హీట్‌…హీట్‌ గా… ఈటెలా…ఏమిటిలా!

 

అటా, ఇటా, ఎటు?

హాట్‌ …హాట్‌ గా ఈటెల ఎపిసోడ్‌..!

`బడ్జెట్‌ మీద చర్చ కన్నా ఈటెల మీదే చర్చ!

`అందరూ మా రాజేందరే అన్నారు! ఎందుకు!?

`అంతుపట్టని వ్యూహం… తెరపైకి ఈటెల వ్యవహారం.

`అసెంబ్లీలో కేటిఆర్‌… మాటా మంతి.

`హరీష్‌ రావు పదే పదే ఈటెల ప్రసక్తి!

`సిఎం. కేసిఆర్‌ అదే ప్రస్తుతి….

`ఇంకేముంది …ఏదో జరుగుతోందనేది మీడియా లోకం కోడై కూస్తోంది!

`లోగుట్టు వున్నట్టా! లేనట్టా!!

`బట్టకాల్చి మీదేసినట్టా!

`బురదంటించి కడుక్కోమన్నట్టా!

`ఈటెల గర్‌ వాపసీ ఉత్త ఊహలేనా?

`ఈటెల మనసులో ఏముంది?

`పైకి చెప్పేదానిలో నిజమెంతుంది?

` బిజేపిలో ఈటెల కలత…మీడియాలో నలత?

`ఈటెల ఖండిరచినా ఆగని ప్రచారం…

`నమ్మడానికి సిద్ధంగా లేని జనం!

`మీడియా లోకం…నేతల చేతుల్లో లేని రాజకీయం!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాలలో కనిపించలేదు. ఇది నిజంగానే కావాలని జరిగిందా? లేక కల్పితమా? అన్నది కాసేపు పక్కన పెడితే ఈటెల రాజేందర్‌ అంశం మాత్రం మరి కొంత కాలం నానడం ఖాయం. ఈ విషయంలో ఈటెల రాజేందర్‌ ఎన్ని ప్రకటనలు చేసినా, దానికి ప్రాధాన్యత దక్కకపోవచ్చు…పైగా ఈటెల రాజేందర్‌ తనకు తానుగా బిఆర్‌ఎస్‌ నుంచి బయటకు రాలేదు…అని ఆది నుంచి అంటూ వస్తున్న మాటనే ఇప్పటికీ చెబుతూవస్తున్నారు. అందులో మార్పేమీ లేదు. బిఆర్‌ఎస్‌ ను ఈటెల రాజేందర్‌ ఇప్పటికీ శత్రు వర్గంగా చూస్తున్న ధాఖలాలు లేవు. తన రాజకీయ మూలాలు అక్కడే వున్నాయన్నది ఆయన మర్చిపోయింది లేదు. ఇదిలా వుంటే బడ్జెట్‌ చర్చ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశానికి ప్రధాని అయితే తొలుత సంతోషించేది నేనే…అన్నారు. అంటే ఆ మమకారం ఇంకా ఆయనకు పోలేదు. ఇది కూడా ఈటెల యాదృచ్ఛికంగా అన్నారా? లేక హుందాతనం కోసమన్నారా? అన్నది ఇక్కడ అవసరం లేదు. కానీ ఈటెల మనసులోనుంచి మాటలు గానే అనుకోవడం జరుగుతోంది. 

అందరూ మా రాజేందరే అన్నారు! ఎందుకు!?

 అన్నది కూడా హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఒక్కరు కాదు…బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అందరూ ఈటెల విషయంలో చాలా పాజిటివ్‌ గా వున్నారు. ఈటెల రాజేందర్‌ పార్టీ నుంచి బైటకు వెళ్లిన తర్వాత ఆయనతో మాట్లాడేందుకు చాలామంది నేతలు వెనుకాముందు ఆడేవారు. కానీ ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది. అదేంటో గాని ఆ మధ్య ఈటెల రాజేందర్‌ తమ పార్టీలో బిఆర్‌ఎస్‌ కోవర్టులున్నారంటూ వ్యాఖ్యానించారు. అది పది రోజుల క్రితం పెద్ద వివాదం ముసురుకుంది. ఈటెల వ్యాఖ్యలపై విజయశాంతి లాంటి వారు స్పందించారు. నిజంగానే బిజేపిలో కోవర్టులు వుంటే బైటకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ వివాదం ఇంకా సాగుతున్న తరుణంలోనే ఈటెల అసెంబ్లీ ఎపిసోడ్‌ కు మరింత మసాలా అద్దినట్లైంది. అసెంబ్లీలో కేటిఆర్‌, ఈటెల సరదా సన్నివేశం చూసినప్పుడే చర్చ మొదలైంది. ఆ తర్వాత ఈటెల, మంత్రి కేటిఆర్‌ రహస్య సమావేశం కూడా జరిగినట్టు ప్రచారం జరిగింది. అది కూడా దాటి సిఎం కేసిఆర్‌ తో ఈటెల రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాతే సిఎం కేసిఆర్‌ అసెంబ్లీలో ఈటెల ను అన్ని సార్లు ప్రస్తావించారనే మాటలు వినిపిస్తున్నాయి. 

