సీనియర్లే సిన్సియర్లు!

కొత్తగా వచ్చి కొంపలు ముంచుతున్నారు?

పాత తరం ఉసురుపోసుకుంటున్నారు?

వారి ఆనవాలు లేకుండా చేస్తున్నారు?

కరుడుగట్టిన కాంగ్రెస్‌ వాదులను దూరం చేసుకుంటున్నారు?

కలుపుకుపోయే రాజకీయాలను పాతరపెడుతున్నారు?

కెలుకుతూ పాత తరాన్ని దెబ్బతీస్తున్నారు?

కోవర్టు ముద్రలేసి తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు?

శిఖండి రాజకీయాలు గుర్తు చేస్తున్నారు?

ఏ నాయకుడైనా చెంచా గిరి కోరుకోడు?

అలాంటి వాళ్లు నిన్నటి తరం కాంగ్రెస్‌ లో లేనే లేరు?

సీనియర్ల దారిలో వెళ్లలేని వారు బలహీనులు?

వారికి దారి మూసే వాళ్లు స్వార్థపరులు?

సీనియర్లను పక్కనపెట్టి గెలవడం సాధ్యమా?

సీనియర్లంతా ఏకమైతే కొత్త వారి ఆటలు సాగునా?

                           కాంగ్రెస్‌లో సీనియర్లు…ఒక రకంగా చెప్పాలంటే పార్టీకి పెట్టని గోడ వంటి వాళ్లు…తెలంగాణ వచ్చాక పార్టీని వదిలి కొందరు ఎవరి దారి వారు చూసుకున్నవాళ్లు కూడా వున్నారు. అయినా కోవర్టులంటూ ముద్ర వేసుకున్న వాళ్లు మాత్రం ఎనమిదేళ్లుగా పార్టీలో వుంటున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఎంత మంది నిందించినా పార్టీలోనే వుంటున్నారు. ఎంత మంది కించపరుస్తున్నా పార్టీని వీడలేదు. ఇంతకన్నా నిబద్దత కల్గిన నాయకులు వుంటారా? సహజంగా సీనియర్లు అన్నాక పెద్దరికం అన్నదానితోపాటు కాస్తో కూస్తో గర్వం వుంటుంది. వుండాలి కూడా. ఇంటిపెద్ద మర్యాద కోరుకోవడంలో తప్పు లేదు. సేమ్‌ అలాంటిదే ఒక్కడ పరిస్ధితి. సీనియర్ల ఆలోచనా సరళి. అంతకు మించి ఏదీ లేదు. కాని దాన్ని బూతద్దంలో చూపించి, వారిని అబాసుపాలు చేయడం అన్నది సరైంది కాదు. ఎందుకంటే కాంగ్రెస్‌లో పుట్టి కాంగ్రెస్‌లోనే చివరిదాకా కొనసాగాలన్న ఆలోచనతోనే చాలా మంది వున్నారు. ఎవరు ఎన్ని రకాలగా మాట్లాడుతున్నా నా పార్టీ అన్నదే నరనరాన జీర్ణించుకొని కొనసాగుతున్నారు. పదవులు లేకపోయినా ఫరవాలేదనుకుంటూనే వుంటున్నారు. ఒక్కసారి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత చాలా మంది సీనియర్లలో పక్క చూపులు చూసిన వాళ్లు లేరు. తమలో తాము తిట్టుకొన్నా, దుమ్మెత్తిపోసుకున్నా పార్టీని వీడిరది లేదు. తమ స్వార్ధం చూసుకున్నది లేదు. కలహాలతోనైనా కూడా కొనసాగూనే వస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొత్తగా పుట్టుకొచ్చిన కోవర్టులు అన్న పదం వారి కోసమే పుట్టిందా? అన్నట్లు అవమానిస్తున్నా పార్టీని వదిలి వెళ్లలేదు. ఇంకా వారిని నిందించడం తగదు. తెలంగాణ ఒక దశలో ఇక కాంగ్రెస్‌కు మనుగడే లేదన్నంత దాకా రాజకీయాలు వెళ్లాయి. అయినా సీనియర్లు పార్టీని వదల్లేదు. దూరంగా పారిపోలేదు. టిఆర్‌ఎస్‌లో చేరలేదు. పదవులు కోరుకోలేదు. ఆస్ధులు కూడబెట్టుకోలేదు. 

                        ఎనమిదేళ్లుగా పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీలు మారలేదు. ఇది నిబద్దత కాదా? పదే పదే వారిని నిందించడం ముందు మానుకోండి? నిజంగా కోవర్టులు అన్న ముద్రలు పడ్డ సీనియర్లలు పదవుల మీద ఆశలే వుంటే, టిఆర్‌ఎస్‌లోకి వెళ్లి ఏదో ఒక పదవి సంపాదించుకునే వాళ్లే కదా? కాని అలా చేయలేదు. ఇంకా అవకాశం వుంటే టిఆర్‌ఎస్‌లో చేరి పోటీ చేసి గెలిచేవాళ్లు కదా? ఇంత కాలం లేనిది…పిపిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి రాగానే సీనియర్లు కోవర్టుల అవతారం ఎత్తారా? కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు అన్నవి ఇప్పటి కావు. ఆది నుంచి వున్నవే…జళగం వెంగళరావు లాంటి వారు ముఖ్యమంత్రి కావడానికి కాసు బ్రహ్మానందరెడ్డిని ఇరుకున పెట్టిన రోజులున్నాయి. ఆఖరుకు పి.వి. నర్సింహారావు ముఖ్యమంత్రైతే కూడా ఆయనను దించేదాకా వదిలిపెట్టని రాజకీయాలున్నాయి. అయినా ఆనాడు వాళ్లలను కోవర్టులు అనలేదు. 1978లో ఒకసారి, 1989 మరోసారి చెన్నారెడ్డి పార్టీని గెలిపించినా ముఖ్యమంత్రి గా ఆయనను పదవిలో కుదురుగా కూర్చోనిచ్చిన రోజులు లేవు. కాంగ్రెస్‌ అంటేనే అలాగే వుంటుంది. వాటన్నింటినా జీర్ణించుకోవాలంటే కాంగ్రెస్‌లోనే పుట్టి పెరిగితే తప్ప భరించగలరు. అంతే కాని కొత్తగా చేరిన వారికి ఆ రాజకీయాలు రుచించవు. పొడగ్తలు లేని రాజకీయాలు జీర్ణించవు. ఆధిపత్యం లేకుండా చేసేవారిని మెప్పించడం వుండదు. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది. పిపిసి ఏం చేయాలనుకుంటుందో వాటిని పార్టీలో సీనయర్లతో చర్చించకుండానే నిర్ణయాలు జరుగుతున్నాయన్నది ఒక వాదన. అంతే ఇంతకన్నా ఏమీ లేదు? పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు ముందే సమచారం ఇవ్వమంటున్నారు? తమ ప్రమేయం లేకుండా కార్యక్రమాలు చేపట్టొద్దంటున్నారు. 

                            తమ గౌరవానికి భంగం కల్గకుండా చూడాలంటున్నారు. ఒంటెద్దు పోకడలు వద్దంటున్నారు. మీడియా హడావుడి కన్నా, ప్రజల్లో వుండడం మేలంటున్నారు. ఏదైనా మెరుపు ధర్నా చేయాలనుకుంటే ముందే లీక్‌ చేయొద్దంటున్నారు. ఇవన్నీ పార్టీకి మేలు చేసే విషయాలే కాని కీడు చేసేవి కాదు…అయినా ఎందుకు సీనియర్లపై దుమారం రేపుతున్నారు? అన్నదే ఇక్కడ స్పష్టం కావాల్సిన అంశం. ఒకనాడు పొన్నాల లక్ష్యయ్యను డాలర్‌ లక్ష్మయ్య అని కీర్తించేవారు. పార్టీ పరమైన కార్యక్రమాల ఖర్చు ఆయనతో పెట్టించేవారు. అయినా ఆయన ఒక్కొమెట్టు ఎక్కుతూ ఎదిగారు. పార్టీకి విధేయుడిగానే వున్నారు. 2004 ఎన్నికల మందు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడాననికి వైఎస్‌ పాదయాత్ర చేస్తే, ఆయనతోపాటు పూర్తి కాలం పాదయాత్ర చేసిన వారిలో పొన్నాల ఒకరు. పార్టీలో ఎంతో విలువైన నాయకుడు. మాజీ ప్రధాని పి.వి లాంటివారు కూడా అమెరికాకు వెళ్తే, ఆయన ఇంట్లో బస చేసేవారు. కడు పేదరికం నుంచి అపర కుభేరుడైనా కూర్చుని హాయిగా తిన్నా కులాసాగా కాలం గడిచేది. కాని ఖద్దరు దుస్తులు వేసుకొని, పల్లె పల్లె తిరిగి ప్రజల కోసం పొన్నాల నాయకుడయ్యాడు. 1989లో మత్స్యశాఖ మంత్రిగా కొద్ది కాలం పనిచేసి, తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినా, పార్టీలోనే కొనసాగాడు. 2004 నుంచి 2014 వరకు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ వచ్చాక పిపిసి. అధ్యక్షుడయ్యారు. పార్టీ ఆయనకు ఇచ్చిన సముచిత స్ధానంతో ఆయన పార్టీకి ఇంత వయసులోనూ సేవ చేస్తున్నాడు. అలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత పిపిసి మీద లేదా? ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదా? ఆయన నియోజకర్గంలో ఆయనకే పొగ పెట్టే పన్నాగాలు పన్నడం అవసరమా? గత ఎన్నికల్లో అదే జరిగింది. ఈ సారి కూడా అదే విధంగా ఆయనను మానసిక క్షోభకు గురిచేస్తారా? నిత్యం ఆయన పార్టీ కోసం పనిచేయడం ప్రజలకు తెలియందా? ఇక ఒకనాడు ఎన్టీఆర్‌ ప్రభంజనంలో కూడా ఇండిపెండెంటుగా గెలిచి నిలిచిన ఆనాటి హీరో జానారెడ్డి. తర్వాత టిడిపిలో చేరినా, తెలంగాణ వాదిగా ఎన్టీఆర్‌ ఒంటెద్దు పోకడలు నచ్చక, టిడిపినుంచి బైటకొచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నాడు. తెలంగాణలో కాంగ్రెస్‌లో అందరికంటే రాజకీయంగా,పాలనా పరంగా అనుభవం వున్న నాయకుడు. కాని ఆయన మాట కూడా చెల్లుబాటు కాకుండా చేయడం సరైందేనా? పైగా ఆయన కూడా పరోక్షంగా టిఆర్‌ఎస్‌ కోవర్టుగానే చిత్రీకరించడం భావ్యమా? ఇక కోమటి రెడ్డి వెంకటరెడ్డి. నల్లగొండ జిల్లా రాజకీయాలను శాసించిన నాయకుడు. ఆయన తమ్ముడు రాజగోపాల్‌ రెడ్డి కూడా ఎంపిగా నిత్యం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న నేత. పైగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కోసం మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన నాయకుడు. ఆమరణ నిరసన కూడా నిర్వహించారు. 

                             ఉమ్మడి నల్లగొండతోపాటు, తెలంగాణలోని అన్ని ప్రాంతాల నాయకులను గుర్తుపట్టగలిగే నాయకుడు. ఎన్‌ఎస్‌యూఐ నుంచి పార్టీని నమ్ముకొని రాజకీయలు చేస్తున్నారు. తెలంగాణలో అనేక చోట్ల వారి తల్లిగారైనా సుశీలమ్మ పేరు మీద వృద్ధాశ్రమాలు నిర్మాణం చేసి, ముదిమి వయసులో వారి ఆలనా పాలనా చూస్తున్నారు. వారికి పట్టెడన్నం పెడుతున్నవారు. అలాంటి వారిని కూడా కోవర్టులు అంటూ నిందించడం సరైందేనా? ఒక్కసారి ఆలోచించండి. పార్టీ అధ్యక్షపదవి కోసం కోమటి రెడ్డి ఆరాటపడ్డారు. పోటీ పడ్డారు. అర్హత వుండి కూడా పదవుల్లో అన్యాయం జరిగిందన్న అసహనం వ్యక్తం చేస్తుంటారు. అందులో తప్పేముంది. అనుకోని అవకాశాలను అందపుచ్చుకొని పదవులు అనుభవించి, ఓడిపోగానే పార్టీని వదిలేసి వెళ్లిన వారు చాల మంది వున్నారు. అందులోనూ టిఆర్‌ఎస్‌లో కీలక పదువులు కూడా అనుభవిస్తున్నారు. కాని ఇంకా పార్టీ కోసం సేవలు చేస్తున్న సీనియర్లను నిందిడంచడం సరైంది కాదు. ఇక వి. హనుమంతరావు. ఆయన స్టైలే వేరు. ఆయన రాజీకీయం వేరు. భోళా మనిషి. దివంగత వైఎస్‌. రాజశేఖరరెడ్డిని నిత్యం తిట్టిన తిట్టు తిట్టకుండా దుమ్మెత్తిపోస్తుండేవారు. అయినా అప్పుడు ఆయన వ్యాఖ్యలను పార్టీలో కూడా ఎవరూ సీనియస్‌గా తీసుకునేవారు కాదు. రాజశేఖరరెడ్డికూడా ఆయన వ్యాఖ్యలపై ఏనాడు స్పందించేవారు కాదు. ఏ రాజశేఖరరెడ్డి నైతే వీలు చిక్కినప్పుడల్లా ఇరికించేవాడో అదే హనుమంతరావుకు 2005లో రాజ్యసభకు పంపే సమయంలో వైఎస్‌. అడ్డుపడలేదు. ఆఖరకు కేవిపి. రామచంద్రరావును రాజ్యసభకు పంపాలని వైఎస్‌కు బలంగా వున్నా, హనుమంతరావుకు రాజ్యసభ ఇవ్వడానికి సహకరించారు. అలా వుండాలి. రాజకీయాలు అంతే గాని, ఆలు లేదు చూలు లేదు…సీనియర్లందర్నీ పక్కన పెడితే చాలు అనుకోవడం పొరపాటు….మొత్తం సీనియర్లు పక్కకు జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికి వుంటుందా? సీనియర్లని కరివేపాకులుగా తీసేయకండి….పార్టీ కోసం వాడుకోండి…అదే వారు కూడా కోరుకుంటోంది…ఎవరో అనామకులను కూడా గెలిపించుకునే శక్తి వున్నప్పుడు, సీనియర్లను గెలిపించుకోండి…పాలనలో వారి అనుభవం కూడా భవిష్యత్తులో ఉపయోపడుతుంది. కోవర్టులు అన్న పదం వదిలేయండి…కోఆపరేషన్‌ తో , పొలిటికల్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ చేసుకోండి…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *