఓదేలు పార్టీ మార్పులో ఓ క్లారిటీ వచ్చిందని అంటున్నారు. అందుకే ఈటెల ఎలాంటి సూచన చేయొచ్చన్నదానిని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదంటున్నారు. 

                       ఈటెల టిఆర్‌ఎస్‌నుంచి వెళ్తు వెళ్తూ, ఏనుగు రవీందర్‌ రెడ్డి, తుల ఉమలను కూడా బిజేపిలోకి తీసుకెళ్లారనే చెప్పాలి.

మరి ఇప్పుడు నల్లాల ఓదేల విషయంలో ఎందుకు జరగలేదన్నది లోతుగా ఆలోచిస్తే, ఈటెల కూడా సమయం కోసమే చూస్తున్నాడన్న వార్తలు మాత్రం బలంగానే చక్కర్లు కొడుతున్నాయి…ఈటెల రాజేందర్‌ కోసం హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఎంతో శ్రమించిన మాజీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇక బిజేపిలో చేరినట్లే అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆ చేరిక ఆగింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో చేరుతున్నారన్న ప్రచారం సాగింది. కాని అనూహ్యం…కొండా చేరలేదు…అందరికీ షాకిచ్చారు…కారణం ఏమైవుంటుందా? అన్నదానిపై రకరకాల చర్చలు ప్రచారంలో వున్నా, ఎవరో బలంగా వద్దని వారించి వుంటారన్నది కూడా విసృతంగానే చర్చించుకుంటున్నారు…అంటే ఎక్కడో ఏదో తేడా కొడుతోందన్నదానిపై మాత్రం రోజురోజుకు మరింత లోతైన విశ్లేషణలే జరుగుతున్నాయి…గతంలో కారులో వైభోగంగా చక్రం తిప్పిన నేత కమలం గూటికి చేరి ఎన్నికల సమయంలో మాత్రమే పనికొచ్చే నేతగా మారపోయారని, తర్వాత కనిపించరన్న వార్తలు కూడా వున్నాయి. అందుకే కమలంలో చేరి కలవరపడే కన్నా, ఆగమై ఆందోళన కొని తెచ్చుకోవడం కాన్న, దూరం వుండడమే మేలన్న సలహాలు ఎవరో బలంగా ఇవ్వడం మూలంగానే చేరికలు కూడా పెద్దఎత్తున ఆగుతున్నాయంటున్నారు. 

                 ఇక ఖమ్మం జిల్లాకు చెందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయం కూడా ఆయనచేతుల్లో లేకుండా చేయాలని చాలా మందే చూస్తున్నట్లు కనిపిస్తోంది.

 ఆయన రాజకీయం జీవితం ఫ్యాను నుంచి కారుకు చేరింది. అక్కడే ఇప్పటిదాక ఆయనకు కుదురుగానే ప్రయాణం సాగింది. కాని గత కొంత కాలంగా మీడియాలో, సోషల్‌ మీడియాలో కుదుపులు కనిపిస్తున్నాయి…కాని అవి నిజం కాదని, పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి అనేక సార్లు చెప్పినా ఆగడంలేదు. ఇటీవల రాజ్యసభ పదవులు పంపకం తర్వాత ఎవరికి తోచింది వారు రాసేస్తున్నారు… అందులోనూ నిజం లేకపోలేదని జనం తీర్మానించుకునేదాకా తెస్తున్నారు. ఇప్పటికిప్పుడు పార్టీ మారితే పొంగులేటికి వచ్చేదేమీ లేదు…ఆయన వైఎస్‌ఆర్సీ తెలంగాణ అధ్యక్షుడిగా వున్న సమయంలోనే కారెక్కారు. పార్టీలో గౌరవంగా ప్రయాణిస్తున్నారు. కారులో ఒదిగిపోయారు. కాకపోతే ప్రత్యర్ధుల మూలంగా కొన్ని వివాదాలు ఎదుర్కొన్నారు. అయినా పార్టీలో ఆయన సముచితంగానే గౌరవింపబడుతున్నారు. అది ఆయనకు తెలుసు. అయినా మీడియాకు వార్తలు కావాలి…వాటిని వేడివేడిగా వండి వార్చాలి…అందుకోసమైనా పొంగులేటిని నిత్యం వార్తల్లో వ్యక్తినిచేయాలి. పొంగులేటి పార్టీ మార్పు వార్తలు ఎప్పుడూ సజీవంగా వుంచాలి. లేకుంటే మీడియాకు తృప్తివుండదు…అలా మీడియా విసృత ప్రచారం కూడా చాలా మంది నేతల కొంపలు ముంచిన సందర్భాలు కూడా చరిత్రలో అనేకం వున్నాయి. అందుకే కొన్ని సార్లు వారి రాజకీయాలు కూడా వారి చేతుల్లో లేకుండాపోతాయంటారు…ఇలా రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్‌లో కోవర్టుల పోరు పేరుతో నిత్యం పురిటి నొప్పులు వుండనే వున్నాయి. అటు నుంచిటు, ఇటు నుంచటు అంటూ ఎవరు ఎప్పుడు ఎటు వైపు మార్పు చూపులు మార్చిమార్చి చూస్తున్నారన్నదానిపై కూడా మీడియాకు సర్వత్రా ఆసక్తే మరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!