అంతుపట్టని వ్యూహం… తెరపైకి ఈటెల వ్యవహారం. 

రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించేది కాదు. ఉన్నట్టుండి ఈటెల రాజేందర్‌ ఎపిసోడ్‌ పుల్‌ స్పీడ్‌ గా దూసుకుపోతోంది. ఎవరికి తోచినట్లు వారు అన్వయించుకుంటున్నారు. వార్తలు వండి వార్చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియా వచ్చాక కంటెంట్‌ అవసరం లేదు…కన్‌ ఫ్యూజన్‌ టెక్నిక్‌ తెలిస్తే చాలు, తోచింది రాసేస్తే చాలు…అది ప్రపంచం మంతా చుట్టొస్తుంది. నాయకులకు కూడా ఇదే కావాలి. నిత్యం వార్తల్లో వుండాలి. ఇలాంటి ప్రచారాలు జరిగినప్పుడు ఎంజాయ్‌ చేయాలి. నాకేం సంబంధం లేదు… అని ఓ నిట్టూర్పు విడిస్తే చాలు…మళ్ళీ మొదలౌతుంది…అందులో లేని గూడార్థాలు వెలుగులోకి వస్తాయి… విపరీత ప్రచారం మోసుకొస్తాయి. నిజానికి ఈటెల రాజేందర్‌ బిజేపిలో అంత సంతృప్తిగా లేరన్న చర్చ కూడా వుంది. పైకి ఈటెల ఎంత సమర్థించుకున్నా, లోలోన రగులుతున్న బాధ చెప్పుకోలేనిది. ఇప్పుడు ఎటు చూసినా ఇబ్బందే…ఎవరు ఏం మాట్లాడినా ఇబ్బందే…చుట్టుపక్కల ఎంత చూసుకున్నా ముళ్ల కంప అంటుకోనుంది…ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు బిఆర్‌ఎస్‌ నుంచి బైటకు వచ్చినప్పుటికన్నా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయనే మాటలే వినిపిస్తున్నాయి. ఈ మధ్య మాజీ ఎంపి. వివేక్‌ వెంకటస్వామి తో జరిగిన రచ్చ ఎంత దుమారం రేపిందో తెలిసిందే… అసలు అప్పటి దాకా ఈటెల రాజేందర్‌ పార్టీలో ఒక రకమైన గౌరవం వుండేది. ఇక అప్పటి నుంచి పార్టీలో అంత ప్రాధాన్యత లేకుండా పోతోందని మధనపడుతున్నారట…ఈటెల ఎంత దూరమైనా వెళ్ళి నాయకులను పార్టీలోకి తెస్తాడన్న నమ్మకం బాగా వుండేదట…ఈటెల, వివేక్‌ మధ్య వ్యవహారంతో ఈటెల ను లైట్‌ తీసుకుంటున్నారట…అంతే కాకుండా తనను ముఖ్యమంత్రి అభ్యర్థిని చేస్తే ఎంతైనా ఖర్చు పెట్టుకుంటానని ఈటెల అన్నట్లు కూడా ప్రచారం జరిగింది… కానీ వివేక్‌ ఎపిసోడ్‌ తో ఈటెల గ్రాఫ్‌ ఒక్కసారిగా పడిపోయినట్లు చెప్పుకుంటున్నదే….ఇదిలా వుంటే ఈటెలను నమ్ముకొని బిజేపిలో చేరిన వారి పరిస్థితి ఎలా అన్నది కూడా చర్చకు వస్తున్నట్లు ప్రచారం జోరుగానే సాగుతోంది. ఈటెల రాజేందర్‌ బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యే సూచనలైతే కనిపించడం లేదు. ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం మాత్రమే వుంది.. ఒకవేళ ఈటెల కు పదవి ఇచ్చేదే వుంటే ఈ పాటికి పూర్తి చేయాల్సి వుండే…ఆ ఆశ కూడా ఈటెల కు లేదనే అనుకోవచ్చు. ఈ సారి ఎన్నికలు బండి సంజయ్‌ నేతృత్వంలోనే వెళ్లే అవకాశం వుంది. అంతేకాకుండా ఈసారి బండి సంజయ్‌ అసెంబ్లీకి మళ్ళీ పోటీ చేయనున్నారట…గత ఎన్నికలలో కరీంనగర్‌ నగర్‌ నుంచి బండి సంజయ్‌ పడిపోవడం, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు సానుభూతి చూపించడం జరిగింది. బండి ఓటమిని జీర్ణించుకోలేక కార్యకర్తలు కన్నీటి పర్యంతం కావడం వంటివి బాగా కలిసొచ్చాయి. పార్లమెంటు కు పోటీ చేసే అవకాశం తలుపుతట్టింది. గెలుపు వరించింది. ఇక్కడితోటే బండి సంజయ్‌ రాజకీయం మలుపు తిరిగింది. ఈసారి మళ్ళీ బండి సంజయ్‌ అసెంబ్లీకి కరీంనగర్‌ నుంచి కాకుండా వేములవాడ నుండి పోటీ చేయాలనుకుంటున్నారట…కరీంనగర్‌ నుంచి పోటీ చేస్తే ఓడిపోయే అవకాశం వుందని తేలిందట…పైగా ఇటీవల ఓ జ్యోతిష్యుడు బండి సంజయ్‌ ఇంటికి వెళ్లడం, ఆయన జాతకం చూడడం జరిగింది. బండి సంజయ్‌ కు యోగం వుందని ఆ జ్యోతిష్యుడు చెప్పాడట…ఇక అప్పటి నుంచి తనకు పోటీ అనుకుంటున్న ఈటెల కు బండి పొగబెడుతున్నట్లు సమాచారం… పైగా ఈటెల బిజేపిలో చేరినప్పుడు వేములవాడ టికెట్‌ తుల ఉమకు ఇవ్వడానికి పార్టీ అంగీకరించిందట…ఇప్పుడు బండి సంజయ్‌ వేములవాడ నుంచి పోటీ అన్నది కూడా ఈటెలను కలవరానికి గురి చేస్తోందట…ఇలా అటు పార్టీలో పొగ…ఇటు బిఆర్‌ఎస్‌ నుంచి వస్తున్న సెగతో ఈటెల కు ఎండాకాలానికి ముందే ఉక్కపోత మొదలైంది….

అసెంబ్లీలో కేటిఆర్‌… మాటా మంతి…హరీష్‌ రావు పదే పదే ఈటెల ప్రసక్తి! సిఎం. కేసిఆర్‌ అదే ప్రస్తుతి….

ఇంకేముంది …ఏదో జరుగుతోందనేది మీడియా లోకం కోడై కూస్తోంది! లోగుట్టు వున్నట్టా! లేనట్టా!!బట్టకాల్చి మీదేసినట్టా! బురదంటించి కడుక్కోమన్నట్టా? ఈటెల గర్‌ వాపసీ ఉత్త ఊహలేనా? ఈటెల మనసులో ఏముంది? పైకి చెప్పేదానిలో నిజమెంతుంది? బిజేపిలో ఈటెల కలత…మీడియాలో నలత? ఈటెల ఖండిరచినా ఆగని ప్రచారం…నమ్మడానికి సిద్ధంగా లేని జనం. మీడియా లోకం…నేతల చేతుల్లో లేని రాజకీయం! వారం రోజుల వ్యవధిలో ఈటెల రాజేందర్‌ పేరు మీడియాలో నానుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఏకంగా ఒకే రోజు ఈటెల పేరు 18సార్లు ప్రస్తావించారు. ఈటెల ఏది కోరితే అది చేయమన్నాడు. ఈటెల మూలంగానే హస్టళ్లలో సన్న బియ్యం పడుతున్నట్లు చెప్పాడు. ఇప్పుడు కూడా ఈటెల సూచనలు, సలహాలు తీసుకొమ్మన్నాడు. ఇదే సమయంలో బిఆర్‌ఎస్‌ సభ్యలు ఈటెల నుద్దేశించి గర్‌ వాపసీ అంటూ బల్లలు చర్చారు. ఈటెలను అయోమయంలో పడేశారు… అంతకు ముందు బడ్జెట్‌ మీద క్లారిఫికేషన్ల సమయంలో మంత్రి హరీష్‌ రావు ..అన్న…రాజేందర్‌..ఎక్కడున్నా మావాడే…అన్నాడు…మా దగ్గర వున్నప్పుడు మంచిగుండె అని ప్రకటించారు. అదేదో సినిమాలో ముందు సీటుకు, వెనుక సీటుకు దూరం తగ్గదన్నట్లు…మా మధ్య దూరం లేదన్నాడు. అటు బిజేపి ని, ఇటు ఈటెలకు మాట లేకుండా చేశాడు…అంతకుముందు రోజు మంత్రి కేటిఆర్‌ ఏకంగా ఈటెల తో ముచ్చట్లే పెట్టేశాడు…బిజేపిలో కుంపటి రాజేశాడు…ఆ సెగ బిజేపికో…ఈటెలకో అర్థం కాకుండా చేశాడు…ఒక్కసారిగా ఈటెల డైలమాలో పడ్డాడు…ఇప్పుడు ఈటెల ఏది చెప్పినా ఉన్న ఫలంగా ఎవరూ నమ్మకుండా చేసేశారు…అదీ బిఆర్‌ఎస్‌ రాజకీయం అని మరో సారి రుజువు చేశారు…తాంబూలాలు ఎవరివో…ఆ తర్వాత తతంగం ఎవరిదో…కాలమే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *