అంత ఆమ్ధాని అధికారులకెక్కడిది..?


అంతంత సంపాదన అధికారులకెక్కడిది?
ఇన్నిన్ని ఆస్ధులులెలా పోగేసుకుంటిరి?


కోట్లకెలా పడగలెత్తుతుంటురి?
ఎన్నికలంటే నాయకులే భయపడుతుంటే, మేం సై అని ఎలా అనగల్గుతుంటిరి?
మీ జీతాలెంత? పొదపు చేసుకున్నా లాభమెంత?
ఎకరాలకెకరాల భూములెలా కొనుగోలు చేస్తున్నారు?
ఫామ్‌హౌజ్‌లు ఎక్కడినుంచి తెస్తున్నారు?
ఖరీధైన ప్రాంతాల్లో స్థలాలెలా వస్తున్నాయి?
కోట్లుకు కోట్లు ఖరీదు చేసే విల్లాలు ఎలా కొంటున్నారు?
అవినితిని ప్రశ్నిస్తే కేసులు పెట్టే పరిస్ధితి వస్తే…ప్రజలకు దిక్కెవరు?
మీడియాను కూడా అధికారులు బెదిరిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?
ఒక్కసారి కలాలన్నీ కదిలితే తెలుస్తుంది?
అక్షరం విలువేమిటో…మీడియా అంటే ఏమిటో కూడా తెలియాల్సిన సమయం ఆన్నమైంది!
కోట్లకు పడగలెత్తుతున్నారు? మార్కెట్‌లోకి వచ్చే లగ్జరీ కార్లు కొంటున్నారు. ఏడాదికోటి మారుస్తున్నారు. ఖరీధైన ఏరియాల్లో స్థలాలు కొంటున్నారు. ఫామ్‌ హౌజ్‌ల పేరుతో ఎకరాలకెకరాలు భూములు కొనుగోలు చేస్తున్నారు. విలాసవంతమైన విల్లాలు సొంతం చేసుకుంటున్నారు.

రాత్రికిరాత్రి అందనంత నాలుగు తరాలు తిన్నా తరగనంత సంపాదనా పరులౌతున్నారు. ఇంతకీ ఏమైనా జాక్‌ పాట్‌లు కొడుతున్నారా? అంటే కాదు…లాటరీలేమైనా తగలుతున్నాయా? అదీ లేదు. కాని విచ్చల విడి సంపాదన మాత్రం వారి వచ్చి వాలుతోంది. కరెన్సీ సామ్రాజ్యం వారి సొంతమౌతోంది. విదేశాల టూర్లు, రేవ్‌ పార్టీలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు… నాలుగు తరాలకు సరిపడా సంపాదించుకొవచ్చు అనుకునేవారట. ఇది మూడు దశాబ్దాలక్రితం మాట. ఇప్పుడు ప్రభుత్వ అధికారి సంపాదనలో మనమెంత? అన్న మాటలు ఎమ్మెల్యేలే మాట్లాడుతుంటే వింటున్న మాట. తాజాగా ఇటీవల ఓ పబ్‌లో జరిగిన సంఘటన విషయంలో ఓ మాజీ ఎంపి. మీడియాతో మాట్లాడుతూ మేమెంత? మాకు అంత లేదు? మా పిల్లలకు అంత స్వేచ్ఛ లేదు. మాకు అంత సంపాదన లేదు? అక్కడ పట్టుబడ్డ వారంతా పెద్ద పెద్ద అధికారుల పిల్లలేనట? అన్నాడు. ఇలా ఎక్కడ ఏ సంఘటన జరిగినా అక్కడ ఉన్నత స్ధాయి అధికారుల పిల్లలే అన్న వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. ఏ రేవ్‌ పార్టీలో యువకులు దొరికినా వాళ్లలో ఉన్నతాధిరుల పిల్లలే వుంటున్నారు. సరిగ్గా ఓ ఏడాది క్రితం సంస్ధాన్‌ నారాయణ పురంలోని ఓ రిసార్టులో దొరికిన యువకులంతా బడా బడా ఉద్యోగుల పిల్లలే అన్నారు. అంటే అలాంటి జల్సాలు చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. పిల్లలు అలా విచ్చలవిడిగా ఖర్చు చేసేంత ఇస్తున్నారంటే, ఎంత వెనకేసుకుంటున్నట్లు అన్నదానిపై కూడా ప్రభుత్వం దృష్టిపెట్టాలి. పైగా అవినీతిని ప్రశ్నించే మీడియా మీద దాడులు, మీడియా మీద కేసులా? ఎక్కడికి తీసుకుపోతున్నారు సమాజాన్ని? అన్న ప్రశ్నపై చర్చ జరగాలి. కనీసం గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వంలో ఒక చర్చ జరిగితే…నిజమేమిటో…అబద్దమేమిటో తెలిపోతుంది.
