అన్నా, తమ్ముడి మధ్య తేడా’0’ నే!?

`కూడిన సున్నాతో వేలకోట్లకు పెరిగిన సంపాదన?

`కట్టాతో మునుగోడు నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.

`కుటుంబంలో రేపటి తరం కోసం, మునుగోడుకు చేసిన మోసం!

`ఆనాడు అన్నకు పులిచింతల పేరు మీద 18వందల కోట్లు?

`ఈనాడు తమ్ముడికి కేంద్రం నుంచి 18వేల కోట్లు?

`కాంట్రాక్టులలో కూడా ఫ్యాన్సీ నెంబర్లు…

`పులిచింతల కడితే అందులో దూకేస్తా అన్నాడు అన్న.

`రాజశేఖరరెడ్డి హయాంలో కాంట్రాక్టు తీసుకొని కట్టిందే వెంకన్న.

`ఆనాడు నల్గొండ రాజకీయాలు అడ్డం పెట్టుకొని… అన్న కోట్లు కూడబెట్టుకున్నాడు.

`తమ్ముడు మునుగోడును ఆత్మ గౌరవం తాకట్టు పెట్టి 18 వేల కోట్లకు టెండర్‌ పెట్టాడు….

`ఇద్దరూ కలిసి తెలంగాణ కు అన్యాయం చేసే పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేశారు.

`పులిచింతలతో తెలంగాణ గ్రామాలు ముంచారు.

`పోతిరెడ్డిపాడు తో తెలంగాణకే అన్యాయం తలపెట్టారు.

`ఇప్పుడేమో నీతులు, త్యాగాలను వల్లిస్తున్నారు.

`కుడి చేత్తో చేసిన సాయం ఎడమచేతికి తెలియకుండా చేయాలంటారు….

`చేసిన సాయాలు చెప్పుకొని అన్నదమ్ములు ఓట్లడుకుంటున్నారు.

`ఆ ఓట్లే లేకపోతే జనాన్ని దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు.

`సాయం పేరుతో మెతుకులు విదిల్చి, రాజకీయం అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించుకొన్నారు.

`పూటకో మాట, గడియకో వేషం కడుతున్నారు…

`అబద్దాల రాజకీయంలో ఓనమాలు నేర్చి, మోసపు రాజకీయాలలో పిహెచ్‌డిలు చేశారు.

`దొందూ దొందే…మరో సారి మునుగోడును ముంచేందుకే!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాలంటే ప్రజా సేవ అన్న అర్థాన్ని మార్చేసి, వ్యాపారానికి కేంద్రంగా చేసుకొని కాంట్రాక్టులు నిర్వహించుకున్నవారిలో కోమటిరెడ్డి సోదరులు ముందువరసులో వున్నారు. గతంలో కాంట్రాక్టర్లకు రాజకీయాలకు సంబంధాలుండేవి కాదు. కాని రాజకీయ నాయకులే కాంట్రాక్టు అవతారాలెత్తిన వారిలో కోమటి రెడ్డి సోదరులు ప్రజలను మోసం చేయడానికి కూడా వెనుకాడడం లేదని మరోసారి నిరూపించారు. గతంలో అన్న పులిచింతల పేరు చెప్పి రాజకీయం చేశాడు. ఓట్లు దండుకున్నాడు. ప్రజలను మోసం చేశాడు. వారి నెత్తిన శఠగోపం పెట్టాడు. ఇప్పుడు తమ్ముడు అదే దారిలో నడుస్తున్నాడు. మాది చిన్న కంపనీ అని ఒకనాడు చెప్పాడు. ఇప్పుడేమో! మా రేంజ్‌కు కార్లలో కూడా కాదు, హెలీకాప్టర్లలో తిరగాలంటున్నాడు. పూటకో మాట…గడికో వేషం అన్నట్లు ప్రజలు బురిడీ కొట్టించి, రాజకీయాలను అడ్డం పెట్టుకొని కాంట్రాక్టుల పేరుతో అడ్డదిడ్డంగా సంపాదించి, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టి, ఓట్లు కొని మళ్లీ గెలువొచ్చని చూస్తున్నారు. అన్నా దమ్ములు కుయుక్తులు మునుగోడు ప్రజలకు ఏనాడో తెలిసిపోయింది. రాజగోపాల్‌ రెడ్డి ఇప్పుడు తల కిందికి పెట్టి తపస్సు చేసినా, కోట్లు కుమ్మరించి ఓట్లు కొనుక్కొవాలని చూసినా ప్రజలు నమ్మే పరిస్ధితి లేదు. ఓట్లే పడే పరిస్థితి అసలే లేదు. వారికి ఈసారి మునుగోడులో ఓటమి తప్పదు. ప్రజల చేతిలో గుణపాటం తప్పదు అంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి మునుగోడు నుంచి కట్టాతో…!ఒకనాడు మాది చిన్న వ్యాపారం అన్న నోటితోనే, కార్లలో కాదు, హెలీకాప్టర్లతో తిరిగేంత రేంజ్‌ అంటున్నారు.

