అధికారులు నిద్రపోతున్నారా…? మరీ ఇంత అధ్వాన్నమా…?


అధికారులు నిద్రపోతున్నారా…? మరీ ఇంత అధ్వాన్నమా…?

  • – పోచాపురం మినీ గురుకులంలో చిన్నారుల అవస్థలు
  • – పిల్లల చేత మరుగుదొడ్లు కడిగిస్తున్న ప్రిన్సిపాల్‌
  • – నీళ్ల పప్పు, చాలీచాలని ఉప్మా, పనికిమాలిన మెను
  • – నీటి సౌకర్యం లేక అల్లాడుతున్న విద్యార్థినులు-వ్యవసాయ బావులే దిక్కు
  • – ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు…?
  • – ఇంత జరుగుతున్న కన్నెత్తి చూడని అధికారులు

నేటిధాత్రి బ్యూరో : నేటి బాలలే రేపిటి పౌరులు, తరగతి గదిలో దేశభవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని అంటారు. ఇవన్ని అధికారులకు తెలుసు, ప్రజాప్రతినిధులకు తెలుసు. అప్పుడప్పుడు వీరు సైతం ఈ నీతి సూత్రాలను వల్లిస్తుంటారు. ఆచరణలో మాత్రం ఆవగింజతైనా పాటించారు. ఓవైపు సర్కార్‌ బాలకార్మికులు లేని రాష్ట్రంగా తెలంగాణను రూపుదిద్దాలని చూస్తుంటే విద్యాశాఖ అధికారులు మాత్రం బడికి వెళుతున్న బాలికలను బాలకార్మికులుగా మారుస్తున్నారు. పోషకాహారం అందిస్తున్నాం, సన్నబియ్యం, గుడ్డు, చికెన్‌ అంటూ తెలంగాణ సర్కార్‌ చెపుతుంటే వాటిని అధికారులు మింగుతున్నారో, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ మింగుతున్నారో తెలియదు కానీ నీళ్లచారు, చాలీచాలని ఉడికి ఉడకని, నీళ్లను పోసి బాగా కాచిన ఉప్మాతో అర్థాకలితో బాలికలు చదువును కొనసాగిస్తున్నారు. అంతేకాదు సభ్యసమాజం తలదించుకునేలా నిసిగ్గుగా ఇక్కడ విద్యనభ్యసిస్తున్న బాలికలతోనే ప్రిన్సిపాల్‌ మరుగుదొడ్లు కడిగిస్తూ తన తెలివి తక్కువతనాన్ని ప్రదర్శిస్తోంది. ఇదంతా జరుగుతుంది ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచాపురం మినీ గురుకుల పాఠశాలలో ఇక్కడి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న శ్రీలత తన వ్యక్తిగత పనుల మీద ఉన్న శ్రద్ద విద్యార్థినులపై చూపడం లేదు. తన పిల్లలను చూసుకునేందుకు ప్రభుత్వ సొమ్ముతో ఇదే గురుకులం తిండి పెడుతూ కేర్‌టేకర్‌ను నియమించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మినీ గురుకులంలోనే ఉంచుతున్న ప్రిన్సిపాల్‌ పిల్లల బాగోగులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

75మందికి కిలో పప్పు

పోచాపురం మినీగురుకులం పాఠశాలలో 75మంది గిరిజన బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి అందిస్తున్న భోజనం తీరును చూస్తే జాలేస్తుంది. 75మంది బాలికలకు కిలోపప్పుతో ఆలుగడ్డలు ఇతర సామాగ్రి కలిపి నీళ్లచారులా కూర తయారుచేసి వడ్డిస్తున్నారు. రోజు ఇదే కూర పిల్లలకు పెడుతూ ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నట్లు తెలిసింది. సరైన ఆహారం లేక అర్థాకలితో తాము అలమటిస్తున్నామని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు అందించాల్సిన అల్పాహారం విషయంలో ప్రిన్సిపాల్‌ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. చాలీచాలని ఉప్మాను అందిస్తున్నారు.

బాలికలచే మరుగుదొడ్లు శుభ్రం

పుస్తకాలు పట్టుకుని చదువుకోవాల్సిన చేతులు వంతులవారీగా బ్రష్‌ పట్టుకుని మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నాయి. పోచాపురం మినీ గురుకులం పాఠశాలలో మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న బాలికలను చూస్తుంటే జాలేస్తుంది. ఇక్కడి ప్రిన్సిపాల్‌ రోజు పిల్లల చేతే మరుగుదొడ్లను శుభ్రం చేయిస్తుంది. కొంతమంది పిల్లలు అందుకు నిరాకరిస్తే బెదిరిస్తుందని, కొడుతుందని బాలికలు ఆరోపిస్తున్నారు. ఓవైపు బాలకార్మికులను పనిలోంచి బడికి పంపుతుంటే ఇక్కడి ప్రిన్సిపాల్‌ మాత్రం బడికి వెళ్లిన బాలికలను పనిమనుషులుగా మారుస్తుందనే విమర్శలు వినవస్తున్నాయి.

నీటి సౌకర్యం లేదు

మినీగురుకులంలో నీటి సౌకర్యం లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానం చేసేందుకు నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురుకులం చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ బావులపై ఆధారపడి నీళ్లు తెచ్చుకుంటున్నారు. స్నానం చేయాలంటే ఆరుబయటే వ్యవసాయ బావుల వద్దకే వెళుతున్నారు. ప్రిన్సిపాల్‌ మాత్రం అధికారులతో మాట్లాడి విద్యార్థినులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు చొరవ చూపడం లేదు.

గురుకుల పాఠశాలలో బయటివ్యక్తులు

ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో అందులో పనిచేసే సిబ్బందికి, ఉపాధ్యాయులకు బయటి వ్యక్తులెవరికి అనుమతి ఉండదు. కానీ ప్రిన్సిపాల్‌ మాత్రం బయటివ్యక్తులు గురుకులంలోనే ఉండేలా సహకరిస్తోందని తెలిసింది. ప్రిన్సిపాల్‌ అనుసరిస్తున్న విధానాలు, పిల్లలకు అందిస్తున్న భోజన విషయాలు అధికారుల దృష్టికి వెళ్లకుండా కొంతమంది స్థానికులను గురుకుల పాఠశాలలోకి అనుమతించి వారికి భోజన సౌకర్యాలు కల్పిస్తుందని, వీరు ఇక్కడే తిష్ట వేస్తున్నారని విద్యార్థినులు తెలిపారు.

అధికారులు మొద్దునిద్ర వీడతారా…?

తాడ్వాయి మండలం పోచాపురం మినీగురుకులంలో ఇంత జరుగుతున్న అధికారులెవరికీ తనిఖీ చేయడానికి మనసు రావడం లేదు. బాలికలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్‌ ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్న వీరు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. పట్టణాలకు, మైదాన ప్రాంతాలకే పరిమితమైన అధికారులు ఏజెన్సీ గురుకులాలను పట్టించుకోవడం మానేశారని విమర్శలు వినవస్తున్నాయి. ఇప్పటికైనా గురుకులాన్ని తనిఖీ చేసి బాలికలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేస్తారా…లేదా చూడాలి.

ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి

– ఎస్‌ఎఫ్‌ఐ

పోచాపురం మినీగురుకులంలో తన ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్న ప్రిన్సిపాల్‌ శ్రీలతపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు సాగర్‌ డిమాండ్‌ చేశారు. గురుకులంలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అధికారులకు కనపడడం లేదా అని ప్రశ్నించారు. సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గురుకులాన్ని సందర్శించి సమస్యలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ సౌకర్యాలు లేక విద్యార్థినులు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. గురకులాన్ని సందర్శించిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నారా దిలీప్‌, సానబోయిన ప్రశాంత్‌ ఉన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!