గతంలో ఏకంగా ఓసారి అసెంబ్లీలో ఒక రోజు రచ్చ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనికి ఆహార పధకం అమౌతున్న సమయం. దేశవ్యాప్తంగా కరువు ఛాయలు అలుముకున్న రోజులు. దాంతో కేంద్ర ప్రభుత్వం పనికి ఆహార పధకం అమలు చేసేది. పేదలతో మట్టి రోడ్లు, ఇతర పనులుచేయించే వారు. సాయంత్రం వారికి బియ్యం ఇచ్చి పంపించేవారు. అయితే ఇందులో నాయకులు కాంట్రాక్టర్లుగా వ్యవహరించేవారు. బియ్యం పంపిణీకి కోసం ఎంబిలు తయారు చేయడం కోసం పై స్ధాయి నుంచి కింది స్ధాయి దాకా అందులో వాటలు వెళ్లేవి. పది మంది పని చేస్తే వంద మంది పని చేసినట్లు లెక్కలురాసుకోవడం అధికారుల కమీషన్లు తీసుకోవడం పెద్ద దుమారం రేగింది. ఆ సమయంలో కాంగ్రెస్‌ నాయకులు చేసే పనులకు అధికారులు ఎంబిలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న సమయంలో అసలు ప్రభుత్వం వుందా? అధికారులు ఇంతగా చెలరేగిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందన్న చర్చ అసెంబ్లీని కుదిపేసింది. సైకిల్‌ మీద వచ్చే తెలుగుదేశం నాయకులు పనికి ఆహార పథకం పుణ్యమా? అని స్కూటర్లు, కార్లు కొనుక్కుంటున్నారని, వాళ్లకు సహకరిస్తున్న అధికారులు పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారని చర్చ జరిగింది. అధికారులకు కళ్లెం వేయకపోతే అది సమాజానికి తలవంపులు తెస్తుందని కూడా శాసనసభ్యులు ఆందోళన చేశారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ కుక్క తోకను ఆడిస్తుందా? లేక తోక కుక్కను ఆడిస్తుందా? అంటూ చంద్రబాబుకు చురకలు పెట్టారు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువైందని టిఆర్‌ఎస్‌ నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అడ్డగోలు సంపాదనకు అడ్డూ అదుపు లేకుండాపోతోందని సాక్ష్యాత్తు టిఆర్‌ఎస్‌ నాయకులే మధనపడుతున్నారు. అధికార పార్టీ నాయకులైనా సరే అధికారులు తమ ఇష్టారాజ్యం చేస్తున్నారన్న మాటలే వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే కాంగ్రెస్‌కు చెందిన అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి చెందని ఓ ఐఏఎస్‌. అధికారి గుర్‌గావ్‌లో వందల కోట్లతో మల్లీ ప్లెక్స్‌ నిర్మాణం చేస్తున్నాడన్నారు. ఇక ఆ మధ్య ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఇంట్లో జరిగిన శుభకార్యానికి ఫలక్‌ నుమా ప్యాలెస్‌లో భోజనాలు ఏర్పాటు అన్నది సంచనలంగా మారిందన్న సంగతి తెలిసిందే…
ఆ మధ్య కీసరలో వంద ఎకరాల భూమి పాస్‌ పుస్తకాల కోసం జరిగిన డీల్‌ ఎన్ని కోట్లో ప్రజలకు తెలుసు. ఆ తహసిల్ధార్‌ జైలులో ఉరి వేసుకొని చనిపోయిన ఘటన తెలుసు. నారాయణ ఖేడ్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి చేసిన లీలలు అప్పట్లో విన్నవే. ఉప్పల్‌లో వారి ఇళ్లలో చేసిన సోదాలు జనం చూసినవే…ఇలా కొందరు మండల, జిల్లా, రాష్ట్ర స్ధాయిల అధికారులు సాగిస్తున్న అవినీతి బాగోతాలు వెలుగులోకి వచ్చినా, పట్టుబడినా, అవినీతి కార్యకలాపాలు ఎక్కడా ఆగడం లేదు. సాక్ష్యాత్తు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇదే విషయం చెప్పారు. ఓ ఎమ్మెల్సీ కూడా తనకు జరిగిన అనుభవం గురించి చట్టసభలోనే వివరించారు.
అపరిచితుడు సినిమా చూస్తాం….ఠాగూర్‌ సినిమా చూస్తాం…ఆఖరుకు బొబ్బిలి పులి సినిమా టివిల్లో వస్తే చూస్తుంటాం. ఆ క్షణం నిట్టూరుస్తుంటాం. సమాజం ఎటు పోతుందని మధనపడుతుంటాం. కొద్ది సేపటికే అన్నీ మర్చిపోతుంటాం. కాని మనం ప్రశ్నించం? ప్రశ్నించడం హక్కు అన్న సంగతి మనం మర్చిపోతుంటాం? అధికారులు మనతో మాట్లాడడమే గొప్ప అనుకుంటాం? వాళ్లు పనులు చేసి పెడితే చాలనుకుంటాం? వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పెట్టుబడలు పెట్టేవారి దగ్గర నుంచి, చిన్నా, చితక వ్యాపారాలు చేసుకునే వారి వరకు ముందు పైసలు చేతిలో పెట్టి పని చేయించుకుంటున్నారు. పైస ఇవ్వందే పని చేయమని అధికారులు కూడా మొహం మీదే చెప్పేస్తున్నారు. ఇది ఎవరు ఎవరకి అలవాటు చేశారో గాని, అవినీతి మాత్రం బలంగా పాతుకుపోయేలా చేశారు. ఎవరైనా అధికారులు మీ పని కావాలంటే ఇంతివ్వాలని అడిగితే? ఎందుకివ్వాలని మాత్రం ప్రశ్నించం? ఎదిరించం? పని ఎందుకు చేయవని నిలదీయం? ఎంత కాలం పనిచేయవో చూస్తామని అల్టి మేటమ్‌ జారీ చేయం? అంతే కాదు ఎవరైనా అధికారులతో వాగ్వాదం చేసుకుంటుంటే ఇదేం అన్యాయం అని అడగం? సినిమా చూస్తున్నట్లు చూస్తాం…? చోద్యం జరుగుతున్నట్లు నవ్వుకుంటాం? అక్కడి నుంచి జారుకుంటాం? మనకే ఇబ్బంది ఎదురైనప్పుడు మాత్రం ఎవరూ సహకరించడం లేదని లోకాన్ని నిందిస్తాం!! అవినీతి అధికారులకే ముందు సలాం కొడతాం…అడిగినంత చేతుల్లో పెట్టి, ఆయన పని చేసి పెట్టడమే మహాద్భాగ్యమనుకుంటాం. ప్రశ్నించేవారు ఎవరైన ఎదురైతే వాణ్ణి చూసి నవ్వుకుంటాం…వాడి చాదస్తం కాకపోతే ఏమిటి? ఎంతో కొంత చేతిలో పెట్టి పనిచేయించుకుంటే పోలా? అని నిట్టూరుస్తుంటాం? ఇదే అధికారులకు వరం. ఎంత చిన్న పనైనా పది నిమిషాలు నిలబడి పని చేయించుకోవాలంటే మనకు బద్దకం. పది రూపాయలు పడేసి రెండు నిమిషాల్లో పని పూర్తిచేసుకోవాలన్నది మన ఆత్రం, ఆరాటం. అందుకే మనం కూడా మారుదాం…అవినీతిని ప్రశ్నిద్దాం…నిలదీస్తున్న మీడియాకు అండగా వుండేందుకు ప్రజా సంఘాలు కూడా ముందుకు రావాలి. మీడియా మీద అవినీతి అధికారులు కేసులు నమోదు చేసేంతు దుర్మార్గం పెరిగిపోతుందటే ప్రశ్నించే సమాజం రావాలి. ప్రజల్లో మరింత చైతన్యం నెలకొనాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!