అంటే ఆ సంపాదన పెరగడానికి కారణం రాజకీయాలు. నల్లగొండ ప్రజలు. భువనగిరి నియోజక వర్గ ప్రజలు, మునుగోడు ఆశీస్సులు. రాజకీయాలు చేసేవారు వ్యాపారాలు చేయొద్దని కాదు..కాకపోతే ప్రజలను అడ్డం పెట్టుకొని కాంట్రాక్టులు సంపాదించడం ప్రజలను మోసం చేయడమే. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు, ప్రజా సేవ మర్చిపోయి, వ్యాపారాలను పెంచుకుంటూ పోయి, ఎన్ను కున్న ప్రజలను మర్చిపోయి, సాయం పేరుతో పది మెతుకులు విదిల్చి, మేం సాయం చేస్తున్నాం…ప్రజలను ఆదుకుంటున్నామంటూ ప్రచారం చేసుకోవడం తప్పు. సాయం చేయడం అన్నది రాజకీయం కోసమే అని నిరూపించుకుంటున్నారు. కుడిచేత్తే చేసిన సాయం ఎడమ చేతికి తెలియకుండా చేయాలంటారు. కాని కోమటి రెడ్డి సోదరుల ప్రచార పర్వంలో సాయమే ప్రధాన నినాదం చేసుకుంటారు. ప్రజలు ఒక రకంగా బ్లాక్‌ మొయిల్‌ చేస్తుంటారు. మేం మీకు సాయం చేయలేదా? అని ఓటర్లను భయపెడుతుంటారు. ఇవేనా రాజకీయాల్లో నైతికత. ఉమ్మడి రాష్ట్రంలో పులిచింతల నిర్మాణం అన్నది తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు వ్యతిరేకించారు. పులిచింతల నిర్మాణం వల్ల తెలంగాణలోని గ్రామాలు మునిగిపోయాయి. ఒకనాడు పులిచింతల నిర్మాణం చేపడితే అందులో దూకి ఆత్మహత్య చేసుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. అవి నిజమని నల్లగొండ జిల్లా ప్రజలు నమ్మారు. కాని ఆ ప్రకటన వెనుక ఎంతో మోసం దాగి వుందని గ్రహించలేకపోయారు. ఏ నోటితో అయితే వెంకటరెడ్డి పులిచింతల అడ్డుకుంటానన్నాడో, అదే చేతితో పులిచింతల నిర్మాణంలో భాగం పంచుకున్నారు. కాంట్రాక్టు దక్కించుకొన్నాడు. ఏడు వందల కోట్లతో పూర్తి చేయాల్సిన పులిచింతలను రూ.18 వందల కోట్లదాకా తీసుకెళ్లి లాభాల పంట పండిరచుకున్నాడు.

రాజకీయాన్ని వ్యాపారాన్ని ముడిపెట్టి సంపాదనలో కింగ్‌గా మారి, అదే బ్రాండ్‌ అని ప్రచారం చేసుకున్నాడు. ఓ వైపు పులిచింతలతో తెలంగాణ గ్రామాలకు అన్యాయం చేసి, ప్రతిగా కాంట్రాక్టు సంపాదించి, కృతజ్ఞతగా నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరెడ్డికి తోడుగా నిలిచి, పోతిరెడ్డి పాడు పొక్కను పెద్దది చేయడానికి కోమటిరెడ్డి సోదరులు కారణమయ్యారు. పులిచింతలతో నల్లగొండకు అన్యాయం చేసి, పోతిరెడ్డిపాడుతో మొత్తం తెలంగాణకే అన్యాయం చేశారు. దక్షిణ తెలంగాణను ఎండబెట్టారు. కృష్ణానది పరీవాహక ప్రాంతమైన మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు అందాల్సిన నీటిని రాయలసీమకు, ఆఖరుకు మద్రాసుకు తరలించేందుకు సహకరించారు. తెలంగాణలోనే కరువు జిల్లాగా, వలసల జిల్లాగా పేరున్న మహబూబ్‌నగర్‌కు నీళ్లిచ్చే మనసు రాలేదు గాని, ఎక్కడో వున్న మద్రాసుకు మరిన్ని నీళ్లు తరలించేందకు కోమటిరెడ్డి సోదరులు దోహదపడ్డారు. తెలంగాణను ఎండబెట్టారు. వ్యాపారం ముసుగులో మేమూ తెలంగాణ వాదులమే అని ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే మోసం చేశారు. మంత్రిపదవిని అడ్డం పెట్టుకొని పులిచింతల, పోతిరెడ్డిపాడు కాంట్రాక్టులు చేసి, తెలంగాణ కోసం రాజీనామా చేశానని ప్రజలను నమ్మించారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఎప్పటికప్పుడు ఎత్తులు వేస్తూనే వున్నారు. ఎన్నికల్లో గెలుస్తూ, కాంట్రాక్టులు కొట్టేస్తున్నారు. అవకాశాలిచ్చిన పార్టీలకు సున్నం పెట్టి, స్వార్ధం చూసుకుంటున్నారు. ప్రజలు మోసం చేస్తున్నారు. వేల కోట్లు సంపాదిస్తున్నారు. అన్న దోరణి అలా వుంటే, తమ్ముడు తక్కువేం కాదని నిరూపిస్తున్నాడు. అన్న 18 వందల కోట్లతో పులిచింతల నిర్మాణం చేస్తే,తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి ఏకంగా రూ.18వేల కోట్ల ప్రాజెక్టు సొంతం చేసుకొని తమకు తామే సాటి అని నిరూపిస్తున్నారు. ప్రజలు మోసం చేయడంలో పోటీ పడుతున్నారు. ఒకనాడు అన్న, ఇప్పుడు తమ్ముడు కుటంబంలోని రేపటి తరం కోసం ఆస్ధులు కూడబెట్టుకునేందుకు రాజకీయాలను వాడుకుంటున్నారు.

ప్రజలకు సేవ చేయడం గాలికొదిలేశారు. ఇలా ప్రజలు ప్రతీసారి మభ్యపెట్టి, మాయ చేసి, మోసం చేస్తూ వస్తున్నారు. అదే వరుసలో మరోసారి మునగోడు ప్రజలు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి, మూడేళ్లుగా బిజేపి పాట పాడి, ఆఖరుకు రూ.18వేల కోట్ల ప్రాజెక్టు కొట్టేసి, మునుగోడు ప్రజలకు పంగనామాలు పెట్టేశారు… అభివృద్ధి విస్మరించారు. ఇప్పుడు కొత్త సుద్దులు వల్లిస్తున్నారు…మళ్లీ ఓట్లేస్తే కేంద్రం నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. అన్న ఆస్ట్రేలియా నుంచి ప్రచారం చేస్తుంటే…తమ్ముడు నోట్లతో ఓట్లు కొనుక్కునేందుకు కుయుక్తులు పన్నుతున్నాడు. మునుగోడుతో తెలంగాణ అస్ధిత్వాన్ని కూడా ఆగం చేసేందుకు తెరలేపుతున్నాడు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కల్లోలం రేపుందుకు కారణమౌతున్నారు. మునుగోడు ప్రాంతానికి ఇన్నేళ్ల రాజకీయంలో కోమటిరెడ్డి సోదరులు మంచినీళ్లు ఇవ్వలేకపోయారు…కాని ఇప్పుడేదో ఉద్దరిస్తామని చెప్పుకుంటున్నారు. ప్రజలకు కోమటిరెడ్డి సోదరుల అసలు స్వరూపం తెలిసిపోయింది. వారి నిజస్వరూపాలు బైటపడిపోయాయి. రాజగోపాల్‌రెడ్డిని మరోసారి నమ్మేందుకు మునుగోడు ప్రజలు సిద్దంగా లేదు…ఓట్లేసేందుకు ససేమిరా? అంటున్నారు..గ్రామాల్లోకే రానివ్వడంలేదు. ఈసారి రాజగోపాల్‌ రెడ్డిని ఓడిరచి తగిన బుద్ది చెబుదామని మునుగోడు ప్రజలు చూస్తున్నారు. మరోసారి ప్రజలను మోసం చేయకుండా రాజగోపాల్‌ రెడ్డి రాజకీయ జీవితాన్ని ఇక్కడే పుల్‌స్టాప్‌పడేలా చేసుందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఈసారి రాజగోపాల్‌రెడ్డి చెప్పే మాయ మాటలు నమ్మమని బహిరంగంగానే చెబుతున్నారు. ఇప్పటికే రాజగోపాల్‌కు ఓసారి అవకాశమిస్తే మునుగోడు అభివృద్ధి కాకుండా పోయింది. ఇప్పుడు మరోసారి మోసపోయేందుకు ప్రజలు సిద్దంగా లేమని చెబుతున్నారు. టిఆర్‌ఎస్‌ను గెలిపించి, అభివృద్ధి చేసుకుంటామంటున్నారు. కోమటిరెడ్డిసోదరులకు చుక్కలు చూపించేందుకు మునుగోడు ప్రజలు సిద్దంగా వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!