అక్రమార్కులపై ఎమ్మెల్యే ‘చల్ల’ని చూపు

అక్రమార్కులపై ఎమ్మెల్యే ‘చల్ల’ని చూపు

ఆయనో ఎమ్మెల్యే, రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కాంట్రాక్టర్‌గా పేరుగాంచి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. సహజవనరులను దర్జాగా నమిలి వేస్తూ కోట్లు కూడబెట్టాడు. ఈయనగారు చేస్తున్న దందా ప్రస్తుత తరాలను, భవిష్యత్‌ తరాలను కూడా కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఎంత పెద్ద గుట్టలనైనా అవలీలగా మింగి వేస్తాడు. అనుమతుల సంగతి దేవుడెరుగు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కనుక పనులు చకచక జరిగిపోతాయి. కోట్లాది రూపాయలు జమ అయిపోతుంటాయి. ఇది ఎవరు ఇచ్చిన హక్కో తెలియదు. కానీ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు, మేథావులు, సహజవనరుల రక్షణ ప్రేమికులు నెత్తి, నోరు కొట్టుకున్న ఆ ఎమ్మెల్యే మాత్రం వ్యాపారాన్ని వదలడు. ప్రస్తుతం తాను చేస్తున్న పనికిమాలిన పనే కాకుండా ఇలాంటి పనులు ఎవరు చేసిన తన నియోజకవర్గంలో సహకరించే స్థాయిలో ఈ ఎమ్మెల్యే ఉన్నట్లు తెలిసింది. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో మట్టి మాఫియాకు కింగ్‌లా వ్యవహరించే ఓ మట్టి కాంట్రాక్టర్‌కు ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మిషన్‌ కాకతీయ పేరుతో ఏ చెరువు పని జరిగిన ఆ కాంట్రాక్టర్‌కు అప్పగించడం ఎమ్మెల్యే పనిగా పెట్టుకున్నాడా. మిషన్‌ కాకతీయ పని అప్పగిస్తే పని జరిగితే పర్వా లేదు. కానీ ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయన్న పొగరుతో ఈ కాంట్రాక్టర్‌ ఇష్టారీతిన వ్యవహారిస్తున్నాడట. ప్రస్తుతం ఈ కాంట్రాక్టర్‌ ఆ వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్‌ గ్రామంలో మిషన్‌ కాకతీయ పనులు చేస్తున్నా అంటున్నాడు. ఇక్కడ మిషన్‌ కాకతీయ మంజూరు అయ్యిందా..లేదా అనేది అనుమానంగానే ఉంది. ఈ విషయమై తహశీల్దార్‌ను వివరణ అడిగితే సమాధానం దాటవేస్తారు ఏమో ఉండవచ్చు అంటారు. మట్టి బయటకు తరలిస్తున్నారని ఎఇని అడిగితే లోడ్‌ చేయడం చూడడం వరకే మా పని మట్టి ఎక్కడికి వెళ్తుందో మాకెందుకు అని అంటారు.

ఇటుకబట్టీలకు సరఫరా లక్షల్లో దందా

ఆత్మకూరు మండలం పెద్దాపూర్‌ చెరువులో మిషన్‌ కాకతీయ పనులు జరుగుతుంటే ఇందులో తోచిన మట్టి రైతులకు సరఫరా చేయాలి, లేదంటే చెరువు చుట్టూ కట్ట కోసం వినియోగించాలి కానీ అలా జరగడం లేదు. తోడిన మట్టంతా లారీల కొద్ది వరంగల్‌ నగర శివారుకు తరలుతోంది. నక్కలపెల్లి, గొర్రెకుంట శివారు గీసుగొండ కెనాల్‌ పక్కన నిర్వహిస్తున్న ఇటుకబట్టీలకు మట్టిని ఈ కాంట్రాక్టర్‌ సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఒక్క నక్కలపెల్లి ఇటుకబట్టీకే 75లక్షలకుపైగా మట్టిని సరఫరా చేసినట్లు తెలిసింది. కోటి ఒక లక్ష రూపాయల మిషన్‌ కాకతీయ పని అని చెప్తున్న ఈ కాంట్రాక్టర్‌ ఇటుక బట్టీలకు మట్టి సరఫరా చేస్తూ కోట్ల రూపాయలు వెనకేస్తున్నట్లు తెలిసింది. అక్రమంగానే మట్టి దందా నిర్వహిస్తున్న ఇతగాడికి ఎమ్మెల్యే చల్లని చూపు ఉన్నట్లు తెలిసింది. ఈ మట్టి దందా ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో చేసుకోవడానికి ఎమ్మెల్యేకు భారీగానే ముడుపులు ముట్టజెప్పినట్లు ఆ కాంట్రాక్టర్‌ ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. ఇదే కాంట్రాక్టర్‌ ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ఊకల్‌ చెరువులో మట్టిని తవ్వి దండిగానే దండుకున్నట్లు తెలిసింది. వారం రోజుల క్రితమే ఇక్కడ పనులు ఆపినట్లు తెలిసింది.

మట్టి మాఫియాకు ఇతనే కింగ్‌

వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అక్రమంగా మట్టిదందా నడుపుతున్న వారిలో ఇతగాడు నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నట్లు తెలిసింది. ప్రతీ ఏటా వేసవికాలంలో కోట్ల రూపాయలు దండుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సంవత్సరం ఇప్పటికే ఇతగాడి టార్గెట్‌ 2కోట్లు దాటినట్లు తెలియవచ్చింది. మొత్తానికి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో అక్రమంగా వ్యాపారాలు చేస్తున్న అందరికి సహకరిస్తుండగా ఉత్తిపున్యానికి మట్టిని తవ్వుతూ కోట్ల రూపాయలు వెనకేస్తున్న ఈ మట్టి మాపియా కింగ్‌కు సహకరిస్తుండడం నియోజకవర్గంలో విమర్శలకు దారితీస్తోంది. ఇకనైన ఎమ్మెల్యే వ్యవహారశైలిలో మార్పు రావాలని జనం కోరుకుంటున్నారు. అడ్డగోలుగా మట్టిని తవ్వుతూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్న కాంట్రాక్టర్‌కు ఎందుకు సహకరిస్తున్నాడో అతనికే తెలియాలని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *